అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -2
2-చెల్లకి గంగాధర మంత్రి
వేంగి దేశం లో చెల్లకి పురానికి చెందిన చెల్లకి గంగాధర మంత్రి మహామండలేశ్వరుడు రెండవ ప్రోలరాజు మహామాత్యుడు .12వ శతాబ్దివాడు .ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .ప్రోలరాజు ఇతనిని మహామంత్రి ని చేసి ,’’యనుకొండ ‘’లో నివాసం ఏర్పాటు చేశాడు .కరీం నగర శాసనం లో ఇతని గురించి వివరంగా ఉంది –‘’చనువు మెయి నగరి లో దగు –పనులెల్లను బెంపు మెరసి పరికి౦చుచునే-ర్పును భక్తియుక్తి నతిముద –మున జేయుచు దత్పరోక్షమున మతియుబ్రభన్ ‘’
‘’ఘోరతరాజి లోలుడత్యకుటిల చిత్తు దీతడని’’ఆదరం తో గంగాధర మంత్రిని పిలిపించాడు ‘’అప్రకటిత కీర్తి ప్రోలజనపాలుడు ‘’. ఇతని వంశ మూల పురుషుడు కొమ్మనమంత్రి .ఆయన ప్రతిభతో కీర్తిపొంది చెల్లకిలో ఉండగా అతనికి బంధు చింతామణి ,శ్రీయుతుడు ఐన నారాయణుడు కొడుకుగా పుట్టాడు .భార్య ఐతమాంబ .వీరికొడుకు గోవిందుడు .ఇతని భార్య తురకమాంబ .వీరి పుత్రుడే మన గంగాధరుడు .
‘’వ్యోజ దండనాథు డనేవాడు యుద్ధం లో చనిపోగా ,ఆ అమాత్యపదవి గంగాధరుని వరించింది .ప్రోలరాజుకాలం లో కాకతి రుద్ర దేవుడికాలం లోకూడా మంత్రిపదవిలో రాణించాడు .అందరి అభిమాన గౌరవాలు అందుకొన్నాడు .అమాత్యపదవి ,నియోగ వృత్తి సక్రమంగా నిర్వర్తిస్తూ బ్రాహ్మణులనుకాపాడుతూ ,అనేక దేవాలయాలు కట్టించి ,పూజా పునస్కారాలకు అవకాశం కల్పించినట్లు కరీం నగర శాసనం లో ఉన్నది .’’శ్వేతాతపత్రం ‘’అంటే తెల్లగొడుగు గౌరవ చిహ్నంగా ధరించేవాడు .అన్ని నియోగ వృత్తులపైనా ,సర్వాధికారాలు ఉన్న మహామాత్యునిగా కాకతి ప్రతాప రుద్రుడు కూర్చోబెట్టాడని తెలుస్తోంది .
తరువాత కాకతీయ భేతా భూపాలుడి కాలం లోనూ సమర్ధంగా మంత్రిపదని నిర్వహించాడు గంగాధరమంత్రి .మహత్తర యశో విరాజితుడై ,అగణిత శౌర్య సంపన్నుడు అయి ,బేతరాజు గౌరవాదరాలు పొంది ‘’సబ్బి సాయిర మండలం ‘’ను సర్వజన మనోరంజకం గా పరిపాలి౦ప జేసింది వైజనాథ మహా మంత్రి .ఈ మంత్రికి ,యాకమా౦బికకు జన్మించినవాడు బేతన ప్రగడ రెండవ ప్రోలరాజు మంత్రి .ఈ భార్యాభర్తలు జైనమతావలంబులు .రెండవ ప్రోలరాజు 1107నుంచి 1157వరకు యాభై ఏళ్ళు అవిచ్చిన్నంగా పాలించాడు .
ఓరుగల్లు పురనిర్మాణ౦ ఈప్రోలరాజుతో ప్రారంభమైందని అంటారు .తాను గెలిచిన దేశ ప్రజలు హాయిగా జీవించటానికి ఈ పుర నిర్మాణం చేశాడట.ఒకసారి ఇక్కడ అమ్మకానికని సరుకులతో వచ్చిన బండి ఇక్కడ ఒక రాతికి తగిలి తలక్రిందులైతే ,ఆ బండీ పట్టా ఆశ్చర్యంగా బంగారం అయిందట .ఈ విషయం ప్రోలరాజుకు తెలిసి ఆ రాయి స్పర్శవేది అయిన శివలింగం గా భావించి ,స్వయంభు గా దానిని అక్కడే ప్రతిష్టించి ,ఆలయం కట్టించి ,పూజాదికాలు ఏర్పాటు చేసి క్రమంగా ఓరుగల్లు పట్టణ నిర్మాణం సాగింఛి క్రమాభి వృద్ధి చేశాడు .ఇతని తర్వాత వచ్చిన రాజులు అక్కడ బలవత్తరమైన ,శత్రు దుర్ణిరీక్షణమైన వప్రము అంటే కోట కట్టారు .అదే వరంగల్లుకోట.
