అపూర్వాంధ్ర పూర్వామాత్యులు
శీర్షిక చూసి గాబరా పడకండి .రాజరిక వ్యవస్ధలో పేరుపొందిన గొప్ప తెలుగు మంత్రులు అనిభావం .మంత్రి, అమాత్య, ప్రెగ్గడ పర్యాయపదాలు .సరదాకోసం పై హెడ్డింగ్ పెట్టాను .తమ శేముషితో ,రాజుకు, రాజ్యానికి ,ప్రజలకు విశేష సేవలు అందించిన నాటి మంత్రి పుంగవులలో కొందరిని గురించి తెలియ జెప్పే ప్రయత్నమే ఇది .
1-రావుల వజ్జియప్రెగ్గడ
క్రీశ 10వ శతాబ్దికి చెందినవాడు రావుల వజ్జియప్రెగ్గడ.ఈయన గురించి తెలుసుకోవటానికి ముందుగా కొన్ని విషయాలు తెలియాలి .64కళలో ప్రజ్ఞావంతుడైన దానార్నవుడికి ,ఆర్యామహాదేవికి శక్తివర్మ ,విమలాదిత్యుడు కొడుకులు .శక్తివర్మను చాళుక్య నారాయణుడు ,చాళుక్య చంద్రుడని పిలుస్తారు .తండ్రిలాగానే ‘’సర్వలోకాశ్రయ శ్రీ విష్ణు వర్ధన మహారాజాది రాజు ‘’పేరుతో శక్తివర్మ పట్టాభిషేకం చేసుకొని 12ఏళ్ళు పాలించాడు . ద్రవిడులైన చోళులకు సాయం చేయాలని చిన్నప్పటి నుండి ఇతనికి ఉండేది .చేజారి పోయిన తండ్రి సామ్రాజ్యాన్నిమళ్ళీ పట్టుకోవాలనే ప్రయత్నం లో ఉండగా జటా చోడ భీముడు విషయం తెలుసుకొని విఫలుడిని చేశాడు .బలపడిన శక్తివర్మ మళ్ళీ జటా చోడు నిపైకి యుద్ధానికి రాగా శక్తివర్మకు చేయూతగా చోళ చక్రవర్తి రాజకేసరివర్మ తన సైన్యాన్ని బాసటగా పంపగా జటా చోడు ని ఓడింఛి వేగీ రాజ్యాన్ని కైవశం చేసుకొన్నాడు .దానార్నవుడి సంతతి మళ్ళీ అధికారం లోకి వచ్చిందని కంటిలో నిప్పులుపోసుకొన్న చోళ ,పాశ్చాత్య ,చాలుక్యరాజ్యాలు సహి౦చ లేకపోయాయి .చోళ చక్రవర్తి శక్తివర్మకు సాయం చేయటం లో, వేంగీ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలనే బలమైన కోరిక ఉంది .రాజనీతి ఉపయోగించి తన కూతురు కుందవ మహాదేవి ని శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యునికిచ్చి పెళ్లి చేసి తనదగ్గరే పెట్టుకొని వేంగీ రాజ్యాన్ని చోళులు హస్తగతం చేసుకొన్నారు .
ఇది కల్యాణి చాళుక్యులకు ఇష్టం లేదు .కాని అప్పుడు వాళ్ళు రాష్ట్ర కూటులను ఓడించి కర్నాటక సామ్రాజ్యాన్ని కైవశం చేసుకోవటం తో వేంగీ రాజ్యంపై దృష్టిపెట్టలేక పోయారు .దానార్నవుడు యుద్ధంలో చనిపోయేనాటికి శక్తివర్మకు ఆరేళ్ళు విమలాదిత్యుడికి నాలుగేళ్ళు వయసు .మంత్రులుకాని ఆప్తవర్గం కాని అతనిపెద్ద కొడుకు శక్తి వర్మను రాజును చేసే సమర్ధులు కాలేకపోయారు .అప్పటికి జటా చోడుడే శక్తి యుక్తి సామర్ధ్యాలున్నవాడు .ఇతని వీరోచిత కార్యాలన్నీ కంచి లో విజయస్తంభంపై చెక్కబడి ఉన్నాయి .ఇతనిపూర్వులు రాజ చాళుక్య వంశానికి బంధువులు సామంతులు, రేనాటి ప్రభువులు .ప్రజోపకారమైనన తటాకాలు నిర్మించటం దేవాలయాలు కట్టించటం చేశారు .అనితర సాధ్య బలపరాక్రమ విక్రమాలున్న జటాచోడుడు ‘’సంగ్రామ విజయ ,అరసరాభరణ ,సమరైక వీర,రణరంగమల్ల,విక్రమ ధనంజయ ‘’బిరుద విరాజితుడు .ఇతని సోదరి వేంగీ చాలుక్యులలో చిన్నకోవకు చెందిన యుద్ధమల్లుని కొడుకైన బాదవుని భార్య . కనుక బాదవుని కి వేంగీ సామ్రాజ్యాధిపతి కావాలనే సంకల్పం ఉండటం వలన ఇమ్మడి రాజు ను ఓడించి ‘’సమస్త భువనాశ్రయ శ్రీ విజయాదిత్య ‘’పేరుతొ వేంగీ సామ్రాజ్యానికి చక్రవరి అయ్యాడు .
