కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3
దువ్వూరి వారిఊరంతా గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపోయింది .ఈయనున్నప్పటి ఊరు అంటే 1910లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ తర్వాత నదీ గర్భం లోచేరింది .తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో వీరి భూములన్నీ గౌతమీ గర్భాన చేరాయి .1910కి వీరికి మిగిలింది 3ఎకరాలే .మరోనాలుగేళ్ళ లో ఇదీ గోదావరికి అర్పణం అయింది .ఒక్కోసారి మూడు లేక నాలుగేళ్ళకు భూమి పైకి తేలచ్చు .ఒక్కోసారి వందేళ్ళు అయినా జాడ లేకపోవచ్చు .ఈ ‘’గంగ వెర్రులు ‘’ఎవరికీ తెలీవు అంటారు దువ్వూరి .తీర గ్రామాలకు ఏటా ఈ తిప్పలు తప్పవు .ధవళేశ్వరం ఆనకట్ట గోదావరికాలువలు ఏర్పరచిన కాటన్ దొర బ్రతికి ఉంటేదీనికి ఉపాయం ఆలోచించి కాపాడేవాడు. ఇప్పటి’’ పబ్లిక్ వేస్ట్ డిపార్ట్ మెంట్ ‘’అదేనండీ పి.డబ్ల్యు డిపార్ట్మెంట్ కు ఈ గోలపట్ట లేదని శాస్త్రిగారు బాధపడ్డారు .కాలువలద్వారా నీరు ప్రవహించి గోదావరి పొలాలు సస్య శ్యామల౦గా భూదేవికట్టిన పచ్చటి చీర లాగా భాసిస్తూ ఉంటె, కాటన్ దొర ఒకసారి ఆ భూములన్నీ కంటితో చూసి ఆనందించాలని ఒక బోటు లో నెమ్మదిగా ప్రయాణం చేసి, తనివార చూసి పులకించి ఆనంది౦ఛి తన జీవితం సార్ధకమై౦దని సంతృప్తి చెందేవాడు . ఒకసారి అలా వస్తూ ధవళేశ్వరం నుంచి తాళ్ళరేవు దాకా ప్రవహించే కాలువ ఆనుకొని ఉన్నఅరవై ఇళ్ళు,80మంది వేదవేత్తలు ఉన్న కపిలేశ్వరపుర ఆగ్రహారానికి రాగా,ముఖ్యమైన రేవులో స్నానం చేస్తున్న శిస్ట బ్రాహ్మణులు కాటన్ ను అపర భగీరధునిగా భావించి ‘’కాటన్ దొరస్నానమహం కరిష్యే’’అంటూ మూడు సార్లు చెప్పుకొని స్నానం చేస్తుండగా రేవు దగ్గరున్న దొర చెవులకు ఆపేరు వినిపించి గుమాస్తానుపంపి వాకబు చేయిస్తే ‘’అయ్యా !కాటన్ అనే గొప్ప దొరగారు ఇంజనీరుగా ఉండేవారు .అ మహానుభావుడే ఈకాలువలన్నీ త్రవ్వించాడు. మహామంచివాడు .స్నాన పానాలకు సౌకర్యం లేకుండా తరతరాలనుంచి ఇబ్బందిపడుతున్నమాకు ,ఇలాంటి సౌఖ్యం కలిగిగించిన ఆయనను మర్చిపోకుండా రోజూ స్నాని౦చేటప్పుడు సంకల్పం లో ఆయన పేరు కృతజ్ఞతగా చెప్పుకొ౦టాం ‘’అని చెప్పారట .వచ్చిన వాడు కాటన్ పంపిన మనిషి అని తెలీక .ఈ మాట గుమాస్తా ద్వారా విన్న దొర అక్కడున్న బ్రాహ్మణులకు తలొక పది రూపాయలు బహుమతులుగాగుమాస్తాద్వారా ఇప్పించాడట ..ఈ వార్తనెమ్మదిగా అవతలి రేవు వారికి పాకి దొర దగ్గరా డబ్బులు పిండుకొందామని ఆయన బోటు అక్కడకు రాగానే బిగ్గరగా అక్కడి బ్రాహ్మలు ఆయన పేరు పైకి బాగా వినబడేట్లు సంకల్పం చెప్పటం విని ,బహుమతికోసం చెబుతున్న మోసపు సంకల్పం అని తెలుసుకొని ,,సరంగులతో ‘’ప్రభుత్వ రేవులో కాక వేరే రేవులో స్నానం చేస్తే ఖయిదులో పెడతామని గట్టిగా చెప్పించి వాళ్ళందర్నీ ఒడ్డుకు తరిమి కొట్టి౦చాడట .పడుతూ లేస్తూ ఆశపోతులు పారిపోయారని దువ్వూరివారు రాశారు .
