కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2
బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు 11ఏళ్ళ వయసువరకు తాళ్ళూరు,జగ్గం పేటలలో ,12,13వయసులో స్వగ్రామం మసకపల్లి (మసక తొలగించి వెలుతురు ని౦పటానికేమో ?)14దాక్షారామ ,15,16కొంకుదురు ,పిఠాపురం ,17-23దాకా ‘’ విజీ’’ నగరం ,24-కొవ్వూరు ,25-43వరకు కృష్ణాజిల్లా చిట్టి గూడూరు ,44లో విశాఖ ,45-48 గుంటూరు ,49-70దాకా వాల్తేరు లలో గడిపారు .ఇన్ని చోట్ల తిరిగినా ఆయనకు చిన్నప్పటి తాళ్ళూరు,జగ్గం పేటలంటే విపరీతమైన అభిమానం .రెండో క్లాసు మాష్టారు చింతా జగన్నాధం గారు పిల్లల దస్తూరి రమ్యంగా ఉండేట్లు చేయటానికి ప్రతి రోజూ ఒకగంట సేపు కాపీ రాయించేవారు .వీరికి దస్తూరి దూరం ,కుదిరేదికాదు .కాపీలు రాయించటం లో అప్పుడొక పధ్ధతి ఉండేది ,పుస్తకం లో పైన గురువుగారు’’ ఒరవడి’’ చక్కగా పెట్టి ఇచ్చేవారు .దాన్ని చూసి పిల్లాడు అడుగు పంక్తి నుంచి ,ప్రారంభించి క్రమంగా పై పంక్తి వరకు కాపీరాయాలి .ప్రతి పంక్తి మాస్టర్ గారికి చూపించి దిద్ది౦చుకొని తర్వాత పైపంక్తిలో పంక్తిలో తప్పులు లేకుండా రాయాలి .ఇలా కిందినుంచి పైకి రాస్తే ఎప్పుడూ మాస్టారుగారి ఒరవడే కనిపిస్తుంది. అదీ కిటుకు .
తన తండ్రిగారు జీవితకాలం లో నాలుగు నిమిషాలు వరుసగాతనతో మాట్లాడ లేదని అంతటి డిసిప్లిన్ ఆయనదని ,ఆయన్ను చూస్తె తాతగారు మామ్మ ,అమ్మమ్మ ,తల్లీ అందరూ గజగజలాడి పోయేవారని తండ్రి తనతో సన్నిహితంగా ఉండకపోవటం పెద్ద బాధగా లోపల ఉండేదని , .కానీ ఏమీ చేయలేని నిస్సహాయత అని చెప్పారు ..తనతోపాటు జగ్గం పేట ,తాళ్ళూరు లలో చదువుకున్న విద్యార్ధులు ,చదువు చెప్పిన మాస్టర్లు అందరూ దువ్వూరి వారికి బాగా జ్ఞాపకమే .బాల్య స్నేహితులను కలుసుకోవాలని ఎప్పుడూ ఆరాటంగా ఉండేది పెద్దయ్యాక ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్లి చూసి అ ఆనవాళ్ళు పోయినా ఆన౦దాన్ని అనుభవించారు .దస్తూరిలో వెనకబడ్డ శాస్త్రిగారు ఒకరోజు ఆదరాబాదరా కాపీ పేజీ అంతా రాసి పారేశారు .చూసిన చి౦తావారు రూళ్ళకర్ర పెట్టి నెత్తిన ఒకటిస్తే బొప్పికట్టింది ఏడుపు లంకి౦కొంటే ,ప్యూన్ వోదారుస్తుంటే , ఆ మేస్టార్ పై అసూయ ఉన్న తక్కినమేస్టార్లు తండ్రికి చెబితే ‘’ప్రాణం విసిగితే మనమంతా పిల్లల్ని కొడుతూనే ఉన్నాం. నేను కొట్టే దెబ్బలు మరీ ఎక్కువ .నేను వెళ్లి ఎలా అడుగుతాను బాగుండదు ‘’అని వాళ్ళ నోళ్ళు మూయించారు .ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు యాగీ చేయమని శాస్త్రిగార్ని మాస్టర్లు రెచ్చగొడితే సమయం చూసి చెప్పారు .ఆయన కనుక్కు౦టాలే అని ,అంతా అయ్యాక ఆ మేస్టర్ని పిలిపించి ఒంటరిగా ‘’అయ్యా రూళ్ళ కర్ర దేనికి వాడుతారు ?’’అని అడిగితె రూళ్ళు వేసుకోవటానికి అని చెబితే ‘’నెత్తిమీద కొట్టటానికీ
ఉపయోగిస్తారా ?’’అనగానే తప్పు తెలుసుకొన్న చింతా వారు చి౦తా క్రా౦తులయ్యారు.
