’ బాబు ‘’నిన్న౦తా బాగా బిజీ

’ బాబు ‘’నిన్న౦తా బాగా బిజీ

మూడు రోజులక్రితం పామర్రు పాత విద్యార్ధి సాయి బాబు ఫోన్ చేసి 22ఆదివారం ఉదయం పాత విద్యార్ధుల సమ్మేళనం ఉందని రమ్మని చెప్పాడు. అప్పటికి వార౦ క్రిందనే  గోదావరి రచయితల సంఘం అద్యక్షుడు శ్రీ శిస్టు సత్యరాజేష్  ఫోన్ చేసి అదే రాజు సాయంత్రం బందరులో ‘కవితాసంకల౦ ఆవిష్కరణకు ఆత్మీయ అతిధిగా రమ్మని ఆహ్వానించాడు .వీటి విషయాలనే ,పై శీర్షికతో రాస్తున్నాను .

  పామర్రుజడ్పి హైస్కూల్ 1984-85 పదవతరగతి విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

  22ఆదివారం ఉదయం స్నాన సంధ్య పూజాదికాలు పూర్తి చేసి ,ఇవి మహాలయ పక్షాలుకనుక ,నిన్నమధ్యాస్టమి  మానాయనమ్మగారి తిధికనుక  శ్రీ వెంకటప్పగారిని పిలిపించి దక్షిణ తాంబూలం ఇచ్చి, టిఫిన్ చేసి పామర్రు ఆటోలో బయల్దేరి ఉదయం 10-30కు శ్రీ కన్యకాపరమేశ్వర సత్రానికి వెళ్లాను .అప్పటికే ఆబాచ్ ‘’అప్పటి విద్యార్ధినీ విద్యార్ధులు,’’నేటికి సుమారు 50ఏళ్ళవాళ్ళు అందరూ చేరి సరదాగా మాట్లాడుకొంటూ ,నన్ను చూసి సాయిబాబు స్వాగత వచనాలు పలికాడు చప్పట్లు మోగించి ఆహ్వానించారు.అలాగే మిగిలిన మేస్టార్లు వచ్చినప్పుడుకూడా శ్రీమతి శ్యామల, సాయి  ఆహ్వానించి తమ గురుభక్తి చాటారు .అందరికి ఇడ్లి పునుగు కాఫీ ఇచ్చారు .నేను ఒక్క ఇడ్లిమాత్రం తిని కాఫీ తాగాను .తర్వాత హాజరైన అప్పటి టీచర్లనుఅంటే నన్ను ,క్రాఫ్ట్ మేస్టార్ శ్రీ ప్రకాశరావు  ,సెకండరి గ్రేడ్ టీచర్ శ్రీ జాలయ్య , యెన్ ఎస్ టీచర్ శ్రీ మతి కస్తూరి ,తెలుగుపండిట్ శ్రీమతి సుబ్బాయమ్మ ,శ్రీమతి లక్ష్మి ,హిందీపండిట్ శ్రీమతి సీతామహాలక్ష్మి  గార్లను వేదికపైకిఆహ్వాని౦చి  ఉత్తరీయాలుకప్పి ప్రార్ధనతో సభ ప్రారంభించారు  .పాత విద్యార్ధులు వచ్చి తమపరిచయాలు, సాధించిన ప్రగతి ,సంసార విశేషాలు అత్యంత క్లుప్తంగా చెప్పారు .ఆతర్వాత ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం చేశారు .ప్రతిఒక్కరికి శాలువా, పుష్పహారం , ఒక బాగ్ అందజేశారు. టీచర్లు తమ అనుభవాలను చక్కగా తక్కువ మాటలతోనేచెప్పారు  .ఆడపిల్లలు ఒక్కొక్కరుగా మా దగ్గరకొచ్చి పరిచయం చేసుకొని ఏ సెక్షన్ లో తామున్నదీ వివరించారు .