గాంధీజీ మహాత్ముడైన విధం
’’ప్రజలతో నా ప్రత్యక్ష సంబంధం 1893లో దక్షిణాఫ్రికాలో కల్లోల పరిస్థితులలో ఏర్పడింది . .మానవుడిగా భారతీయునిగా నాకు హక్కులు లేవు అని మొదట గ్రహించాను .నేను భారతీయుడై న౦దు వలన నాకు కనీస మానవ హక్కులు కూడా లేవని బాగా అర్ధమైంది ‘’అన్నాడు గాంధీజీ .
మహాత్ముడికి పబ్లిక్ తో సంబంధం రెండు దశలలో జరిగినట్లు మనం గ్రహించాలి .దక్షిణాఫ్రికా లో 1893మే నెలనుంచి మొదటి దశ 21ఏళ్ళు .రెండవ దశ1915జనవరిలో భారతదేశం వచ్చినప్పటినుంచి 33ఏళ్ళు 1948జనవరి వరకు .అంటే ప్రజాజీవితం లో 54ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం మహాత్మునిది .సౌత్ ఆఫ్రికాకు మొదట వెళ్ళినప్పుడు ,,ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ,బ్రిటన్ లో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం లో చెప్పుకోదగిన విశేషాలేమీ లేవు .20ఏళ్ళ అప్పటి పిరికి ,సాదు వినయ విధేయతల కుర్రాడు ఇరవైల మధ్యకాలం లో ఎలా తిరుగు బాటు దారుడు అయ్యాడు ?స్వంత దేశం ఇండియాలో లో న్యాయవాద వృత్తిలో అసలు విజయాలే లేని అనామక బారిస్టర్ ,దక్షిణాఫ్రికాలో లాయర్ గా అద్భుత విజయాలు ఎలా సాధించాడు ?105 పౌండ్ల వార్షిక వేతనం తో సౌతాఫ్రికా వెళ్ళిన లాయర్ ,కొన్నేళ్లలోనే ఏడాదికి 5,000 పౌడ్ల లాయర్ ఫీజు ఎలా సంపాదించాడు ?భారత తీరాలను తమాషా ఇంగ్లీస్ దొరలాగా వదిలి పెట్టి వెళ్ళినవాడు ,మళ్ళీ మాతృదేశం చేరగానే ‘’స్వదేశీ దుస్తులు ఎలా ధరించాడు ? ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా, సృజన శీలిగా గుర్తింపు పొందేది ఏదీ చేయనివాడు ఏదేదో చేస్తానని , వాగ్దానం కూడా చేయని వాడు అకస్మాత్తుగా దక్షిణాఫ్రికాలో గొప్ప జర్నలిస్ట్ అవతారం ఎలా ఎత్తగలిగాడు ? ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు నోరు మెదపని వాడు, ఇరవైల మధ్యలో ఎలా మహా వక్తగా మారాడు ?జీవిత ప్రారంభ దశలో ఏమాత్రమూ ప్రత్యేక ప్రతిభ చూపనివాడు గణనీయ అపూర్వ వ్యక్తిగా ,ప్రజల భవితవ్యం తీర్చిదిద్దగలిగే అవతార పురుషుడుగా ఎలా రూపొందాడు ?ఇలా ప్రశ్నించుకొని సమాధానాలు తెలుసుకొంటేనే క గాంధీజీ వ్యక్తిత్వ వికాసం , మహాత్ముడుగా గాంధీజీ రూపొందిన తీరు మనకు అర్ధమౌతుంది.
‘’సత్యాహింస’’ అనే గాంధీ సిద్ధాంతం అందులోని విలువలు దక్షిణాఫ్రికా లో గడిపిన కాలం లో రూపుదిద్దుకొన్నాయి .బ్రహ్మ చర్యం ,సత్యాగ్రహం ,అహింస ,ఆశ్రమ జీవితం అన్నీ అక్కడ చేసిన ప్రయోగ విధానాలే .అక్కడే ప్రజలతో మాట్లాడటం ,జర్నలిజం నేర్చాడు .మొత్తం మీద ఒక సాధారణ బారిస్టర్ ను ఈ లక్షణాలన్నీ మహాత్మునిగా మార్చాయి అని తెలుసుకోవాలి .మానసిక పరిపక్వత కూడా దక్షిణాఫ్రికాలోనే సాధించాడు .
ఈ క్రమ వికసనం తెలియాలంటే దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలను మనం తెలుసుకోవాలి .వీటిలో కొత్త విషయాలేవీ ఉండకపోయినా ఆ సంఘటనలను మనం హైలైట్ చేసి చూస్తె ఆయనలోని లోని గుణ మాణిక్య దీధితులు ప్రకాశమానమై గాంధీజీ ‘’దేశభక్త మహాత్మ’’గా ఎదిగిన తీరు అర్ధమై ,ఇండియాలో ఆయన జీవన విధానం యెంత ఉన్నతంగా ఆదర్శవంతంగా ,మార్గ దర్శకంగా అభివృద్ధి సాధించిందో అవగతమౌతుంది .మరపురాని ఆ మధుర ఘట్టాలు, జీవిక ఇంత ఉన్నతంగా ఎదగటానికి దక్షిణాఫ్రికా నేపధ్యమే అయింది .
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-19