కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు తమ జీవిత చరిత్రను అప్పటిదాకా బోధించిన ,రచించిన గ్రాంధిక భాషలో కాక, బాణీ మార్చి,వ్యావహారిక తెలుగులో హృద్యంగా రసవద్యంగా ,కమనీయంగా ,ఆయనే చిన్నయసూరి బాలవ్యాకరణానికి రాసిన ‘’రమణీయం ‘’గా ముగ్ధ మనోహరం గా ఉంది .ఎన్ని సార్లు చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి పవిత్ర శ్రోతస్వినిగా ,పరమ పవిత్రంగా భాషా భేషజం లేని కమ్మని తెలుగు నుడికారంగా,కారమే లేని కమ్మదనంగా ఉంది .చదువుతుంటే మనల్ని మనమే మర్చిపోయి ,వంశీ కృష్ణుని వేణు గానానికి సకల జగత్తు సమ్మోహంతో ఊగిపోయిన రసమయ భావన కలుగుతుంది .శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘’అనుభవాలు –జ్ఞాపకాలు ‘’లో ఎలా గోదావరిప్రాంత శిస్ట జన జీవితం ప్రతిబి౦బించిందో , శ్రీ మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి ‘’కృష్ణా తీరం ‘’లో కృష్ణానదీతీర వాసుల గ్రామ జీవన సౌభాగ్యం కనులకు కట్టిందో ,అలా ఉంటుంది దువ్వూరివారి స్వీయ చరిత్ర .కామ ధేనువు కమ్మని పాల పెరుగు మీగడ ,ఇక్షురసం ,ద్రాక్షా సవం త్రాగిన అనుభూతి కలుగుతుంది .ఇంతకీ దువ్వూరి వారెవరో ,వారి విశేషాలేమిటో టూకీ గా తెలుసుకొని అందులోకి ప్రవేశిద్దాం .
దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత.[1]
వీరిది తూర్పు గోదావరి జిల్లా లో మసకపల్లి గ్రామం. వీరి ఇంటి పేరు దువ్వూరి . దువ్వూరు అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔప విభక్తికం గనుక ‘ఇ’ కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.
వీరు విలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగినది. ” ఈయన వివాహం పదిహేనేళ్ళ వయసులో కోనసీమ లో అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రామంలో జరిగింది. మామగారు వంక జగనాధశాస్త్రి.
ఈయన 1914 సంవత్సరంలో విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరారు. ఆ కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షులుగా, కిళాంబి రామానుజాచార్యులు వైస్ ప్రిన్సిపాల్ మరియు సంస్కృత భాషా బోధకులు, వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు తెలుగు బోధకులు. ఈయన 1918లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి “విద్వాన్” పరీక్షలో ఉత్తీర్ణులయ్యా రు. వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు 1976వ సంవత్సరం మార్చి 6వ తేదీన కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ 78వ యేట మరణించారు[2
దువ్వూరి వారి రేడియోటాక్ ‘’జానకితో జనాంతికం ‘’బహు ప్రాచుర్యం పొందింది సీతమ్మతల్లితో ముచ్చటిస్తున్నట్లుగా వ్రాసిన ఈ వ్యాసం ఆయన మనోభావాలను ,అమ్మకు నివేదించిన వైనమూ కడు రమణీయం . బాల వ్యాకరణ కర్త చిన్నయ సూరి ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని ,ఆయన వ్యాకరణ సూత్రాలలో ఉన్న సొగసు ,మంత్రం వంటి ఫలితం ,కూర్పు నేర్పు లను మహా సొగసుగా తెలుగువారికి అందించి సూరి వ్యాకరణం అంటే భయపడేవారికి,విపరీతమైన మైన క్రేజు కలిగేట్లు దువ్వూరి వారు రాసిన ‘’రమణీయం ‘’కడు రమణీయమే .అలాంటి దువ్వూరి వారు తమ జీవిత చివరి కాలం లో 70వ ఏట రాసిన స్వీయ చరిత్ర అనుభవాల పుట్ట. జుంటి తేనే తెట్ట ,వడబోసిన ఇక్షురసం ,కలకండ పానకం .