ఫాతీమా మెహజబీన్ అనే అమ్మాయి నాతో తాను దుబాయిలో ఉంటున్నానని ,నేను చెప్పినపాఠాలు,స్పూర్తి దాయకం గా ఉండేవని అంటే ,జుబేదా బేగం అనే అమ్మాయి తన సోదరితోవచ్చి ‘’సార్  మీరు  మమ్మల్ని’’ట్విన్స్ ‘’అని పిలిచేవారు ‘’అని చెబితే ,మరొక అమ్మాయి ‘’సార్!మీరు చెప్పిన సైన్స్ పాఠంవింటే ఇక మళ్ళీ చదవాల్సిన పని ఉండేదికాదు అలామనసులో నిలిచిపోయేది ’’అని సంబర పడిచెబితే మహాదాన౦ద౦  వేసింది .వాళ్ళంతా నాతో ఫోటోలు తీసుకొన్నారు .వీరంతా స్కూలు వదిలి సుమారు 35లేక 36ఏళ్ళు అవుతోంది  వాళ్ళమనసుల్లో అంతగా గుర్తుండిపోవటం నా అదృష్టం .సినిమాలలో ‘’గుండు సుదర్శనం’’లాగా ఉండే తెనాలి కుర్రాడు చాలా ఆత్మీయత మర్యాద చూపాడు .అలాగే సాయిబాబు  శ్యామలా ,ఒక ఆర్కిటెక్ట్ కుర్రాడు పొందిన ఆనందం వర్ణనాతీతం .శరీరాలు పెరిగి  వంగలేక పోయినా ప్రతివారు ఆడామగా వంగి మరీ పాదాలకు నమస్కరించిన తీరు జన్మలో మర్చిపొలేని అనుభూతి .వారందరి ఆదరణ ఆత్మీయత ,ప్రేమ గౌరవం ఆదరణ ,భక్తి ప్రపత్తులు చూస్తే ఉపాధ్యాయుడికి ఉన్న గౌరవం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది .ఒళ్ళు పులకరించింది .ఆడవారు అందరు సంప్రదాయ బద్ధంగా చీరలు కట్టుకురావటం మహా ముచ్చటగా ఉంది .ముస్లిం లు క్రిస్టియన్ లు అంతా సోదర సోదరీ భావంతో కలిసి మెలిసి ఈ పండుగ చేశారు .పామర్రు హైస్కూల్ కు అభి వృద్ధికి వనరుల పెంపుకు పదివేలు నుంచి వెయ్యి రూపాయలవరకు వీరు యధాశక్తి విరాళాలు అందించి  ‘’ఆల్మామేటర్’’ పై ఉన్న తరగనిప్రేమను చాటారు ,హాట్స్ ఆఫ్ .

  నేను మాట్లాడుతూ ‘’పామర్రు చరిత్ర క్లుప్తం గా చెబుతాను .సుమారు అయిదు లేక ఆరువందల ఏళ్ళక్రితం పామర్రు లో నాగులేరు అనే నది ఉండేది .దాని ఒడ్డున నాగదేవతలు శివలింగం ప్రతిష్టించి పూజించేవారు .అభిషేకజలానినదినికూడా ఏర్పాటు చేయటం వల అది నాగు లేరు గా పిలువబడింది  .నీటికిపైన శివలింగం కనిపించేది .లింగం యెంత లోతుందో ఎవరికీ తెలీదు .ఈ లింగానికి ప్రభావం ఎక్కువగా ఉండేదని చెప్పుకొనేవారు  .నాగులేరుమధ్యలో తామరకొలను ఉండేది .అందులో ఒకపద్మం నిత్యం శివలింగం పై ఉండేది .దాని సువాసనకు దారిన పోయే వారు ఆశ్చర్యపోయేవారు .