బాదవునికి సంతానం లేకపోవటంతో ,భార్యకు రాజ్యాధికారం సంక్రమించి న వేంగీ సామ్రాజ్యాన్ని ‘’స్వభగినీ పదమంధ్ర మండల౦ ‘’పేరుతొ జటాచోడుడు పాలన సాగించాడు .ఈ సమయం లోనే దానార్ణవ ,నృపకాములను యుద్ధం లో చంపేసి మొత్తం ఆస్తి హరించి ఇష్టారాజ్యంగా పాలించాడు .అతని శక్తియుక్తులను ఎదిరించగల మొనగాడే వరూ లేకపోవటం తో కీర్తి దిలీపుడై ,సమర ధనున్జయుడై చెలరేగాడు.తండ్రి రాజ్యాన్ని మళ్ళీ హస్తగతం చేసుకొనే శక్తివర్మ ప్రయత్నాలన్నిటిని చోడుడు భగ్నం చేశాడు .అయినా ప్రయత్నాలు మానని అతనిని ‘’మృగాధివ సతిం మాయాం హరేఃపౌరుషం ‘’అని కవి కీర్తించాడు .పట్టువదలని విక్రమార్కుడి లాగా 27ఏళ్ళు జటా చోడుడు తో యుద్ధం చేసి చివరికి ఓడించి తన రాజ్యాన్ని తిరిగిపొండాడు శక్తివర్మ .
ఇమ్మడి తైలపుడు చనిపోయాక చోడుడు ఏకాకియై ,విసుగు చెంది ,వృద్ధాప్యం మీదపడి కర్నాటక రాజ్యానికి వెళ్ళిపోయేప్రయత్నం లో ఉండగా ,శక్తివర్మ ప్రయత్నాలు తెలిసి వెనక్కివచ్చి ,అతనితో యుద్ధం చేసి ఓడిపోయాడు .27ఏళ్ళ పగ చల్లారటానికి చోడుడి బంధు మిత్రులనదర్నీ చంపేయించి అతని వంశాన్ని నిర్వంశం చేశాడు శక్తి వర్మ .కళింగం పైకి దండెత్తి చోడభీముని ప్రతినిధి ని ఓడించి చంపి రాజ్యాన్ని ఇమ్మడి వజ్రహస్తుడికిచ్ఛి పూర్వపు మైత్రి కొనసాగించాడు .ఇదంతా వికారి సంవత్సరం లో క్రీ శ 999-1000కాలం లో జరిగింది .
ఈవిధంగా తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొన్న విక్రమాదిత్యుడే శక్తివర్మ .అనాధ ఐన వెంగీసామ్రాజ్యానికి సనాదుడై చాళుక్య నారాయణుడయ్యాడు.అప్పుడే ఇతని తమ్ముడు యువరాజైన విమలాదిత్యునికి చోళరాజు తన కూతురును క్రీశ.1002 లో ఇచ్చి వివాహం చేశాడు .శక్తివర్మరాకతో వేంగీ సామ్రాజ్యం లో శాంతిభద్రతలు సుస్థిరమయ్యాయి .వరాహ చిహ్నమున్న బంగారు నాణాలు ముద్రించాడు శక్తివర్మ .