ఈ నరచనకు నేపధ్యం – -2011లో అనుకొంటా కృష్ణా జిల్లా తెన్నేరు వాసి ,ఆత్మీయులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్తకం ఆప్యాయంగా నాకు పంపారు .చదవటం ప్రారంభించి వదలలేక రెండుమూడు రోజుల్లో జుర్రేశాను .మళ్ళీ చదివా, మరోమారు కూడా చదివా.తనివి తీరలేదు .ఆనందం వర్ణించటానికి నోట మాటలు రాలేదు . మంచికథకులు, కథారచనలో అద్వితీయులైన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మగారి అన్నగారు , నాకు పరమ ఆప్తులు బ్రహ్మశ్రీ గంధం వేంకాస్వామి శర్మగారితో ఈపుస్తకం గురించి తరచుగా మా ఇద్దరిమధ్యా జరిగే ఫోన్ సంభాషణలో చెప్పాను .ఆయన మరింత సంబర పడి ఆపుస్తకాన్ని తనకు పంపిస్తే ,చదివి తిరిగినాకు పంపిస్తామనగా ,కొరియర్ లోప౦పాను .ఆతర్వాత 2012లో మేము అమెరికా వెళ్ళటం ,ఆ మేనెలలోనే శర్మగారు మరణించటం అక్కడినుంచే వారి సౌజన్యంపై నెట్ లో వ్యాసం రాయటం జరిగింది .అక్టోబర్ లో ఇండియా వచ్చి ,కాస్త కుదురుకున్నాక , బెజవాడ లో శర్మగారి౦టికి వెళ్లి ,ఆయనతో తరచుగా సభలకు వచ్చే ఆయన కుమార్తెను పలకరించి పుస్తకం సంగతి అడిగితె ,శర్మగారు చనిపోగానే ఆయన పుస్తకాలన్నీ పెట్టేల్లోపెట్టి అటకపై దాచేశామని దించి వెతికే ఓపిక లేదని చెప్పగా హతాశుడనై తిరిగి వచ్చాను .మళ్ళీ ఆపుస్తకం నాకు పంపమని మధుసూదనరావు గారు కనిపించినపుడు అడిగితె తనవద్ద ఉన్న కాపీలు అందరికీ ఇచ్చేశాననని లేవని చెప్పారు .బెజవాడ పాత పుస్తకాల షాపులుఅన్నీ గాలించా. ప్రయోజనం లేదు .ఇక ఆపుస్తకం మనకు కనిపి౦చదు అని నిర్వేదనలో ఉండిపోయా .
అనుకోకుండా ఈ ఆగస్ట్ నెల మొదటివారం ఆంద్ర జ్యోతి దినపత్రికలో శ్రీ సాకం నాగరాజుగారు తనవద్ద దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్తకాలున్నాయని కావలసినవారు ఫోన్ చేస్తే తానె పంపిస్తానని,సెల్ నంబర్ తో సహా తెలియ జేశారు .నా ఆనందానికి అవధిలేకుండా పోయింది .ఫోన్ చేద్దాం అనుకుంటూనే ఒక వారం గడిపి ఆగస్ట్ రెండవవారం లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాగరాజుగారికి ఫోన్ చేశా .ఆయన తీయలేదు .కాసేపటికి వారే నాకు ఫోన్ చేశారు .వారి సౌజన్యానికి దాన్యవాదాలు చెప్పి దువ్వూరివారి పుస్తకం పంపగలరా అని అడిగా .తప్పక పంపుతానని ,కానీ తానుప్రస్తుతం బెంగుళూరులో ఉన్నానని ,17,18తీదీలకు తిరుపతి వెడతానని నా నంబర్ సేవ్ చేసుకోన్నానని ,అడ్రస్ మెయిల్ చేయమని చెప్పారు .అప్పటికప్పుడు అడ్రస్ మెయిల్ చేశా .20 కి ఉయ్యూరు వచ్చాం .పుస్తకం రాలేదు .మళ్ళీ ఫోన్ చేశా ఆత్ర౦ ఆగలేక.ఆయన తాను 20కి మాత్రమె తిరుపతివచ్చానని,ఆ రోజే ప్రొఫెషనల్ కొరియర్ లో పుస్తకం పంపాననని చెప్పారు .