కొలనుగట్టు మీద పెద్ద మర్రి చెట్టు ఉండేది .దాని తొర్రలో ఉన్న నాగుపాము ,రోజూ దిగివచ్చి శివలింగానికి చుట్టుకొని కొంతసేపు ఉండి వెళ్ళేది .కొన్నేళ్ళకు చెరువు పూడిపోయింది .దాని చుట్టూ చిన్నగ్రామ౦ ఏర్పడింది  .నిజాం నవాబులకాలం లో ఒక గురపు దళం ఇక్కడికి వచ్చి శివలింగ మహిమ విని దాన్ని త్రవ్వితీస్తే అడుగున వజ్రాలు రత్నాలు బంగారం దొరకవచ్చునని దిగి పీకటానికి ప్రయత్నించారు .అది ఊడి రాలేదు .తర్వాత ఒక బలమైన ఏనుగును నీటిలోకి దింపి తొండం తో లింగాన్ని పెకలించే ప్రయత్నం చేశారు .ఏనుగు శివలింగం పై ఉన్న పద్మం యెక్క కాడకు ఆశపడి, లాగగానే లింగం పై ఒక రంధ్రం ఏర్పడి ,రక్తం కారటం ప్రారంభమై కొలను రక్తపు మడుగు అవగా సైనికులు భయపడి పారిపోయారు .విషయం గ్రామస్తులకు తెలిసి ఆలింగాన్ని అక్కడే ప్రతిష్టించి పూజలు చేయటం ప్రారంభించి ఆలయం ప్రాకారం కట్టించి ‘’సోమేశ్వరాలయం ‘’గా పిలిచారు .ఇప్పటికీ ఆ లింగం పై రంధ్రం చూడవచ్చు .ఈ  ప్రదేశంలో పాము, మర్రి ఉండటం చేత దీన్ని ‘’పాముమర్రి ‘’అనేవారు. క్రమ౦గా పామర్తి అయి ఇప్పుడు పామర్రు ‘’అయింది అని చెప్పగానే చప్పట్లు మారుమోగాయి .అలాగే 12-12-1911లో ధిల్లీలో నాటి అయిదవ జార్జి చక్రవర్తి ,రాణి మేరీల పట్టాభి షేక మహోత్సవం జరిగింది .ఆఉత్సవాలు దేశమంతా నిర్వహించారు  .పామర్రులోకూడా పంచాయితీ వారు అందరివద్దా చందాలు పోగేసి పేదలకు వస్త్రదానం చేసి, తృప్తిగా  భోజనాలు పెట్టారు .దీని తీపి గుర్తుగా 20అడుగుల ఎత్తు ,నాలుగు అడుగుల వెడల్పు, ఆరు ముఖాలతో  ఒక జయ స్త౦భం ఏర్పాటు చేసి దానిపై పట్టాభి షేకవార్తను ఇంగ్లీష్ లో రాయించి ,పుల్లేరు కాలువ ఒడ్డున ప్రతిస్టించగా కలెక్టర్ హెచ్ .ఎల్ .బ్రైడ్ దీన్ని14-12-1911న ఆవిష్కరించాడు .ఇప్పుడు దీని సంగతి ఎవరికీ తెలీదు .అని అనగానే మళ్ళీ ఒకసారి చప్పట్లు మోగాయి .ఇవి కట్టుకథలుకావు .’’శివ –వెంకట కవులు’’ అనే జంటకవులు శ్రీ అడవి సాంబశివరావు శ్రీమాన్ నందగిరి వెంకట అప్పారావు లు ‘’పామర్రుస్థూప  జయ ధ్వజ చరిత్ర ‘’లో పద్యాలతో విపులంగా వర్ణించి చెప్పారు . ‘’అని ముగించాను .’’మాకు ఎవరికీ తెలీని ఎన్నో విషయాలు చెప్పారు  చాలాబాగా చెప్పారు ‘’అని అందరూ అన్నారు .సంతోషపడ్డాను .

