భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –
శ్రీ కృష్ణుని జీవితాన్నిబట్టి చూస్తె భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు రచించినట్లు ,కృష్ణబాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణుని ఉత్తర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే వ్యాసుడు భాగవతం రాసినట్లు ఉంది .రెండిటికీ కర్త వ్యాసుడే అయినప్పుడు ఈ మీమాంస ఎందుకు వచ్చిందని కోరాడ రామకృష్ణయ్యగారు తనను ఇంటర్వ్యు చేసిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారిని ప్రశ్నించారు.
శర్మగారుఅదొక చిక్కుప్రశ్న అని దాన్ని మరింత జటిలం మాత్రమె చేయగలనని చెప్పి ,భరతం చివరిభాగం హరివంశం ,ఇందులో కృష్ణ జననం మొదలైన భాగవత కథలన్నీ ఉన్నాయని భారత భాగవతాలకు ముందే వ్యాసుని తండ్రి పరాశర మహర్షి విష్ణుపురాణం రాశాడని ,అందులో కథలన్నీ భాగవత కృష్ణలీలలే కదా అని జవాబిచ్చారు .’’అందుకేనేమో లోకం లోభాగవతం వ్యాసుడు రాయలేదని ఎవరో బోపదేవుడు రాశాడనే మాట ప్రచారం లో ఉంది అన్నారు కోరాడవారు .,బోపదేవుడు రాశాడు అనేది అర్ధం లేనిమాట అని .అతనికాలం 13వ శతాబ్ది అని, అంతకు పూర్వమే మధ్వాచార్యులు మొదలైనవారు భాగవతాన్ని ప్రమాణ గ్రంథంగా స్వీకరించారని ,శైలిలో తేడా ఉండటం వలన ఈ ఊహ వచ్చి ఉండచ్చు అన్నారు శర్మగారు .దీనితో ఏకీభవిస్తూ కోరాడవారు ‘’భారత మిషమున బలికితి ,వేదార్ధ భావమెల్ల మునుకొని ,స్త్రీ, శూద్ర ముఖర ధర్మములందు తెలిపితి నే జెల్ల –దీని జేసి ఆత్మ సంతసమందదు,ఆత్మలో ఈశుండు సంతసి౦పక యున్నజాడ దోచె-హరికి ,యోగివరుల కభిలషి త౦బైన ,భాగవతంబు బలుకనైతి ,మోసమయ్యే’’అని వ్యాసుడు తృప్తి లేకుండా ఏడుస్తూ కూర్చుంటే ,నారదమహర్షి వచ్చి ఓదార్చి భాగవతం రాసి సంతృప్తి చెందమని ప్రోత్సహించాడని ,కానీ హరివంశం లోనే శ్రీ కృష్ణుడు మహా విష్ణువు అవతారం అని ,అతడు చేసినవన్నీ మానవాతీత చర్యలని వర్ణించిన వ్యాసునికి ఈ అసంతృప్తి శోకం ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదని కోరాడవారు రాళ్ళపల్లి వారిని ప్రశ్నించారు .
‘’నిజమే .భారత, హరివంశాలలో శ్రీ కృష్ణ మహత్వం అంతా ఉంది కాని వాటిలో భక్తి భావన అంతతీవ్రంగా లేదు .భాగవతం లో ఆ రసానుభవం తీవ్రంగా నిర్వహించబడింది .భారత హరివంశాలు వీలైనప్పుడల్లా శివ ,కేశవుల అభేదాన్నే వివరించాయి ,హరివంశం లో శ్రీ కృష్ణుడు సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేసిన ఘట్టం లో హరి హరులకు పూర్తిగా అభేదం చెప్పబడి౦ది కూడా.కాని భాగవతం లో ఈ కథ లేనేలేదు .కనుక శ్రీ కృష్ణుడే పరబ్రహ్మ అనే తత్వాన్ని చెప్పటానికే వ్యాసర్షి భాగవతం రాశాడు అని పిస్తోందన్నారు శర్మగారు .శ్రీ కృష్ణుడు శివునికి తపస్సు చేసినవిషయం విష్ణు పురాణం లో లేదుకదా అన్నారు కోరాడవారు .అందుకే ఈ చిక్కు విడి పోయేది కాదు అని ము౦దే చెప్పానని, ఎవరు రాసినా శ్రీకృష్ణునిపై అనన్యభక్తిని ప్రచారం చేసింది భాగవతం మాత్రమె నని దీన్ని తన అసాధారణ కవిత్వ ధారతో పోతన్నగారు తలపొలం దాకా ,ఈడ్చుకు వెళ్ళాడని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మం ను పూజించి అతని గుణగానాలను మననం చేస్తే,పూజిస్తే మోక్ష సాధనమని ,ధర్మమార్గ మని శర్మగారన్నారు .
కోరాడవారు అందుకొని కృష్ణభక్తిని భాగవతం సాధించినంతగా భారతం సాధించలేదనీ , బాలకృష్ణ లీలలు, యవ్వన విలాసాలు భారతం లో లేకపోయినా ,ఆయన అసాధారణ ప్రజ్ఞా ఆశ్రిత వాత్సల్యం ,ధర్మ దృష్టి,నీతిపా౦డిత్యం ,స్వార్ధం లేని లోకకల్యాణ దృష్టి,అందరినీ ఆకర్షించే ధీర లలిత శా౦తత్వం ,క్లిస్టసమయాలలోకూడా చెడని మనోబలం భారత కృష్ణుని లక్షణాలు అన్నారు రామకృష్ణయ్యగారు .దీన్ని కొనసాగిస్తూ అనంత కృష్ణ శర్మగారు శ్రీ కృష్ణుడు సార్వకాలిక సందేశంగా అందించిన భగవద్గీత లో స్థిత ప్రజ్ఞతను మహోదాత్త గుణం గా చెప్పగా గాంధీ మహాత్ముడు ఆ శ్లోకాలను నిత్యపారాయణ చేసి అమలు పరచుకొన్నాడు .ఈ స్థిత ప్రజ్ఞత్వం మహా భారత కృష్ణుని కి శోభాయమానమైన అలంకారం. ఆయన భగవానుడు అనటానికి ఇదొక్కటి చాలు అన్నారు .
