కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం   10

భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1

భారతీయ మహర్షుల ఆంతరంగిక తాత్విక విచారణం వలన వేదాలకు శిరో భూతాలైన ఉపనిషత్తులు అందులోని రహస్య విజ్ఞానం బయటకొచ్చింది .కాని ఆత్మజ్ఞానం అందరికి అర్ధంకాదు .ప్రత్యక్షం నే  ప్రమాణంగా భావించి చార్వాకులు, సర్వం క్షణికం ,శూన్యం అనే బౌద్ధులు సామాన్యజనాలను ఆకర్షించి తమవైపు కు తిప్పుకొన్నారు .వీళ్ళను ప్రతిఘటించి ,వేద ఉద్ధరణకు బయల్దేరిన  ఆస్తికమతాలలో కర్మకాండ  నిశ్శ్రేయస సాధనం అని ,ఆత్మికజ్ఞానమే ముక్తి సాధకం అని చెప్పే జైమిని పూర్వమీమాంస సూత్రాలు ,జ్ఞానకాండ గొప్ప తనాన్ని చెప్పే బాదరాయణుడి ఉత్తర మీమాంస సూత్రాలు ,గౌతముని న్యాయ సూత్రాలు ,కణాదుని వైశేషిక సూత్రం ,కపిలుని సాంఖ్య సూత్రం ,పతంజలి యోగసూత్రాలు వచ్చాయి .వేద వేదా౦గా లలోని విషయాలను పరిశీలించి ,అవగాహన చేసుకొని ,చేతనాచేతన వస్తువు యొక్క మూల రహస్యాలను దర్శించే నెపం తో రచించిన శాస్త్రాలు కనుక ఈ ఆరింటిని ‘’దర్శనాలు’’(షడ్దర్శనాలు) అన్నారు .

  వేదం ప్రామాణ్యాన్ని స్థాపిస్తూ జైమిని రచించిన కర్మ మీమాంస సూత్రాలకు మొట్టమొదటగా గొప్ప భాష్యం రాసిన శాబర మహర్షి ఆంధ్రుడే .శబరులు ఆంధ్రులేకనుక దీనికి తిరుగులేదు .అంతేకాదు యజ్ఞ యాగాది కర్మకాండతో కూడిన వైదిక మతాన్ని పోషించి ,స్వయంగా తానె పౌ౦డరీకాది క్రతువులను చేసి ,ఈమత వ్యాప్తి చేసి ,దక్షిణభారతం లో కృష్ణా గోదావరీ నదుల మధ్య దేశం లో ఆమతాన్ని నెలకొల్పిన వారు ఆంధ్రరాజులే .గౌతమీ పుత్ర శాతకర్ణి మొదలైనవారనేక యజ్ఞాలు చేసి గోవులను పోషించి దానాలిచ్చారు. అందులో ఒకరిపేరు యజ్ఞశ్రీ అవటం ఆయనకు వీటిపై ఉన్న మక్కువకు గౌరవానికి గొప్ప నిదర్శనం .వీరి తర్వాత పాలించిన రాజవంశాలుకూడా వీరి మార్గాన్నే అనుసరించి పరమత సహనాన్ని పాటించారు .అందుకే జైమిని సూత్రాలకు ,శాబర భాష్యానికి కూడా భాష్యంగా చెప్పబడే ‘’తంత్ర వార్తికం ‘’అనే గ్రంథాన్ని రాసిన కుమారిలభట్టు ఆంధ్రే దేశం వాడే అయి ఉంటాడు –‘’ఆంధ్రోత్కలా నాంసంయోగే  పవిత్రే ,జయమంగళే,ఆంధ్రజాతి స్తిత్తిరో మాతా చంద్రగుణా,సతీ యజ్నేశ్వరః పితాయస్య ‘’అని ‘’జిన విజయం ‘’లో చెప్పబడటం చేత ఆతడు పదహారణాల ఆంధ్రుడే అని భావించవచ్చునని కోరాడ వారి తీర్పు .ఈ మతాన్ని ఖండించి న దిగ్నాగుడి ‘’ప్రమాణ సముచ్చయం ‘’పై ‘’న్యాయ బిందువు ‘’అనే వ్యాఖ్యరాసిన ధర్మకీర్తి  కూడా ఆంధ్రుడే అనే అభిప్రాయం ఉన్నది .కర్మ అనేది జ్ఞానానికి సాధనం కనుక మొదటిది అయిన కర్మను గూర్చి చెప్పేది ‘’పూర్వ మీమాంస ‘’అని ,బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పే వేదాంత మీమాంస’’ ఉత్తర మీమాంస ‘’అని  ప్రసిద్ధి కెక్కాయి .ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని బాదరాయణ వ్యాసమహర్షి రచించిన 552బ్రహ్మ సూత్రాలే దీనికి ఆధారం .వీటికి శంకర రామానుజ మధ్వాచార్యులు రాసిన భాష్యాలను బట్టి అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతాలేర్పడ్డాయి .శంకరాచార్యలు అద్వైత సూత్రాలకే కాక ,దశోపనిషత్తులకు ,భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు .ఈమూడిటిని ‘’ప్రస్థాన త్రయం ‘’అంటారు .శంకరులు అద్వైతభావ వ్యాప్తికి అనేక శ్లోకాలు ,స్తోత్రాలు గ్రంథాలు కూడా రాశారు .