   సభ అవగానే అందరికీ మంచి విందుభోజనం చాలారకాలతో  ఏర్పాటు చేశారు .అన్నీ మసాలావాసనతో ఉండటం తో నేనుమాత్రం ఇంత స్వీటు ,సాంబారు, పెరుగు అన్నం తిని తృప్తి చెందాను .అందరి భోజనాలు అవగానే మళ్ళీ మమ్మల్ని వేదికపైకి పిలిచి గ్రూపు ఫోటో తీశారు .ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 2-30దాటింది .అందరికీ వీడ్కోలు చెప్పి కార్యక్రమం బాగా నిర్వహి౦చి న౦దుకుఅభిన౦దదనలు తెలిపి ఎవరి దారివారు పట్టాం .

   శ్రీ సోమంచి రామంగారి సందర్శనం

మధ్యాహ్నం 3గంటలకు బందరు బస్సు ఎక్కి నాలిగింటికి దిగాను .అప్పటినుంచీ సాయంత్రం 5-30వరకు ఏమి చేయాలా అని ఆలోచించగా  పామర్రు వాళ్ళు కప్పిన రెండు శాలువాలు ఒక దండ ఉన్నాయి .కనుక సోమంచిరామగారినిచూసి కనీసం ఆరేళ్ళు అయి౦ది కనుక  వెళ్లికలుద్దమ నిపించి యాపిల్ పళ్ళు కొని ఫోర్ట్ రోడ్ లో ఉన్న వారింటికి వెళ్ళా .అక్కడే ‘’పురాణం వారి భవనం ‘’అనే మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మామగారుశ్రీ పురాణం సూరి శాస్త్రులుగారి  పెద్దభవనముంది .అది ప్రఖ్యాత కథకులు తండ్రికి తగ్గ ప్రఖ్యాత కథకులు మల్లాది సూరిబాబుగారిల్లు .వారిభార్యరుక్మిణి గారున్నారేమో ఒకసారి పలకరిద్దాం అని అడిగితె హైదరాబాద్ లో ఉన్నారన్నారు .

   రామం గారి అర్ధాంగి నన్ను సాదరంగా లోనికి ఆహ్వానించారు .రామంగారు వచ్చి సౌ౦జ్ఞాలతో పలకరించారు .నేనెవరో ఆమె ఆయనకు చెప్పారు ‘’ఉయ్యారాయన .మీలాగే రాస్తారు ‘’అన్నారు .ఆయనకు జ్ఞాపకం తక్కువైందని ,అన్నీ మర్చిపోతున్నారని బయటికి వెడితే ఇల్లుకూడా గుర్తు ఉండటం లేదని ఆమె అన్నారు. మా  యిద్దరికీ జ్యూస్ ఇచ్చారామే .రామ౦ గారికి శాలువాకప్పి దండవేసి ఆపిల్ పళ్ళు చేతిలోపెట్టి  ,ఆమెనునా మొబైల్ తో ఫోటో తీయించాను .తర్వాత దంపతులిద్దర్నీ కలిపి నేను ఫోటో తీసి కాళ్ళకు నమస్కరించి  ఉదయం పామర్రు విద్యార్ధులు మాకు గురుభక్తి చూపిస్తే, ఇప్పుడు నేను మాస్టారి యడల నా గురుభక్తి చాటుకున్నాను .ఆయన చెప్పాలనుకొన్నదానిలో ‘’ఎందుకు ఈహడావిడి.శాలువా దండా’’అన్నముఖ కవళిక లో భావన నాకు అర్ధమైంది .అయ్యొయ్యో అని నొచ్చుకొన్నారుకూడా . ఆయన స్పస్టా స్పస్టం  గా మాట్లాడుతున్నారు .83నడుస్తున్నాయి .జాతీయ అవార్డ్ ,రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత .కృష్ణాజిల్లా  ప్రధానోపాధ్యాయ సంఘానికి మాజీ  అధ్యక్షులు. రాష్ట్ర సంఘానికి కార్య దర్శి .ఆయనకు తెలియని జివో లేదు .