గాంధీజీ మహాత్ముడైన విధం -2
దక్షిణాఫ్రికా అనుభవాలు
దక్షిణాఫ్రికా డర్బాన్ లోని నటాల్ పోర్ట్ లో గాంధీ 1893మే లో ఒక వాణిజ్య సంస్థకు జూనియర్ కౌన్సెల్ గా వచ్చాడు .40వేల పౌ౦డ్ల సివిల్ కేసు కు టర్మ్ కాంటాక్ట్ పై వాదించటానికి వచ్చాడు .ఈ కేసు నటాల్ కు చెందిన అబ్దుల్లాకు, మ్త్రాన్స్ వాల్ కు చెందిన త్యేబ్ సేట్ల మధ్య జరిగింది .గాంధీకి రానూ పోనూ ఫస్ట్ క్లాస్ టికెట్లు, ఏడాదికి 105పౌండ్ల జీతం ,ఈ కాలం లో ఆయన ఆ వ్యాపార సంస్థలో లో గెస్ట్ గా ఉండే ఏర్పాటు .అక్కడ అమలులో ఉన్న నియమ నిబంధనలు ఆయనకుతెలియనే తెలీదు .అక్కడ దిగేటప్పటికి తన వేషం ,వైఖరి ఎలా ఉండేదో ఆయనే గుర్తుకు తెచ్చుకొన్నాడు .’’బారిస్టర్ ను కనుక తగిన ,నచ్చిన వేష ధారణతో ,నా ప్రత్యేకత ,ప్రాముఖ్యం చాటుతూ డర్బాన్ లో దిగాను ‘’కానీ నటాల్ లో మొదటి రోజునే అక్కడి యూరోపియన్లు ఇండియన్ లను యెంత అమానకరంగా చూస్తున్నారో గ్రహించాడు .గాంధీని ఇక్కడిక్ రప్పించిన వ్యాపారవేత్త దాదా అబ్దుల్లా స్వాగతం పలకటానికి షిప్ పైకి వచ్చాడు .అక్కడివారు అబ్దుల్లాతో పరిచయమున్నాకూడా తమకంటే సామాజికంగా హీనంగా ఉన్న చులకన భావ౦తో చూడటం ,అక్కడి ఇండియన్లు దీనికి అలవాటుపడి ‘’లైట్ ‘’తీసుకోవటం గమనించాడు .కానీ 23ఏళ్ళసున్నిత౦గా ,గర్వంగా ఉన్న ఈ కుర్ర బారిస్టర్ సహించలేకపోయాడు .రెండు మూడు రోజుల్లో అబ్దుల్లా గాంధీని డర్బాన్ లోని మేజిస్ట్రేట్ కోర్ట్ కు దక్షణాఫ్రికాలో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో అనుభవం లోకి తేవటానికి తీసికెళ్ళాడు .వెళ్ళగానే మేజిస్ట్రేట్ గాంధీని నెత్తిమీద ఉన్న టర్బన్ తీసేయ్యమన్నాడు. అది అవమానంగా భావించి తిరస్కరించిన గాంధీ వెంటనే కోర్ట్ నుంచి బయటికి వచ్చేశాడు . ‘’ఆహా ఇక్కడ కూడా నేను పోరాటం చెయ్యాలన్నమాట ‘’అని రాసుకొన్నాడు జీవిత చరిత్రలో .
ఆయన ఎదుర్కొన్న అనేక అవమానకర దారుణ సంఘటనలముందు కోర్ట్ ఉదంతం లెక్కలోకి రాదు .వ్యాజ్య విషయంలో అబ్దుల్లాకు సాయం కోసం ప్రిటోరియాకు సుదీర్ఘ సంక్లిష్ట ప్రయాణం చేయాల్సి వచ్చింది .చార్లెస్ టౌన్ కు రైలు లో ,స్టాండర్ టన్ కు కోచిలో ,మరోకోచిలో జోహాన్స్ బర్గ్ ,అక్కడనుంచి ట్రెయిన్ లో ప్రిటోరియా వెళ్ళాడు .ఈ ప్రయాణం లోనే ఆయన్ను ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ నుంచి మాట్జ్ బర్గ్ లో అవమానించి దెబ్బలుకొట్టి ,చివరగా బయటికి తోసేశారు .చావుతప్పి , కన్ను లొట్టపోయినట్లు ఎట్లాగో ప్రిటోరియా చేరాడు .అక్కడ స్టేషన్ లో ఒక నల్లజాతి అమెరికన్ , అమెరికన్ వాళ్ళ చిన్న హోటల్ కు తీసుకు వెళ్ళాడు .అక్కడే ఆరాత్రి గడిపి మర్నాడు అబ్దుల్లా ఏర్పాటుచేసిన లాడ్జికి మారాడు .
