కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 14
విత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-3(చివరిభాగం )
రామకృష్ణయ్య గారు చూపిన దారిలో వెళ్ళిన తర్వాతివారు ఆశ్చర్యకర విషయాలు చాలా గ్రహించి తెలియజేశారు .ఉత్పల,చంపక మాలలను కన్నడం నుంచి ఎలా నన్నయగారు తీసుకొన్నారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది .కన్నడ ఉత్పలమాల –‘’వ్యాసమునీంద్ర రుంద్ర వచనామృత వాగనీసు వె౦కవి –భ్యాసనె నెంబ గర్భ మెనగిల్ల ‘’పంపని చంపకమాల ‘’కతెసిరిదాదొడం కథయె మెయ్ గిడలీయ దెముం సమస్తభారతమున పూర్వమాగె వలె పెర్రద కవీశ్వర రెల్ల వర్ణకంకతెయొళొడం బడం’’(పంప ).ఇక కన్నడ కందం అందం చూద్దాం –‘’మిగె కన్నడ కబ్బ౦ గళొ,ళగణిత గుణగద్య పద్య సమ్మిశ్రితమం-నిగదిసువర్గద్య కథా ప్రగీతి యంత చ్చిరంతనా చార్యర్కళ్’’.9వ శతాబ్ది నృపతుంగ’’ కవిరాజమార్గ ‘’గ్రంథంలో నుంచి మన కవులు చాలా కన్నడ శబ్దాలు తీసుకొని వాడటం చూపించబడింది .’’చోళ నాళికకాక క్షోణీ తలేశ ‘’అని పండితారాధ్య చరిత్రలో ప్రయోగం ఉందని చూపి౦చాడు శేషేంద్ర శర్మ ..చోళ నాలిక అంటే జొన్నలు, నాలుకతో అని వేటూరి వారు అర్ధం చెప్పారు .జోళ అంటే కన్నడం లో జొన్నలు .’’జొన్నలు గొన్న ఋణంబు నీగెదన్’’అని నన్ని చోడుడు కుమార సంభవం లో రాసినదానికి పంప భారతం లో ‘’జోళమ నెంతునీగు ‘’లేక రన్న భారతం లో ‘’జోళదిపారియం ‘’అనేది మూలం అయి ఉంటుందని శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి గారు చెప్పారని శేషేన్ ఉవాచ .వీరే నన్నయ ,తిక్కనలు కూడా పంపభారతాన్ని పద్య నిర్మాణం లోనూ ,అలంకార ప్రయోగాల్లోనూ ఎలా అనుసరించారని తమ కుమార సంభవ పరిశోధన గ్రంథంలో చూపించారు .నన్ని చోడుడు ‘’నేలయు నింగియు తాళము గా వాయింప , నెండమావులబట్టి బండవలయు ‘అని సీసపద్యం రాశాడు .పాల్కురికి సోమన ‘’వెట్టన నేలకు నింగి కి సూత్రపట్టమే కాళ్ళను బట్ట తలలను ‘’అని రాశాడు .తిక్కన ‘’నేలయు నింగియు తాళముల్ గా జేసి,యేపున రేగి వాయించి యాడ ‘’అన్నాడు విరాటపర్వం లో . ’నేలయు నింగియు తాళముల్’’అనే పధ్ధతి కర్ణాట కవి నయసేనుడు రాసిన ‘’ధర్మామృతం ‘’అనే కావ్యం లో ఉందట .1112కాలం వాడైన నయ సేనుడు ‘’ధరణి చక్రము వియత్తళము మగంటిక్కువర్ ముంచ నచ్చరి యప్పంతు’’—అని రాశాడట .