స్వంతూరిలో శివాలయ విష్ణ్వాలయాలు లేవు .ఊళ్ళో బ్రాహ్మలు కోరితే దంగేరులో ఉన్న రావిపాటి కమ్మవారు కేశవస్వామి గుడికట్టించారు .అంతాకలిసి చ౦దాలు వేసి మల్లేశ్వరస్వామి గుడి కట్టించాలని సంకల్పించి దంగేరువాసి పోలిశెట్టి వెంకటరట్నంగారినే కాపు కులస్తుని అడగటానికి వెళ్ళారు .ఆయన మొదట్లో చేతిలోకానీ లేక పోగాకు కాడలు ఊర్రూరూ తిరిగి అమ్ముతూ ,వచ్చినదానితో కుటుంబం పోషించుకొంటూ’’ ఎక్కడో తేనే తుట్టె పట్టి ‘’ క్రమంగా ఎకరాలకు ఎకరాలుకొని, కాకినాడ వంతెనదగ్గర ఉప్పుటేరు ఒడ్డున ఉన్న కలప అడితీలలో సగం దాకా కొని మహాదైశ్వర్యవంతుడై ,దాన శీలియై ,దైవ బ్రాహ్మణభక్తితో ఎవరేది అడిగినా సంకోచం లేకుండా సాయం చేస్తూ ,లెక్కలేనన్ని దాన ధర్మాలు చేస్తూ ,బీద బ్రాహ్మణులకు యకరమో అరఎకరమో రాసి ఇస్తూ ,ఊళ్ళో ఎవరేది అమ్మినా కొంటూ ,ఎవరైనా అమ్ముతామని వస్తే ‘’నలుగురికి చెప్పి యెంత ఎక్కువ ధర పడుతు౦దోతెలుసుకొని నాదగ్గరకు వస్తే, దానిపై కొంచెం ఎక్కువే వేసి నేను కొంటాను ‘’అనే ఉదార హృదయంతో అందరికి తలలో నాలుక అయ్యాడు. ‘’సాధారణంగా చెడి అమ్ముకొంటారు ఎవరైనా .వాళ్ళు కష్టపడుతూ ఇచ్చింది మనకు జయం కాదు .వాళ్ళను సంతోషపెట్టి పుచ్చుకోవాలి ‘’అన్న ఫిలాసఫీ అమలు చేసిన సహృదయుడు .కాకినాడకు స్వంతకారులో వెడుతూ దారిలో ఎవరైనా ముసలి వారుకనబడితే ఆపి కారు ఎక్కించుకొని తీసుకు వెళ్ళే పరోపకారి .శివాలయం లో ‘’కోటి పత్రి ‘’పూజ ,రోజుకు లక్ష పత్రి చొప్పున 100రోజులు జరుపుతూ ,పగలల్లా ఉపవాసం ఉంటూ ఆ వందరోజుల్లో ఊరందరికీ రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తూ , వాళ్ళ భోజనాలయ్యాకే తానూ భోజనం చేస్తూ,ప్రతిరోజూ పొరుగు ఊళ్లకు జనాలనుపంపి ఒక్కొక్క మారేడు దళం చొప్పున కోయించి తెప్పిస్తూ ,,సంతర్పణలు సమారాధనలు చేస్తూ కేశవ స్వామికి కోటి తులసిదలాలపూజ చేయిస్తూ, లక్ష్మీ పార్వతులకు కోటి కు౦కు మార్చనలు చేయిస్తూ ,108శ్రీమద్రామాయణ పారాయణాలు 108బ్రాహ్మణుల చేత వందరోజులు చేయించి ,ప్రతిదానికీ పూర్ణాహుతి అతి వైభవంగా చేస్తూ ‘’బరంపురం లో ప్రత్యేకంగా నేయిం ఛి తెప్పించిన తెల్లని అక్షీరాబ్ది పట్టు చాపు ఉత్తరించి విడదీసి ,రెండు చేతులతో లుంగ చుట్టి ఆవునేతి మండగ లో ముంచి తడిపి అగ్నిహోత్రం లో వ్రేలుస్తుంటే అతని వదాన్యతకు ముక్కున వేలు వేసుకోనేవారట .