అర్ధంకాని విషయం లేదు .ఆయన సాయం పొందని టీచర్ లేరు అంటే అతిశయోక్తికాదు .ప్రతిదీ ఫింగర్ టిప్స్ పై ఉండేవి .జిల్లా అధికారులకు తలలో నాలుక .నాకూ  ఆంజనేయ శాస్త్రి ఆదినారాయణరావు  శ్రీమతిభారతి శ్రీమతి కస్తూరి మొదలైనవారికి రామంగారు ఫిలాసఫర్, గైడ్  సారధి సచివులు మార్గదర్శి ..అందుకే మాకు ఆ గురుభక్తి .తనకొచ్చిన నేషనల్ అవార్డ్ గురించి ఆయన నాతో వినపడీ వినపడనట్లు రెండుమూడు సార్లు చెప్పారు .ఆయన ధ్యాస అంతా  టీచర్లు బాగా చెప్పటం లేదని ,విద్యార్ధులు సరిగ్గా చదవటం లేదనేవాటిపైనే ఉంటోంది అని ఆమె నాతో అన్నారు .ఆయనకు బిపి,సుగర్, కీళ్ళ  నెప్పులు లాంటివి ఏవీ లేని అదృష్టవంతులు . ఏమైనా చాలాకాలం గా మనసులో ఉన్న కోరిక ఇలా తీరింది రామంగారిని చూడటం తో .

      ఆటవెలదుల తోట ఆవిష్కరణ

 రామంగారింటినుంచి హిందూ కాలేజి ఎదురుగా  శ్రీ ఆ౦జనేయ స్వామి దేవాలయం లో ఉన్న మహతి ఆడిటోరియం కు సాయంత్రం 5-15కు ఆటోలో చేరాను .వెలగలేరునుంచి వచ్చిన ఒకామె, నేనే ఉన్నాం .తర్వాత శిస్టు రాజేష్ , వడ్డేప్రసాద్ లు వచ్చారు పావుగంటకు. శ్రీ గుత్తికొండసుబ్బారావు గారు శ్రీమతి రాదికాణి వచ్చారు .ఆరువరకు సందడే లేదు. ఆరున్నరకు జనం వచ్చారు .సభ ప్రారంభమైంది .సుబ్బారావు గారు అధ్యక్షులు శ్రీ ధన్వన్తరిఆచార్య ,కృష్ణా యూనివర్సిటి వైస్ చాన్సలర్,  శ్రీమతి వారణాసి సూర్య కుమారి, శ్రీభావిష్య,నేను  వగైరాలు అతిధులు.పట్టు ఉత్తరీయాలతో ఆహ్వానించారు .పుస్తకావిష్కరణ గుత్తికొండ చేశారు .అందరూ తమ మనోభావాలు చెప్పారు .అందరికి బిస్కెట్లు ఫాంటా ,బ్రెడ్ కేక్ చాక్లెట్ ,ఉడికించిన మొక్కజొన్నల కప్పు, చివరికి ,ఉప్మాలాంటి ఉలిహారపెట్టారు .ఆకలేసి వేదికమీదే ఆబగా తినేశా సిగ్గులేకుండా .నేను వచ్చినదగ్గర్నుంచి రాధిక ‘’సార్!టిఫిన్ తెప్పించమంటారా డ్రింక్ తెప్పించమంటారా’’అని రెండుమూడు సార్లు అడిగితే వద్దన్నాను . .రాదిక పుస్తక సమీక్ష బాగా చేసింది . పూసిన ఎర్రగులాబి ఉన్న గులాబిమొక్కను ప్లాస్టిక్ సంచీలో పెట్టి అతిధులకు ఇచ్చారు ..ఇదంతా రాజేష్ స్పెషల్ అనిపించింది .నేను వస్తున్నానని తెలిసి శ్రీ కోసూరు ఆదినారాయణ దంపతులు , మా శిష్యురాలు శ్రీమతి భారతి ఆమె స్నేహితురాలు ,కనకదుర్గ ,మేరీ కృపాబాయి మునిసిపల్ మాజీ హెడ్మాస్టర్ శ్రీమూర్తి  వచ్చారు .హైదరాబాద్ నుంచి శ్రీకంచి వాసుదేవరావు వచ్చారు. చాలాకాలమైంది . ఇద్దరం మాట్లాడుకొన్నాం ఆప్యాయం గా .