మర్నాడే పుస్తకం అందింది. వారికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పి వారిచ్చిన అడ్రస్ కు సరసభారతి పుస్తకాలు పంపవచ్చా అని అడిగితె పంపమంటే ఆసాయంత్రం అదే కొరియర్ లో15పుస్తకాలు పంపాను .అవి అందగానే నాగరాజుగారు ఫోన్ చేసి మాట్లాడి ‘’ఇన్ని ఉద్గ్రంధాలు రాశారు మీరు . మీ వయస్సు యెంత సార్?అనగా 79 నడుస్తోందని చెప్పగా మరింత ఆశ్చర్యపోయి మనస్పూర్తిగా అభినదించారు .నాగరాజు గారిపేరు బాగా విన్నవాడినేకాని,వివరాలు తెలేదునాకు .వారినే ఫోన్ లో అడిగా. తాము తిరుపతికాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేసి 2010లో రిటైర్ అయ్యానని ,అభ్యుదయ రచయితల సంఘం లో తనకు బాధ్యత ఉందని, పుస్తకాలు ప్రసురి౦చామని చెప్పగా ,’’మా మధుసూదనరావు గారు మీకు తెలుసా ?’’అని అడిగా ..’’బాగా తెలుసు .వారి తెన్నేరుకు రెండుమూడు సార్లు వెళ్ళాము ‘’అన్నారు .అప్పుడు నేను దువ్వూరివారి పుస్తకం ఆయన నాకుఇవ్వటం గంధం వారి నుంచి తిరిగిరాకపోవటం కథ అంతా పూసగుచ్చినట్లు చెప్పి ‘’అందుకే మళ్ళీ చదవాలనే కోరికతో మిమ్మల్ని ఆపుస్తకం పంపమన్నాను ‘’ అనగానే ఆయనకూడా ‘’ఈపుస్తకం అడిగారు అంటే సాహిత్యం లో ఎంతో అభి రుచివున్నవారై ఉంటారు ‘’అని తానూ అనుకొన్నట్లు ఆనందం గా చెప్పారు .ఫోన్ లోనే ఈ పుస్తకావిర్భావం వివరించారు .’’నారాయణ రెడ్డిగారు ,భరద్వాజ మొదలైనవారు కలిసి దువ్వూరి వారి స్వీయ చరిత్రను మొదట కొద్దికాపీలే ముద్రించారు . అవి ఎవరిదగ్గరున్నాయో ఎవరికీ తెలీదు .నేను మళ్ళీ ప్రింట్ చేయి౦చాకొని ప్రయత్నిస్తే కృష్ణా జిల్లా పామర్రులో ఉన్న డా రొంపిచర్ల భార్గవి గారి వద్ద జిరాక్స్ కాపీ ఉందని తెలిసి ,ఆమెనుంచి దాన్ని సేకరించి రెండవ ముద్రణగా ప్రచురించాము .అవీ అయిపోయాయి .తర్వాత తిరుపతిలోని ఒక వదాన్యుడు చాలాఖర్చుపెట్టి ఇంకా అందంగా మూడవ సారి ప్రచురించి అన్ని యూనివర్సిటీలకు, కాలేజీలకు పంపాడుకాని ఫీడ్ బాక్ రాలేదు పుస్తకాలుకూడా అయిపోయాయి .మళ్ళీ మేమే నాలుగోసారి ప్రచురించాము .ఆసక్తి ఉన్నవారికి మేమే పంపిస్తున్నాము .మీరు అడిగినందుకు మీకున్న సాహిత్యాసక్తి గమనించి మీ పేరు సెల్ నంబర్ సేవ్ చేసుకొన్నాను ‘’అని ఈ పుస్తక చరిత్ర వివరించారు ఆసాంతం సైకం నాగరాజుగారు .డాక్టర్ భార్గవిగారు నాకు తెలుసు .ఆమెమద్రాస్ లోని వి.ఎ.కే. రంగారావు గారి ‘’ఆలాపన ‘’పుస్తకానికి స్పాన్సర్.
ఈపుస్తకం వచ్చినప్పటినుంచి మా శ్రీమతి ఒక్క క్షణం వదలకుండా చదివి ఎంతో ఆనందం,అనుభూతిపొంది నిన్నటితో పూర్తి చేసింది .నిన్నరాత్రి నా చేతికి వచ్చిన ఆపుస్తకం లోని నలభైపేజీలు ఏకధాటిగా చదివి ,దువ్వూరివారి జీవిత విశేషాలు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు నని సాహితీ బంధువులకు ఆ విశేషాలు అందించి ధన్యుడనవ్వాలని భావించి చేస్తున్న ప్రయత్నం ఇది .
