శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ
గడచిన ద్వాపర యుగం చివర 126 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుల అష్టమి అర్ధరాత్రి వృషభ లగ్నం లో మధురానగరం లో శ్రీ కృష్ణుడు జన్మించాడని భాగవతం లోనూ ,విజయనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి మంగళవారం రోహిణీ నక్షత్రయుక్త వృషభ లగ్నం లో జన్మిచాడని,హోరాను దర్పణం లోనూ ఉన్నది .ఇప్పటికి 5,115 ఏళ్ళక్రితం కలిద్వాపర సంధిలో అని అర్ధం .కృష్ణుడి జీవితకాలం 125 సంవత్సరాల 7నెలల 8రోజులు .కృష్ణావతారం సమాప్తం కాగానే కలియుగారంభమైంది .అంటే క్రీ పూ .3225.
కృష్ణుడు పుట్టిన మూడు నెలలలోపు పూతన సంహారం,శకటాసుర భంజనం జరిగి ,యశోదకు మొదటిసారి తన విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించాడు కృష్ణుడు .గర్గాచార్యుల చేత బలరామ కృష్ణులకు నామకరణం జరిగింది .ఆరవనెలలో బాల కృష్ణుడికి అన్నప్రాసన అయ్యాక ,తృణావర్త సంహారం చేశాడు .అప్పటికి శత శృంగ పర్వతం మీద కుంతీ పా౦ డురాజులకు యమధర్మరాజు వరంతో ధర్మరాజుప్రజోత్పత్తినామ సంవత్సరం లోనూ , ,ఆంగీరసనామ సంవత్సరం లో వాయు దేవుని వరంతో భీముడు ,హస్తినాపురం లో గాంధారి ధృత రాష్ట్రులకు దుర్యోధనుడు ,శ్రీముఖ నామ సంవత్సరం లో ఇంద్రుని వరం తో అర్జునుడు జన్మించారు .శ్రీకృష్ణ జననం శ్రావణ బహుళ అష్టమి .కలిపూర్వం 126వ సంవత్సరం .
కలిపూర్వం 125కు భావ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి కృష్ణుడికి ఏడాది వెళ్ళింది .రెండవ ఏడు రాగానే మట్టి తినటం ,యశోదకు ద్వితీయ విశ్వరూప సందర్శనం కలిగించటం ,శతశృంగం లో మాద్రి పా౦డురాజులకు అశ్వినీ దేవతల వరంగా నకుల ,సహదేవులు జన్మించటం జరిగింది .124 యువ లో శ్రావణ బహుళాస్టమికి రెండో ఏడాది వెళ్లి ,ఉలూఖల బంధనం ,యమళార్జున భంజనం ,నలకూబర ,మణిగ్రీవ శాప విమోచనం ,నందాదులు గోకులం నుంచి బృందావనానికి నివాసం మార్చటం జరిగి 3సంవత్సరాల 11వ నెలవరకు కన్నయ్య బృందావన లీలలు సాగాయి .123ధాత లో మూడో ఏడు పూర్తి కాగానే బాలకృష్ణ వత్సాసుర ,బకాసుర, అఘాసుర వధ చేయగా , దేవతలు పుష్ప వృష్టి కురిపించారు .122 ఈశ్వర లో నాలుగో యేట బ్రహ్మదేవుడు గోవులను దూడలను గోపాలురను అంతర్ధానం చేసి ఒక ఏడాది ఉంచాడు ,ఇప్పుడే కృష్ణస్వామి సమస్త గో, గోపాల ,వత్స రూపాలు ధరించి తన సర్వా౦త ర్యామిత్వాన్ని ప్రకటించాడు .
కలిపూర్వం 121బహుధాన్య శ్రావణ బహుళ అష్టమి కి 5యేళ్ళు నిండి బ్రహ్మకు దిమ్మతిరిగి ఆవు దూడ గోపాలురను వదిలేసి చెంపలేసుకొని కృష్ణ స్తోత్రం చేశాడు .చైత్ర కృష్ణ చతుర్దశి నాడు శత శృంగపర్వతం పై పాండురాజు మృతి చెందాడు .అప్పటికి ధర్మరాజుకు 7,భీముడికి 6,అర్జునుడికి 5,నకులసహదేవులకు 4ఏళ్ళ వయసు .వీరు హస్తిన కు తీసుకుపోబడి భీష్ముని ప్రాపకం లో పెరిగారు .120 ప్రమాదిలో కృష్ణుడికి 6ఏళ్ళు నిండి బృందావనం లో ధేనుకాసుర వధ ,కాళీయ మర్దనం ,ప్రలంబాసురవధ చేశాడు .గ్రీష్మ, వర్ష, శరత్తులలో గోపాలురతోకలిసి గోవులను మేపుతూ ఆటపాటలతో ,మురళీ గానం తో అందర్నీ రంజి౦ప జేశాడు .మార్గశిరమాసం లో కన్నె గోపికల కాత్యాయని వ్రతం ,వారి వస్త్రాపహరణం ,వరప్రదానం ,బ్రాహ్మణులు అంగీరస యాగం చేయటం ,స్వామికి గోపాలురకు బ్రాహ్మణ స్త్రీలు యజ్ఞప్రసాదం సమర్పించటం జరిగాయి .
