కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13
కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2
కవుల చరిత్రలతో మొదలైన తెలుగు సాహిత్య పునర్నిర్మాణ ఉద్యమం ఈ దశ వరకు తెలుగు సాహిత్య స్వరూపాన్నే ముట్టుకోలేదు .ఇక్కడే శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి కీలక స్థానం ఆవిష్కృతం అయింది అన్నాడు శేషేంద్ర .అప్పటికి పోగు చేసిన కవుల చరిత్రల సామగ్రి ,తెలుగు భాషాపరిణామ సామగ్రి కోరాడవారు పూర్తిగా అవగాహన చేసుకొని .తెలుగు సాహిత్య స్వరూపాన్ని మళ్ళీ నిర్మించాలంటే తెలుగు సాహిత్యాన్ని మాత్రమె పరిశీలించాలి అనే అభిప్రాయానికి వచ్చారు .అందుకే తన గ్రంథానికి కవితా శబ్దం చేర్చి ,అందులో మన సాహిత్యం మొదటి గ్రంథంగా ఉన్న నన్నయభట్టు భారతం లోనే మన సాహిత్య చరిత్ర బీజ రహస్యాలు౦ టాయని గ్రహించి ,అన్ని శాసనాలు తీసుకోకుండా నన్నయకు పూర్వం ,నన్నయకు సమీపం లో ఉన్న శాసనాలనే పరిశీలించారు .7వ శతాబ్దికి చెందిన జయ సింహ వల్లభ శాసనం ,లక్ష్మీ పురశాసనం ,8వ శతాబ్ది ప్రారంభం లోని అహదహన శాసనం ,9వ శతాబ్ది పండరంగ అనే అద్దంకి శాసనం గుణగ విజయాదిత్యుని ధర్మవరపు శాసనం ,తర్వాత చాళుక్య భీముని శాసనం ,దీర్ఘాసి శాసనం ,యుద్ధమల్లుడి శాసనాలు మాత్రమె పరిశీలనకు తీసుకొన్నారు .వీటిలోనే తెలుగు భాష యొక్క నన్నయ సమీపకాల రూపం కనిపించటం ,తరువోజ ,అక్కర ల వంటి దేశీ ఛందస్సులో చేసిన రచనలు ,శాసనాలు ఉండటం ముఖ్య కారణం .ఆయనకు భాషతో కాక సాహిత్యం తోనే సంబంధం అని గ్రంథ నామమే స్పష్టంగా తెలియ జేస్తోంది. వీరికి ముందు చాలామంది సాహిత్యం కోసం వెతుకుతూ ,ఇతర మార్గాలలో ప్రయాణించి దారినే కోల్పోతే ,రామకృష్ణయ్యగారు సాహిత్యాన్ని పట్టుకోవలసిన తాళపు చెవులనే పట్టుకొన్నారు అని శేషేన్ శర్మ చెప్పాడు .
ఈ తాళపు చెవులలో కన్నడ భాషా శబ్ద పరిశీలనం చాలాముఖ్యమైనది .ఉడివోవు అనే పదానికి ఉడి +పోవు గా విడదీసి ఉడుగు అనే ధాతు స్వరూపం అనీ ,కన్నడం లో ఉడగు అని ఉందని ,కనుక దీని ప్రాచీన రూపం ఉడి ఐ ఉంటుంది అని తేల్చారు .’’తగులు సంక్రందన నూతికి౦దగిలి కన్గొన జాలదే సక్తమై ఆసక్తితో ‘’పద్యం లో తగులు అంటే తాకటం అని అర్ధం. కన్నడం లో తగులు శబ్దం ఉంది .ప్రాచీన కన్నడం లో తాగు మాటకు ముట్టుకోవటం అనే అర్ధం ఉండి,తా౦గు గామారి తగులు అయిందని భాషా పరిణామం చెబుతోంది అన్నాడు శేషేంద్ర .
