అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6
6-పసుదోవ పంపన భట్టు
క్రీ శ 902లో వేంగిగిరాజ్యం లో పరాశర గోత్రుడు ,ఆర్వేల నియోగి ,వేద,వేదంగ ,మీమాంస శాస్త్ర పారంగతుడు పసుదోవ గ్రామంలో పంపనభట్టు జన్మించాడు .వాజ్మయ మహోదధిలో ఈదులాడినవాడు .షట్కర్మ నిరతుడు .తండ్రి కేశవ శర్మ సర్వ శాస్త్ర తత్వ విదుడు.తాత పంపన బ్రహ్మ తుల్యుడు .లక్ష్మీశ్వరం అనే పేరున్న ‘’పులిగెరే’’పట్నం రాజధానిగా పాలించిన చాళుక్యరాజు ‘అరి కేసరి ‘’కి ప్రధానామత్యుడుగా ఉన్నాడు ..తండ్రి వైదికమతం వదిలి జైనమతం తీసుకొన్నాడు .
భువనైకమల్లుడు అనే పేరుతొవీర విజయాదిత్యుని సమకాలికుడు ఇమ్మడి సోమేశ్వరుడు , కర్నాటక రాజ్యాన్ని ఎనిమిదేళ్ళు పాలించాడు .తమ్ముడు విక్రమాదిత్యునితో వచ్చిన వైరం వలన పదవి కోల్పోయి కారాగారం లో బందీ అయ్యాడు .ఇతని చివరిరోజులూ దీన౦ గానే గడిచాయి .కానీ ముసలితనం లో అంటేరాజ్యానికి వచ్చిన 12ఏళ్ళకు కొడుకుపుట్టాడు .యితడు బతకడు అని కార్తా౦తికులు చెప్పగా ,ఆరోగ్యంగా జీవించాలని ‘’మావిం డేరు’’,’’కృందిడి’’అనే రెండు అగ్రహారాలను పసుదోవ వాస్తవ్యుడు పంపన భట్ట మహామంత్రికి దానంగా ఇచ్చాడు .కాని విదివైపరీత్యం వలన ఆకుర్రాడు బతికి బట్టకట్టలేదు .చివరికి హతాసుడై సంతాన రహితుడుగా 1076లో చనిపోయాడు .ఇతనితో వేంగీ రాజ్యం లో చాళుక్యరాజ వంశం అంతమైంది .నిజానికి విజయాదిత్యుడే చివరి సత్యాశ్రయ కులజుడు .ఇతడు మరణించిన సమయం లోనే కర్నాటకం లో భువనైకమల్ల సోమేశ్వరుడు పదవిపోగోట్టుకొని దుర్మరణం చెందాడు .ఈవిషయాలను ‘’ర్యాలి ‘’శాసన కర్త ‘’ముత్తయభట్టు ‘’ విపులంగా వివరించాడు .
క్రీశ 941లో పంపనభట్టు మొదటి జైన తీర్ధంకరుల చరిత్ర ‘’ఆదిపురాణం ‘’రాయటమే కాక ‘’విక్రమార్క విజయం ‘’అనే’’ పంప భారత౦ ‘’రాశాడు .తండ్రికేశవ శర్మ వేంగిని వదలి కర్నాటక చేరాడు .వేముల వాడ చాళుక్యులలో గొప్పయోదుడైన ఇమ్మడి నరసింహుని ఆధిపత్యం లోనే ముమ్మడి ఇంద్ర వల్లభుడి యుద్ధాలన్నీ జరిగాయి .లాట ,మాళవ, ఘూర్జర, ప్రతీహారులను ఓడించి విజయాలు సాధించటం ఇమ్మడి నరసింహుని సైన్య వ్యూహ౦ వలననే .ఇంతగొప్ప చమూపతి ఆ శతాబ్దం లోభారత దేశం లో లేడు అంటారు .ఇతడి కొడుకే ఇమ్మడి అరికేసరి 930లో మండలానికి అధిపతి అయ్యాడు .ఇతడు రాష్ట్ర కూట రాజు ముమ్మడి ఇంద్రవల్లభునికి మేనల్లుడు .ఇంద్ర భూపతి తనకుమార్తె’’రేవక ‘’నుమేనల్లుడు అరికేసరి కిచ్చి పెళ్లి చేసి మామగారుకూడా అయ్యాడు .బద్దగని ముమ్మనుమడైన అరికేసరి నాల్గవ గోవింద రాజు సమకాలికుడు .
అరికేసరి ముఖ్యమంత్రి మన పంపన భట్టు .వేంగిగిమండలం లోని కమ్మనాడులో ఉన్న వేంగిపర్రు గ్రామస్తుడు .మహామంత్రి పంపకవి కంటే పెద్దవాడు , సమకాలికుడు పొన్నకవి శాంతిపురాణ, ,భువనైక రామాభ్యుదయ కావ్య కర్త . కమ్మనాడులోని పు౦గనూరులో నాగమయ్య అనే బ్రాహ్మణుడికి మల్లపయ్య ,పొన్నమయ్య కొడుకులు .శాంతిపురాణ౦ రాశాడు .ముమ్మడి కృష్ణభూపతికి ‘’భువనైక రామాభ్యుదయం ‘’అంకితమిచ్చిన పోన్నకవి’’ఉభయకవి చక్రవర్తి’’బిరుదాంకితుడు .ఉత్తర ఆర్కాడులో వాణియంబాడి వాస్తవ్యుడు .మల్లపయ్య , పొన్నమయ్య మొదలైనవారు పొన్నకవివంటి వారికి ఆశ్రయమిచ్చి కన్నడ కావ్యరచనకు ప్రోత్సహించారు .అప్పుడు మన తెలుగు రచనలకు ప్రోత్సహించినవారు లేరు .చాళుక్యులే తెలుగు దేశికవితను ప్రోత్సహించారని నన్ని చోడుని కమార సంభవ పద్యం –‘’మును మార్గ కవిత లోకం-బున వెలయగ ,దేశికవిత బుట్టించి తెనుం –గు నిలిపి ర౦ధ్రవిషయం –బున జన చాళుక్యరాజు మొదలగు బలువుర్ ‘’వలన తెలుస్తోంది. గుణగుని పూర్వీకులైన పూర్వ చాళుక్యులలో ఒకరు తెలుగు దేశికవిత్వం పుట్టించాడని భావించాలి .
ఇమ్మడి నరసింహుడు 914నుంచి 930వరకురాస్ట్రకూటరాజు ముమ్మడి ఇంద్రునికి సామ౦తుడు .ఇతడికొడుకు అరికేసరి .అరికేసరి ప్రధానమంత్రి పంపన భట్టు . ఇదీ వరస .
ఆధారం – ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-9-19-ఉయ్యూరు