ఘనంగా గురుపూజోత్సవం
సరసభారతి 147వ కార్యక్రమం బ్రహ్మశ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవం 5-9-19గురువారం సాయంత్రం 4 గం.లకు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం నాడు అమరవాణి హైస్కూల్ లో ఆ స్కూల్ తో కలిసి సంయుక్తం గా నిర్వహించాము .సభాధ్యక్షుడిగా నేను సభను నిర్వహించగా ,ఆపాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు అతిధులను ఆహ్వానించగా, సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి సుమధురంగా గురువందన గీతం ఆలాపించి సభను ప్రారంభించారు .పెదముత్తేవి ఓరియెంటల్ హైస్కూల్ రిటైర్డ్ హెడ్మాస్టర్,కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘ మాజీ కార్య దర్శి శ్రీ కోసూరు ఆదినారాయణ ,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,ఆధ్యాత్మికవేత్త రచయిత, శ్రీ పెర్నేటి గంగాధరరావు ,ఉయ్యూరు ఏజీ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి రిటైర్డ్ కేమిస్ట్రి లెక్చరర్ శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు ,93సంవత్సరాల వయసులోనూ యవ్వనోత్సాహంగాఉన్న పౌరాణిక నాటక రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారు వేదికపై ఆత్మీయ అతిధులుగా ఆసీనులు కాగా ,సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి కార్యక్రమం నిర్వహించారు .శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనగా, ముందుగా అందరం శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీ రాధాకృష్ణన్ గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ,పుష్పాలు సమర్పించాము .శ్రీ విశ్వేశ్వరరావు గారు శ్రావ్యంగా ఖంగుమనే కంఠ ధ్వనితో పద్యాలు పాడి, జోకులు చెప్పి సభా రంజనం చేశారు .
తర్వాత శ్రీ బొడ్డపాటి వారికి ,వారి కుమారునికి సంయుక్తంగా శాలువాకప్పి సరసభారతి గ్రంథాలు అందించి, 500రూపాయల నగదుతో ,పుష్పమాలతో ఎంఎల్సీ చేత సత్కరి౦ప జేశాము .తరువాత వరుసగా శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు ,ఉయ్యూరు ఏజీ ఎస్జీ సిద్ధార్ధ డిగ్రీ కాలేజి రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ యు.రాం ప్రసాద్ ,శ్రీ ఆదినారాయణ,శ్రీ పెర్నేటి గంగాధరరావు ,56సంవత్సరాలక్రితం నేను మోపి దేవి హైస్కూల్ లో మొదటి సారిగా సైన్స్ మాస్టర్ ఉద్యోగంలో చేరినప్పుడు నా మొదటిబాచ్ ఎస్ ఎస్ ఎల్సి విద్యార్ధిని ,ఆతర్వాత మచిలీపట్నం లో సైన్స్ టీచర్ గా , హెడ్ మిస్ట్రేస్ గా చేసి ,జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షురాలైన నాకు అత్య౦త ఆత్మీయురాలైన విద్యార్ధి శ్రీమతి కొల్లి భారతీ దేవి ,పామర్రులో నాతోపాటు హైస్కూల్ లో సైన్స్ టీచర్ , తర్వాత హెచ్ ఏం గా చేసి రిటైర్ అయి, టేన్నికాయిట్ ఆటలో మేటి అయిన శ్రీమతి వి కస్తూరి బాయి ,ఉయ్యూరు విఆర్ కే ఏం హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా చేసి రిటైర్ అయిన మా అన్నగారబ్బాయి ఛి గబ్బిట రామనాథబాబు ,అమరవాణి టీచర్ శ్రీమతి సుశీల గార్లకు అంటే తొమ్మిదిమంది నవరత్నాలైన వారికి చందనతాంబూలాలు ,పుష్పమాలలు శాలువలు సరసభారతి పుస్తకాలు ,తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి లామినేటేడ్ ఫోటో లు అందజేసి నేనూ మాశ్రీమతి ,శ్రీ రాజేంద్రప్రసాద్ ఘన సత్కారం చేశాం .
