కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 11
భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )
ఆధునికకాలం లో వేదాంత గ్రంథ రచనలతో సంస్కృత భాషా సేవ చేసినవారిలో గుంటూరుజిల్లా పమిడిపాలెం ఆగ్రహారానికి చెందిన శ్రీ బెల్లంకొండ రామారావు గారొకరు .బాల్యం నుంచి హయగ్రీవ ఆరాధకులైన ఈయన భగవద్గీతా శంకర భాష్యం పై ‘’భాష్యార్ధ ప్రకాశం ‘’అనే వ్యాఖ్య,సిద్ధాంత కౌముదిపై ‘’శరద్రాత్రి ‘’వ్యాఖ్యానం రాసి, తన అసామాన్య శాస్త్ర పరిజ్ఞానాన్ని చాటుకొన్నారు .చంపూ గద్యకావ్యాలూ రాశారు .37వ ఏటనే మరణించిన మేధావి .గుంటూరు లోఉన్న ఒక శంకర మఠ పీఠానికి అధ్యక్షులైన శ్రీ కల్యాణానంద భారతీ మా౦తాచార్యులవారు సుమారు నలభై ఏళ్ళు అద్వైతమత ప్రచారం చేశారు .అసమాన పాండిత్యం ఇంగ్లీష్ లో అభినివేశం ఉన్న వీరు ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు సంస్కృతం లో వ్యాఖ్యలు రాసి ప్రచురించారు .వీరి శిష్యులు లింగన సోమయాజులుగారు పంచదశి వ్యాఖ్యానం ,ఉపనిషత్ లకు వ్యాఖ్యానం రాశారు .
విజయనగరానికి చెందిన ముడు౦బి వెంకట రామ నరసింహా చార్యులు 1842లో జన్మించి ,96ఏళ్ళు జీవించి 1938లో స్వర్గస్తులయ్యారు ఈయన తత్వ శాస్త్ర రచనలు కావ్య నాటక ఆలంకారిక గ్రంథాలు ,చంపూ కావ్యాలు రాసిన మేధావి .వీరి వంశ మూలపురుషుడు ముడు౦బి ఆచాన్ రామానుజులు ఏర్పాటు చేసిన 72గురు వైష్ణవ ఆచార్యులలో ఒకరు .విజయనగరం లో విజయరామ గజపతి ఆస్థానపండితుడైబ్రహ్మ సూత్రాలకు ‘’బ్రహ్మ సూత్రరోమంధనము ‘’భాష్యాన్ని ,తత్వ దర్పణం అనే స్వతంత్ర వేదాంత గ్రంథం ,పాతంజలి యోగసూత్రవ్యాఖ్యానం మొదలైనవి రచించాడు .శతాధిక ఇతర సంస్కృత రచనలూ చేశాడు.
తర్క సంగ్రహం కు దీపిక వ్యాఖ్య రాసిన అన్నం భట్టు ,గౌతమసూత్రాలను అనుసరించి కేశవ మిశ్రుడు రాసిన తర్కభాషకు తర్కభాషా ప్రకాశం రాసిన చెన్నుభట్టు ఆంధ్రులే .జగదీశుని సిద్ధాంత లక్షణం పై క్రోడపత్రం ‘’సంగమేశ్వర క్రోడ’’రాసిన తార్కికులు మహాపండితులు గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రిగారు విజయనగరం వాస్తవ్యులు .బ్రహ్మ సూత్రాలకు శ్రీకర భాష్యం అనే శైవ భాష్య కర్త శ్రీపతి పండితుడు పశ్చిమగోదావరిజిల్లా తణుకు తాలూకా కాలధారి గ్రామనివాసి అయిన ఆంధ్రుడు .ఇంతమంది ఆంధ్రులు సంస్కృత తత్వశాస్త్రాన్ని తేజోమయం చేశారు .
ఆధారం –కోరాడవారి ‘’సంస్కృత తత్వ శాస్త్రమునకు ఆంధ్రుల సేవ ‘’వ్యాసం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-19-ఉయ్యూరు