కనుక ఏతావాతా తేలింది యేమిటి అంటే ,ఆంద్ర సాహిత్యం లో ఇతరకావ్యాలు పరిశోధనకు లొంగినట్లు ఆంద్ర మహాభారతం లొంగదు అంటాడు శేషేంద్ర .దీనితర్వాత వచ్చిన కావ్యాలన్నీ భారత భాష ,అలంకార ,ఛందస్సులను అనుసరించాయి .కానీ ఆంద్ర భారతం మాత్రం కన్నడ భాషలో కలిసిపోయి ఉన్న తెలుగు ,క్రమంగా విడిపోతూ ,ప్రత్యేక రూపాన్ని పొందుతున్న అస్పష్ట సంధియుగ గర్భం లోంచి పుట్టింది .కనుక ఇందులో నూతన ఆంద్ర శబ్దాల కన్నడ మాతృకలు ,కన్నడ జాతీయాల ఆంధ్రీకృతరూపాలు ,కన్నడ ఛందస్సులు ,కన్నడ కావ్యాలలోని అందమైన అలంకారాలు ఉన్నాయి ‘’కావ్యం గ్రాహ్యం అలంకారాత్ ‘’అన్నారు అందుకే పెద్దలు .
సమగ్ర ఆంధ్రభారత పరిశోధనకు సంస్కృత వ్యాస పాఠాన్నీ,కవిత్రయ తెలుగు పాఠాన్నీపోలుస్తూ’’ ఇది తీసేశారు అది కొత్తగా కలిపారు ‘’అంటూ చేసే పరిశోధన చాలదు అని విస్పష్టంగా చెప్పాడు శేషేంద్ర .కవిత్రయం కొత్తగా సృష్టించిన భావం పరమ రమణీయం అనీ ,వ్యాసుడు వీరిముండు బలాదూర్ అనీ కొందరు మూర్ఖంగా వ్యాఖ్యానించారు .ఇదే తప్పే అన్నాడు .కానీ కోరాడ వారు ,శ్రీపాదవారు రచించిన పరిశోధన గ్రంథాలు చూస్తె ,కవిత్రయం వారి నూతన సృష్టి ,సంస్కృత మూలం అనుసరించటం ,వదిలేసిన వాటిల్లో కర్ణాటక కావ్యాలనుంచి తీసుకొన్న భాగాలే అని అర్ధమౌతుంది అన్నాడు గుంటూరు శర్మ .కవిత్రయం ఎక్కడ నూతన సృష్టి చేశారో ,అక్కడ పరిశోధకుడు అప్రమత్తంగా కన్నడ కావ్యాలను శోధించాలి .కనుక కవిత్రయ భారత శోధనకు సంస్కృత పా౦డిత్యమేకాక ,కన్నడ పాండిత్యం అంతకంటే అధికంగా కావాలి అని ఖచ్చితంగా చెప్పాడు శేషేన్ .దీన్ని అతిక్రమించి చేసిన పరిశోధన అసమగ్రం, నిష్ప్రయోజనం అన్నాడుకూడా .
తాను 20-5-1962 ఆంధ్రప్రభ దినపత్రికలో కర్ణాటక, ఆంద్ర సాహిత్య సంబంధాలను గురించి ‘’కర్ణాటాంధ్ర సేతువు ‘’అని రాసిన వ్యాసం లో ‘’మన కావ్యాలను వాటి సంస్కృత మాతృకలతో పోల్చి పరిశీలించటం ఇంతవరకు పరిపాటి అయితే ,ఇక మీదట కన్నడ మాతృకలతో పోల్చి పరిశీలించటం ఆధునిక ఆంద్ర వాజ్మయ విమర్శన పద్దతిగా నెలకొనాలి ‘’అన్నది అందరూ అర్ధం చేసుకోవాలని శేషేంద్ర కోరాడు .ఈ విధంగా శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు అమూల్యమైన కర్ణాటకాంధ్ర సంధానపద్ధతిని ఆంధ్రమహాభారత పరిశోధనలో ప్రవేశపెట్టి ,ఆంద్ర సాహిత్య మహా పురుషులలో’’ అగ్రణి ‘’అయ్యారని ,వారికి ఆంధ్రులు ఎంతో రుణపడి ఉన్నారని ,వారి కోవిదత్వానికి రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తున్నానని గుంటూరు శేషేంద్ర శర్మ సవినయంగా ప్రకటించాడు .గొప్పవారి హృదయాలు గొప్పవారికే తెలుస్తాయి .కోరాడ, శేషేంద్ర అలాంటి వారే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-19-ఉయ్యూరు