మా గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల కుమారులైన శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట రామకృష్ణ ,శ్రీ కోట గాయత్రిప్రసాద్ ,శ్రీ కోట సీతారామాంజనేయులు గార్లు తమ తలిదండ్రుల స్మారకార్ధం బ్రాహ్మణ విద్యార్ధి విద్యార్ధినికి ఏర్పాటు చేసిన నగదు పురస్కారం 2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి, స్థానిక . నారాయణ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న -కుమారి గబ్బిట రమ్య కు 10,,116రూపాయలు
8-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక చైతన్య జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చి. యనమండ్ర రోహిత్ కుమార్ కు 10,,116 రూపాయలను,
ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం
1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు
2- అమరవాణి పాఠశాల విద్యార్థిని -కుమారి ఎస్.సాహితి 10/10 –కు 2,000 రూపాయలు
3-..అమరవాణి పాఠశాల విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు 2,000 రూపాయలు
.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు ఏర్పాటు చేసిన ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
4-కుమారి .కె.తిరుపతమ్మ – బి.ఎ.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –ఉయ్యూరు కు 2,000 రూపాయలు
5-చి.మీరావలి – బి.కాం.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –ఉయ్యూరు కు- 2,000 రూపాయలు
6-కుమారి ఎన్.ఫాతిమా –బి ఎస్.సి.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –ఉయ్యూరు. కు -2,000 రూపాయలు – సరసభారతి ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కారం
స్థానిక శ్రీనివాస విద్యాలయం లో 2019 మార్చి పదవ తరగతి పరీక్షలో 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారి ఐలూరు హర్షిత కు 5,116 రూపాయల ను ,సరసభారతి అమూల్య గ్రందాలతోపాటు శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా అందజేశాము . మొత్తం 37,వేల 420రూపాయల నగదు పురస్కారం సరసభారతి ద్వారా అందజేయించిన కోట సోదరులు ,శ్రీ మైనేని దంపతుల సౌజన్యం అనిర్వచనీయం .ఈ నగదు విద్యార్ధులకు ప్రోత్సాహకం మాత్రమే .వారంతా చదువులలో రాణించాలని కోరుతున్నాము .
అతిధులందరూ ఉపాధ్యాయ దినోత్సవ విశేషాలు రాధాకృష్ణన్ గొప్పతనం విద్యార్ధులు నేర్చుకోవలసిన విషయాలు చాలా చక్కగా తేట తెల్లంగా మాట్లాడి విద్యార్ధులకు ప్రేరణ కలిగించి సభ ఉద్దేశ్యాన్ని సఫలీ కృతం చేశారు .అనివార్య కారణాలవలన మా కోట గురుపుత్రులు సభకు హాజరు కాలేకపోవటం గొప్ప లోటుగా గోచరించింది .శ్రీనాగరాజు అతిధులకు ఉపాహారం ,చల్లని పానీయం అందించి ఆతిధ్యధర్మాన్ని నిర్వర్తించారు .పెర్నేటి వారు అందరికి తమ అమూల్య గ్రంధాలను కానుకగా ఇవ్వగా సరసభారతి ఉగాది వేడుకలలో ఆవిష్కరించిన మూడు పుస్తకాలు ఆస్కూలు లైబ్రరీకి నేను నాగరాజుద్వారా అందజేశాను .విద్యార్ధులంతా అత్యంత క్రమ శిక్షణతో మెలగి కార్యక్రమం జయప్రదం చేశారు .
నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు మెసేజ్ లు చూస్తుంటే ,శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి సరసభారతి కార్యక్రమాలకు నా అకౌంట్ కు 10వేలరూపాయలు పంపటం చూసి అమితంగా ఆశ్చర్యపోయాను .వారెప్పుడూ అంతే. చడీ చప్పుడూ లేకుండా ఇలా డబ్బు పంపుతూనే ఉన్నారు .వారి సౌజన్యం వెలకట్ట లేనిది .మేమిద్దరం ఇంతవరకు ఈ పదేళ్ళలో కలుసుకోలేదు .ఒకరిముఖం ఒకరు చూడనే లేదు .ఎప్పుడో ఒకసారి మాత్రం ఫోన్ లో మాట్లాడుకొన్నాం .ఆయన మైనేనిగారికి దగ్గరివారు .మా ఉయ్యూరు దగ్గర గండిగుంట గ్రామ వారిది .గుంటూరు నాగార్జున యూని వర్సిటి లైబ్రేరియన్ గా పని చేసి రిటైర్ అయి హైదరాబాద్ లో ఉంటున్నారు .తాను 2004 లో ఉయ్యూరు ఎసి లైబ్రరి ప్రారంభోత్సవానికి వచ్చానని ,కాని నేను వేదికపై కార్యక్రమ నిర్వహణలో ఉన్నందున తాము నన్ను పలకరించటం కుదరలేదని ఆ తర్వాత ఎప్పుడో ఫోన్ లో చెప్పి తాను సరసభారతి బ్లాగ్ ను నిత్యం చదువుతూ ఉంటానని ఈ ప్రాంతం లో జరిగే విషయాలన్నీ మనబ్లాగ్ ద్వారా తెలుసుకొంటున్నానని సరసభారతికార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయని ,సరసభారతి ఆత్మీయుడనని చెప్పారు .అదే మా ఇద్దరి మధ్య సాహితీ బంధం .చాలా సార్లు హైదరాబాద్ వెళ్ళినా, వారిని స్వయంగా కలవలేక పోయాను .ఈ సారైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారిని కలిసి రావాలి .ఈ పదేళ్ళలో సరసభారతికి చాలా డబ్బు పంపిన వదాన్యులు కోటేశ్వరరావు గారు. వెంటనే మెయిల్ రాసి కృతజ్ఞతలు తెలియ జేశాను .దీనికి గాను సరసభారతి తరఫున వారికి ఏదో ఒకటి చేసి ఋణం తీర్చుకోవాలి …అలాగే నిన్న సభలో శ్రీమతి భారతి శ్రీమతి కస్తూరి గార్లు చెరి ఒక సీల్డ్ కవర్ నాకు ఇచ్చారు .రాత్రి ఇంటికి వచ్చి ఆ కవర్ లను తీసి చూస్తె, చెరి రెండు వేలరూపాయలు నగదు వాటిలో ఉండి,మళ్ళీ ఆశ్చర్యానికి గురైనాను .వీరిద్దరి సుమనస్కతకు ధన్యవాదాలు .మనపని మనం చేసుకు పోతుంటే మనకు తెలియకుండానే సహాయం లభిస్తుందని అర్ధమైంది .
ఇప్పుడు నిన్న నేనుమాట్లాడిన ,మాట్లాడాలనుకున్న విషయాలు మీకు అందజేస్తున్నాను. .
‘’గురు రాది రనాదిశ్చగురుః పరమ దైవతం –గురోః పరతరం నాస్తి –తస్మైశ్రీ గురవేనమః ‘’
గురువుకు జ్ఞానం ,అనుభవం ,త్యాగం అనే మూడు కొమ్ములుంటాయి .గురువు ను వసిస్టమహర్షిని శ్రీ రాముడు ,సాందీపని మహర్షినిశ్రీ కృష్ణుడు ,అరిస్టాటిల్ ను అలేగ్జాండర్,శ్రీ రామ కృష్ణను శ్రీ వివేకానందుడు ,రామేశ్వర స్కూల్ గురువును అబ్దుల్ కలా౦ ఎలా అనునిత్యం స్మరించే వారో అలా స్మరించి స్పూర్తిపొందాలి .మా గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట మాస్టారిని అందుకే నేనూ, మా గోపాలకృష్ణగారు స్మరిస్తూ ,ఉపాధ్యాయ దినోత్సవాన్ని శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తూ ,విద్యార్ధులలో స్పూర్తి కలిగిస్తూ వారి ప్రతిభాపాటవాలను గుర్తించి ప్రోత్సాహకంగా ఘనమైన నగదు పురస్కారాలు అందిస్తున్నాం .
