అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5
5-రాయసము గోవింద దీక్షితులు
చెవ్వప్ప నాయకుడు తంజావూరు పాలించేటప్పుడు 1521లో తనకొడుకు అచ్యుతప్ప నాయకునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు .వ్యవహార కుశాలుడవటం వలన పాలన తండ్రిదైనా అచ్యుతప్ప రాజకీయవ్యవహారాలన్నీ చూసి ‘’మహామండలేశ్వర ‘’బిరుదుపొందాడు.ఇతనికాలం ను౦చే,తంజావూరు రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండటం ప్రారంభమైంది .ఏడాదికి 40లక్షలకప్పం చెల్లిస్తూ ,యుద్ధం వస్తే తోడ్పడేవారు .ఇతనికాలం లోనే విజయనగరాన్ని తిరుమల ,శ్రీరంగ ,వేంకటపతి రాయలు పాలించారు .తుళువ సదాశివరాయలతర్వాత పాలన ఆరవీటి వారిదే .అచ్యుతప్ప పేరుకు సామంతుడేకాని యదార్ధానికి చాలా స్వతంత్రంగా ఉండేవాడు .కానీ 1584లో మళ్ళీసాంతుడిగాఉంటూ విధేయడయ్యాడు .’’సంగీత సుధ’’ పీఠికలో ,’’అప్రతీపః కౌమార ఏవాభ్రుత రాజ్యభారః –నిర్జిత్య సామంత నృపవర్గం –మహీ మహేంద్రః –లక్ష్మాశ్చసర్వాన్యపి మండపాని –దివ్యాని రత్నాభరణాని ‘’అనీ ,రామేశ్వరాది తీర్ధాలలో కొత్త రాజగోపురనిర్మాణ౦ చేశాడని ,రామసేతువు లో లక్షలద్విజులకు అన్న సంతర్పణ చేశాడని ఉంది .రాజచూడామణి దీక్షితులురాసిన ‘’రుక్మిణీ పరిణయ ‘’కావ్యం లో ‘’మాయూర .మధ్యార్జున కుంభ ఘోణ-శ్రీ చంపకారణ్య ముఖ స్థలేషు-మహత్తరం’’ మండప ‘’ మాతతాన భక్త్యా మహత్యాపర మచ్యుతే౦ద్రః ‘’అని అచ్యుతప్పనాకకుని యశో విశేషాలు ఉన్నాయి .
అచ్యుతనాయకుని సచివుడు గోవింద దీక్షితుడుమహామంత్రజ్ఞుడు ,మహాకవి ,గాయకాగ్రేసరుడు ,మహాయజ్వ .అప్పయ దీక్షితులతో మీమాంస చర్చచేసిన పండితాఖండలుడు .మీమాంస శాస్త్రం పై స్వతంత్ర గ్రంథాలు రాసిన విద్వద్ వరేణ్యుడు .’’సార్వ చిత్య ,సర్వతోముఖా తిరాత్ర,సాగ్ని చిత్యాప్త ,వాజపేయాది యజ్ఞాలు చేసిన కర్మిస్టి.’’పదవాక్యప్రమాణ పారావార పారీణ ,అద్వైత విద్యాచార్య ‘’బిరుదులుపొందినవాడు .ఈ మహామంత్రి ఆజ్ఞను శిరసావహించి రఘునాథ రాయలు సంగీత సుధ’’రాస్తే ,గోవింద దీక్షితులు పీఠిక రాశాడు .కనుక చెవ్వప్ప నాయకుడు బ్రతికి ఉండగానే అచ్యుతప్పకు రఘునాధరాయలు పుట్టాడని అర్ధమౌతోంది .అచ్యుతప్ప ,గోవింద దీక్షితులు రఘునాథునికి విద్యాబుద్ధులు, రాజనీతి నేర్పించి వివేక శీలుని చేశారు .గోవింద దీక్షితులు చేసిన యజ్ఞాలకు కొడుకు యజ్ఞనారాయణ దీక్షితుడే అధ్వర్యుడు .ఆయజ్ఞాలలో రఘునాథ నాయకుడు గోవింద దీక్షితులకు తండ్రి ఆనతిప్రకారం ముత్యాలగొడుగు పట్టేవాడట
