ఈ పోరాటాలలో గాంధి తన నిజాయితీని,వ్యక్తిత్వాన్ని ,సూటి మార్గాన్ని పారదర్శకంగా ప్రదర్శించి మెప్పు పొందాడు .ఆయన పోరాటం బాధితుల, అణగద్రొక్క బడిన వారి కన్నీరు, బాధలు దూరం చేయటానికే .ఇదే ఆయన ముఖ్య సూత్రం గా మారింది .అణగ ద్రొక్కేవారు అణగ ద్రొక్క బడే వారు సహకరించుకోకపోతే అణగద్రొక్కబడంటం అంత౦ కాదు అని విశ్వసి౦చాడు .ఇందులో అందరూ విజేతలే .ఆయన సిద్ధాంతం ‘’విన్ –విన్ ‘’సిద్ధాంతం .అంటే ఇరువైపులా విజయం ఉండాలి .అణచ బడే వారికి అణచేవారు శత్రువులుగా కనిపించకూడదు .వాళ్ళ దుర్దశ కష్టాలను ఆయన అడ్వా౦టేజిగా అంటే అనుకూలంగా ఎన్నడూ తీసుకోలేదు .వాళ్ళ దయనీయ స్థితి చూసి,వారికి సాయం కోసం పోరాటం ఆపేసేవాడు .ఆంగ్లో –బోయర్ యుద్ధం ,,రైల్వే సమ్మెలలో పోరాట౦ నిలిపేశాడు .ఆయన వ్యూహం సాంకేతికంగా ‘’జీరో మొత్తాన్ని ,నాన్ జీరో మొత్తం ‘’గా మార్చే ఆట .గెలుపుకంటే ఇరువైపులా సామరస్య పరిష్కారానికే మొగ్గు చూపేవాడు .దీనికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గాంధీ –జనరల్ స్మట్స్ మధ్య జరిగిన విలువైన ఒప్పందమే గొప్ప ఉదాహరణ .
ఇండియాకు తిరిగి వెళ్ళే సమయం వచ్చిందని గాంధి భావించాడు .ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే కూడా త్వరగా రమ్మని కబురు చేశాడు .దీనితో గాంధీ సౌతాఫ్రికాను 1914జులై లో చివరి సారిగా వదిలేసి ఇండియా బయల్దేరాడు .ఆయన అభిమానులు అనుచరులు తండోపతండాలు గా వచ్చి దర్శనం చేసుకొని విలువైన కానుకలు బహుమతులు జ్ఞాపికలు అందించి ‘’దేశభక్త మహాత్మా గాంధీ ‘’నినాదాలతో వీడ్కోలు పలికారు .నిరంకుశ జనరల్ స్మట్స్ కూడా చలించిపోయి ‘’మహర్షి మన తీరాలను దాటి వెడుతున్నాడు .బహుశా ఇక తిరిగిరారు ‘’అని శ్లాఘించి స్పందించటం విలువైన మాటగా చరిత్ర పేర్కొన్నది .
దక్షిణాఫ్రికాలో గాంధీ పోరాట౦ సంక్షిప్తం గా చెప్పుకొంటే ,మొదట్లో మనం వేసుకొన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లభిస్తాయి .గాంధి దక్షిణాఫ్రికా అనుభవం’’ అభద్రతాభావం తో పిరికిగా ,విజయాలే లేని లాయర్ గా ఉన్న గాంధీని యదార్ధమైన ,సృష్టిలో అద్భుతమైన వింత వ్యక్తిగా పరివర్తన చెందించింది .ఒక వేళ గాంధీ దక్షిణాఫ్రికాకు రాకుండా ఉండి ఉంటే? సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది .
దక్షిణాఫ్రికాకు గాంధి ఏం రుణ పడి ఉన్నాడు ?ఇది వింత ప్రశ్న .దీనికి సమాధానం చెప్పటానికి ముందు ఇండియాలో ఆయన బాల్యం ,యవ్వనం ,తలిదండ్రులనుంచి సంక్రమించిన నైతిక విలువలు ,సాంప్రదాయం ఆయనలో గుప్తంగా ఉన్నాయి .ఇవన్నీ సౌతాఫ్రికా చేరగానే తగిన అవకాశాలు రాగానే బయటకు వ్యక్తమయ్యాయి .ఇండియాలోకాని ఇంగ్లాండ్ లోకాని జాతి వివక్ష ,పక్షపాతం ఆయన ఎదుర్కోలేదు .దక్షిణాఫ్రికా అనుభవం ఆయనను దిగ్భ్రాంతి కి గురి చేసి,ఆయనను తట్టుకోనేట్లు గా ,తన గౌరవం ,వ్యక్తిత్వం కాపాడుకోనేట్లుగా చేసింది .నటాల్ లోని మిట్జ్ బర్గ్ స్టేషన్ లో రాత్రి ఉదంతం ఆయన జీవితంలో సృజనాత్మక మైన మార్పు తెచ్చింది .ఇక్కడే మొదటిసారి ‘’రంగు పక్షపాతం’’అంటే వర్ణ వివక్షత జబ్బును అన్ని కోణాలనుంచి ఎదుర్కొన్నాడు .అది లజ్జాకరమైన హేయ సంఘటన .అది ఒక పాఠం గా నేర్చుకొని ఆయన మనసులో నిరసన బీజాలు మొలకెత్తి ,కనిపించిన ప్రతి పక్షపాతాన్నిఎదుర్కొనే స్థితికి వచ్చాడు .ఇలాంటిపక్షపాతం ప్రిజుడిస్ మానవ గౌరవానికే భంగకరమని భావించి దాన్ని అంతమోది౦చటమే ధ్యేయంగా ఎంచుకొన్నాడు .
దక్షిణాఫ్రికాలో భారతీయులు అప్పటికి నాయకత్వ శూన్యం లో ఉన్నారు.ఇండియా వలసవాదులు ‘’కుంటి ,నిరక్షరాశ్యులు ‘’.వారంతా ఎవరో వచ్చి తమను సమీకరించి నాయకత్వం వహించి మార్గదర్శకత్వం చేసి నడిపించాలని ఎదురు చూస్తున్నారు .ఆ సమయంలో యువ సున్నితమైన బారిస్టర్ రంగ ప్రవేశం చేశాడు .అక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకొని ,వర్ణ పక్షపాతం వంటి సాంఘిక అసమానత లవంటి సమస్యలపై పోరాటానికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాలని భావించాడు .అదే సత్యగ్రహ దివ్యాయుధం .అది విశ్వవ్యాప్త తారకమంత్రమై ,అన్ని వ్యాధుల నివారణ ఔషధమై పని చేసింది .తన మాతృ భూమి ప్రవచించిన ఉపనిషత్సారం ‘’సత్యమేవ జయతే ‘’ను సత్యాగ్రహం అనే మహా గొప్ప ఆయుధంగా మార్చి ప్రయోగించాడు .ఇదే టెక్నిక్ ను ఇండియాలో 1913దండి ఉప్పు సత్యాగ్రహ యాత్రలోనూ ప్రయోగించాడు .దక్షిణాఫ్రికా లో 2037మంది పురుషులు ,127మంది స్త్రీలు ,57మంది పిల్లల ఒక దళంతో నటాల్ నుంచి ట్రాన్స్ వాల్ లో ప్రవేశించాడు .ఈ నడక ఇండియన్ లేబర్ ల సమ్మెలో ఒకభాగమై అయిదు రోజులు నవంబర్ 6నుంచి 10 వరకు జరిగింది .