  నేనుమాట్లాడుతూ ‘’ వచ్చే ఆదివారం నుంచి ప్రారంభమయే శరన్నవరాత్రి దసరా కు వారం ముందే శుభాకాంక్షలు .గోదావరి  కృష్ణా నదుల అనుసంధానం జరిగి నాలుగేళ్ళు దాటింది .దానివలన కృష్ణా జిల్లా సస్యశ్యామలంగా ఉంది .ఇప్పుడు గోదావరి –కృష్ణా కవిత్వ అనుసంధానం కను విందుగా ఉంది .ఇదీ కవితాఫల సాయం ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాలని కోరుకొందాం .మధ్యమధ్యలో కమ్మని పాటలు పాడించటం తో సంగీత సరస్వతికూడా  అంతర్వాహిని అయి పవిత్ర ‘’త్రివేణీ సంగం ‘’అయింది .’’గోరసం’’ అంటే గోదావరి రచయితల సంఘం పూనిక అక్కా చెల్లెలు అయిన  రాజేష్ ,రాదికలవలన ఇక్కడి సాహితీ మిత్రుల సహకారం తో బాగా నెరవేరింది .ఆంధ్రకేసరి సినిమాలో టైటిల్ సాంగ్ గా ఆరుద్ర ‘’వేదం లా ప్రవహించే గోదావరీ అమర ధామంలా భాసిల్లె రాజ మహే౦ద్రి –తరతరాల చరిత్రకిది మహానగరము -శతాబ్దాల చరిత్రకిది గొప్ప గోపురం .ఆదికవి నన్నయ్య పుట్టే నిచ్చటా-వీరేశలింగ చరిత్ర అదో ముచ్చట ‘’అని పొంగిపోయి రాశాడు .మనం అత్యంత పవిత్రంగా భావించే గంగానదినికూడా ఏ సంస్కృత కవులు తెలుగు కవులు ‘’వేదం లా ‘’ప్రవహి-చినట్లు  భావనచేసి రాయలేదు నాకు తెలిసినంతవరకూ .ఆరుద్ర రాసి పరమపవిత్రత తెచ్చాడు .ఆరో రుద్రుడుకదా!కవి సామ్రాట్ విశ్వనాథ ‘’కృష్ణా తరంగ నిర్నిద్ర గానము తోడ కవులగానమ్ము కలయునాడు ‘’అని పొంగిపోయాడు .ఇలా ఈరెండు సీమల సౌభాగ్యం మనకు వారసత్వ సంపద .నలభై ఎనిమిది మంది వివిధ ప్రాంతాల కవులతో ఆటవెలదులు ‘’పూయించి ‘’ కను,మనసు  విందుగా తోట పెంచి ఆహ్లాదం చేకూర్చారు .అదేదో సినిమాలో ఆహుతిప్రసాద్ ఇంట్లో ఆతిధ్య మర్యాదలు అనుభవించలేక ఇబ్బంది పడ్డట్లు ,ఇప్పుడు రాజేష్  రాజమండ్రి దగ్గర లోని ప్రసిద్ధమైన కడియం నర్సరినుంచి గులాబి అంట్లు తీసుకొచ్చి అతిధులకు అందజేయటం శిస్టు రాజేష్  విశిష్ట అభిరుచికి తార్కాణ.వేదిక ఎక్కిన దగ్గర్నుంచీ ఏదో ఒకటి తెచ్చిచ్చి నోట్లో కుక్కుతూ మాట రాకుండా చేశాడు.అతని సౌజన్యం  ,అతని ఆతిధ్యమర్యాద కే ఆదర్శం .ఒక్కడే ‘’ఆసులో గొట్టం ‘’లాగా అటూ ఇటూ తిరుగుతూ అక్కను వీసమెత్తు పని కూడా చేయనీయకుండా  గౌరవం చూపా’డు  .