శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -5
కలిపూర్వం 49 వికృతి సంవత్సర చైత్ర శుక్లానికి చైతన్య వరడుడికి 77ఏళ్ళు నిండాయి .ధర్మరాజు రాజసూయ యాగం చేయటం, శిశుపాలుడి నూరు తప్పులు సైచి,101వ తప్పుకు శిక్షగా కృష్ణస్వామి చక్రం తో సంహరించటం ,భీష్మ పితామహుని సలహా పై ధర్మరాజు శిఖిపింఛమౌళికి అగ్రానాధిపత్యం ఇచ్చిపూజించటం ,ఆశ్వయుజ శుక్లం లో పాండవులతో పరమాత్మ ఇంద్రప్రస్థం లో ఉండగా,సాళ్వుడు ద్వారక ముట్టడించటం , ద్వారకా నిర్మాత స్వామి అక్కడికి వెళ్లి వాడినీ ,వాడి తమ్ముడు విధూరధుని ,దంతవక్త్రుని సంహరించాడు .ఆశ్వయుజ శుక్ల దశమి నాడు ద్వారకలో మురారి యుద్ధ సంరంభం లో ఉండగా ,కృష్ణుడు లేని సమయం కనిపెట్టి దుర్యోధనుడు ధర్మరాజు తో ద్యూతానికి పురిగొల్పి ఓడించటం ,ద్రౌపదీ వస్త్రాపహరణానికి నిండు సభలో ప్రయత్నించగా యాజ్ఞసేనికి అక్షయ వస్త్ర దానం చేసి ద్రౌపదీ మాన సంరక్షకుడు అనిపించాడు యజ్ఞపురుషుడైన మురభంజనుడు .ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో వనవాసానికి వెళ్ళాడు .48ఖరకు చాణూర మర్దనుడికి 78నిండాయి .వనవాసం లో పాండవులను పరామర్శించిన పాండవ శ్రేయోభిలాషి తో పాంచాలి తనపరాభావాన్ని చెప్పుకొని దుఖించగా కృష్ణా ను ఓదార్చాడు కృష్ణుడు .
47నందనకు 79,46విజయకు 80,45జయకు 81,44మన్మధకు 82,43దుర్ముఖికి 83,42 హేవళంబికి 84,41విళంబికి 85,40వికారికి 86,39శార్వరికి 87,38ప్లవకు 88,37శుభకృత్ కు 89,ఏళ్ళు నిండాయి యదుకుల విభూషనుడికి .సత్య తోసత్యాపతి రెండవసారి పాండవుల వద్దకు రాగా ద్రౌపదీదేవి సత్యభామకు పతివ్రతా ధర్మాలు బోధించటం ,వనవాసం ముగిసేముందు మూడవ సారి ముకుందుడు మళ్ళీ వచ్చిపరామర్శించి పాండవులకు ధైర్యం చెప్పాడు .శ్రీ కృష్ణానుగ్రహం తో ద్రౌపది దుర్వాసుని ఆగ్రహాన్ని శాంతి౦ప జేసి ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గి పాండవులకు ఉపశమనం కలిగించింది .ఈ సమయం లోనే ద్వారకకు కుచేలుడు రావటం అటుకులు చెలికాడికిచ్చి శౌరి చే అస్టభార్యలచే సపర్యలుపొంది అష్టైశ్వర్యాలు అనుగ్రహి౦ప బడటం ,మాధవుడు మిధిలరాజు బహుళాశ్వుని,శ్రుత దేవుని,మిదిలవాసులను తరి౦ప జేయటం జరిగాయి .పాండవుల 12ఏళ్ళ వనవాసం పరి సమాప్తి అయింది .