సంస్కృతపదాలు ఎక్కువ, దేశీ పదాలు తక్కువతో అల్లిన నన్నయ రచన అంతకు ముందే కన్నడం లో పంప మొదలైనవారి రచనలో ఉన్నాయి .దీన్ని చూపటం కోరాడవారి రెండవ తాళపు చెవి .చాలాకాలం నిష్ఫలంగా సాగిన తెలుగు సాహిత్య స్వరూప అన్వేషణ ఉద్యమాన్ని రామకృష్ణయ్యగారు ‘’ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’గ్రంథం ద్వారా సఫలత్వ ద్వారం దగ్గరకు తెచ్చారని ,అంటే శబ్దాలు, ఛందస్సులు, రచనాశైలి అంతా కర్నాటక నుంచి తెచ్చుకొని తన ప్రథమ కృతిని నన్నయభట్టు ఆనాడు ప్రవర్తమానం అనుకోవలసిన పండరంగ ,యుద్ధమల్లాది శాసనాలలో ఉన్న శిష్ట ఆంద్ర భాషలో రాశాడు అని మొట్టమొదటి సారిగా చెప్పిన కోరాడ రామకృష్ణయ్య పంతులుగారి ‘’ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’అనే గ్రంథం తెలుగులో భారత పరిశోధనకు ‘’ఆద్య గ్రంథము,మార్గదర్శక గ్రంథము’’అని గుంటూరు శేషేంద్ర శర్మ స్పష్టంగా చెప్పాడు .ఇంకా పరిశోధన ముందుకు సాగటానికి దీనిలో ఎన్నో విశేషాలు బీజప్రాయంగా ఉన్నాయి .అంటే ఆంద్ర భారత పరిశోధనకు కన్నడ భాషా సాహిత్య పరిచయం ,పరిశీలనం అనివార్యం అని కోరాడ వారే మొదటగా చెప్పారన్నమాట .
‘’ఆంద్ర శబ్ద చింతామణి విషయ పరిశోధనము ‘’ లో శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు చింతామణి ని చర్చిస్తూ ‘’అప్పటికే కర్ణాటక పండితులు త్రొక్కిన పద్ధతులు పరిశీలించి ,ఆంధ్రభాషా సహజాలైన నియమాలను కొంత విశాలంగా సూత్రీకరించి ఉండును .ఆంద్ర భాషాకవితనుధారగా నడపట౦ దుష్కరం కాదని ,ఉభయ భాషా కవితానుభవం ఉన్నవారికితోచకపోదు కదా .నన్నయకు పూర్వమే సంస్కృత భాష సాయం తో కర్నాటక భాషలో ధారావాహిక కవిత వెలిసింది కదా ‘’అని స్పుటంగా చెప్పారు . వఝలవారు కర్నాటక ఆంద్ర లిపులలోని సమానత్వాన్ని కూడా చర్చించారు .ఇలా సమానంగా ఉన్న ఈ రెండుభాషల లిపులను చూసి , నన్నయ తెలుగు లిపికి ప్రత్యేకత ఉండాలని భావించి కొన్ని మార్పులు చేశాడని చెప్పి, అప్పకవీయం లోని ‘’అప్పకవి పుస్తకే స్థితంఆంద్ర లిప్యుద్దారకం శ్లోక త్రయం ‘’అని ‘’బాలేందు పరిధి శృంగవర్త కుశ గ్రంథి దాత్ర పరశు సమాః’’వంటి శ్లోకాలను ఉద్ధరించి చూపించారు .ఈరెండుభాషలలో అలఘు లకారం వేరు అనీ ,ళకారం వేరని చింతామణిలో నన్నయ చెప్పాడని ,ఈ విషయంలో ఆయన కర్నాటక సంప్రదాయం పాటించాడని ,కర్నాటక శబ్దాను శాసనం140 సూత్రవ్యాఖ్యఉదాహరించారు .అంటే వఝలవారు అప్పటికే కోరాడ వారి గ్రంథాన్ని చూసే ఉంటారు కనుక రామకృష్ణయ్య గారి’ఆంద్ర –కన్నడ సందాన పధ్ధతి ‘’ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు పెద్దమనసుతో సాదుమార్గం గా స్వీకరించి బలపరిచారు అని శేషేంద్ర శర్మ గట్టిగా చెప్పాడు .
సశేషం
ఆధారం –కోరాడ రామకృష్ణయ్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-19-ఉయ్యూరు