అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11
11-రాయూరు యల్లన మంత్రి
12వ శతాబ్ది రాయూరి యల్లన మంత్రి కమ్మనాడు రాయూరు వాస్తవ్యుడు .ఆ పురం అపర అమరావతిగా వైభాగంలో ఉండేదని 1158అమరావతి శాసనం లో ఉన్నది –‘’శ్రీకాంతా నిలయంబు శిష్టజనతాసేవ్యంబు ,శాలీవనానీక ప్రాంత జలాశాయోద్గత లసన్నీరేజ శోభాన్వితం ‘’యల్లన మంత్రి ధిషణ బహుదొడ్డది అవటం వలన 13వ ఏటనే మంత్రిపదవి పొంది ,సత్కవి బంధుమిత్ర జన సంపత్కారి అయ్యాడు .శుద్ధ ప్రతిభా ప్రపంచిత లసన్మార్గ స్థితి తో అభ్యుదయ పరంపరగా ఎదిగాడు –‘’పదమూదేడులనాడు అమాత్యపదవి౦ బ్రాపించి తత్సంపదాస్పడుడై –సత్కవిబందుమిత్ర జనసంపత్కారి అనిపించాడు .ఈమంత్రి పాలిత ధర్మ మార్గుడు ,అనుపాలిత సత్య విలాసుడు ,ఉమ్లేలిత సర్వ శాస్త్రమతి ,మిత్రజనా౦బుజమిత్రమూర్తి అంటే స్నేహితులనే పద్మాలకు సూర్యుడు ,అగ్లాలిత కీర్తి ,నిశ్చలితలక్ష్మీ సమన్వితుడు .
తెలుగు చోడుడులకు ‘’కొణిదెన ‘’రాజధాని .వీళ్ళు అనేకదేవాలయాలు కట్టించారు కవులను ఆదరింఛి భాషాభిమానం పెంచారు .యెల్లన మంత్రి తండ్రికూడా చోడులమంత్రిగా ఉండేవాడు –‘’త్రిభువన గీతకీర్తి ,నరదేవ శిఖామణి ,కామధారుణీ ప్రభు తనయుండు ,మా౦డలికభర్గుడు ,భర్గ పదాబ్జ షట్పదుడు అంటే మహా శివభక్తుడు ,అభి నవరాముడు,అర్యమకులాగ్రణి’’గుండియ పూండి ‘’భక్తితో త్రిభువన మల్ల దేవుడుప్రతీతిగా శంభునకిచ్చె బ్రీతితోన్ ‘’ .నన్ని చోడమహారాజు మంత్రి శంభుడు .ఈ శంభుమంత్రికి త్రిభువనమల్లుడు ‘’గుండియ పూండి ‘’అగ్రహారం ఇచ్చాడు .శంభునికొడుకు అన్నమంత్రి తాను సంపాదించింది దీనులకు బంధువులకు ,దేవాలయ నిర్మాణాలకు ఖర్చు చేశాడు .ఇలాంటి శుద్ధమనస్కుని కొడుకే మన యల్లనమంత్రి .భారద్వాజ గోత్రీకుడు ఆపస్తంభ సూత్రుడు .13ఏళ్ళకు మంత్రిపదవి పొంది ,వాజ్మయ సారస్వత ,మతవిషయాలను చక్కగా అభివృద్ధి చేశాడు .
క్రీశ.6వ శాతాబ్దినుంచే శాసనాలలో గద్య పద్యాలు వచ్చాయి .1145కు పూర్వం ఉన్న పద్యకవితలో అద్భుత ధారాశుద్ధి కనిపించి పక్వ దశకు వచ్చిందని పిస్తుంది .యల్లనమంత్రి వైదుష్యాన్ని ,అతనిరాజు రాజు వైభోగాన్ని తెలిపే శాసన పద్యాలన్నీ అందుకే రసగుళికలుగా మనకు ఇందులో కనిపిస్తాయి .
ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
దుర్గాష్టమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-19-ఉయ్యూరు