తెలుగులో మొదటి ప్రింటింగ్ -2
ఇండియాలో ప్రింటింగ్
దైవవాక్య వ్యాప్తికి ఇండియాలో క్రిస్టియన్ మిషనరీ ప్రవేశించింది .దీనికి బైబిల్ మొదలైన వారి మతగ్రంధాలు బాగా అవసరమయ్యాయి .వారు స్థానిక భాషలు నేరుస్తూ నిఘంటువులు ,వ్యాకరణాలు రాశారు .తర్వాత కాలనీ ప్రభుత్వం సామ్రాజ్య విస్తరణకోసం ప్రవేశించింది .సివిల్ ఉద్యోగులు సమర్ధ పరిపాలనకు స్థానిక భాషలు నేర్వాల్సి వచ్చింది .వీరికీ భారతీయ భాషలలో డిక్షనరీలు ,వ్యాకరణాలు అవసరమయ్యాయి .ఈ అవసరాలు తీర్చటం కోసం మిషనరీలు, కాలనీ ప్రభుత్వాలు భారతీయ భాషలలో పుస్తకాల కోసం అచ్చు యంత్రాలను నెలకొల్పారు .1576లో గోవాలో జేస్సూట్ మిషనరీ మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసింది . 1578లో మొదటిపుస్తకంగా ‘’డాక్ట్రినా క్రిస్టా’’ ముద్రించారు .దక్షిణభారత లో తిరునల్వేలి జిల్లా పులికైల్ లో కూడా ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది .1579లో వెంట్రిలో మిషనరీలు ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాన్ని కేంద్రంగా మార్చుకొన్నారు. 1581లో వెంట్రి కి దగ్గరలో ఉన్న వైపికోట కు హెడ్ క్వార్టర్ మార్చారు. 1602లో పోప్ వైపికోట జెసూట్ మిషనరీకి ఒక ప్రింటింగ్ ప్రెస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు .ఈ ప్రెస్ లో రోమన్ స్క్రిప్ట్ లో తమిళ, మళయాళ, కొంకణి భాషలలో ప్రార్ధన పుస్తకాలు ప్రచురించారు .పోర్చుగీస్ భాషలో ఉన్న క్రిస్టియన్ మత గ్రంథాలను మలయాళం లోకి అనువదించి 1616ప్రాంతం లో అచ్చువేశారు .1649,1654లలో వీటిని పునర్ముద్రించారు .ఇక్కడ గమనించాల్సిన అతిముఖ్య విషయం ఈ పుస్తకాలు రోమన్ స్క్రిప్ట్ లో ముద్రి౦చ బడటం .
1674 గుజరాతి వ్యాపారి భీమ్జి పరేఖ్ బొంబాయి లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు .తనకు సాయంగా ఒక ప్రింటర్ ను పంపమని ఈస్ట్ ఇండియా కంపెనీకి రాస్తే ,ప్రింటింగ్ లో నిష్ణాతుడైన హెన్రి హిల్స్ నుపంపారు .ఇక్కడ కూడా పుస్తకాలు రోమన్ అక్షరాలలోనే ముద్రి౦ప బడినాయి .గుజరాతి ,ఇతర భాషలలో ముద్రించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు .1679 లో హంబెల్ ఖండ్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పడి, మొదటిసారిగా తమిళ్ –పోర్చుగీస్ డిక్షనరీ ప్రింట్ చేశారు .1712లో డేనిష్ మిషనరీ తమిళనాడు తంజావూరు లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి పోర్చుగీస్ భాషలోనే పుస్తకాలు ముద్రించారు .జర్మనిలో తమిళ అక్షరాలను మోల్డ్ చేయించి దిగుమతి చేసుకోన్నారు కాని,అవి బాగా పెద్దవి అవటంతో ఉపయోగపడలేదు .ఈ ప్రెస్ లోనే చిన్న అక్షరాల మోల్డ్ లు తయారు చేసే ప్రయత్నం చేశారు .ఫలించి 1744లో ఈప్రెస్ లోనే తమిళంలో ‘’న్యు టెస్ట్ మెంట్ ‘’ముద్రించారు .అంతకుముందు 1733లోనే ఇక్కడే తమిళం లో వ్యాకరణ పుస్తకం అచ్చయింది .ఇదే ఇండియాలో తమిళభాషలో ముద్రింపబడిన మొదటి వ్యాకరణ పుస్తకంగా గుర్తింపు పొందింది .
మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్
1761లో మద్రాస్ లో కొన్ని ఆసక్తికర పరిస్థితుతులలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటైంది .ఆ ఏడాదే బ్రిటిష్ వాళ్ళు పా౦డిచేరిని ఫ్రెంచ్ వారినుంచి స్వాధీనం చేసుకొన్నారు .గవర్నర్ భవన౦ లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ను మద్రాస్ కు తెచ్చి, తమిళం లో నిష్ణాతుడైన బ్రిటిష్ స్కాలర్ కు అందజేశారు .దీన్ని వెప్పేరి మిషన్ కాంపౌండ్ లో నెలకొల్పారు .1779లో ఇక్కడే తమిళ –ఇంగ్లిష్ డిక్షనరీ ,1786లో ఇంగ్లిష్ –తమిళ్ నిఘంటువు లు ముద్రింపబడ్డాయి.ఇంతమాత్రం చేత మద్రాస్ లో ఇదే మొదటి ప్రిన్టింగ్ ప్రెస్ మాత్రం కాదు .1746నుంచి మద్రాస్ లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్లు ఆధారాలున్నాయి .దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు పాండి చేరికి తీసుకు వెడితే ,వాళ్ళ అధికారం పోయాక బ్రిటిషర్లు మళ్ళీ మద్రాస్ కు దీన్ని1761లో చేర్చారు .కనుక దక్షిణభారత దేశం లో ప్రింటింగ్ 16వ శతాబ్దం లోనే ఉన్నట్లు గమనించాలి .ఉత్తరభారతం లో 200 ఏళ్ళ తర్వాతనే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది .కానీ బెంగాల్ లోని ‘’సేరా౦ పూర్ ప్రెస్’’ అనేక భాషలలో ప్రింటింగ్ చేయటం లో ప్రముఖంగా తోడ్పడింది .సేరా౦పూర్ మిషనరీలే మొదటి పవర్ ప్రెస్ నుకూడా ఏర్పాటు చేయటం చారిత్రాత్మకం .
ఇండియాలో 16వ శతాబ్దిలోనే ప్రింటింగ్ టెక్నాలజీ మొదలై ,19వ శతాబ్ది ప్రారంభానికి పూర్తిగా వికసించింది .ప్రింటింగ్ ప్రెస్ వలన భాషాభి వృద్ధి ,అక్షరాస్యత ,విజ్ఞానం మిక్కిలిగా పెరిగి ,వార్తాపత్రికల ఆవిర్భావానికి నాంది పలికింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-19-ఉయ్యూరు