ముందుగా సాకం నాగరాజు ఏమన్నారో తెలుసుకొందాం ‘’ఇది తెలుగు వారి మృష్టాన్న భోజనం .దువ్వూరివారి కలం లో గోదావరిప్రవహి౦చి౦ది .పాఠకుడికి తీర్ధయాత్ర ప్రారంభమౌతుంది .’’గోవిందమ్మ’’ తోడుపెట్టి శాస్త్రిగారికి రోజూ ఇచ్చే పెరుగులాగా బహుకమ్మగా ఉంటుంది .వీరి భూములు గౌతమీ నది గర్భం లో కలిసిపోయిన ఉదంతాలు వింటే గుండె చెరువే అవుతుంది .మతభేదం వదిలి బ్రాహ్మణులు రేవులలో ‘’కాటన్ దొర స్నానం అహం కరిష్యే ‘’అని సంకల్పం చెప్పుకొని స్నానాలు చేస్తుంటే,తమపోలాలను సస్యశ్యామలం చేసిన దొరపట్ల ఉన్న ఆరాధన కుమనసు ఉప్పొంగిపోతుంది .కృష్ణాజిల్లా చిట్టి గూడూరు కళాశాలనుంచి వీడ్కోలుసమావేశం లో శాస్త్రిగారిపై వక్తలు కురిపించిన ప్రశంసల వర్షం లో మనమూ తడిసి ముద్ద అవుతాం .’’తృప్తి లేనివాడు దరిద్రుడుకాని ,ధనం లేనివాడు దరిద్రుడు కాదు ‘’అన్న ఆయన సిద్ధాంతం అందరికీ ఆదర్శనీయం .వర్తమాన సమాజం పై ‘’సంఘం లో ఏ వర్గమూ ,ఏ వ్యక్తీ నాకేం భయం అని గుండెలమీద చెయ్యి వేసు కొని హాయిగా నిద్ర పోయే వారు నాకు కనబడలేదు ‘’అని ఆవేదన చెందారు .దువ్వూరి వారి మనుమరాలు డా ధూళిపాళ అన్నపూర్ణ ‘’తాతగారు సాహితీ రమణీయమూర్తి .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి సాహితీ సౌరభం అద్దిన సౌ౦దర్య భావుకులు .రమణీయం అనే పేరుపెట్టటం లోనే సుందరమైనదని వారి హృదయ ధర్మం తెలియజెప్పారు .కటువైన వ్యాకరణ శాస్త్రాన్ని పుష్పం లాగా మలచారు .జీవితాన్ని సరళతరం చేసుకొన్న సాధనాపరులు.స్నేహధర్మం సౌ౦దర్యభావన వీరికి రెండుకళ్ళు .ఈ పుస్తకం చదివితే జీవితాన్ని యెంత సౌందర్య మయంగా మలచుకోవచ్చో తెలుస్తుంది .డా.ధూళిపాళ మహాదేవ మణి’’స్మరణ కీర్తి ‘’లో పద్యాలలో దువ్వూరి వారి వైదుష్యాన్ని కీర్తించారు –
1-‘’మాట మాటాడెనా !మల్లెలై మొల్లలై –ఘుమఘుమ లాడింఛి గుండె నింపు
మైత్రి చూపించెనా ! మరువమై ,గుణ సుధీ -హారమై చిరతర స్మారకమగు
శబ్ద శాస్త్రము చెప్ప,చక్కని భారత- కథ చెప్పునట్లుగా కలుగు ప్రీతి మురిపించు వ్రాతలో !’’ముత్యాలు ‘’తారలై –నింగి లేఖను వెల్గు నిశ్చయంబు
రమ్య దువ్వూరి వేంకట రమణవిఖ్యు –తెలుపుటన్నచో నక్షత్ర కలితమైన
అంబరము ,’’కళాపూర్ణో దయ’’ ప్రశస్తి-చిత్రముల్ వేసి చూపుటే శిస్టులార!
‘’ఎందరొ జీవితంబు వెలయించిరి గ్రంథము గాగ ,నందు ,మా –కంద ఫల ప్రసాద మిది,కావ్య మరందము ,సంప్రదాయముల్
చిందు జవాది సౌరభము ,చిక్కని వెన్నెల ,పూలపాన్పు ,నౌ –సుందర లోక వృత్త నయశోభితమయ్యె పఠింప హర్షమై ‘’
రెండోభాగం నుంచి అసలు కథ లోకి ప్రవేశిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-19-ఉయ్యూరు
—
అయ్యా, ఇలాంటి పుస్తకాలు ప్రచురణ కర్తలే పి. డి. ఎఫ్.లో మారిస్తే అందరికీ అందుబా టు లో ఉంటాయి. వారి ఫోన్ నంబర్ తెలియజేస్తే నేను కూడా పుస్తకం తెప్పించుకుంటాను. నాబోటి డయా బెటిక్ వాడికి, జుంటి తేనెల మీద, పానకాల మీద వ్యామోహం జాస్తి.
నమస్తే ఉండాల్సిన వ్యామోహమే అది .శ్రీ సాకం నాగరాజు -9440331016
I’m
protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.