గురించి తెలుసుకోవాలంటే అసలు అచ్చు యంత్రం చరిత్ర ముందు తెలియాలి .ఆధునిక రవాణా సౌకర్యాలు అంటే రైల్వే ,పోస్ట్ ,టెలిగ్రాఫ్ ,టెలీ కమ్యూని కేషన్లు లేనికాలం లో భారత దేశం లో వార్తలు ఎలా ఒకచోటునుండి మరో చోటుకు చేరేవో తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది .
క్రీ.పూ.మూడవ శతాబ్దం లో పాలించిన మౌర్య సామ్రాధీశుడుడు అశోక చక్రవర్తి కాలం లో పాలనా పరమైన విషయాలను ప్రజలకు తెలియ జేయటానికి శిలాఫలకాలు, ,స్తంభాలపై వివరాలను చెక్కించాడు .సామ్రాజ్యం లో చాలా మారుమూల ప్రాంతాలలోకూడా వీటిని ఏర్పాటు చేశాడు .రవాణా వ్యవస్థ అంతగా రూపు దాల్చని ఆ కాలం లో రాజ నిర్ణయాలు తెలియ జేయటానికి ఇవే ప్రజలకు ఉపయోగంగా ఉండేవి .ఈయన తర్వాత వచ్చిన పాలకులు గోడలపై వ్రాయస గాండ్ల చేత ముఖ్య విషయాలు రాయించారు .పాతవి చెరిపేసి తర్వాత కొత్తవార్తలు రాసేవారు .మొఘల్ సామ్రాజ్యావతరణలో వార్తా ప్రసారం కొత్త దారి తొక్కింది .వార్తాహరుల చేత వార్తలను వేర్వేరు ప్రదేశాలకు పంపే వ్యవస్థ ఏర్పడింది .ఇలా రవాణా వ్యవస్థలో పెక్కు మార్పులు తెచ్చింది మొగలులే .వ్రాతప్రతులు ఆనాడు ఉద్యోగస్తులకే ఉపయోగకరం గా ఉండేవి .తర్వాత వాటిని నకులు అంటే కాపీలు తీసి బాగా ఉపయోగించారు .వార్తలను సేకరించి రాయటానికి వ్రాయస గాళ్ళకు ఔరంగజేబ్ ఎక్కువ స్వాతంత్ర్యాన్ని కలిపించాడు .కొన్ని సందార్భాలలో వీళ్ళ రాతలు కల్పితంగా ,నిజాలకు దూరంగా ఉండేవి .ముఖ్యంగా దక్కన్ లో ఈ బాధ ఎక్కువగా ఉండేది .
1656-58కాలం లో ఇండియాలో పని చేసిన ఫ్రెంచ్ డాక్టర్ ఫ్రాన్కోస్ బెర్నియర్ తనపుస్తకం లో మొగలులకాలం లో వార్తలురాసి వివిధ ప్రాంతాలకు పంపే వకి –అస్నవిస్ గురించి విపులంగా రాశాడు .ఔరంగజేబ్ పాలనలో వచ్చిన వెనీస్ యాత్రికుడు నికోలా మానుషి ‘’వార్తలురాసే వకియా –నావిస్ ,కన్ఫియనేవిస్ లు వార్తలను వారానికి ఒకరోజు మొఘల్ రాజుల సమక్షం లో చదివి వినిపించాలి అనే షరతు ఉండేది ‘’అని రాశాడు .1828లో కల్నల్ జేమ్స్ టాడ్ వందలాది ఇలాంటి వార్తా పత్రాలను లండన్ లోని రాయల్ ఏషియాటిక్ సొసైటీకి భద్రంగా పంపించాడు .ఇవి ఒక్కొక్కటి 8అంగుళాల పొడవు ,నాలుగున్నర అంగుళాల వెడల్పు ఉండేవి .ఇవన్నీ వేర్వేరు వారిచేత రాయబడిన నోటీసులు ,పదోన్నతపత్రాలు ,చక్రవర్తి పర్యటన విశేషాలు ,వేట వినోదాలు ,దాడులు ,అందిన నజరానాల వివరాలు పెర్షియన్ ఉర్దూలో రాయబడిన పత్రాలు . భారత దేశ చరిత్రలో ఈ వార్తా పత్రాలకు అధిక ప్రాధాన్యం ఉంది .పరిపాలకులకు దేశం లో జరిగిన అనేక విషయాలను తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడేవి .
అచ్చు వార్తా పత్రికలు వచ్చాక కూడా వ్రాతప్రతులు, వార్తా పత్రాలు, వార్తాపత్రికలు ఉంటూనే ఉన్నాయి.ప్రభుత్వ పాలనకు వ్యతిరేక౦గా ఉన్న వ్రాతప్రతులు వార్తల రవాణాకు బాగా సహకారంగా ఉండేవి .12-4-1828న ఫోర్ట్ సెయింట్ జార్జ్ ,సర్ జోహాన్ మాల్కోంల అతిరహస్య దస్త్రం ప్రభుత్వ వ్యతిరేక వ్రాతప్రతిగా పేర్కొనబడింది .క్రీశ 1800లో ఆ దక్షిణ భారత దేశం లోని ప్రతిగ్రామానికీ చేరింది .1800-1806 కాలం లో జరిగిన ‘’వెల్లూరు తిరుగుబాటుకు’’ఆ ప్రతులు బాగా దోహదపడ్డాయి .1857ప్రథమభారత సంగ్రామం లో ఇలాంటి ప్రతులు కీలకపాత్ర పోషించాయని ఆయన రాశాడు .
అచ్చుకళ
ఆర్ట్ ఆఫ్ ప్రింటింగ్ అంటే అచ్చుకళ గురించి తెలుసుకొందాం .జర్నలిజం చరిత్ర అచ్చు యంత్రం అభి వృద్ధితో ముడిపడి ఉన్నది .ప్రింటింగ్ ప్రెస్ మొదట కనిపెట్టిన ఘనత చైనాకే దక్కుతుంది .చైనావారు కదిలే టైపు లను మొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ లో ఉపయోగించారు .మొదటి పేపరు కూడా చైనాలోనే తయారయింది .క్రీ.శ 866లోనే మొదటిపుస్తకం చైనాలోనే అచ్చు అయింది .పెకింగ్ లో ప్రచురింపబడిన ప్రభుత్వ గెజిట్ అత్యంత పురాతన వార్తాపత్రికగా గుర్తింపు పొందింది .
15వ శతాబ్దం లో జర్మనిలోని మైంజ్ సిటి కి చెందిన జాన్ గూటేన్ బెర్గ్ అనే గోల్డ్ స్మిత్ కదిలే యంత్రాన్ని, కొయ్య బ్లాకులకు బదులు వాడే మెటల్ టైప్ కు పనికొచ్చే సిరాను అభి వృద్ధి చేసి ఇన్వెంటర్ అయ్యాడు .1456లో సుమారు 300 బైబిల్ పుస్తకాలను ముద్రించి చరిత్ర సృష్టించాడు .దీనితర్వాతే చాలా దేశాలలో ప్రింటింగ్ ప్రెస్ లు వెలిశాయి .ఇటలిలోని వెనిస్ నగరం ప్రింటింగ్ కు పెద్ద కేంద్రంగా విరాజిల్లింది .ఆ కాలం లో ప్రభుత్వాలు, చర్చి లు ప్రింటింగ్ ప్రెస్ లను పోషించాయి .1476లో కాక్స్టన్ అనే మొదటి ప్రింటర్ వెస్ట్ మినిస్టర్ లో ప్రింటింగ్ ప్రెస్ మొదటిసారిగా నెలకొల్పాడు .ఈయన అచ్చు కళను కొలోన్ లో నేర్చుకొన్నాడు .అప్పటిదాకా లాటిన్ భాషలోమాత్రమే ప్రింట్ చేసే వారు. ఈయన ఇంగ్లిష్ లో ప్రింట్ చేసి మరో చరిత్రకు నాందిపలికాడు .క్రమంగా ప్రింటింగ్ ప్రెస్ లు ప్రపంచమంతా పాకిపోయాయి .
14వ శతాబ్ది శ్రీనాథకవి రచనలవలన భారతదేశం లో పేపరు వాడకం ఆంధ్రప్రాంతం లో రెడ్ది రాజులకాలం లోనే ఉన్నట్లు తెలుస్తోంది .ప్రింటింగ్ ప్రెస్ అవతరించిన ప్రతి చోటా విద్యావ్యాప్తి జరిగింది .మనిషి దృక్పధంలో అత్యంత తీవ్రమైన మార్పు వచ్చింది .ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక కాలాన్ని ప్రాచీనకాలాన్ని విభజన చేసింది ప్రింటింగ్ ప్రెస్ . ఇండియాలోకూడా విద్యావ్యాప్తికి ,అభి వృద్ధికి బహువిధాల ప్రింటింగ్ ప్రెస్ తోడ్పడింది .భారతీయ భాషలు దీనివలన ఎన్నోప్రయోజనాలు పొందాయి .వార్తాపత్రికల ప్రింటింగ్ లో ప్రింటింగ్ ప్రెస్ అత్యద్భుత ప్రగతి సాధించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-19-ఉయ్యూరు