అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12
12-పింగళి మాదన్న మంత్రి
నియోగిబ్రాహ్మణుడు భారద్వాజ గోత్రీకుడు పింగళి మాదన్న మంత్రి 17వ శతాబ్ది వాడు .తండ్రి భానోజి ,తల్లి భాగ్యమ్మ .చిన్నప్పుడే చదువు బాగా నేర్చి గోల్కొండకు వెళ్లి మీర్ జుమ్లా అనే ఉద్యోగి వద్ద నెలకు 10’’గిల్డరు’’ల జీతం తో గుమాస్తాగా చేరాడు.అన్న అక్కన్న కొంచెం తొందరపాటువాడు,కాని పండితుడు .మాదన్న ఉపాయా శాలి .వీరిద్దరి తెలివి తేటలు తానీషాకు తెలిసి ,ఇద్దర్నీ ఆహ్వానించి ‘’వసాఉత్’’ఉద్యోగులుగా చేర్చుకొని ఆ౦తరంగికులుగా చేసుకొన్నాడు .తానీషా అసలు పేరు అబుల్ హసన్ .ఉన్నతకులం లో పుట్టినా బాల్యం లోనే ఆస్తిపాస్తులు హరించుకుపోయి దరిద్రం అనుభవించి ఐహిక సుఖాపేక్షతోపాటు మోక్షాపేక్షకూడా పెంచుకొన్నాడు .అప్పుడు గోల్కొండలో సయ్యద్ రాజ్ కొత్తాల్అనే పైగంబర్ మహాతపస్వి ఉండేవాడు .ఈయనను గురువుగాభావించి 14ఏళ్ళు యోగాభ్యాసం ,భక్తీ నేర్చాడు .
అప్పటి రాజకీయ పరిస్టితులుఅస్తవ్యస్తంగా ఉన్నాయి .సుల్తాన్ అబ్దుల్లాకు మగసంతానం లేదు .ముగ్గురుకూతుళ్ళు.పెద్దకూతురు ను సయ్యద్ అహమ్మద్ కు ఇచ్చి పెళ్లి చేయగా ,మామగార్ని కీలుబొమ్మ ను చేసి తానే అధికారం చెలాయించాడు .రెండవ కూతుర్ని ఔరంగజేబు కొడుకు మహమ్మద్ సుల్తాన్ కిచ్చి పెళ్లి చేశాడు .మూడవ కూతుర్ని పెద్దల్లుడి ఆశ్రితుడైన సయ్యద్ సుల్తాన్ కిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి రేపు పెళ్లి అనగా వాడు తనను వెక్కి రించాడని ఈర్షాసూయలతో మాట నిలబెట్టుకోకుండా ,తనకు అణగిమణగి ఉంటాడని తానీషాకిచ్చి పెళ్లి చేశాడు .మామగారు మరణించగానే పెద్దల్లుడు సయ్యద్ అహమ్మద్ సుల్తాన్ అవటానికి ఉబలాట పడ్డాడు .ఐతే వీడి అహంకారం వెకిలితనం వలన అనేకులు శత్రువులై సేనాని సయ్యద్ ముజఫర్ ,మహాల్దారు మూసాఖాన్ లు పెద్దల్లుడిని జైలు లోపెట్టి మూడవ అల్లుడు అబుల్ హసన్ ను ‘’తానీషా’’ అనే పేరుతొ సుల్తాన్ చేసి తాము మంత్రులయ్యారు వీరిద్దరి కపటనాటకాలు గమనిస్తున్న తానీషా వీళ్ళని తప్పించే ఉపాయమాలోచిస్తూ అమాయకుడిగా నటించాడు .,
అక్కన్నమాదన్నల ప్రభుభక్తి తెలివి తేటలు బుద్ధి సూక్ష్మత ,సామ్రాజ్య రక్షాబాధ్యతలు గుర్తించి ముజఫర్ ,మూసాలను ఖైదు చేసి మాదన్న కు ‘’సూర్యప్రకాశరావు ‘’అనే బిరుదు ఇచ్చి మహామాత్యుని చేసి రాజ్యభారం అప్పగింఛి వేదాంత గోష్టిలో కాలంగడిపాడు తానీషా.అక్కన్న మహా సేనాని గా ,మాదన్న మహామంత్రిగా ,మరోతమ్ముడు వెంకన్న ‘’రుస్తుం రావు ‘’అనే బిరుదుతో ఫౌజు దారు అయ్యారు .మాదన్నమంత్రి మః నేర్పుతో సామ్రాజ్య రక్షణభారం అంతా నిర్వహించి జనరంజకపాలన చేశాడు .ఉత్తరాన కళింగ, దక్షిణాన పుదుచ్చేరి వరకు గోల్కొండ సామ్రాజ్యాన్ని అభి వృద్ధి చేశాడు .విదేశా౦గనీతిలో దిట్ట మాదన్న.ధిల్లీ సుల్తాన్ ఔరంగజేబు కు కప్పం కడుతూ విధేయంగా మెలిగారు గోల్కొండ నవాబులు .