తాను , విన్న ,కన్నా అనుభవించిన జాతి వ్యతిరేకత ,వివక్ష, పక్షపాతాలు సున్నితమనస్కుడైన గాంధీని కలచివేసి ,తక్షణమే తిరుగుటపాలో ఇండియా వెళ్లి పోవాలని పించింది .కాని వాణిజ్య కేసు కాంట్రాక్ట్ ఆయన్ను ఉండిపోవాల్సిన పరిస్థితి కల్పించి ఒక ఏడాది ఎలాగో అలా గడుపుదాం లే అని నిర్ణయించాడు .తిరిగి వెళ్ళటం పిరితనం అవుతు౦దనుకొన్నాడు .కనుక దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచి౦చాలనిపించి ,మొదటగా దక్షిణాఫ్రికా భారతీయుల ను ఉత్తేజ పరచి వారిని సంఘటిత పరచే పనిలో పడ్డాడు . అక్కడికి చేరిన కొద్ది రోజులకే దక్షిణాఫ్రికాలో మొదటి ఉపన్యాసం లో భారతీయులు మత ,ప్రదేశ ,పుట్టుకలకు అతీతంగా ఏకం కావాలని,సంఘటిత శక్తినిఎదిరించేదేదీ ఉండదని ఉత్తేజకరంగా ప్రబోధాత్మకంగాప్రసంగించాడు .అక్కడి వర్తక వాణిజ్య వర్గాలవారిని నీతి నిజాయితీ తో ప్రవర్తించమని ,ఆరోగ్య విషయం లో అందరూ సుచి శుభ్రత పాటించమని కోరాడు .
ఒక ఏడాది గడిచాక ఇండియాకు తిరిగి వెళ్లబోయే గాంధీకి డర్బాన్ లో వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు .అందులో గాంధి ‘’నటాల్ మెర్క్యురి ‘’పత్రికలో వచ్చిన వార్త చదివి వినిపించాడు .అందులో నటాల్ ప్రభుత్వం 43వేలమంది ఇండియన్స్ లో వోటు హక్కు ఉన్న 250మంది ఇండియన్ వోటుహక్కు రద్దు చేస్తున్నట్లు ఒక బిల్లు ప్రవేశ పెట్టబోతోందని ఉంది .వెంటనే గాంధీ అక్కడి ఇండియన్ లను దానికి వ్యతిరేకగా పోరాటం చేయమని పిలుపునిచ్చాడు .దీనికి స్పందించి వారంతా గాంధీని ఇండియా పర్యటన వాయిదా వేసుకోమని ,తమను దగ్గరుండి నడిపించి మార్గ దర్శనం చేయమని అభ్యర్ధించారు .అబ్దుల్లా సేఠ్ కూడా ఒకడుగు ముందుకు వేసి తగినట్లు స్పందించి ‘’మేమంతా నడకరానివాళ్ళం ,అక్షరం ముక్క లేని వాళ్ళం .రోజువారీ మార్కెట్ రేట్లు తెలుసుకోవటానికే మేము రోజూ పేపర్లు చూస్తాం .మాకు చట్టాల సంగతి ఏం తెల్సు .ఇక్కడ మా కళ్ళూ చెవులూ అన్నీ యూరోపియన్ అటార్నీ లే .’’అని ప్రసంగించి గాంధీ మనసు మార్చుకోనేట్లు , పర్యటన వాయిదా వేసుకోనేట్లు చేశాడు .
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-19-ఉయ్యూరు