1011లోశక్తివర్మ మరణం తర్వాత తమ్ముడు విమలాదిత్యుడు వేంగీ సామ్రాజ్యాధిపతి అయ్యాడని ‘’కోరుమిల్లి ‘’శాసనం తెలియ జేస్తోంది .రణస్థపూ౦డిశాసనం లో జ్యేష్ట శుక్ల పంచమి గురువారం పుష్యమి నక్షత్ర సింహలగ్నం లో పట్టాభి షిక్తుడైనట్లున్నది .’’ముమ్మడి భీముడు ,బిరుదా౦క భీముడు , త్రిభువనా౦ కుశుడు ‘’అనే సార్ధకబిరుదులుపొందాడు.1014లో తమిళనాడు తిరువయ్యార్ లో పంచనాథేశ్వరస్వామికి ద్రవ్యం అందజేసిన శాసనం ఉన్నది .జైనమతావలంబి అయినా పరమతసహనం కలవాడు .ఇతనికికి ఇద్దరుభార్యలు కుందమాదేవి ,మేడమాదేవి .కుందమకు రాజరాజు ,మేడమ కు విజయాదిత్యుడు కొడుకులు .రాజరాజును తండ్రివైపువారు విష్ణు వర్ధనుడు అనీ ,తల్లివైపువారు రాజరాజు అనీ పిలుస్తారు .వజ్జియప్రెగ్గడ తో మొదలెట్టి,శాఖా చంక్రమణం చేశా౦ కదూ .ఇప్పుడు ఆయన అవసరం వచ్చింది .
విమలాదిత్యమహారాజు పరిపాలన కు మహామాత్యుడు వజ్జియప్రెగ్గడ విశేషమైన కృషి చేశాడు .ఆయన రాజనీతి అపూర్వం .వేంగీ సామ్రాజ్యాధిపతి కుబ్జ విష్ణువు అయినప్పటినుంచి వేంగీ సామ్రాజ్యానికి చక్రవర్తి పరమ మహేశ్వరుడైన సుక్షత్రియుడే అధిస్టించాలి అనే సంప్రదాయం ఏర్పరచి నిలబెట్టాడు .ఇది చాలుక్యవంశ మర్యాదగా వేంగీ చాళుక్యుల రాజనీతిగా పేరుపొందింది .వేంగీగీచాలుక్యుల ఇలవేలుపు దాక్షారామ భీమేశ్వరస్వామి .
ఆకాలం లో ‘’త్రికాలయోగి సిద్ధాంత దేవముని ‘’అనే ఒక జైనముని ‘’కొండ కుందాన్వయానికి చెందిన నంది గణంవాడు ,దిగంబర జైనుడు ,గోల్లాచారి శిష్యుడు ఆంద్ర దేశానికి వచ్చాడు ప్రచారంబాగా చేసి జనాన్ని జైనంలోకి మార్చాడు .ఈయన సమకాలికుడు ప్రభాచంద్రుడు దారానగరరాజు భోజరాజు చేత సత్కారం పొందాడు .విమలాదిత్యుడు భోజుని మిత్రుడే .విమలాదిత్యుడికి హిందూ ధర్మం పై విరక్తికలిగి జైనాన్ని స్వీకరించినా రణస్థిపూండిశాసనం నాటికి ఇంకా పరమమాహేశ్వరుడే .కలిదిండి శాసనం ప్రకారం ఇంకా అభిషిక్తుడు కాని రాజరాజు రాజప్రతినిధి మాత్రమె .రాజరాజు మంత్రి వజ్రాదిత్యుడు ,త్యాగి విమలాదిత్యుడు కలిసి మనుధర్మ ప్రవర్తకులైన రాజప్రతినిధి వర్గాన్ని ఏర్పరచి సామ్రాజ్య రక్షణ బాధ్యత అప్పగించటంలో విమలాదితుని సర్వసంగ పరిత్యాగం మహామాత్యుడు వజ్జియప్రెగ్గడపై ఉన్న అపారమైన నమ్మక విశ్వాసాలు ఆయన శేముషీ సంపన్నత కారణాలు .ఈ ఏర్పాటు జరిగిన ఒక ఏడాదికే విమలాదిత్యుడు మరణించాడు .
