కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 12
తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో
తెలుగులో నన్నయ ఆదికవి .అంటే మహాభారతం వంటి ప్రౌఢరచన చేసినకవి .అలాగే తమిళం లో ఇలంగో ‘’శిలప్పదికారం ‘’అనే కావ్యం రాసి తమిళ సాహిత్య నిర్మాత అయ్యాడు .రాజపుత్రుడే అయినా రాజ్యం చేయకుండా జైన సన్యాసి యై ‘’ఇలంగో అడిగళ్’’అయ్యాడు .అడిగళ్ అంటే దాసుడు .ఇలంగో అంటే చిన్నరాజు .ఇది మనతెలుగు పదం లాంటిదే .ఎల అంటే తెలుగులో లేత అని అర్ధం . ఇళంత-ఎళ౦త-లేంత –లేత అయింది .అంటే చిన్న అని భావం .కో అంటే రాజు .ప్రపంచానికి రాజు దేవుడుకనుక కో అంటే దేవుడు అని అర్ధం .దేవుడిగుడి కోయిల ,కోవెల అయింది .దానిము౦దున్న చెరువు కోనేరు అయింది .
చిన్నరాజు అనబడే ఇలంగో తండ్రి నెడుం చెరలారన్ చేర రాజు .ఆయన ఇద్దరుకొడుకులలో చిన్నవాడు ఇలంగో .చిన్నప్పుడే బాగా విద్య నేర్చాడు .ఐతే అతడు సన్యాసం తీసుకోవటానికి ఒక కథ ఉంది .తండ్రికి ఒక సారి తీవ్రంగా జబ్బు చేస్తే ,జ్యోతిష్యులువచ్చి రాజు త్వరలోనే చనిపోతాడని ,చిన్నకొడుకు ఇలంగో రాజవుతాడని చెప్పగా ,అన్న విని పెద్దకొడుకు బాధపడటంచూసి ,ఆంతర్యం తెలిసి, వెంటనే జైనమత సన్యాసం తీసుకొని తనకు రాజ్యార్హత లేకుండా చేసుకొన్నాడు .దూరంగా వెళ్లి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ,విద్యా వ్యాసంగం చేస్తూ ,అక్కడే శిలప్పాదికారం మహా కావ్యం రాశాడు .ఇది తమిళపంచ కావ్యాలలో ఒకటి .కావ్యం పేరులో ఒక విషయం ఉంది .శిలంబు అంటే కాలి కడియం .దాన్ని అధికరించి అంటే దాన్ని గురించి రాసినకావ్యం కనుక శిలప్పాదికారం అయింది .ఈ కావ్య నాయిక కణ్ణకి లేక కణ్ణగి .
చోళరాజధాని కావేరిలో మాశాత్తువార్ అనే ధనిక వైశ్యుడికొడుకు కోవలన్ భార్య కణ్ణకి.విలాసపురుషుడైన కోవలన్ ఒక నర్తకిని మోహించి భార్యను పట్టించుకోకుండా వ్యసనాలకు మరిగి ,ఉన్నడబ్బంతా హారతి కర్పూరం చేసుకొని ,భార్య నగలు అమ్మి వ్యాపారం చేద్దామని అడిగితె ఆమె తనకాలి కడియం తీసి ఇచ్చి అమ్మి ఆసోమ్ముతో వ్యాపారం చేయమని పంపగా ,వాడు మధుర వెళ్లి ఒక కంసాలికి అమ్మాడు .వాడు రాణీ గారి కాలికడియం ఇదివరకే కాజేసినవాడుకనుక రాజభటులకు చెప్పి వీడిని పట్టించగా రాజు విచారణ లేకుండా నే ఉరిశిక్ష విధించాడు .
