కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 8
వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )
రాజరాజ నరెంద్రునికాలం లో కులోత్తుంగ చోలునికాలం లో విదేశీ వాణిజ్యం బాగా ఉండేది .కులోత్తు౦గు డు చైనా చక్రవర్తికి రాయబారం పంపినట్లు ,రాజేంద్ర చోళుడు సింహళం మొదలైన ద్వీపాలు జయించి లాకెడిన్,మూల్ డీవ్ ద్వీపాల (మాల్దీవులు )నౌకా యుద్ధాలు చేసి జయించినట్లు తెలుస్తోంది .వంగదేశ కావ్యాలలో గంగా ప్రసాద్ ,సాగర సేన ,హంసవర ,రాజవల్లభ నౌకలపేర్లు కనిపిస్తాయి .ధనపతి సింహళం వెళ్ళేటప్పుడు 7 నౌకలతో వెళ్ళాడని అందులో మధుకర నౌక చాలాపెద్దదని దానిలోపల బంగారు పూత ఉన్నదని తెలుస్తోంది .దుర్గావర ,సింహముఖి ,చంద్రసాన నౌకలు కూడా పెర్కొనబడినాయి .క్రీస్తుశకం మొదటి నుంచి మోటుపల్లి రేవు విఖ్యాతి చెందింది .కాకతి గణపతి దేవుడు నావికుల రక్షణకోసం అభయ శాసనం వేయింఛి పన్ను కొంతతగ్గించి వ్యాపారాభి వృద్ధికి తోడ్డాడు .
రెడ్డి రాజులకాలం లో ఎల్లాప్రగడ మల్లారెడ్డి ని గురించి ‘’ఉత్సాహోదగ్రుడు మోటుపల్లి గొని ,సప్తద్వీప సద్వస్తు సందోహముల్ తనకిచ్చు నెచ్చెలి సముద్రుం బ్రీతి గావి౦చుచున్ ‘’అన్నాడు .కుమారగిరిరెడ్డి సుగంధ భండారాధ్యక్షుడు అవచి తిప్పయ్య సెట్టి విదేశీ వ్యాపారాన్ని శ్రీనాధుడు వర్ణించి చెప్పాడు –‘’తరుణా సీరతవాయి గోప రామణాస్థానంబులన్ ,చందనాగరుకర్పూర ,హిమాంబు కుంకుమ ,రజః కస్తూరికా ద్రవ్యముల్ –శరదిం గప్పలి జోగులన్ విరివిగా సామాన్ల దెప్పించు నేర్పరి –యేవైశ్య కులొత్తముం డవచి తిప్పం డల్పుడే ఇమ్మహిన్ ‘’ఇందులో కప్పలి ,జోగులు అనేవి రెండురకాల నౌకలపెర్లు .
గోల్కొండ నవాబులకాలం లో మైసోలియా గా ప్రసిద్ధి చెందిన కృష్ణానదీ ముఖద్వారం లోని మచిలీ బందరుకు మళ్ళీ గొప్ప పేరు వచ్చింది .17వ శతాబ్దిలో ఫ్రాన్స్ నావికుడు టేవెర్నియర్అనేవాడు బంగాళాఖాతం లో ఇంతటి ప్రసిద్ధ రేవు ఇంకేదీ లేదని ,లోతైన సముద్రం కనుక ఓడల రాకపోకలకు చాలా అనువుగా ఉందని ,ఇక్కడి నుంచే చైనా మక్కా హార్మాజ్ పట్టణాలకు ,మడగాస్కర్, సుమత్రా ,మైనిల్లా దీవులకు నౌకాయానం జరిగేదని రాశాడు. ఇతర యాత్రికులుకూడా దీన్ని ప్రసిద్ధ రేవుపట్టణం అన్నారు .గోల్కొండ నవాబులకు ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా శోభించింది .నవాబులు ఇతర దేశాలనుంచి, ద్వీపాలనుంచి ఏనుగులను తెచ్చుకోనేవారు .ఒక్కో ఓడలో 25 ఏనుగులు దిగుమతి అయ్యేవట.వెయ్యి టన్నుల బరువుగల ఓడలు కూడా వాళ్లకు ఉండేవి .బందరు నుంచి ‘’మసూలా ‘’అనే తేలిక రకం ఓడలు ఎక్కువబరువు తరల్చటానికి బాగా ఉపయోగపడేవి .ఒకే తెరచాప కల పడవలను తెడ్లతో కళాసులు నడిపేవారు .
బందరు తర్వాత నరసాపురం రేవు పెద్దది .నౌకనిర్మాణానికి పనికొచ్చే కర్ర గోదావరి వరదల్లో కొట్టుకువచ్చి లభించేది .ఇక్కడ గోదావరి చాలా లోతుగా ఉండటం తో బ్రిటిష్ నౌకాదళం అంతా ఇక్కడే ఉండేదని మారిస్ దొర రాశాడు .17వ శతాబ్దం లో బ్రిటిష్ వాళ్ళు కూడా తమ పెద్ద పెద్ద ఓడలను ఇక్కడే కట్టించుకొనే వారట .నక్షత్రాలను బట్టి నౌకల్ని చక్కగా నడపగలిగే సామర్ధ్యమున్న నావికులు నరసాపురం లో ఉండేవారట .దీనికి దగ్గరలోనే ఉన్న కోరంగి ,తాళ్ళరేవు కూడా ప్రసిద్ధ నౌకాశ్రయాలే .బ్రిటిష్ నౌక ఆల్బట్రన్ కు ఇక్కడ మరమ్మతులు చేశారట .విశాఖ ,కళింగపట్నం కూడా గొప్ప నౌకాశ్రయాలే .సహజ నౌకాశ్రయమైన విశాఖ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందింది .
4వ శతాబ్ది చైనాయాత్రికుడు జావా ద్వీపం అంతా హిందువులతో నిండి ఉంది అని రాశాడు .తాను జావానుంచి శ్రీలంక , అక్కడి నుంచి చైనాకు వెళ్ళినప్పుడు బ్రాహ్మణ నావికులు నడిపిన ఓడలలోనే ప్రయాణం చేశానని చెప్పాడు .14వ శతాబ్దికి చెందిన ప్రయర్ ఒడోరిక్ అనేవాడు గుజరాత్ లోని రాజపుత్రనావికులు 700మంది జనం తో ఉన్న నౌకలను అత్యంత లాఘవంగా నడిపారని ,సోమ నాథ్ నుంచి చైనాకు పోయే నౌకలను రాజపుత్రులే నడిపేవారని రాశాడు .ఒక్కో ఓడకు వందలాది కళాసులు ఉండేవారు .ఓడ ప్రధానాదికారి లేక కెప్టెన్ ను ‘’నఖూదా’’అనేవారు .నడిపే వాడిని మాతి౦గుడు అనీ ,కళాసులపై అధికారిని తండేలు అనీ ,ఎగుమతి దిగుమతులను చూసేవాడు సరంగు అని పిలిచేవారు .నీళ్ళు తోడేవాళ్ళు, లెక్కలు రాసేవాళ్ళు ఉండేవారు . వారిధి లోని ద్వీపా౦తరాలలో, ఖండాంతరాలలో వ్యాపారం చేసిన మన నౌకల ,నావికుల చరిత్ర అత్యద్భుతం అంటారు శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-19-ఉయ్యూరు