తమ చిన్ననాటి వైశ్య స్నేహితుడు వెంట్రప్రగడ సత్యనారాయణ మూర్తి ,కమ్మవారి పిల్లాడు ముత్యాలసత్యం అంటే ఎక్కువ అభిమానం .వెళ్లి పలకరిస్తే ఎంతో ప్రేమాభిమానాలు కురిపిస్తారు ‘’హృదయం త్వేనన జానాతి ప్రీతి యోగం పరస్పరం ‘’అన్నారు .దస్తూరిబాగా ఉంటె జీవితగమనమూ బాగా ఉంటుందని ,మనసు సరళంగా ఉంటుందని ,ఎగుడు దిగుడుగా రాస్తే జీవితం లోనూ అవి తప్పవని తన అనుభవం చెప్పినట్లు తెలియజేసి ‘’చక్కబాటు –సద్దుబాటు –దిద్దుబాటు ‘’ఒక ప్రత్యేకక కళ అన్నారు .గోవిందమ్మ అనే ఇల్లాలు రోజూ సత్తుగిన్నెలో ప్రత్యేకంగా పెరుగు తోడుపెట్టి స్వయం గా వీరింటికి తెచ్చి వీరి తల్లిగారికి ‘’అబ్బాయికి ఈ పెరుగే వేయ౦ డమ్మా ‘’,అని చెప్పేది .సమయానికి పెరుగు అందించని రోజు ఎంతో నోచ్చుకోనేదని ,కని ఇంట్లో అలమారలో ఉన్న సత్తుగిన్నె లో ప్రత్యేకంగా తోడుపెట్టిన పెరుగును తాను రానప్పుడు ఈయన్నే తెచ్చుకోమని చెప్పే మహా ఇల్లాలు .శాస్త్రిగారు బాబాయి పిన్నిలదగ్గర ఉన్నప్పుడు గోవిందమ్మ ‘’అబ్బాయికి పెరుగంటే ఎంతో ఆప్యాయనం.ప్రత్యేకంగా తోడు పెట్టి పంపుతాను అదే అబ్బాయికి వేయండి మీ ఇంట్లో పెరుగు లేదనికాదు .ఏమీ అనుకోకు ‘’అని వ్రేపల్లె గోల్లామే అన్నంత ఆప్యాయంగా చెప్పేది .కాని పిన్నిమాత్రం పిల్లలందరికీ పెరుగు వేసి ,ఈయనకు మీగడ వేసేది ఆప్యాయంగా .’’నాకూ పెరుగే వేతూ,మీగడ జిడ్డు వదలదు ‘’అంటే పిన్ని ‘’పాలసారం పెరుగులో లేదు,రుచా పచా . మీగడలో ఉంది సున్నిపిండితో జిడ్డు పోతుంది .నీకోసం పాల కుండలో మీగడ వేరే తీసి ఉంచాను .వద్దనకు నాయనా !’’అని బ్రతిమాలి వడ్డించేది .ఆప్రేమ ఆప్యాయతకు శాస్త్రిగారు మురిసిపోయారు .ఇలా జగ్గం పేటలో కల్లూరి, వెంట్రప్రగడ కుటుంబాలతో అనుబంధం గాఢమైంది .’’ఒకే కుటుంబం అన్న భావనే తప్ప వేరే కుటుంబాలు అన్న ఆలోచనే ఉండేది కాదు .అలాంటి ఆప్తులమధ్య తాళ్ళూరు, జగ్గం పేటలలో పన్నెండో ఏడుదాకా పెరిగాను ‘’అంటారు దువ్వూరి వారు .బాబాయిపిన్నిలకు సంతానం లేదు .ఈయన్ను దత్తత తీసుకోవాలని లోపల ఉ౦డేదికాని బయట పడేవారుకాదు .అమ్మమ్మకు ఈయన ఒక్కరే దౌహిత్రుడు ఆమె ప్రాణాలన్నీ ఈయనమీదే .ఆమె ఐహిక అముష్మికాలన్నీ ఈయన చేతులమీదే జరగాలి కనుక ఎవరికీ ఈయన్ను పిన్ని బాబాయిల వద్ద ఉంచటానికి ఇష్టపడలేదు .