ఇలాంటి షావుకారు దగ్గరకు శివాలయం చందాకోసం శాస్త్రి గారు గ్రామ౦లొని బ్రాహ్మణ్యం దువ్వూరిపుల్లయ్యగారి నేతృత్వం లో వెళ్లి అడిగితె ‘’మీరు గుడికతట్ట వచ్చు కట్టలేక పోనూ వచ్చు .నేను ఇచ్చి౦దానికి వెంటనే ఫలితం రాదు .నేనేదైనా ఇచ్చినా ఆలయం పూర్తియితే అప్పుడు మీ అందరితోపాటు నాకూ ఆవగిజలో అరవై వంతుఫలితం రావచ్చు .మీ అందరికీ నాకు తోచింది ఇస్తాను .దాన్ని మీరు దేవాలయానికే ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి.నాకు వెంటనే ఫలితం దక్కుతుంది ‘’అని చెప్పి వెళ్ళిన 12మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక ‘’దొంతి ‘’అంటే 20వెండి రూపాయల వంతున పళ్ళెం లో పెట్టి ఇస్తే ,తీసుకొని వెంటనే అంతా పుల్లయ్యగారి చేతుల్లో పెట్టారు .వీరు ఊహించింది వందరూపాయలు .ఆయన ఇచ్చింది 240రూపాయలు .ఎలాగోఅలా మల్లేశ్వరాలయం కట్టేశారు వీరంతాకలిసి .కాని నైవేద్యానికి పొలం లేదు .కొంతకాలానికి మళ్ళీ వెంకటరత్నం గారినే వెళ్లి అడిగారు ‘’నాకున్న దేవ బ్రాహ్మణ భూములు ‘’పల్లం కుర్రు ‘’లో ఉన్నాయి ,మీకు దూరమైనా మంచిఫలసాయం వచ్చే ఒక ఎకరం రాసి రిజిస్టర్ చేయించి మీకు పంపిస్తాను .మక్తా ధాన్యం ఈఏడాదినుంచే వచ్చే ఏర్పాటు చేయిస్తాను ‘’అన్నాడు .పుల్లయ్యగారు ‘’అదనంగా ఇంకొంచెం భూమి ఇస్తే బాగుంటుంది ‘’అనగా ఆమాట వీరెవరికీ నచ్చలేదు .షావుకారు ‘’పుల్లయ్యగారు !దేవుడికి ఎంతిస్తే మనకూ అంత ఇస్తాడు .భగవంతుడు నానోట ఎకరం పలికించాడు .మీరు అడిగారని మరో ఎకరం ఇస్తే మీ ప్రేరణతో ఇచ్చినట్లవుతు౦ది కాని నేను స్వయంగా ఇచ్చింది అనిపించదు దాని ఫలితం లో సగం వాటా మీకూ పంచాల్సి వస్తుంది .నాకు తెలీదుకాని ‘’కర్తా కారయితా ‘’అంటారు తమలా౦టిపెద్దలు .నాకు రావలసిన ఫలితంలో సగానికి సగం ఇతరులకు పంచటం నాకు మనసొప్పదు క్షమించండి ‘’అని చెప్పగా అవాక్కయ్యారు ఆయన వాదనాపటిమకు అక్షరజ్ఞాననం లేని ఆయనముందు ఈపండితులు తలవంచుకోవాల్సివచ్చింది అన్నారు దువ్వూరి శాస్త్రి గారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-19-ఉయ్యూరు
—
—