-అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7
7-వాణస కందన మంత్రి
ఓరుగల్లు దగ్గర రామగిరి దుర్గాదీశుడు ముప్ప ధరణీపతి మహామాత్యుడు వాణస కందన మంత్రి .ఈయనకు ఆశ్రితుడు మడికి సి౦గన బహు గ్రంథ కర్త .సింగన కందనమంత్రిపేర’’నీతి తారావళి ‘’రాసినట్లు ఉందికాని అలభ్యం .సింగన పద్మపురాణం లో ‘’మంత్రం రక్షణ కళాచాతుర్య ,సాహిత్య గీత రసాస్వాదన లోకమానస సదా ధర్మజ్ఞ శ్రీ ముప్పిడీశ్వర కారుణ్య కటాక్ష వర్ధిత మహా సౌభాగ్య భాగ్యోదయా ‘’అన్నాడు కందనమంత్రి తాతలు కాకతి గణపతి సామంతులుగా గణపేశ్వరం మొదలైన చోట్ల దేవాలయ ప్రతిష్ట చేసినట్లున్నది .మడికి సింగన తిక్కనగారి కొడుకు కొమ్మనకు దౌహిత్రుడైన అయ్యలమంత్రికొడుకు .ఇతడు అనపోత రెడ్డికిమంత్రి .అందుకే సి౦గనకు రాజనీతిబాగా అలవడింది .విద్యానగర కంప తాజు సి౦గన కాలం వాడు .మనుమంచి భట్టు ఏలిక కంపరాజు .భట్టు ‘’శాలిహోత్ర ‘’అనే అశ్వ శాస్త్రం ను ‘’హయలక్షణ సారం ‘’గా ఇతడు తెలుగు చేశాడు .ఇది చాళుక్య కంపభూపతికి అంకితం .
గోదావరి నది దక్షిణ తీరం లోని ‘’పబ్బినాటి రాష్ట్రాన్ని రామగిరి రాజధానిగా ముప్పభూపాలుడు పాలించాడు .ఈయనకు ‘’సకల సామ్రాజ్యభార ధురంధరుడు ,ధర్మ చరితుడు ,నీతి చాతుర్య వివేక విశేష సర్వ లక్షణ లక్షితుడు ,చత్ర చామర ఆందోళికాదిరాజ చిహ్నాలతో అలరారే కాశ్యపగోత్రుడైన కందన మహామాత్యుడై వర్దిల్లాడు ఇతని ముత్తాత తండ్రి ‘’నన్నయ ‘’గణపతి దేవుని మంత్రి .ఈనన్నయ దాన రాధేయుడు ,మాన్యుడు .ఇతనికొడుకు మల్లన ‘’మొలగూరు ‘’లో రామేశ్వరాయ మొదలైన విగ్రహ ప్రతిష్ట చేశాడు .’’చంద్ర చంద్రికాకాశసమాన మూర్తియగు గౌరమ మల్లన మంత్రి –దిక్కులన్ వాసికి నెక్కి భక్తిని నవావారణమై గుడికట్ట రామేశు బ్రతిస్ట జేసి నుతికెక్కెననన్మోలగూరి వాకిటన్ ‘’
కందనమంత్రి పెద్దన్నకేసన మంత్రి ముప్పభూపాలుని మంత్రిగా ఉండి ధర్మకార్యాలతో ప్రసిద్ధి పొందాడు .1430లో రాసిన’’ సకలనీతిసారం ‘’దైవా౦కితమే అయినా సింగన -అయ్యలమంత్రి సి౦గ మా౦బకు పుత్రుడని తెలుస్తోంది .ఇంతకీ అయ్యలమంత్రి ఎవరు ?ఆత్రేయ గోత్రుడు పవిత్ర చరిత్రుడు పేరయమంత్రి కూతురు సి౦గ మాంబ ను పెళ్ళాడి ,రాజమహే౦ ద్రపురాదినేత అయిన తొయ్యేటి అనపోతన మంత్రి యై ,గౌతమికి ఉత్తరాన ‘’పెద్దమణికి అగ్రహారం ‘’లో ఆరామ క్షేత్రాదులు కట్టించి అన్నదాత బిరుదుపొందిన అల్లాడ మంత్రి కొడుకు .ఈ అయ్యలమంత్రికోడుకులు సింగన ,అనంతయ్య, అబ్బయ, నారయ్యలు .ఇందులో సి౦గన కు ముప్పభూపాలుడు రామగిరి సీమలో అనేక గ్రామాలను దానం చేశాడు .సి౦గనకు సంగీతనాచార్యుడు తాళ్ళపాక తిరుమలయ్య గురువు అద్దంకి సీమవాడు ‘’పరవాడి భద్రవారణ ‘’బిరుదున్నవాడు .
ముప్పరాజు తెలుగురాయడు రాజ్యం చేసేకాలం లో కందన మంత్రిగా ఉన్నాడు .ముప్పడు మంత్రక్షణ కళా చాతుర్యుడు సాహిత్య గీత రసాస్వాదన పరుడు అని సింగన పద్మపురాణం లో రాశాడు .కృష్ణానది దక్షిణ తీరం లోగుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ‘’రావెల ‘’అగ్రహారం ఏలుతూ అక్కడ గొపీనాథ ఆలయం నిర్మించిన అల్లాడ మంత్రి ముని మనవడే మన కందన మంత్రి. కనుక రావెల వాస్తవ్యుడు .
ఆధారం – ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-9-19-ఉయ్యూరు . –