119 విక్రమ శ్రావణ బహుళాస్టమికి స్వామికి 7ఏళ్ళు నిండి ,ఇంద్రయాగాన్ని నందాదులతోమాన్పించటం ,ఆగ్రహించి దేవేంద్రుడు అతి వృష్టికురిపించటం ,స్వామి గోవర్ధనగిరి నెత్తటం ,ఇంద్ర గర్వ భంగమవటం ,కామధేనువు స్వామికి క్షీరాభిషేకం చేయటం ,వరుణ దేవుడు పట్టుకు వెళ్ళిన పెంపుడుతండ్రి నందుని విడిపించటానికి వరుణ లోకం వెళ్లి ,విడిపించి తీసుకు రావటం , బాల్య రాసక్రీడ ,జరిగాయి .118 వృష సంవత్సరం లో సర్పరూపం ధరించిన సుదర్శనుడి శాపాన్ని బాలకృష్ణుడు తొలగించాడు .జ్యేష్ట శుద్దంలో ధర్మరాజుకు 11 వ ఏట ఉపనయనం జరిగింది .
కలిపూర్వం 117నుంచి 112వరకు అనగా చిత్రభాను నుంచి సర్వ జిత్ వరకు శంఖ చూడ సంహారం , వృష భాసుర ,కేశి రాక్షస ,వ్యోమాసుర వధ జరిపాడు కృష్ణుడు .బృందావనం లో గోపాల లీలలు చూపాడు .ఇవన్నీ అయ్యేసరికి కన్నయ్యకు 14 ఏళ్ళు పూర్తయ్యాయి .111 సర్వధారికి 15 ఏళ్ళు పూర్తి అయి , నారద మహర్షి వచ్చి కంససంహారం మొదలైన భవిష్యత్ కార్యక్రమాలు చెప్పటం జరిగింది .అంటే కృష్ణుడికి బాల్యం పూర్తి అయి ,అవతార కార్యం నిర్వహించే వయసువచ్చింది కనుకనే నారదుడు వచ్చి కర్తవ్య౦ బోధించాడు .
110 విరోధి శ్రావణ బహుళ అష్టమికి కృష్ణస్వామికి నూనూగు మీసాల నూతనయవ్వనం వచ్చి 16సంవత్సరాలు నిండాయి .అక్రూరుడిని కంసుడు బృందావనానికి పంపటం బలరామ కృష్ణులు ఆయనతో ధనుర్యాగానికి మధుర చేరటం ,గోపికలు స్వామిని విడువలేక దుఖించటం ,వారించటం ,దారిలో యమునాతీరాన అక్రూరునికి కృష్ణుడు విశ్వరూప సందర్శనభాగ్యం ప్రసాదించటం, (ఇప్పటికి స్వామి 3 సార్లు విశ్వరూప సందర్శనం చూపించాడు ) అందరూ మధుర చేరటం జరిగింది .మధురలో రధం పై విహరిస్తూ సోదరులు రజకుని నిగ్రహించటం ,తంతు వాయక సన్మానం,మాలాకార సన్మానం పొందటం ,కుబ్జ తో సంభాషణం .మర్నాడు ధనుర్యాగశాల ప్రవేశం చేసి ,కువలయాపీడ౦ అనే ఏనుగు పీచమడిగించి,మల్ల యుద్ధం లో బలరామ కృష్ణ సోదరులు ముస్టికా, చాణూరులను మల్లయుద్ధం లో గెలిచి, కృష్ణుడు మేనమామ కంసునితోపోరాడి సంహరించటం ,బలరాముడు కంస సోదరులతో పోరి ,నిర్జించటం ,సోదరులు తలిదండ్రులు దేవకీ వసుదేవులను కారాగృహం నుంచి విముక్తికల్పించి ,వారిచే లాలి౦ప బడటం జరిగాయి .కొన్ని రోజులతర్వాత ,పెంచిన తలిదండ్రులైన నంద, యశోదాదులను ఆహ్వానించి పిలిపించి, వారి సమక్షం లో మాతామహుడు ఉగ్రసేనునికి పట్టాభి షేకం చేసి ,నందునికి కృష్ణస్వామి ఆధ్యాత్మికజ్ఞాన బోధ చేసి ,దుర్గా స్తోత్రం ఉపదేశింఛి ,వారిని తిరిగి బృందావనానికి పంపించటం జరిగింది .
సశేషం
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-19-ఉయ్యూరు
—