వారిధి చూపిన వసుధ
మనం ఉండే భూమిని సముద్రమే చూపించింది అంటే సముద్రం లోనుంచి బయట పడిందన్నమాట .సృష్టిక్రమంలోనూ ఆకాశం నుంచి వాయువు వాయువునుంచి అగ్ని ,అగ్నినుంచి నీరు ,నీటినుంచి భూమి పుట్టినట్లు ‘’ఆకాశాద్వాయుః—-‘’బట్టి తెలుస్తోంది .ఒకప్పుడు ప్రపంచమంతా జలమయం .ఆ చీకటిలో ఆమున్నీటిమధ్య విష్ణుమూర్తి వటపత్ర శాయి గా ఉంటాడని ,సృష్టి సమయం లో భూమి బరువెక్కి నీటిలో మునిగిపోతే ,దాన్ని పైకెత్తి పాములరాజు తన పడగలపై నిలబెట్టాడని ఒక గాధ ఉన్నది. దీన్నిబట్టి వారిధినుంచే వసుధ వచ్చిందని చెప్పవచ్చు .భూగోళం పై కొంత నీరు కొంతభూమి ఉన్నాయి .సముద్రం లోనుంచి ఏ భూభాగం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పలేము .కాని సముద్రాలమధ్య ఉన్న భూ భాగాలలోని మానవులు సముద్రాలను దాటి ఇతరభూభాగాలకు ఎలా,ఎప్పుడు చేరారో తెలుసుకోగలిగాము .
అతి ప్రాచీనకాలం నుంచీ మానవుడు సముద్రాలుదాటి ఇతరభూభాగాలకుచేరి వర్తకవాణిజ్యాలు చేశాడని వాటిని ఆక్రమి౦చు కొన్నాడని తెలుసు .దీనికి నౌకాయానమే అతని ముఖ్య సాధనం .పోర్చుగీస్ ఇంగ్లాండ్ స్పెయిన్ మొదలైన దేశాలవారైన వాస్కోదగామా , డ్రేక్ మొదలైనవాళ్ళు కొత్త భూభాగాలను కనిపెట్టారని సంతోషించామేకాని భారత దేశం లో ప్రాచీన నౌకానిర్మాణం నౌకాయానం దాన్ని చేసిన సాహసులగురించి తెలుసుకొనే ప్రయత్నం మనం చేయనే లేదు .రాధా కుముద్ ముఖర్జీ అనే వంగదేశ పండితుడు హిందూ దేశ నౌకాయాన చరిత్ర తెలిపే అనేక విషయాలను తెలియజేశాడు . దీన్ని బూలర్ పండితుడు కూడా అంగీకరించాడు .రుగ్వేదకాలం లోనే మనకు నౌకాయానం ఉంది . ఋగ్వేదం లో వరుణుడికి నౌకలు పోయే సముద్రమార్గాలన్నీ తెలుసునని ,ఆకాలం లోనే డబ్బు కోసం వర్తకులు దూర దేశాలలో వర్తకం కోసం సముద్రం నాలుగుమూలలకు నౌకలు పంపుతారని ఉన్నది .తుగ్రుడుఅనే రాజర్షి భుజ్యుడు అనే కొడుకును దూర ద్వీపాల శత్రువులపై నౌకలతో దండయాత్రకు పంపాడని ,అవి సముద్రమధ్య లో తుఫానుకు భగ్నం అయిపోతే ,శతాదిత్రాలు అంటే నూరు తెడ్లుగల ఓడలలో అశ్వినీ దేవతలు వచ్చి అతడిని కాపాడినట్లు ఋగ్వేదం 1వ మండలం 116 వ సూత్రం లో ఉన్నది.
రామాయణ కిష్కింధ కాండలో సుగ్రీవుడు వానర సైన్యాన్ని పంపుతూ ‘’సముద్ర మన గాఢాంశ్చపర్వతాన్ పత్తనానిచ ‘’అని సముద్ర ద్వీప పర్వత పట్టణాలలో ఎగిరే దారులు ,’’భూమిశ్చ కోషకారాణా౦’’కోషకారుల భూమిని కూడా వెతకమని చెప్పాడు .కౌషేయాలు అంటే పట్టుదారాలపురుగులను ఉత్పత్తి చేసే భూమి అంటే చైనా దేశాన్ని కూడా వెతకమన్నాడు .’’చీనా౦ శుకమివ కేతోః’’ అని కాళిదాసు అనేకాలానికి పట్టు ప్రసిద్ధమైపోయింది .సప్త రాజ్యోప శోభితమైన యవద్వీపం సువర్ణ రూప్యక ద్వీపం కూడా రామాయణకాలం లో ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి .మహాభారతం లో విదురుడు రహస్యంగా పంపిన జనం ,ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్న పాండవులు గంగానది ఒడ్డున నిర్మించిన ఓడలో తప్పించుకొని పారిపోయినట్లు ఆదిపర్వం లో ఉంది .’’పార్దానాం దర్శయా మాస –మనో మారుతగామినీం –సర్వ వాత సహాం నావం –యంత్ర యుక్తాం పతాకినీం –శివే భాగీరధీ తీరే నరైర్వింశ్ర౦ షిభిః కృతాం’’మనోవేగం కలది అన్నిరకాల గాలులను తట్టుకోనేది యంత్రం తో నడిచేది ఐన ఓడలో తప్పించుకు వెళ్ళారు .ఎంతటి డెవలప్ మెంట్ ఉన్నదో ఆనాడే !