అచ్యుతప్పగోవింద దీక్షితుల అన్యోన్యాన్ని వర్ణించే ఒక శ్లోకం –‘త్రినామాద్యంత నామానౌ –మహీక్షిద్దీక్షితా ఉభౌ –శస్త్ర శాస్త్రే చ కుశలా –వాహ వేషు హవేషు చ ‘’అచ్యుతుడు ‘’ఆ రభ్య బాలా దతి భక్తి శాలి ‘’ముసలి ఆ వరకు బ్రతికి ,రాజ్యాన్ని రఘునాథునికి అప్పగించి శ్రీరంగానికి వెళ్లి ‘’ముకుంద చింతనము ‘’తో గడిపి 1615లో మరణించాడు . –‘శ్రీరంగ స్థల సంగతో బుధకులం –శీతాంశు రుర్వీమివ ప్రాప్త స్సైష పుపోష శేష శయనే భక్తః పరే ధామని ‘’అని సాహిత్యరత్నాకరం లో ఉంది .అచ్యుతప్ప జీ వించి ఉండగానే అతన్ని ఒప్పించి రఘునాథ రాయలను రాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు గోవింద దీక్షితులు అని ‘’సాహిత్యరత్నాకరం ‘’లో ఉన్నది –‘’భాద్రాసన స్థిత విధి ప్రథితం విభూత్యా –నిత్యాగ్ని హోత్ర భావయా నిటలేమహీన్ద్రో –ఆ చంద్ర తారక అధీశ్వరతా నిధానం – గోవింద దీక్షిత గురుః కురుతేస్మ పట్టం ‘’
రఘునాథ రాయల పట్టాభి షేకం అయినప్పతినుంచి , గోవింద దీక్షితులను అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించాడు .కొంతకాలానికి గోవింద దీక్షితులు చనిపోయాడు .తన సంగీత సుధలో రఘునాధుడు గోవింద దీక్షితులను ‘’జయంతి సేనా దిమరాగ,రామానందాది తాళాన్ రచయాన్ నవీనాన్ –సంగీత విద్వాంస ముపాది శస్త్వం-విపంచికావావిచాక్షణానాం’’అని దీక్షితుల సంగీత ప్రతిభను కొత్తగా కనిపెట్టినరాగాలను తాళాలను స్తుతించాడు .గోవి౦ద దీక్షితులు స్వయంగా ‘’సంగీత శాస్త్ర నిక్షేపం ‘’గ్రంథం రాశాడు.ఇందులో 72ప్రస్తార మేళాలను చెప్పాడు .వేంకటమఖి రాసిన’’చతుర్దండి’’ గ్రంథంకంటే ఇది ప్రాచీనమైనది .కనకాంగి రత్నాంగి ఖరహర ప్రియ రాగాలు దీక్షితులదానిలో ఉన్నాయి .ఇవే వేంకటమఖికి ఆధారం .రఘునాథుని వీణ మెట్లక్రమాన్ని కాదని సప్తస్వరాలకు సర్వకాలాబాధితమైన మెట్లు ఉన్న ‘’సరస్వతీ వీణ ‘’తయారు చేసి,72మేళకర్తలను ఏర్పరచిన ప్రజ్ఞాశాలి వెంకటమఖి .జయదేవుని గీత గోవిందాన్ని అనుసరించి సంగీత సద్గురు త్యాగరాజ స్వామిపై 24అష్టపదులు రాశాడు .