విషయం తెలిసిన కణ్ణగి,మధురవెళ్లి రాజుకు తనభర్త నిరపరాధి అని మొరబెట్టుకొంది.తనకాలికడియమే తనభర్తకు ఇచ్చానని అలాంటి కడియమే తన రెండవకాలికి ఉన్నదని చూపింఛి దానిలోపల రత్నాలు పొదిగి ఉండటం చూపించగా రాజు నిర్ఘాంత పోయి ఆమె భర్త నిరపరాది అని గ్రహించి ,అతనికి మరణశిక్ష విధించినందుకు కుంగిపోయి సింహాసం నుంచి క్రిందపడి చనిపోయాడు .తనభర్తకు జరిగిన అన్యాయాన్ని సహించలేక సాద్ధ్వి కణ్ణగి ,తన ఎడమ స్తనాన్ని పీకేసి ,మధురా పట్టణం మీద విసిరేసి పట్టణం తగలబడి పోవాలని శపించింది .అగ్ని దేవుడు అలానే దగ్ధం చేశాడు .మధురనుంచి పశ్చిమానికి బయల్దేరి ఆమె మలై నాడు వెళ్లి నెడవల్ కుండ్రం అనే కొండమీద వెంగై చెట్టుకింద కూర్చుని తపస్సు చేస్తుంటే ,మధురాపుర పట్టణ దేవత వచ్చి ప్రత్యక్షమై ,ఆమె గత జన్మ గురించి చెప్పి ,ఆమె భర్త కోవలన్ గతజన్మలో భరతన్ అనేపేరుతో సి౦గపురరాజు కొలువులో ఉండి నిరపరాధి యైన ఒకవర్తకుడిని గూఢచారిగా భావించి చంపించి వేశాడని ,అందుకే ఈజన్మలో ఇలా అతడు మరణిం చాల్సి వచ్చిందని ,ఆరోజు నుంచి 14వ రోజున ఆమె భర్త విమానం లో వచ్చి ఆమెను తీసుకొని స్వర్గానికి వెళ్తాడని చెప్పి అదృశ్యమైంది .అన్నట్లుగానే అదేరోజున కొండపై ఉన్న కురవలు అందరూ చూస్తుండగా భర్త తెచ్చిన విమానమెక్కి స్వర్గారోహణ చేసింది కణ్ణగి.
ఈ విషయాన్ని రాజైన శెంగుట్టువాన్ కు ప్రజలు చెప్పగా ,రాణిగారు కణ్ణగికి గుడికట్టించి విగ్రహాన్ని ప్రతిస్టించాలనుకొన్నది.రాజు ఉత్తర దేశ యాత్రకు వెళ్లి అక్కడినుంచి విలువైన పాలరాతి పలక తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని చెక్కించి ‘’పత్తినిక్కడవుళాల్’’పేరిట దేవతగా ఆగుడిలో స్థాపించి నిత్యపూజానైవేద్యాలు ఏర్పాటు చేశాడు .ఇలా కణ్ణగి దేవతయై పూజల౦దు కొంటోంది.ఇదే శిలప్పాదికారం కావ్య కథా విశేషం .
మణి మేఖలై అనే ఆమె కథ ను నత్తనార్ ‘’మణి మేఖలై’’కావ్యంగా మలిచాడు .ఇదికూడా తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటి .శిలప్పాదికారం గీతాలు(ఇశై ) నాటకలక్షణాలతో రాణించింది .సముద్రగానం ,ఏటి పాటలు ,ఊయలపాటలు కూడా ఉన్నాయి .తమిళరాజ్యాలైన పాండ్య, చోళ , చేర, రాజ్యాల పరస్పర సంబంధాలు ,మత సాంఘిక విషయాలు ,ప్రజల జీవనపరిస్థితులు మొదలైన సమస్త విషయాలు ,క్రీస్తు శకారంభం లో తమిళుల జీవిత చరిత్ర తెలుసుకోవటానికి శిలప్పాదికారం కావ్యం బాగాతోడ్పడుతుంది కనుకనే ఇలంగో అడిగళ్ తమిళ సాహిత్య నిర్మాతలలో ఒకడుగా గుర్తి౦ప బడినాడు .
ఆధారం –కోరాడ వారి ‘’తమిళ సాహిత్య నిర్మాత –ఇలంగో ‘’వ్యాసం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-19-ఉయ్యూరు