  ఆదిశంకరుల అద్వైత గ్రంథాలకు వేదాంత పంచదశి వివరణ ,ప్రమేయ సంగ్రహం ,జీవన్ముక్తి వివేకం మొదలైన భాష్యాలు ,వేదానికి భాష్యం కూడా రాసిన విద్యారణ్య మహర్షి ఆంధ్రుడే అనే భావన ఉన్నది .బ్రహ్మ సూత్రాలకు ‘’అణుభాష్యం’’రాసిన  వల్లభాచార్యుడు ఆంధ్రుడే .ఈతని పూర్వీకులు గోదావరి నదీతీరం లోని కా౦కరవాడ వాస్తవ్యులు .వెలనాటి బ్రాహ్మణుడు .తండ్రిలక్ష్మణభట్టు  .గురువు  పురుషోత్తమభట్టు .యితడు జైమిని సూత్రాలకు వ్యాఖ్య ,భాగవతానికి ‘’సుబోధిని ‘’వ్యాఖ్య రాశాడు .మాయావాదాన్ని ఖండించి సాకార బ్రహ్మవాదాన్ని వ్యాప్తి చేశాడు .విజయనగర శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం లో వాదంలో అద్వైతవాదుల్ని ఓడించి , వైష్ణవాన్ని స్థాపించి రాజు చేత కనకాభిషేకం పొంది ఆచార్యపీఠం అధిరోహించాడు.ని౦ బార్కర్  నుంచి రాధాకృష్ణ తత్వాన్ని గ్రహించి శుద్ధాద్వైత వాదాన్ని ప్రచారం చేశాడు .మాయావాదం సమర్ధించిన శంకరునిది ‘’ఆశుద్దాద్వైతం ‘’అని గేలి చేశాడు .కృష్ణుడే పరబ్రహ్మమని ,విశుద్ధభక్తితో ఆయనకు చేసిన సేవయే ఆయనవద్దకు చేరుస్తుందని నమ్మి ప్రచారం చేశాడు .ని౦బార్కరుడు కూడా తెలుగు వాడేనండోయ్.కాని బృందావనం లో స్థిరపడ్డాడు .వేదాంత సూత్రాలకు ‘’వేదాంత పారిజాతం ‘’అనే వృత్తి రాశాడు .ఇతడి కృష్ణుడు విష్ణువు అవతారం కాదు .పరబ్రహ్మయే .గోలోకం లోని రాధ ,బృందావనం లో కృష్ణుడి భార్య .ఇతనివాదాన్ని ‘’భేదాభేద తత్త్వం ‘’అంటారు .తనమత సిద్ధాంతాలను ‘’దశశ్లోకి ‘’ కావ్యంగా రాశాడు .

  సశేషం

ఆధారం –కోరాడవారి ‘’సంస్కృత తత్వ శాస్త్రమునకు ఆంధ్రుల సేవ ‘’వ్యాసం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-19-ఉయ్యూరు   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.