అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8
8-చుండి కాళయా మాత్యుడు
16వ శతాబ్దికి చెందిన చుండి కాళయామాత్యుడుఆర్వేల నియోగి ఆపస్తంభ సూత్రుడు ,కౌశిక గోత్రీకుడు చుండి రాజ్య ప్రధానమంత్రి .శివపూజా రతుడు .తల్లి సోమాంబ .తండ్రి రామమంత్రి .
కాళయామాత్యుడు అదీంద్ర ధైర్యుడు ,స్వామి ద్రోహర గండ నవ సమీరబలుడు ,రుద్రాక్ష భూతిభూషణ ముద్రా౦కు డు. దుస్సహగ దూరుడు,నభ స్సిందు సమాన కీర్తి భరితాంకుడు,నిస్సీమ భూప్రదాత,అఖిల విద్యాపతి ,విస్సాంబాపతి,శౌర్య ధనుడు ,రాదేయ సమాన దానపరుడు ,బందుప్రియుడు ఇతని ఆజ్ఞాప్తి సామంత సీమంతినుల కొప్పువిరులకు వేసవి గాలి అని ఇతని బంధువు పెదపాటి ఎర్రన రాసిన ‘’మల్హణ చరిత్ర ‘’లో వర్ణింపబడింది .ఇతడు నేపాల, కురు, నిషధ ,అంగ, వంగ, గౌళ, గాంధార ,మగధ,కొంకణ, విదేహ నృప మహాస్థాన కవి .మల్హణ చరిత్ర అంకితం పుచ్చుకున్నవాడు .ఇతనికీర్తి శైలేంద్ర కన్యాదీశ కంఠ హాలహలా౦క౦బు కప్పేస్తుంది .ఇతని కీర్తి దిగంతాలకు వ్యాపించగా ,తనమనోహర మూర్తి మానినీ జనములను మరులు గొల్పింది.ఇతడు సుకవి ఫణిత వర గుణమణి గణాభరణ శాలి .విస్సా౦బను ఉద్వాహం చేసుకొన్నాడు .అతనిది విభీషణుడి పట్టు .రాష్ట్రాలకు శ్రీరామ రక్ష.ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ.’’రామయ కాళుడు అనంత యశుడు’’.
పండితా రాధ్య చరిత్ర నుండి విషయంతీసుకొని ,మల్హణ కథ ప్రధానంగా ,శ్వేతుని వృత్తాంతం ప్రాసంగికం గా పెదపాటి ఎర్రనకవి ‘’మల్హణ చరిత్రను ‘’శృంగార రసాభ్యుదయంగా రచించి మనకు కాళయ మంత్రి ప్రతిభా విశేషాలు అందించాడు .
ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-19-ఉయ్యూరు