ఆధునికకాలం లో భారత మాజీ రాష్ట్రపతి మహా తత్వ వేత్త ఆచార్యులకు ఆచార్యుడు శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యా య దినోత్సవంగా అంటే గురు పూజోత్సవంగా 1962నుంచి జరుపుకొంటున్నాము .ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యా శాఖ మంత్రి శ్రీ మండలి కృష్ణారావు గారు తనకు మచిలీ పట్నం లో గురువులైన కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరిరావుగారి కి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి ఆధ్వర్యం లో మొదటి సారి నిర్వహించి అందరికి మార్గ దర్శనం చేశారు.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రొఫెసర్ రాధాకృష్ణ ‘’ది ఫిలాసఫిఆఫ్ రవీంద్ర నాథ్’’పుస్తకం రాసి రవీంద్ర కవీంద్రుని తత్వ దర్శనం లోకానికి చాటి చెప్పారు .గురువు ఎలా ఉండాలో ఒక సంస్కృత శ్లోకం వివరిస్తోంది –
‘’శాంతో దాన్తః కులీనశ్చ ,వినీతః ,శుద్ధ వేషవాన్ -శుద్ధాచారః ,సుప్రతిస్టః,శుచి ర్దక్షః ,సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాన నిష్టశ్చ ,మంత్రం తంత్ర విశారదః –నిగ్రహానుగ్రహ శక్తో ,గురురిత్యభిదీయతే ‘’
దాదాపు ఇన్ని లక్షణాలు మూర్తీభవించిన వాడు రాదా కృష్ణ పండితుడు .అందుకే మనకు ఆరాధ్యుడు .ఐతే ఇన్ని మంచి గుణాలున్న ఉపాధ్యాయుడు లభించటం కష్టం .అంతేకాక విద్యా బోధనలోఅనేక మైన రీతులు విషయాలు ఉన్నాయి .ఇప్పటి గురువు ఆటపాటలతో హాయిగా చదువు చెప్పి ఇష్టంగా విద్యార్ధులు నేర్చుకోనేట్లు ప్రోత్సహింఛి ,స్నేహంగా ఉంటూ మార్గ దర్శనం చేయాలి . .విహార యాత్రలకు తీసుకు వెళ్లి అన్యోన్యత పెంచాలి –‘’దేశమైనా చూడు –కోశమైనా చూడు’’అన్న మాటను నిజం చేయాలి .కోశం అంటే నిఘంటువు .కాని ఈ రోజుల్లో కంప్యూటర్ .అది బోధించని, చూపించని విషయం లేనేలేదు .అన్య భాషలు నేర్వటం అవసరమే కాని ,మాతృభాషను మరువ రాదు .తల్లిభాష మూలధనం అని మర్చిపోరాదు .పుస్తకాల బరువు తగ్గించాలి .’’గణము కాదు లెక్క –గుణము లో నుండును ‘’అనే ‘’తెలుగుబాల ‘’మాట ను ఆచరణలో పెట్టాలి .
