అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10
10-నండూరు కొమ్మనమంత్రి
తూర్పు చాళుక్యులతర్వాట వేంగి దేశాన్ని వెలనాటి చోడులు 1016నుంచి 1161వరకుపాలించారు .వీరిశాసనాలలో పిఠాపుర శాసనం ముఖ్యమైనది .వీళ్ళను ధర్మరాజు సేవకుడైన ఇంద్ర సేనుడు దగ్గరనుంచి అందర్నీ శూద్రరాజులుగా భావించారు .వీరిది మధ్య ప్రదేశ్ లోని కీర్తిపురం .మల్లవర్మ తెగలో 5వ వాడు మొదటిమల్లవర్మ ‘’షట్సహస్ర దేశాన్ని జయింఛి ధనదపురం రాజధానిగా పాలించాడు .ఇతడు త్రిలోచనపల్లవుని సాయంతో దేశం పై హక్కు పొందాడు .తూర్పు చాళుక్యులను అనుసరించే వీరిలోఇతడే చివరివాడు అని డా.హల్ష్ చెప్పాడు .యితడు త్రినేత్ర పల్లవుడితో యుద్ధం చేస్సినట్లు శాసనాలున్నాయి .ఇతనిపూర్వులు 9వ శతాబ్దిలో వెలనాడును స్వతంత్రంగా పాలించారు .ఈ రెండుతెగలవారు వెలనాటిపల్లవుల అభిమానం పొందారు .కేయూరబాహు చరిత్రలో ఈ విషయముంది .
వెలనాటి మహా మండలేశ్వరుడు కొంక భూపతి 1139నుంచి 1191వరకు సనదుప్రోలు రాజధానిగా రాజ్యమేలాడు .సుమారు 195ఏళ్ళు ఈ వంశజులు పాలించారు .గుంటూరుజిల్లా చందవోలు లేక చందోలు కే ధనదపురం అని పేరు .’’నిఖిల విభ వనములకు నెలవగుచు వెలయు –ధనదుపురము న కెనయు ధనదుపురం ‘’అని కీర్తి పొందింది .వెలనాటి దుర్జయ ఆస్థానం లో ‘’కార్యఖడ్గప్రవీణుడు ,అసమాన తేజస్సంపన్నుడు కొమ్మన మంత్రిగా ఉన్నాడు .కొంకరాజు పాలనలో చివర రోజులలో పాకనాడు జయించి స్వాధీనం చేసుకొన్నాడని బాపట్ల భావనారాయ స్వామి దేవాలయం లో 1190-91శాసనం లో ఉన్నది –‘’రమణీయ ధనదుపుర వర –మమరనిజరాజదానియై యుండ ,గనక –రము నెల్లూరు లోపుగ-గ్రమమొనరగ నేలె బాహుగర్వమువెలయన్ ‘’.కొ౦కభూపతి ఈ చందోలు రాజధానిగా ముఖలింగం నుంచి సింహపురి అంటే నెల్లూరు వరకు ఏలుబడి చేశాడు .’’ఏక వింశతి సహస్ర గ్రామ సంఖ్యాకమై –ధరనణి న్బేర్చిన ‘’పాకనాడు ‘’నిజ దోర్దండైకలగ్నంబుగా –ధర బాలించె ‘’నమాత్యకొమ్మన ‘’జగ –త్ప్రఖ్యాత చారిత్రుడై ‘’.ఇతడి కొడుకు రాజేంద్ర చోడుడి ఆజ్ఞతో కొమ్మనమంత్రి పాకనాడు ఏక వింశతి సహస్ర గ్రామాలు జయించాడు .కులోత్తుంగ చోళుని పాలనలోకూడా వేంగి పై కల్యాణి ,కటకం సామంతరాజులు దండెత్తారుకాని సనదుప్రోలు కటక దండ నాధుల సహాయంతో పెద్ద సైన్యంతో కొమ్మన మంత్రి మన్నేరు ,కొత్త చెరల ప్రాంతాలలో పోరాడి రాజుకు జయం చేకూర్చినట్లు మంచన రాసిన ‘’కేయూరబాహు చరిత్ర ‘’లో కనిపిస్తుంది –‘’మావతుల తలలు తలపుడికి వేసి మావంతు తలలు ,శత్రురాజశిరములు ద్రోక్కించు రాగే దిరుగవాగే నుబ్బేడు తన వారువంబు చేత -మహిత శౌర్యుండుకొమ్మనా మాత్య వరుడు ‘’అని అతని గుర్రం ,ఆయన చేసిన సాహసం వర్ణించాడు .కొత్త చర్లయుద్ధం లో కొమ్మనమంత్రి వీర విక్రమ పరాక్రమ దీశక్తులు అనుపమానం అని అర్ధం .,యుద్ధమే వృత్తిగా,శస్త్ర విద్యా గర్వితులైనవారు చేసే యుద్ధాన్ని ‘’విద్యా౦క౦ ‘’అంటారని’’అభిలషి తార్ద చింతామణి ‘’లో సర్వజ్ఞ సోమేశ్వరుడు చెప్పాడు.కనుక కొమ్మన మంత్రి ‘’విద్యాంక బిరుదుకు సర్వవిధాలా అర్హుడే .పాకనాటికి వాయవ్యంలో ఉన్నడుర్గమే కొత్త చర్ల .