మిక్కిలి అభినదనీయం .విశాఖలో కొప్పరపుకవుల దౌహిత్రుడు శ్రీ ప్రసాద్’’కొప్పరపు కళాపీఠం’’ఏర్పాటు చేసి మంచికార్యక్రమాలు చేస్తున్నారు .రాజమండ్రి దగ్గరి కడియం సమీపం లో జన్మించిన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి  ఆయన జంట కవి తిరుపతి శాస్త్రిగారి పేరిట ‘’తిరుపతికవుల సాహితీ పీఠం ‘’రాజమండ్రిలో ఉన్నట్లు లేదు .’’గోరసం’’ వారు దాని ఏర్పాటుకు పూనుకొని ఆమహామహులకు దివ్య నీరాజనాలు ప్రతిఏడాది చేస్తే బాగుంటుంది .ఒడ్డున ఉండి చెప్పటం తేలిక .ఆచరణ కష్టం .ప్రయత్నించమని అభ్యర్ధన .ఎనభై దగ్గర పడుతున్న నన్ను ‘’ఆటవెలదులతో ‘’ఆడుకో రమ్మ’’ని రాజేష్ పిలిచాడు .కాదనలేకపోయాను .అతడు మా ఉగాది వేడుకలలో మొదటి సారి చూశాను .మంచి టెస్ట్ ,దమ్ము ,నిబద్ధత ఉన్న కవి ,రచయిత,నాయకుడు  అనిపించాడు .మరిన్ని మంచి కార్యక్రమాలతో గోరసం ‘’పీయూష లహరి ‘’ప్రవహి౦పజేయాలని కోరుతున్నాను ‘’అని ముగించగా అందరూ హర్షధ్వానాలు చేశారు .అప్పటికే సమయం రాత్రి 8-30.బందరునుంచి బెజవాడకు తొమ్మిది దాటితే బస్సులు దొరకటం కష్టం.అందరికీ బైచేప్పి ,బయల్దేరగా, మూర్తిగారు తన స్కూటర్ పై నన్ను బస్ స్టాండ్ లో దింపారు .తొమ్మిదన్నరకు బస్సు వస్తే ఎక్కాను .ఉయ్యూరు చేరే సరికి రాత్రి 10-55.మామనవడు తెచ్చిఉంచిన సోమ్ పాపిడి   లో సగం తిని ,మజ్జిగ తాగి  ,మంచమెక్కి యుట్యూబ్ లో చంద్రగిరిసుబ్బు సీరియల్’’ నేనూ తను ‘’చూసి 11-45కు నిద్రలోకి జారుకున్నా .ఉదయం9నుంచి రాత్రి 11-45వరకు సుమారు 15గంటలు బిజీ బిజీగా గడపటం ‘’మిర్చి ఎఫ్ ఏం లో ‘మధ్యమధ్యలో వచ్చే ‘’బాబు బాగా బిజీ ‘’అనే మాట తరచూ వినటం ,అంతకు ముందురోజు మా అమ్మాయి విజ్జి అమెరికా ను౦చి ఫోన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళమ్మ ‘’అమ్మడూ ! రేపు మీబాబు బాగా బిజీ ‘’అనటం వినటం వలన ఈ  ఎపిసోడ్ కు ‘’బాబు నిన్నంతా బాగా బిజీ’’   అని పేరుపెట్టి రాసి ,నామనోభావాలు తెలియ జేశాను ఈరోజు .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.