‘’ Platonic Kingdom ‘’ రాజైన రాష్ట్ర పతి రాధాకృష్ణన్ .ఒకసారి లండన్ లో డా వికె ఆర్ వి రావు ,డా బిఎస్ దేశికన్ లు ఐరోపా తత్వ వేత్తల సమక్షం లో మాట్లాడటానికి వచ్చిన రాదా కృష్ణ ఉపన్యాసం వినటానికి ఉవ్విళ్ళూరి ,ప్రవేశం దొరకక ,ఆయన్నే అడిగితె ‘’నాకు ముందు మంచి కాఫీ ఇప్పించండి ‘’అని చెప్పి వాళ్ళు తెప్పించి ఇవ్వగా త్రాగి ,ఇద్దరి బుజాలపైనా చేతులు వేసుకొని ఉపన్యాస హాలులోకి ప్రవేశింఛి తన శిష్య వాత్సల్యాన్ని చాటిన గురువు .రష్యా నియంత స్టాలిన్ ఐరన్ కర్టెన్ అని పిలువబడే రష్యాలో ఎవరికీ ప్రవేశం కలిపించేవాడుకాదు.కానీ రాదా కృష్ణన్ అంటే విపరీతమైన గౌరవం ఉండేది .ఆయన తనను చూడటానికి వస్తే ,ఎదురువెళ్ళి స్వాగతం పలికి తన చేంబర్ ఓ కూర్చోపెట్టి’’ప్రొఫెసర్ ప్రొఫెసర్ ‘’అంటూ మర్యాద చేసి తనలోని మానవత్వాన్ని చాటి ,తాను చేసిన నరమేధానికి ఆయన సమక్షం లో పశ్చాత్తాపం ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకొని తనను దుష్టునిగా భావించకుండా స్నేహ హస్తం చాటిన మేధావి మహాపండితుని దగ్గర కన్నీరు కార్చాడు .అదీ తత్వ వేత్త రాధాకృష్ణ అసమాన వ్యక్తిత్వం .’’త్వరలోనే భారత్ లో తత్వ వేత్తలు రాజ్యాదికారు లౌతారన్నమాట ‘’అని భవిష్యత్తును ఊహించి చెప్పాడు కర్కశ హృదయుడు స్టాలిన్ .
1959 బ్రిటిష్ ప్రధాని ఆ౦థోని ఈడెన్ భారత దేశానికి వచ్చి పార్లమెంట్ లో రాధాకృష్ణన చేసిన ఆంగ్లప్రసంగానికి ముగ్ధుడై ‘’ఇంగ్లీష్ లో ఇంత గొప్పగా ధారాప్రవాహం గా, ఇంత ఉ శుద్ధంగా,ఇంత పరమమాదుర్యంగా మాట్లాడే వారు ఇంగ్లీష్ దేశమైన మా బ్రిటన్ లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు .ఆయన తర్వాత నేను మాట్లాడలేను .’’దున్నిన భూమిలో ,నాగలి చాళ్ళమధ్య చెంగు చెంగున ఎగిరే కుందేలు పిల్లలాగాఆయనఉంటె , ,కాళ్ళు తడబడే పసిపిల్లవాడిలానేను ఉండిపోయాను ‘’అని తన జీవిత చరిత్రలో ఈడెన్ రాసుకొన్నాడు .
భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ రాధాకృష్ణన్ మహత్వాన్ని గురించి చెబుతూ ‘’He is a lift to our nation ,a gift for our nature .He is a teacher to patriots and preacher to philosophers .In the world Radha Krishnan is the Everesst of philosophers ‘’అని ప్రశంసించాడు .
విద్యా కుటుంబం అంటే విద్య నేర్పేవారు నేర్చుకొనేవారు ,యాజమాన్యం ఎలా ప్రవర్తించాలో విద్యా రహస్యం ఏమిటో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక పద్యం లో చెప్పినది మనకు ఆదర్శం కావాలి –
‘’వర్తి౦తున్ మత ,దేశ ,జాతి కృతముల్ వైవిధ్యముల్ వీడి,ని -ర్వర్తి౦తున్ ,బరి చర్య నార్తులకు యావత్ప్రజ్ఞ నర్పించి
త్రికరణ శుద్ధిగా ,భవదీయుడనై ,ఇతర ప్రవృత్తి వీడి,వీ-డికొనిపదార్ధ లాభమొకటే గమనించెద నింక’’
గురుభ్యోం నమః
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-19-ఉయ్యూరు