11వ శతాబ్దం నాటికి తెలుగు దేశంలో దేశ భాగాలకు ‘’విషయం’’ అనీ’’ నాడు’’ అనీ ‘’రాష్ట్రం’’ అనీ సమానార్ధాలుగా వాడేవారు .14,15శతాబ్దాలకు రాష్ట్రం అంటే నాడు ,విషయం లకంటే పెద్ద భూభాగం అనే అర్ధం ఏర్పడింది ..’’తుంగభద్రా తరంగిణ్యాః ప్రాగ్దేశం వెలనాడితి’’అంటే తుంగభద్రానదికి తూర్పున ఉన్నది వెలనాడు అని అర్ధం .దీనికే ‘’ఆరువేల దేశం ‘’ అనే పేరు .నాల్గవ విష్ణువర్ధన మహారాజుకాలంలో 12వేలగ్రామాలుగా వేగినాడు ఉన్నది .తర్వాత ఆరువేల మూడువందల దేశంగా ఉండేది .మొదటి కులోత్తు౦గుని కాలం లో 16వేలగ్రామాల దేశంగా ఉండేదని పిఠాపురం శాసనం ఉవాచ .కొండపడమటి దేశం లో 13గ్రామాలున్నాయని –‘’ఆంధ్రా త్పతః పశ్చిమతో క్షితిః’’అన్నారు.దీనినే ‘’ఆంద్ర పథం’’ అన్నారు .గుండ్లకమ్మకు దక్షిణాన వెలికొండలు నుంచి సముద్రం వరకు ఉన్నది ‘’పాకనాడు ‘’.అంటే ఇప్పటి నెల్లూరు మండలం ఒంగోలుతాలూకా, కడప మండలం తూర్పుభాగం కలిస్తే పాకనాడు .
వెలనాటి దుర్జయులలో చివరిరాజు పృద్వీశ్వరుడి రాజ్యం శ్రీకూర్మందాకా ఉండేది .కళింగరాజులు ఇతనికి కప్పం చెల్లించేవారు .ఇతన్ని చంపినవాడు తిక్కరాజు రాజేంద్ర చోడుడి కొడుకు .ఇతనిమంత్రి కేతన .తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం లో దీన్ని చెప్పాడు –‘’ఆకాశ మరుచ్చ శివకాశ సురాశన ,తార కేశ,నీకాశత రాభి రోచి రవకాశ వికాస యశో విలాసుడై ‘’ .ఇతడితండ్రి కొమ్మన –‘’ఆ కొమ్మనప్రగడ సుతు –డై కేతన చోడ భూవరాత్మజుడై –ధైర్యాకరుడగు ప్రుద్వీశ –మహాకాన్తుని మంత్రియయ్యే నెంతయు బెర్మిన్ ‘’
పృధ్వీశుని ఆప్తమిత్రుడు కేతన .కొమ్మన ప్రగడ –‘’వాగ్దేవీ స్తన హార నిర్మల యశో వాల్లభ్యం ఉన్నవాడు .యశో భూషితుడు ,కౌశిక గోత్రీకుడు .’’కొంక విభు రాజ్యాధిస్టుది ఉండగా ,సంధి విగ్రహ ముఖ్య ‘’కార్యాలు నిర్వర్తించాడు .రిపు క్షితీశ బహు సైన్య ధ్వంస నా టోపం ఉన్నవాడు .తండ్రి గోవిందుడు .ప్రతిఏడాది 75పుట్లధాన్యం పండే భూములు ,తోమ్మిదికోట్ల రొఖం వందలాది ఏనుగులు,40వేల గుర్రాలు ఉన్న మహా విభవ సంపన్నుడైన కులోత్తుంగ రాజేంద్ర చోళునికి ఇష్టసచివుడు ,తంత్ర ముఖ్యుడు కొమ్మన ప్రధాని .కొమ్మన నిర్మించిన తటాకాలు దేవతా విగ్రహాలు గుడులు గోపురాలు లెక్కకు అందవు .దండనాదాగ్రణి గోవింద ప్రగ్గడ వెలనాటి కొమ్కరాజు వద్దమంత్రి .కొడుకు కొమ్మన దండనాధుని కొడుకు కేతన తిక్కమహీపాలుడిఆత్మ సచివుడు .కేతనకొడుకు భీమన రణవీర రణరంగడు .మునిమనవడు గుండన మనుమసిద్దిరాజు కార్యా చారుడు .ఏటా జరిగే కాకుళేశ్వరుని తిరునాళ్ళకు వచ్చే తీర్ధ ప్రజలకు గుండనమంత్రి రత్నాలు ,మాడలు విరివిగా ఇచ్చేవాడు .అంటే కొమ్మన మంత్రి తండ్రి గోవిందా మాత్యుడు, గుండనమంత్రివరకు అందరూ రాచకార్యాలలో ఖడ్గ పరాక్రమం లో సాటిలేనివారే .ఆపస్తంభ సూత్రుడు ,కౌశిక గోత్రుడు ,ఆర్వేల నియోగిబ్రాహ్మణుడు కొమ్మనమంత్రి కృష్ణా గోదావరి మండలంలోని నండూరు గ్రామస్తుడు .
సరస్వతీపూజ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-19-ఉయ్యూరు