కానీ మరికొంతకాలానికి బోధాయన ఆపస్తంభమొదలైన సూత్రకారులు బ్రాహ్మణులకు సముద్రయానం నిషేధించారు .మనువు మరింత ముందుకు వెళ్లి సముద్రయానం చేసిన బ్రాహ్మణుడు శ్రాద్ధకర్మలో భోక్తకు అర్హుడు కాదు అని చెప్పాడు .బౌద్ధ జాతక కధలు సింహళ గాధలు క్రీ,పూ 500కు పూర్వమే విజయుడు అనే వంగదేశ రాజకుమారుడు దేశ బహిష్కృతుడై ,700మంది అనుచరులతో అనేక నావలలో ప్రయాణం చేసి సింహళం చేరి రాజ్యస్థాపన చేసినట్లు ,తామ్రలిప్తి ,సింహళం మధ్య ఆ నాడే నిరంతరం ఓడలలో రాకపోకలు జరిగేవని తెలుస్తోంది .కళింగ దేశం లోని దంతపురం నుంచి బుద్ధుని దంతాన్ని సింహళానికి తీసుకుపోతున్న దంతకుమారుడి ఓడలు కృష్ణా ముఖద్వారం లో వజ్రాల దిన్నె దగ్గర మెట్టఎక్కగా ,ఒక తెలుగు నాగరాజు స్వాగతం పలికి ఆదరించి మళ్ళీ ఓడలు ఎక్కి౦చి పంపినట్లు అమరావతీ శిల్పచిత్రాలలో కనిపిస్తుంది .అప్పటి వోడలు 300మంది సామాన్లతో సహా సుఖంగా ప్రయాణం చేయటానికి అనువుగా ఉండేవట .పారశీక రాధాని బాలి(బి)లాను తో వ్యాపారం జరిగేదని ,గ్రీస్ ఈజిప్ట్ రోమ్,అస్సీరియా మొదలైన యూరప్ ఆఫ్రికా దేశాలకు సుగంధ ద్రవ్యాలు మణులు ముత్యాలు కాశ్మీరు శాలువలు రవసెల్లాలు మొదలైనవి ఎగుమతి చేస్తూ భారతదేశం అపారధనాన్ని సంపాదించి సుభిక్షంగా సుసంపన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇండియాలోని మజ్లిన్ లపై రోమ్ దేశ స్త్రీలు ఎక్కువ మక్కువ పడేవారట .ఇండియానుంచి దిగుమతి అయ్యే విలాస వస్తువులను కొంటూ ఏటా అపారధనాన్ని కోల్పోతున్నారని ప్లీనీ యాత్రికుడు ఏడుస్తూ రాశాడు .
క్రీ పూ. వెయ్యి ఏళ్ళకు పూర్వమే ,ఇండియా ను౦చి ,కలప,ఏనుగు దంతాలు సుగంధద్రవ్యాలు నెమలి ఈకలు,వస్త్రాలు ఈజిప్ట్ దేశం కొనేది అని చరిత్ర తెలియజేస్తోంది .ఇవన్నీ దక్షిణ దేశం నుంచే ఎగుమతి అయ్యేవి .హీబ్రూ భాషలోని అహలిం ,తూకి అనేపదాలు తమిళ పదాలైన అగిల్ ,తోకై లనుంచి వచ్చినవే .భారత దేశ నౌకాయానం వాణిజ్యం కు దక్షిణభారత దేశమే ముఖ్యస్థానం .క్రీస్తు పూర్వం 7వ శతాబ్దిలో ఇండియానుంచి హిందువులు కొందరు ఓడలలో చైనాకు వెళ్లి అక్కడ ‘’లాంగ్ గా ‘’అనే వలస జాతిని ఏర్పరచారని ,ఆ ఓడల ము౦దు భాగాలు పక్షులు , జంతువుల ముఖాలులాగా ఉండేవని చైనా దేశ చరిత్ర చెబుతోంది .క్రీశ లో బోధధర్మ అనే దక్షిణ దేశ రాకుమారుడు 3 వేలమంది బౌద్ధ భిక్షువులతో చైనాలోని కాంటన్ నగరం చేరి బౌద్ధం ప్రచారం చేసి వాళ్లకు సంస్కృతం కూడా నేర్పాడట .క్రీస్తు శకం మొదటి శతాబ్దిలో ఆంద్ర సామ్రాజ్యకాలం లోనే కంట కోసల ,కూడూరు రేవులనుండి ఆంధ్రులు జావా సుమత్రా బర్మా కంబోడియా ద్వీపాలలో వలస రాజ్యాలను ఏర్పరచారు .అక్కడ బౌద్ధ ,బ్రాహ్మణ మతాలను ,హిందూనాగరకతను, చిత్రకళను వ్యాప్తి చేశారు .
సశేషం
ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణయ్యగారి వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు నావికులు ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-19-ఉయ్యూరు
.