రాజరాజు వేంగీ చక్రవర్తి అవగానే సవతి తమ్ముడు వీర విజయాదిత్యుని యౌవరాజ్య పట్టాభి షిక్తుని చేశాడు .సందట్లో సడేమియా అన్నట్లు ఇదే సమయంలోకళింగరాజు మధుకామార్ణవుడు రాజరాజు కు శత్రువుకాగా ,దాయాదులను విరోధులను ఓడించాకమాత్రమే రాజ రాజు అభిషిక్తుడయి,మధురాంతక దేవుడు అనిపిలువబడే రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగ దేవిని 1023లో పెళ్ళాడాడు .ఇదంతా వజ్జియప్రెగ్గడ ప్రతిభావిశేషాలవలననే జరిగిందని 1023రణస్ధిపూ౦డి శాసనం తెలియజేస్తోంది .ఇందులోనే ప్రెగ్గడవంశ గోత్రాది విశేషాలున్నాయి –
‘’మద్భక్తాయ కృత క్లేశాయ’’కారమ చేడు ‘’వాస్తవ్యాయ కౌండిన్య గొత్రాయామాత్య శిఖా మణ్యే బుధ వజ్ర ప్రాకారాయ ,సౌజన్య రత్నాకరాయ వజ్జియప్రెగ్గడఇతిప్రసిద్ధాభిధానాయ భవద్విషయో ‘’పారువటి’’నామ గ్రా మేణసార్ధం రణస్థిపూ౦డి నామగ్రామోగ్రహారీ కృత్య మత్సంవర్దిత్వా నిమిత్తే,మాయాదత్తఇతి విదిత మస్తునః ‘’.వజ్జియకౌండిన్య గోత్రుడు .ద్రోణమంత్రి పౌత్రుడు ,హరిదత్త వరప్రసాదుడైనదత్తామాత్యుని కుమారుడు .ప్రభు మంత్రోత్సాహ శక్తిమంతుడు .తల్లి పతివ్రత చీడమాంబ .వజ్జియ బుద్ధిలో బృహస్పతి .సుహృద్వతంసుడు. అవిరళ జపహోమ తత్పరుడు ,సకల వేదార్ధ నిష్ణాతుడు .శుచి ,దాని .చతురసత్య వచో నిరతుడు .బుధ వజ్ర ప్రాకారుడు ,శ్రీకంఠ పాదార వి౦ద షట్పదుడు,సౌజన్య రత్నాకరుడు ,స్వామికార్యనిర్వహణ దక్షుడు .త్రికరణాల చేత పవిత్ర చరిత్రకల కౌండిన్య మహర్షి వంటివాడు ,మిక్కిలి శివభక్తుడు .యజ్ఞయాగాది క్రతువులెన్నో చేసినకర్మిస్టి,విప్రకుల భాస్కరుడు ,అగ్నిస్టోమ, అతిరాత్రాది క్రతుకర్త ,అతిధి అభ్యాగతులకు కొంగుబంగారం .పురోడాశ పవిత్ర వక్త్రుడు .విద్వాంసుల ,వేదవిధిజ్ఞుల ,సోమయాజుల ను సత్కరించటం లో సాటిలేనివాడు ,శ్రమణులు ,దిగంబర జైనులు వీరు వారు అనే భేదం లేక ఆదరించేవాడు .
మన ప్రెగ్గడ రాజకార్యాలను తన భవ్య హర్మ్యం నుంచే సాగించేవాడు .ఈ భవనానికికి ఒకప్రక్క ఉద్యానవనం దానిమధ్యలో నుయ్యి ,రెండవవైపు గోస్టాలు,అందులో ముచ్చటైన కపిలదేనువు .దాని క్షీరాన్నే త్రాగే అలవాటున్నవాడు .భార్యాభర్తలు ప్రత్యూషకాలం లో లేచి కపిల ధేనువు సందర్శనం చేసి పూజించేవారు .అన్నికులాలవారికీ ఆవుపాలు పంచి పెట్టేవారు ఆ దంపతులు .ఆపాలుత్రాగి ఎవరికీ ఏజబ్బులూ రాకుండా ప్రజలు ఆనాడు ఉత్సాహాలతో ఉండేవారు .వేదాధ్యయనం కూడా ఉండటం తో ఇల్లు ఒక గురుకులంగా భాసిల్లేది .విమలాదిత్య మహారాజు కు ముఖ్య సచివుడై యుద్ధంలో ధర్మం లో మంత్రాంగం లో సాయపడుతూ సామ్రాజ్యాభి వృద్ధి ప్రజాసంక్షేమం రెండుకళ్ళుగా భావించి సేవచేసిన చిరస్మరణీయుడు వజ్జియ ప్రెగ్గడ .ఈయన గురించి ఇదే మొదటిసారి నేను తెలుసుకోవటం .నా అన౦దాన్ని మీతో పంచుకోవటమే నేను చేసినపని
మరో మహామాత్యుని గూర్చిమరో సారి తెలుసుకొందాం .
ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-19-ఉయ్యూరు