చెవ్వప్ప నాయకుని కాలం నుంచే నేపాలనే జాఫ్నా త౦జావూరికి కప్పం కట్టే సామంత రాజ్యంగా ఉండేది .అచ్యుతరాయల హితవుప్రకారం చెవ్వప్పనాయకుడు కార్యవాది యై రాజధాని తంజావూర్ చేసుకొని అది తమిళప్రాంతం లో ఉండటం చేత ,ఆంద్ర ప్రాంతం నుండి మంత్రులు దండనాథులు ,పండితులు ,కవిశేఖర గాయకులను నాట్యకత్తే లను తంజావూరుకు తీసుకుపోయాడు .అలా వెళ్లినవారే గోవింద దీక్షితుల వంశం కూడా .
గోవింద దీక్షితులు వశిష్ట గోత్రుడు ‘’రాయసాన్వయ పయః పారావార రాకా సుధాకరుడు ‘’.భార్య నాగా౦బిక.ఈయన పేరుతొ తంజావూరు జిల్లాలో లో గోవిందాపురం , దీక్షిత సముద్రం గ్రామాలేర్పడ్డాయి .గుంటూరు ప్రాంతం నుంచే ఈయనవంశం వారు అక్కడికి వెళ్ళారు .అచ్యుతప్ప కావేరి నదికి ఆనకట్ట కట్టి ఎన్నో ధర్మకార్యాలు చేసి ,1577లో మధ్వ స్వామి విజయేంద్ర తీర్ధులకు ఒకగ్రామం దానం చేశాడు .కోటలోని ‘’లక్ష్మీ విలాస భవనం ‘’లో మంత్రా౦గ౦ నిర్వహించేవాడు .ఈ సభలో రఘునాథునికి దీక్షితమంత్రి శత్రు సంహారం కోసం ఒక్కొక్కరిని తాకమని అంటే ఒక్కొక్కరినే ఎదుర్కొని చంపమని సలహా ఇచ్చేవాడని సాహిత్య రత్నాకరం లో ఉంది . ఇలా చేస్స్తేశాత్రువుల ఐక్యతకు అవకాశం ఉండదని భావం .
రఘునాథరాయలు దిగ్విజయ యాత్రలకు వెళ్ళే టప్పుడు రాజ్యభారం అంతా దీక్షితుల పైన వేసి వెళ్ళేవాడని అంతటినమ్మకం ఉండేదని సాహిత్యరత్నాకర౦ లో ఉంది –‘’’’ధరాధురం నిజ సచివే నివేశ్యచ –సరోహితా త్సదసి సరోష మీక్షణా –దనీకినీమథసమనీ నహత్ క్షణాత్ ‘’గోవింద దీక్షితులకొడుకులు యజ్ఞనారాయణ దీక్షితులు, వెంకటేశ్వర దీక్షితులు ,లింగాధ్వరి .లింగాధ్వరి వేదార్ధ తత్వ నిర్ణయం ,శివసహస్రనామ భాష్యం రాశాడు .నారాయణ దీక్షితులు ‘’సాగ్నిచిత్సర్వ క్రతుయాజి .రఘునాధరాయల చరితం ,సాహిత్యరత్నాకరం రఘునాథ భూప విజయం రఘునాథ విలాస నాటకం రాశాడు .ఇతడు రఘునాథుని శిష్యుడే .కావ్యనాటకాలంకార సాహిత్యాలను ప్రభువు వద్దే నేర్చాడు .వెంకటేశ్వర దీక్షితులు వాజిపేయయాజి .సాహిత్య మీమాంస ,కర్మాంత వార్తిక ,వార్తికాభారణ చతుర్దండి ప్రకాశిక మొదలైనవి రాశాడు .మహాకవి వల్లభుడైన నీలకంఠ దీక్షితునికి గురువుకూడా .ఇలా గోవింద ,దీక్షితుల వంశంవారు ఆంధ్రదేశం గుంటూరు సీమనుంది తమిళదేశం తజావూరు సీమకు తరలివెళ్లి అక్కడ సాహిత్య సంగీత ,వేదవేదా౦గ, క్రతువిదులలోనూ మంత్రాంగం లోను కీర్తి ప్రతి స్టులై ,అందరూ మహానుభావులే అనిపించుకొన్నారు .
ఆధారం – ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-19-ఉయ్యూరు