దీన్ని సమర్ధిస్తూ కోరాడవారు లోక కల్యాణానికి ,ఆత్మానందానికి ఆ గుణాలు యెంత యెక్కువగాఉంటేఅంత దివ్యత్వం ఆ వ్యక్తిలో కనిపిస్తుందని పూతన సంహారం ,కాళీయమర్దనం గోవర్ధనోద్ధరణం మొదలైనవి ,భగవదవతారమని భావి౦చబడే వ్యక్తిలోచిన్న చిన్న చిల్లరపనులుగా వివేకవంతులు భావిస్తారని, అవతారం అంటే విష్ణువు వైకుంఠానికి తాళం పెట్టేసి ,క్రిందికిదిగి మనిషిగా పుట్టాడని ,కానీ ,అక్కడా ,ఇక్కడా రెండు శరీరాలలో ఏకకాలం లో వర్తి౦ చేవాడని భావించటం’’ ‘ రమణీయం కదా అన్నారు .,శర్మగారు అవిచారం అయినా రమణీయం అనే మాట గొప్పగా ఉందని ,అదే భక్తులుకోరుకోనేదని ,ఆ రమణీయతా గుణమేసామాన్యభక్తులకు జీవనం అనీ ,ఆధ్యాత్మికమైన అతీంద్రియ తత్వాన్ని ,ఆది భౌతికంగా భావించి అనుభ వించటమే భక్తి స్వరూపం అనీ ,అందుకే శ్రీ కృష్ణుని బాల,తరుణ లీలలు లోకాన్ని అంతగా ఆకర్షించాయని అన్నారు .
రామ క్రిష్ణయ్యగారు వెంటనే ఆది భౌతికభావనలను ,ఆధ్యాత్మికంగా సంస్కరించుకోకపోతే ,అవి మరీ సంకుచితమైపోతాయని గుర్తించాలి అంటూ ,శ్రీ కృష్ణభక్తులు ఆయన జార.చోర లీలలతో ఆగిపోయి ,చరితార్దులమయ్యామని భావిస్తారని ,మనం ఉపాసించే దేవతా లీలలు మన ధర్మార్ధ కామాల సంస్కరణ కు సాధకం కాకపొతే ఆ భక్తివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని నిర్మొహమాటంగా చెప్పారు ..శర్మగారు భారత కృష్ణుని మహాత్యాన్ని అర్ధం చేసుకొని ఉపాసి౦చటానికి పూర్వరంగంగా భాగవత కృష్ణమూర్తి చిత్రి౦ప బడినాడని కోరాడవారి భావమా ?అని ప్రశ్నించారు ,.అవునని కోరాడవారనగా ,శర్మగారు తనదీ అదేఅభిప్రాయం అని బలపరఛి ,భారత కృష్ణుడే ఎక్కువ గంభీరంగా ,ధర్మాన్ని ,నీతినీ రెండిటినీ సమానంగా నిర్వహించి ,భోగ ,యోగాలు రెండూ పరస్పర ఉపకారకాలుగా చెప్పిన మహా వ్యక్తి భారత కృష్ణుడే అనీ ,ద్రౌపదీ స్వయంవర ఘట్టం లో ‘’అమూర్తి ‘’గా ఉండి,రాయబారం యుద్ధం లలో ,తత్వ చర్చలో ,వినోదం లో ‘’అత్యత్తిస్ట దశాంగులం’’అని వేదం చెప్పినట్లు అందరినీ మించి ,అందరితో చేరి ,నవ్వుతూ జీవితం గడిపాడు అన్నారు .
కోరాడవారు కోరస్ గా ‘’సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ –అహం త్వా౦ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః ‘’అని అందుకే అన్నాడు ,అనగలిగాడు అని చెప్పి
‘’క్ర౦దు కొను సర్వ ధర్మ,వికల్పములను –నెడల విడిచి ,దృఢంబుగ నేనొకండ-శరణముగ నాశ్రయి౦పుము సకల దురితములకు – దొలగింతు నిన్ను బ్రమోదమంద’’అని భారత యుద్ధం లో గీతోపదేశం లో అర్జునునికి శ్రీ కృష్ణుడు నిర్భయంగా ,నిస్సందేశం గా చేసిన ఉపదేశం మనదేశంలో అందరూ మహా మంత్రంగా జపిస్తారు అన్నారు .శర్మగారు ఔనంటూ,దానికి మించిన సందేశం లేనే లేదని ,శ్రీ కృష్ణుడు తప్ప దాన్ని చేయగల సమర్ధుడు వేరొకరు లేరని విస్పష్టంగా చెప్పారు .
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మననం చేసుకోదగ్గ మంచిమాటలు
ఆధారం –కృష్ణాష్టమి సందర్భంగా ఆచార్య కోరాడ రామకృష్ణయ్యగారి తో రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి ఇంటర్వ్యు ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-19-ఉయ్యూరు