గంగాధర మంత్రి మహామాత్యుడైన తర్వాత హనుమకొండ ను నగరంగా నిర్మించాడు .ఎటుచూసినా కోనేరులు దేవాలయాలు ,ఆరామాలు చెరువులతో అంటే సప్త సంతానాల ప్రతిస్టలతో హనుమకొండ శోభించేట్లు చేశాడు .ప్రభువు అనుమతితో విద్వజ్జనాలను పిలిపించి గొప్ప క్రతువు చేయించి,వారికి ‘’డొండొండు’’అనే అగ్రహారాన్ని యిచ్చి వారికి పౌరసత్వం అంటే సిటిజన్ షిప్ ఇప్పించాడు –
‘’పురుషనిధి ,పురుషరత్నము –పురుషోత్తమ మూర్తి యనుచు బొగడగ జనులు –త్కరుషమతి వెలయంగం ద్రైపురుషుల జేసితి బ్రతిస్ట పూజర్హముగాన్ ‘’అని చెప్పుకోవటం వలన ఆ అగ్రహారం లో త్రిమూర్తి ప్రతిస్ట చేశాడు గంగాధరమంత్రి అని తెలుస్తోంది –
‘’పరమేశుడు ,హరి ,బుద్ధ-స్వరూపుడై యప్పురవరుల వచించు జినో –హరి యనెడుపట్టశాలం-జిరముగ బుద్ధ ప్రతిస్ట జేసితి భక్తిన్ ‘’అని ఉన్నదాన్ని బట్టి బుద్ధాలయం కూడా నిర్మించాడు .ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని పనులను చేస్తూ ,రాజుకు విధేయుడుగా ఉంటూ ,కాకతీయ ఆంద్ర సామ్రాజ్య అభ్యుదయానికి గంగాధర మంత్రి యెనలేని సేవలు చేశాడు .
ప్రోలరాజు తర్వాత అతడికొడుకు రుద్ర దేవుడు రాజై,హనుమకొండ రాజధానిగా ఉండటం ఉచితం కాదనుకొని ,ఓరుగల్లుకు రాజధాని మార్చినట్లు ‘’శివయోగ సారం ‘’లో ఉన్నది .గంగాధరమంత్రి ప్రోలరాజు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు రాజధాని హనుమకొండ ,రుద్రదేవుని మంత్రిగా ఉన్నప్పుడు రాజధాని ఓరుగల్లు అని తెలుస్తోంది .1170’’నగు నూరు’’ శాసనంలో కవిబ్రహ్మ తిక్కన చెక్కించిన పద్యాలున్నాయి –చివరిది
‘’సుర కరిపతి మృగపతి హరి-సురసతి ధవళ సరసి రుహ ,శక్తిరుహ సద్రుక్-సురు చిర విశద యశో భా-సుర నిధిచే సుకవి తరణి సురనిధి చేతన్’’.నాలుగు దిక్కులావిజయ స్తంభాలు నాటించి ,మిక్కిలి ప్రతాపశాలియై ,అనేక తెలుగు గ్రంథాలను అంకితం పొంది ,సప్త సంతానాలను పొందిన ధన్యుడు చెవికి గంగాధర మంత్రి .తానూ చేసిన సుహృత్ కార్యాల వివరాలను శాసనం పై చెక్కించాడు .
రుద్ర దేవుని అనుమకొండ వేయిస్తంభాలగుడిలోని 1162శాసనం
అనుసరించి కాకతీయ రుద్ర దేవుని సామ్రాజ్యం తూర్పున బంగాళాఖాతం ,దక్షిణాన శ్రీశైలం ,పడమర కటకం ,ఉత్తరాన మాల్యవంతం వరకు విస్తరించి ఉన్నది .ఇంతటి విశాలసామ్రాజ్యాన్ని రుద్ర దేవ చక్రవర్తి పాలిస్తుంటే ,దానికి సర్వవిదాలా తోడ్పడినవాడు గంగాధరమంత్రి .హిడంబాశ్రమ౦ ,నగనూరు ,అనుమకొండ మొదలైన చోట్ల దేవాలయాలు పుష్పారామాలు నిర్మించాడు .ఈయన ప్రోత్సాహంతో రుద్రదేవుడు సకల శాస్త్ర పరాయణుడై ,రామేశ్వర దీక్షితుని వద్ద విద్యలు నేర్చి ,రాజనీతి పెంపు చేసుకొని ,కవిత్వం చెబుతూ ఆస్వాదిస్తూ గురువుగారికి విన్నకొండ సీమలో శివపురం అనే గ్రామాన్ని మొదటగా దానం చేసి ఖాజీపేటలో దాన స్తంభాన్ని వేయించాడు .
అనుమకొండను మాధవవర్మ మొదలైన వారు పాలించినా ప్రోలరాజువంటి స్వాతంత్ర్య దీక్ష ఉన్నవారుకాలేకపోయారు .చాలుక్యరాజ్య ప్రాభవం సన్నగిలుగిలు తుండగానే ఆంద్ర సామ్రాజ్యం నెలకొల్పి ఆంధ్రుల వ్యక్తిత్వాన్ని కాపాడినవాడు ప్రోలరాజు .తనలో దాగి ఉన్న రాజనీతి ,సమయజ్ఞత శోర్య ధైర్య సాహసాలు ,ఔదార్య గాంభీర్యాలు పురి విప్పిన నెమలిలా విజ్రుమ్భించి ఉపయోగపడినాయి .ఈ సామ్రాజ్యానికి శ్రీరామ రక్ష చెల్లకి గంగాధర మంత్రి ;’
ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-19-ఉయ్యూరు