స్వగ్రామం మసకపల్లిలో తాతగారివద్ద సంస్కృతం నేర్వటం ప్రారంభించారు .అప్పుడేవరైనా రఘువంశం నాలుగో సర్గ లోని ‘’సర్గాసరాజ్యం గురుణాదత్తం’’శ్లోకం తో ప్రారంభించేవారు అలాగే వీరూనూ .అమరం తాతగారికి వాచోవిధేయం .పుస్తకం అక్కర్లేదు .ఆయనది ‘’చీకటి సంత ‘’మూడుకా౦డలూ అలాగే నేర్పారు .వనౌషధి వర్గులో కొసభాగం ,లింగాది సంగ్రహవర్గు వదిలేశారు .వల్లించి ఊరుకోవటం కాదు తాతగారితో నిత్యం కొంతభాగం ఏకరువు పెడుతూ ఉండాలి .వ్యుత్పత్తులు కూడా చెప్పేవారు .లింగాభాట్టీయం అనే గురుబాలప్రబోధిక ఆయనకు కంఠస్తమే.’’అమరం నెమరుకు వస్తే ,కావ్యాలెందుకు కాల్చను ?’’అనేవారు తాతగారు .పంచకావ్యాలలో మల్లినాద సూరి ఏ శ్లోకం దగ్గర ఏ పంక్తి రాశాడో ఆయనకు గుర్తే .వాల్మీకం అయిదు వందల సర్గలలో తీర్దీయ వ్యాఖానం లో ఎక్కడ ఏ పంక్తి ఉందో టక్కున చెప్పేవారు రామాయణం గురుముఖతా పాఠం గా చదివారట తాతగారు .రామాయణ ఆరుకాండలు తీర్దీయ వ్యాఖ్యానం తో సహా తాటాకులమీద స్వయంగా రాసుకొని భద్ర పరచుకొన్న సాహితీ మూర్తి .వ్యాకరణ ,అలంకార శాస్త్రాలు చదువుకోకపోయినా వ్యాఖ్యానాలో వాటి వివరణలు వాటిని చదువుకొన్న పండితులకంటే మేలుగా చెప్పేవారు .ఆప్రాంతం లోని గొప్ప సాహితీ పండితులు తాతగారి సాహిత్య పరిజ్ఞానానికి జోహార్లు చెప్పేవారట .గోదావరిజిల్ల్లాలో ఇందుపల్లి సాహిత్యానికి ,విశాఖ మండలం లో సాలూరు సాహిత్యానికి 1860-1920 కాలం లో ప్రత్యేక ప్రసిద్ధి ఉండేదని దువ్వూరి ఉవాచ .ఏలేశ్వరపు తమ్మన్న శాస్త్రులు గారివల్ల ఇందుపల్లికి , సామవేదం అన్నప్ప శాస్త్రులు గారివలన సాలూరు ప్రాంతాలు బహు ప్రసిద్ధి చెందాయి .వీరి తాతగారు ఇందుపల్లి సంప్రదాయానికి చెందినవారు. .
తాతగారికి పొలం వ్యవసాయ కామటమూ ఉండేది .తాతగారితో పొలం వెడుతూ తిరిగివస్తూ వెనకటిశ్లోకాలు వల్లెవేస్తూ వ్యాఖ్యానాలు చర్చిస్తూ గడిపేవారు .చదువుకు క్షణం విరామం ఉండేదికాదు .బామ్మగారు తాతగారిని ‘’పిల్లాడికి వినోదం లేదు ఆటాపాటా లేదు ఎప్పుడూ సంతతా సంధేనా ?అని సన్నాయి నొక్కులు నొక్కేవారు .ఆకాలం లో తోలుబొమ్మలాటలు బాగా ఉండేవి .ఒక రోజు రాత్రి ఆటకు ఆముదం ఖర్చు పెట్టుకొని ఆరు రూపాయలిస్తే రాత్రి తొమ్మిదినుంచి తెల్లవార్లూ ఆడేవారట .వారి బృందం లో కనీసం పది మంది ఉండేవారట .ఈ కాస్త డబ్బు ఎలా సరిపోయేదో అని శాస్త్రిగారు బాధపడ్డారు .రామాయణంలో సుందరకాండకు భారతంలో విరాట పర్వానికి మోజు ఎక్కువగా ఉండేదట .తోలుబొమ్మలాటలు వీదినాటకాలుగా ,స్టేజి నాటకాలుగా ,మూగ సినిమాలుగా టాకీలుగా క్రమ పరివర్తనం చెందాయంటారు .మామ్మగారు ఎన్నో సార్లు బ్రతిమిలాడితే ల తప్ప బొమ్మలాట చూడటానికి ఒప్పుకొనేవారు కాదట .చూసిన రోజు మాత్రం బ్రహ్మానందంగా ఉండేదట .
