అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3
3-గోపరాజు రామయమంత్రి
కాకతీయ గణపతి దేవుని మంత్రి గోపరాజు రామయమంత్రి .1166నుంచి 1290వరకు గణపతి దేవునికాలం కనుక 13వ శతాబ్దివాడు .ధరణికోట రాజధానిగా రాజుపాలించాడు .1193లో అధికారం లోకి వచ్చినట్లు చిలుకూరి వీరభద్రరావు గారన్నారు .త్రిపురాంతక శాసనం బట్టి 62ఏళ్ళు పాలించాడు .రాజధానిని ధరణికోటనుంచి ఓరుగల్లుకు మార్చి ,శివాలయాలు చెరువులు భవనాలు కట్టించాడు .గ్రామాలు ఏర్పాటు చేశాడు .’’కొండవీటి దండకవిలె ‘’లో ‘’శ్రీమాన్గణపతిర్భూపో గజపత్యాన్వయోద్భావః –ఆస్తి భూ మండలే తస్య బహవస్సంతి మంత్రిణః-తేషాం శ్రేష్టతమమాత్యో-యాజ్ఞవల్క్యోత్తమా ద్విజః –గోపరాజాన్వయోత్పన్నో –రామాఖ్యో గణికాగ్రణీః-రక్తాస్యబ్దే మాసి భాద్రపదే బహుళ పక్షకే –దర్శేర్క గ్రహణే-పుణ్య కాలేన్గారక వాసరే’’అనేదానిలో ఉన్నప్రకారం గోపయమంత్రి రక్తాక్షి సంవత్సర భాద్రపద బహుళామావాస్య మంగళవారం కృష్ణాతీరం లో సూర్యగ్రహణకాలం లో ,రాజు అనుగ్రహం తో కరణీక బ్రాహ్మణులకు ఇచ్చాడని తెలుస్తోంది .
రామయమంత్రి తిరుపతికి వెళ్లి తిరిగివస్తూ 1066లో సత్తెనపల్లి దగ్గర మాదల గ్రామం లో ఒక బ్రాహ్మణుడి ఇంట ఉండి ,తాను పెట్టాల్సిన ఆబ్దికాన్ని సంతృప్తిగా పెట్టటానికి మొదటిరోజునే బ్రాహ్మణులను ఏర్పాటు చేసుకొని ,అందులో ఒకాయన కట్టాల్సిన పన్ను చెల్లించనికారణంగా,ఆ వూరికంసాలి ,కారణాలు పిలిపించి ‘’బండకొయ్య ‘’వేయింఛి నందున భోక్తగా రావలసినవాడు ఎంతకీ రాకపోతే ,మనుషులనుపంపి వాళ్ళిద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, తానె వెళ్లి చెప్పినా, వినకపోతే ,పితృకార్యం ఎలాగో అలా అయిందనిపించి ,రాజధానికి వెళ్ళిపోయాడు. రామయమంత్రి ప్రతీకారం తీర్చాలి అని మనస్సులో సంకల్పం చేసుకొని .
ఆతర్వాత సూర్యగ్రహణం రోజున సంకల్పం చెప్పటానికి బ్రాహ్మణులేవ్వరూ రాకూడదని శాసనం చేసి ,గణపతి ప్రభువుతోకలిసి కృష్ణా స్నానానికి వెళ్ళాడు .తాను సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ప్రభువుకు సంకల్పం చెప్పటానికి బ్రాహ్మణుడు ఎవరూ లేనందున రాజు ను అడిగి రామయ మంత్రి తానే ఆయనకు సంకల్పం చెప్పి పుణ్య గ్రహణ స్నానం చేయింఛి ,ఆయన అనుమతితో 7గడియలు ముద్రాధికారం పొంది ,చేతిలో నీళ్ళు విడిపించుకొన్నాడు .రికార్డ్ లన్నీ పరిశీలించి బ్రాహ్మణుడికి అన్యాయం చేసిన కంసాలిని పదవినుంచి తప్పించి ,ఆపదవులకు 434మంది బ్రాహ్మణులను గ్రామాలలో నియమించాడని ‘’కొండవీటి దండకవిలె ‘’తెలియ జేస్తోంది .అందుకే రామయమంత్రికి ‘’కరణీకోద్దారకుడు ‘’అనే బిరుదు వచ్చింది .కొండవీటి చరిత్రను జయనాగ దేవ భట్టర్ , బోలమరాజు కోనప్ప , అన్నమరాజు అనే ముగ్గురు ‘’దండ కవిలె ‘’గా శాలివాహన శకం 1250నలనామ సంవత్సరం లో రాశారు,అదే దాని చరిత్రకు ఆధారం.