దక్షిణాఫ్రికాలోనే గాంధీ మొదటి సారిగా ‘’స్వయం సేవ (సెల్ఫ్ హెల్ప్ )లోని సౌందర్యాన్ని ఆస్వాది౦చాడు .భగవద్గీతలో చెప్పబడిన ‘’ వస్తువుపై వ్యామోహం లేకపోవటం ‘’(నాన్ పోసేషన్) ను ప్రచారం చేసి ,అనుసరించాడు .ఇక్కడే స్నేహితుడు పొలాక్ ఆయనకు రస్కిన్ పుస్తకం ‘’అన్ టు ది లాస్ట్ ‘’1903లో అందజేశాడు .దీన్ని చదివి అర్ధం చేసుకొని మనసుకు పట్టించుకోని అది భగవద్గీత ను ప్రతిధ్వనిస్తోందని గ్రహించి దాన్ని ఆధారంగా భవిషత్ ప్రణాళిక రచించుకొన్నాడు .అమెరికా తత్వవేత్త, వేదాంతి, రుషి తుల్యుడు’’ హెన్రి డేవిడ్ థోరో’’రాసిన ‘’సివిల్ డిస్ ఒబీడిఎన్స్’’వ్యాసం చదివి ‘’పాండిత్య నైపుణ్యంతో రాసిన అద్భుత గ్రంథం’’.నా జీవితం పై గొప్ప ప్రభావం చూపింది ‘’అని గాంధీ మెచ్చుకొన్నాడు .దీన్ని ఆయనను దక్షిణాఫ్రికాలో వోక్ ట్రస్ట్ జైలు లో అరెస్ట్ చేసి ఉంచినపుడు చదివాడు .అందులోని ‘’చర్యరాహిత్యాన్ని’’ మెచ్చుకొన్నాడు .రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ పుస్తకం ‘’దికింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు ‘’చదివి అభిమానిగా మారి ఆయనతో స్నేహాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను జీవితాంతం కొనసాగించాడు .ఈ సంఘటనలన్నీ దక్షినణాఫ్రికాలోనే జరిగాయి .వాటిలోని విలువైన విషయాలను ,విలువలను స్పూర్తిగా తీసుకొని తనలో నిక్షిప్తమై గుప్తంగా ఉన్న భావాలను జోడించి ప్రయోగాలు చేశాడు .దీనినుంచే గాంధీ మహా నాయకుడుగా ,మహా తత్వ వేత్తగా పరిణామం చెందాడు .
ముఖ్యంగా దక్షిణాఫ్రికా అనుభవాలు భారత్ లో హింద్ స్వరాజ్ లేక హోమ్ రూల్ లు నేపధ్యమైనాయి .పాశ్చాత్య యాంత్రిక నాగరకత తెచ్చిన అనర్ధాలను గాంధి 76పేజీల కరపత్రం గా ఇంగ్లాండ్ నుంచి సౌతాఫ్రికాకు 1909లో తిరుగు ప్రయాణం లో రాశాడు .గాంధిజీవిత చరిత్ర రాసిన పాశ్చాత్య చరిత్రకారులలో ప్రసిద్ధుడైన లూయీ ఫిషర్ ‘’దక్షిణాఫ్రికాలోనే గాంధీ కర్మ యోగి గా మారే ప్రయత్నం చేశాడు .గీతలో చెప్పినట్లు అనాసక్తత ను జీవితాంతం పాటించాడు ‘’అన్నాడు. బికు ఫరేఖ్ గాంధీని క్షుణ్ణంగా పరిశీలించి రాసిన దానిలో ‘’గాంధీ లోని తాత్విక భావనలలో ఎక్కువభాగం , అంతర్ దృష్టి ఏర్పడటానికి దాక్షిణాఫ్రికా గొప్ప భూమిక అయింది .గాంధీ మహాత్ముడుగా పరిణామం చెందటానికి ,ఆ దేశం దోహదపడి గర్వకారణంగా మారింది ‘’అంటాడు .
ఈ విధంగా గాంధీలో దేనికీ లొంగని మొండిపట్టుదల ,నాశనం చేయటానికి వీలులేని మనస్తత్వం మొట్టమొదటగా దక్షిణాఫ్రికాలోనే ఏర్పడ్డాయి .గాంధీని మహాత్ముని చేయటానికి కావలసిన ఆయన భావనలు ,చర్యలలో చాలాభాగం ఏర్పడటానికి ఆదేశమే ముఖ్యకారణం అనటానికి ఎలాంటి సందేహం లేదు .దక్షిణాఫ్రికాలో జరిగింది అంతా గాంధీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పి,ఆయన మహాత్ముడుగా పరిణామం చెందటానికి కీలక పాత్ర పోషించింది .
ఆధారం – అంకుష్ బి.సామంత్ వ్యాసం –‘’మేకింగ్ ఆఫ్ మహాత్మా గాంధి ఇన్ సౌత్ ఆఫ్రికా
ఫ్రికా’’
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –
గాంధీ150 వ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-19-ఉయ్యూరు