మోసం గుర్రో
గురు –ఏందిభాయ్ !పాలన సురుగ్గా సాగిస్తున్నావా ?
శిష్య –అంతా నీ ఆశీర్వాదం అన్నా .మూడు కూల్చివేతలు ఆరు దౌర్జన్యాలు రోజూ జరిగిపోతున్నాయి .కిక్కురుమంటే బొక్క లిరగగొట్టిస్తున్నాను .
గురు –ధిల్లీ పోయోచ్చినావా ?
శిష్య –నాలుగైదు సార్లుపోయా .ప్రత్యేకహోదా అంటూ వెళ్ళిన ప్రతిసారీ వాల్యూం తగ్గించి ‘’సార్ సార్ ప్ల్లెజ్ ప్లీజ్ మంత్రం జపించినా .ఉలుకూలేదు పలుకూ లేదు .నువ్వు పోయి౦ డ్లేదా హస్తినకు?
గురు –అక్కడ మనమొహం ఎవడు సూస్తార్రా బయ్యా .అదోలోకం .నాపై కక్ష కట్టినట్లున్నారు అక్కడి జంట.
శిష్య –మనదీ అదే పరిస్థితి .ఇక వాగ్దానాలన్నీ బుట్టలో పడేసి చాణక్యం ప్రయోగించాలి .అయినా అన్నా గిప్పుడు ఫోన్ చేశావేంది?
గురు -నీ ఎలక్షన్ లో నాలుగంకెల కోట్లు అప్పగించాను .గేపకం తేటానికి ఫోన్ చేశా .
శిష్య –యాదమరిస్తే గదన్నా .మీరుణ౦ నా చర్మంతో చెప్పులు కుట్టి తీరుస్తా .
గురు –అదేవడికి గావాల్రా భయ్యా .ఇంకేదైనా ?
శిష్య –హైదరాబాద్ లో మా భవనాలన్నీ ఇచ్చేశాను రూపాయి అడక్కుండా .మాకు నీనుంచి రావాల్సిన కోట్ల రూపాయల బాకీలడక్కుండా గుమ్మునుండా .
గురు –ఇంతేనా .లక్షన్నర కోట్ల గోదావరి ప్రాజెక్ట్ తెలంగాణలో కడదాం .ఖర్చు చెరిసగం .ఎవరివాటా వాళ్ళదే .
శిష్య –దానికేం అభ్యంతరం ?నా మాట వేదవాక్కు .ఇంజనీర్లు అక్కర్లేదు .నువ్వు పెద్దిన్జనీర్ నేను చిన్నిన్జనీర్ .మన పద్ధతిలో కడదాం .మా వాళ్ళు కిక్కురు మనకుండా నాదీ పూచీ .
గురు –ఇంతేనా ?
శిష్య –వాన్పిక్ నీకే అని చెప్పా .బందరు రేవూ నీకే అన్నాగా అన్నా ?
గురు –అవుననుకో .నావల్ల జాతీయ స్థాయి కూటమి కుదరలేదు .అడుగులోనే హంసపాదై౦ది మనిద్దరం కలిసి యాంటి మోడీ గా కలిసి సాగుదాం .ఇంకేంటి ప్లాన్స్ ?
శిష్య –వండర్ఫుల్ ఐడియా .నేనూ అలానే అనుకొంటున్నా .కాశ్మీర్ సమస్య తీర్చి తలాక్ కు తలాకులిచ్చి అరివీర భయంకరుడైనాడు మోడీ .మనమాట చెవిటివాడిముందు శంఖమే .అమరావతి కి గుడ్ బై పోలవరానికి రివర్స్ టెండరింగ్, అన్నాకాంటీన్ల క్లోజ్ , పెన్షనర్లకు చేయ్యివ్వటం,ఆశాలకు నిరాశా ,రేషన్ కు పరేషాన్ ,ఇసుక పైకి చిమ్మటానికి కూడా లేకుండా మావాళ్ళ పైరవీలు .
గురు –ఒకేఒకే నన్నే మించావ్ శిష్యా .అవును నిజం .సోనియా ను పొగిడి ,తెలంగాణలో సెంటిమెంట్ రగిల్చి విద్యార్ధుల ఆత్మబలిదానాలను హైలైట్ చేసి ,కాంగ్రెస్ తో కలిసిపోతానని నమ్మించి తీరా తెలంగాణా ఇచ్చాక ‘’తూ నా బొడ్డు’’అని వదిలేసి ,దళితముఖ్యమంత్రి అని చేసిన ప్రచారానికీ తిలోదకమిచ్చి నేనే రెండు సార్లు సిఎం అయ్యా .కాని ఎపి లో పిచ్చోడు బాబు మొదటిసారి అయి రెండో సారి బొక్కబోర్లపడ్డాడు నావల్లా నీవల్లా మోదీవల్లా. కాని బాబు గ్రేటేనయ్యా కమలం వికసించకుండా నలిపేశాడు .ఆపరాభవం తట్టుకోలేక పోతున్నారు పైనున్న జంట .అందుకే నాకూ నీకూ ఎసరు పెట్టె ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది .
శిష్య –ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావు గురూ ?
గురు –ముందుజాగ్రత్త కోసం .మనం ఇద్దరం బెసకకుండా ఫెవికాల్ బంధంగా బిగుసుకుపోతే మనల్ని పీకే వాడు ఉండడు.అందుకని .
శిష్య –ఒకే గురూ .కలిసి పని చేద్దాం కలిసి కసి తీర్చుకొందాం కలిసి గోదారిలో మునుగుదాం అంటే ప్రాజెక్ట్ కడదాం .
గురు –గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్ నీదీ నాదీ ఒకటే మాట ఒకటే బాట .
శిష్య –ఔను చరిత్ర సృస్టిద్దాం .మనబంధం ఫెవికాల్ .మన బలం సెరిలాక్ ,మన ధ్యేయం ‘’సిరి లాక్ ‘’
గురు –బాగా చెప్పావ్ శిష్యా .నీ లాంటి ,నా లాంటి వాళ్ళుంటే అవినీతి ఆమడ దూరం .
శిష్య –మనం వినీతులం అన్నా .’’అ’’ ని ముందు చేర్చిమనల్నిదేబ్బతీస్తున్నారు అలగా జనం .గురూ మోడీ, షా లకు షా పెట్టటం ఖాయమేగా ?
గురు –నూటికి వెయ్యిశాత౦ శూర్ భయ్యా .ఫికర్ మత్.మై హూనా.
శిష్య –ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి తెలుగువారికి శుభోదయం జరుగుతోంది !
గురు –గ్రేట్ మైండ్స్ ధింక్ఎలైక్ అన్నమాట రుజువు చేశాం .ఎవరో ఫోన్ చేస్తున్నట్లున్నారు .తర్వాత మాట్లాడతా .
శిష్య –సరే గురూ .
శిష్య –గురూ గురూ ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదేం?
అవతలి నుంచి –సార్ కు షా గారు ఫోన్ చేసి అర్జెంట్ గా ధిల్లీ రమ్మంటే వెళ్ళారు .మిమ్మల్ని మళ్ళీ ఫోన్ చేయద్దని గట్టిగా చెప్పారు .
శిష్య -మోసం గుర్రో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-19-ఉయ్యూరు