అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4
4-తరిగొప్పుల దత్తన మంత్రి
విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది
‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ వ్యగతి శ్రితపారిజాతమై ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు .కనుకదత్తన 16వ శతాబ్దివాడు .వసుచరిత్ర అంకితం తీసుకొన్న తిరుమలరాయల నాలుగవ కుమారుడే వేంకటపతి రాయలు .అలియ రామరాయల సోదరుడు తిరుమలరాయుడు .తళ్ళికోట యుద్ధం లో రామరాయలు చనిపోయాక ,తిరుమలరాయడు సదాశివరాయలకు ముఖ్యమ౦త్రి గా ఉండి,1570లో సదాశివరాయలమరణం తర్వాత రాజ్యం ఆక్రమించి మూడేళ్ళు పాలించగా రెండవకొడుకు శ్రీరంగరాయలు 1574నుంచిరాజ్యానికి వచ్చాడు .
తళ్ళికోట యుద్ధం తర్వాత తురుష్కదండయాత్ర వలనవిజయనగరం భస్మంకాగా తిరుమలరాయలు రాజధానిని పెనుగొండకు మార్చాడు .ఇతనితర్వాత శ్రీరంగరాయలు ఆతర్వాత వేంకటపతిరాయలు రాజ్యం చేశారు .రంగరాయల కాలం లో బిజాపూర్ నవాబులు పెనుగొండను లాక్కోటం వలన చంద్రగిరి రాజధాని చేసుకొన్నాడు .వెంకటపతిరాజ్యానికి వచ్చేనాటికి చంద్రగిరి రాజధాని .’’రామరాజీయ గద్యం ‘’లో –‘’తనకు వేలూరు వరరాజధాని గాగ –వీర వెంకటరాయ విభుడు మిగుల ధరణి బాలించే ధర్మతత్పరత జెలగి ‘’అని ఉండటం వలన రాజధాని వేలూరుకు మారి ‘’రాయల వేలూరు ‘’అయింది.
తిరుమల రాయడు తాను బ్రతికి ఉండగానే కొడుకులతో కొన్ని ప్రదేశాలలో పాలన చేయించినట్లు ,తానూ విద్యా వినోదగోస్టితోకాలక్షేపం చేసినట్లు ‘’శృతి రంజని ‘’పద్య చరణం –‘’నమదరి నృపమౌళిస్తోమ నీరాజితాన్ఘ్రి ‘’వలన తెలుస్తోంది .’’బుధు లెన్నవలయు రాజాధిరాజ –రాజపరమేశ సకల కర్ణాటకాంధ్ర –రాజ ధౌరేయ తిరుమలరాయ తనయ –చంద్రుడగు వేంకటపతి క్షితీంద్ర మణికి ’’
ఇంతటి ప్రతాప శౌర్య ధైర్యశాలి వేంకటపతి రాయలు ముఖ్య సచివుడై తరిగొప్పుల వంశం నాగమ్మ మల్లన దంపతులకు నరసయామాత్యుడు పుట్టాడు .అసామాన్య యశో విభూషితుడై,ఆశ్రిత బాంధవుడై ,అనంత పద భక్తుడుగా విరాజిల్లాడు .భార్య తిప్పాంబ మహాపతివ్రత .అన్నదానం ,పరిచార్యలలలో పేరు పొందింది .వారిది అన్యోన్య దాంపత్యం .వీరికి అప్పన దత్తన మల్లన కొడుకులు అని చంద్రభాను చరిత్ర చెబుతోంది .అప్పన నిరతాన్న దాననిది .లోకబంధుడు .ఇతని తమ్ముడే దత్తనామాత్యుడు
‘’పటు కార్యదక్షుడు ‘’.రాజు ఈ క్రిందివిధంగా అతడినిపోగడినట్లు ‘’చారు చంద్రోదయం ‘’లో ఉన్నది
దత్తన మంత్రి మధ్వమతాను చరుడు .స్వతంత్ర కౌశిక గోత్రుడు .సత్తెనపల్లి తాలూకా ‘’రాజనాపుర ‘’వాస్తవ్యుడు .ఆర్వేల నియోగి మధ్వుడు.ఈ వంశీకులు విజయనగర సామ్రాజ్యం లో తిరువనతపురం మైసూర్ లలో కూడా ఉన్నారట .టిప్పుసుల్తాన్ తండ్రి హైదరాలీకి టిప్పుసుల్తాన్ కు మంత్రి పూర్ణ య్యమంత్రి ఈ శాఖవాడే .
ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-19-ఉయ్యూరు