కృష్ణవేణీ తీరం లో ఆ నాడు గణపతి చక్రవర్తికి ,మహామాత్యుడు గోపరాజు రామయ మంత్రికి జరిగిన సంభాషణకు సంబంధించిన మూడు చాటువు ప్రచారం లో ఉన్నాయి –
‘’అవగత శబ్ద శాస్త్ర చయులైన ,మహాత్ములు ,పండితోత్తముల్ –భువనతలంబు నందధిక పూజ్యులు వారటులుండ గూటికై –నవనవ కల్పనావిది చణత్వముతోడినబద్ధమాడు నీ –కవులట,దానపాత్రులట –గౌరవమందుట జూవె చిత్రముల్ ‘’అని చక్రవర్తి అంటే –అమాత్యుడు
‘’మానఘనుండు ,బ్రహ్మకుల మండనమూర్తి ,పరోపకారి దు-ర్దానదురాన్నముల్ గొనడు-తప్పడు స్వామి హితైక కార్యముల్ –దీనులబ్రోచు ,బాంధవ విధేయుడు ,డస్సియు,వేట బూనడింపూనిన భక్తితోడుత’’నియోగి కోసంగిన దానమల్పమే ?’’అని ఝాడించి ,మళ్ళీ తగుల్కొని-
‘’వ్రాయుట దోషమా? ,వికృతి వైదికమా?సుతదార రక్షణోపాయముకై ‘’నియోగి ‘’నయి ,పార్థివ సేవనొనర్చునంతనే –పాయునె వంశశీలములు,బాగుగ మున్నల చిత్రగుప్తు లున్ –వ్రాయరె యెల్లలోకముల వారలు సేసిన పుణ్య పాపముల్ ‘’అంటూ కడిగిపారేసి మూడోపద్యం లో –
‘’కవి కమలాసనుండు ,త్రిజగత్పతియైన పినాకపాణి యుం –గవియె,తలంపగా గవులుకారె,పరాశర ,బాదరాయణుల్ ,కవికృత పుస్తక గ్రహణ గర్వితులల్పులు పూజనొందగా-గవులట! దానపాత్రముల్ గారట !యిట్టివిపో విచిత్రముల్ ‘’అని మళ్ళీ మాట్లాడకుండా రామయ మంత్రి చేశాడని ‘’ద్వావి౦శ న్మంత్రిచరిత్ర ‘’లో ఉన్నదట .
‘’గణక నిర్వాహంబు గల్పించె నూరూర మహి గోపరాజు రామ ప్రధాని ‘’అనీ ,’
‘’ధరగోపరాజు రామన కరణీకము లుద్ధరించు కాలము దలపన్ –గిరి ఋతు గగన శశా౦కులు -గరమొప్పెడు శకము నాటి కాలంబయ్యెన్ ‘’అనీ చాటువులు చేటలతో రామయమంత్రి గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి .
రామయమంత్రి చెక్కించిన ఒక శాసనం లో
—
రామయమంత్రి గుంటూరుతాలూకా ‘’తంగెళ్ల మూడి ‘’గ్రామస్తుడు .యాజ్ఞవల్క్యనియోగి .కాశ్యప గోత్రీకుడు .ఆపస్తంభ సూత్రుడు
ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-19-ఉయ్యూరు .