ఇంటి దగ్గరా ,పొలం లోనూ చదువే చదువు .క్షణం విరామం లేదు .శ్లోకాలు శబ్దాలు,సమాసాలు వ్యాఖ్యానాలు ,కొత్త శ్లోకాలకు అన్వయించే ఎక్సర్ సైజులు ,వ్యుత్పత్తుల పరీక్ష ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉండాలి.ఇవికాక ఆట విడుపుగా ‘’కట్టు శ్లోకాలు ‘’అంటే మన అంత్యాక్షరి అన్నమాట .అంటే ఒకరు ఒక శ్లోకం చదివితే దాని చివరి అక్షరం తో ప్రారంభమయే శ్లోకం రెండో వారు చదవాలి అన్నమాట .ఎప్పుడూ తాతగారిదే గెలుపు .ఒక్కో సారి మనవడికి గెలుపు ఇవ్వాలని మనసులో భావించి చెప్పాల్సిన శ్లోకం స్పురణకు రావటం లేదనే వారట .
ఆవులు గేదెలు పాడీ పంటా తో ఇల్లు శోభాయమానం గా ఉండేది .రాత్రి వేళ కిరసనాయిల్ దీప౦ దగ్గర చదువు .నిద్ర వచ్చే సమయానికి కట్టు శ్లోకాల జాతర .మామ్మ మధ్యవర్తి .మనవడిని అప్పుడప్పుడు గెలిపించేది .ఉదయం చల్ది భోజనమేకాని కాఫీ అన్నది లేనేలేదు .రోజూ పొలం లేక పెరటి లోనుంచి కోసిన తాజా కూరలతోనే వంట .బామ్మ పెరుగు చిలికిచల్ల చేసి పోసేవారు పల్లెటూరి మజ్జిగ అంటే ‘’చింత గింజ వేస్తే మునగని మజ్జిగ ‘’.ఈభోగం పట్నవాసులకు లేనేలేదన్నారు శాస్త్రిగారు ‘’తక్రం శక్రస్య దుర్లభం ‘’అని ఆర్యోక్తి .అంటే దేవేంద్రుడికి మజ్జిగ దొరకదు అనికాదు అర్ధం .మజ్జిగ వైభోగం అంతటి గొప్పదని కవిభావన అని చెప్పారు .మజ్జిక్కి సంస్కృతం లో 1-తక్రం 2-ఉదశ్విత్తు3-మధితంఅని మూడు పెర్లున్నాయని ,నాలుగోవంతు మాత్రమె నీరు కలిపింది తక్రం అని ,సగానికి సగం కలిపింది ఉదశ్విత్తు అనీ ,,అసలే నీళ్ళు కలపనిది మధితం అని అర్ధాలు చెప్పారు దువ్వూరివారు .వీటిలో తక్రం ఉత్తమోత్తమమం –శక్రస్య దుర్లభం అని దీనినే అంటారని చెప్పారు మజ్జిగలో నీళ్ళు ఎప్పుడైనా కాస్త ఎక్కువైతే తాతగారు మామ్మగారితో ‘’అబ్బా ! ఈ వేళతక్రం ఉదశ్విత్తుఅయిందే?’’అనేవారని అప్పడు ఆపదం సంస్కృతం లో ఎక్కడుంది అని తనను అడిగితె తడుముకోకుండా ‘’తక్రం హ్యుదశ్వి న్మదితం ,పాదా౦ బ్వర్దాంబు నిర్జలం ‘’అనే అమర శ్లోకం అందుకొనే వాడిని ,ఇలా భోజన సమయం లోనూ చదువు ప్రసంగాలు జరిగేవని దువ్వూరివారు ఆనందంగా గుర్తు చేసుకొన్నారు .’’తక్రాన్న సమయే చక్రధారి స్మరణ గోవిందో హారి ‘’అని బ్రాహ్మణ భోజన సమాప్తిలో అనటం నాకు బాగా జ్ఞాపకం .
సశేషం
ఆధారం –కళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి స్వీయ చరిత్ర ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-19-ఉయ్యూరు
—