36 శోభకృత్ ఆశ్వయుజ కృష్ణ అష్టమికి కౌస్తుభధారికి 90ఏళ్ళు నిండాయి .పాండవుల అజ్ఞాత వాసం విరాట రాజు నగరం లో ప్రారంభమై ,10 నెలలు నిండాక భీమునిచే నర్తన శాలలో కీచక ఉప కీచక వధ , ,విరాట రాకుమారి ఉత్తరకు బృహన్నల వేషం లోని అర్జునుడు నాట్యం నేర్పటం , ఉత్తర, దక్షిణ గోగ్రహణం జరిగి ఉత్తరకుమారుని కి సారధ్యం వహించి పేడి ఐన క్రీడి శమీ వృక్షం పై దాచిన గాండీవం అక్షయ తూణీరాలు ఉత్తర కుమారునితో ది౦పి౦చి , ధరించి అర్జునరూపం తో ఉత్తరుడు సారధిగా ,కౌరవులకు తన నిజరూప దర్శనం చేసి తన అవక్ర పరాక్రమం తో ఓడించి సిగ్గుపడి వెనక్కి మల్లేట్లు చేసి భీష్మ ద్రోణాదులమెప్పుపొంది ,విరాట నగరానికి రావటం, ఉత్తరుడు సర్వం తండ్రికి వివరించటం ,ఉత్తరాభి మన్యుల వివాహం నీలమేఘశ్యాముడు స్వయంగా జరిపించాడు .ఆశ్వయుజ శుక్లపక్షం లో పాండవులు ఉపప్లావ్యం ప్రవేశించారు .యదుకులస్వామి ద్వారకకు చేరాడు .కౌరవ ,పాండవులు యుద్ధం కోసం సేనలను సమకూర్చే ప్రయత్నం లో దుర్యోధన అర్జునులు ఒకేసారి ద్వారకలో శ్రీ కృష్ణ సాయం కోసం రావటం ,తన సర్వసైన్యాన్ని కౌరవ రాజుకిచ్చి ,అర్జునుని కోరికపై తాను విజయసారదిగా ఉండటానికి అనుగ్రహి౦చి బావమరదితో ఉపప్లావ్యానికి వచ్చాడు వృష్ణివంశ యదుభూషణుడు . కార్తిక శుద్ధ ద్వాదశి (ద్వాదశి దగ్ధ యోగం )నాడు కేశి సంహారి హస్తినకు రాయబారం వెళ్లి 8రోజులు నయానా భయానా నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ,తనను కట్టేయాలని ప్రయత్నించిన గాంధారి జ్యేష్టపుత్రసమూహానికి విశ్వరూపం తో(నాలుగవ విశ్వరూప సందర్శనం ) భ్రమపెట్టి ముసలిరాజుకు ఆ భాగ్యం కలిగించి , విదురుని ఇంట ఆతిధ్యం స్వీకరించి ,తిరిగి వెళ్ళాడు .
మార్గశిర శుద్ధ త్రయోదశి మధుసూదనుడికి 90ఏళ్ళు పూర్తి అయి ,కౌరవ పాండవ సైన్యాలు కురుక్షేత్రం లో మోహరించాయి.అర్జునుడు విషాద యోగం లో ఉంటె భగవద్గీత బోధించి గీతాచార్యుడై నరుడికి నారాయణుడు 5 వసారి విశ్వరూపం చూపించాడు .యుద్ధం ప్రారంభమైన శుద్ధ ఏకాదశినాడే గీతోపదేశం జరిగింది .మార్గశిర బహుళ అమావాస్య నాడు 15 రోజుల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది .పుష్య శుద్ధ పాడ్యమి నాడు దుర్యోధనుని రెండు తొడలు విరగ్గొట్టి హతుడిని చేసి భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాడు .అశ్వత్ధామ ఉపపాండవులను మట్టు బెట్టాడు .వాడిని కృష్ణార్జునులు బంధించి తెచ్చి ద్రౌపదిముందు నిలబెట్టగా మాతృహృదయం తో క్షమించగా ,బావ సూచనతో బావమరది వాడి తలలోని చూడామణిని పెకలించి గబ్బుకంపుతో ఉన్న వాడిని బయటికి తోసేశాడు .పుష్యశుద్ధ పౌర్ణమి నాడు యుదిస్టిరుని పట్టాభి షేకం శ్రీ కృష్ణ పరమాత్మ చేతులమీదుగా జరిగింది .మాఘ శుద్ధ ఏకాదశి నాడు భీష్మ పితామహుని స్వచ్చందమరణం .భీష్మ తేజస్సు కృష్ణపరమాత్మలో విలీనమైంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-8-19 –ఉయ్యూరు