మహారాష్ట్ర లో శివాజీ ఉద్ధృతంగా బల శౌర్యాలతో రాజ్యాలు జయిస్తూ సామ్రాజ్యం దక్షిణా పధం అంతావిస్తరిస్తున్నాడు .ఔరంగ జేబుతో స్నేహం పాముతో స్నేహం అని గ్రహించి ,దగ్గరశత్రువు శివాజీతో తానీషాకు స్నేహం చేకూర్చాడుమాదన్నమంత్రి .గోల్కొండకు శివాజీ అండగా ఉండి,తాను స్వాధీనం చేసుకొంటున్న దక్షిణాపధం లోని కొంతరాజ్యం ధనం గోల్కొండకు ఇచ్చేట్లు,దీనికి బదులుగా తానీషా శివాజీకి కొన్ని లక్షల వరుమానం ఇచ్చేట్లు మాదన్నమంత్రి ఒడంబడిక కుదిర్చాడు .ఇది ఔరంగ జేబు కు ఎక్కడోకాలి తానీషాను అదుపులోపెట్టటానికి ప్రత్యేకరాయబారిని నియమించాడు .బిజాపూర్ నవాబు ఎప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధమవుతూనే ఉన్నాడు .
రాజకీయ చతురత ,శక్తియుక్తులున్న మాదన్నమంత్రి ఇదంతా వెయ్యికళ్ళతో గమనిస్తూ ,విదేశీ వర్తకులకు సకల సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నాడు .కాని కొందరు దర్బారీయులకు అంతఃపుర స్త్రీలకూ మాదన్న పై అసూయ ఏర్పడి తానీషాకు ఆయనపై పితూరీలు చేస్తున్నారు .వీటిని పడచెవినిపెట్టాడు తానీషా.శివాజీపై మాదన్న పెట్టుకొన్న ఆశలు శివాజీ మరణంతో నిరాశలయ్యాయి .ఈలోగా బీజాపూర్ పై ఔరంగజేబు దాడి చేస్తూ ,వాళ్లకు సాయం చేస్తే తానీషాకు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించాడు .కాని రహస్యంగా బిజాపూర్ నవాబుకు సాయం అందించాడు .
ఎలాగైనా గోల్కొండను స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబు ఆత్రం .తానీషా’’ కాఫర్’’ అయిన అక్కన్నమంత్రి చెప్పుచేతల్లో ఉన్నాడని వ్యసనాలకు బానిసయ్యాడని ఆగ్రహంతో దుష్ప్రచారం చేయించాడు .తానీషాతో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉండమని రాయబారికి వర్తమానం పంపాడు .దర్బారీయుడైన ‘’అత్తేమత్తయ రాయని ‘’మహాసేనాని అగౌరవపరచాడని తెలుసుకొని ,అతడిని బుజ్జగించే ప్రయత్నం చేసినా అతడు అవమానం మర్చిపోలేకపోతున్నాడు .ధిల్లీ సుల్తానుకు గోల్కొండ నవాబుకు మధ్య పరస్పర కుట్రలు కుతంత్రాలు పెరిగి ,గోల్కొండపై మొగలాయి దండయాత్ర ప్రారంభంకాగా’అత్తేమత్తయ రాయడు మాదన్న ,తానీషా ,సేనానులపై ద్వేషం పెరిగేట్లు చేశాడు .
పాదుషాకొడుకు షా ఆలం గోల్కొండ పైకి దండెత్తివచ్చాడు.కప్పం చెల్లిస్తూనే తానీషా రాయబారం నడిపాడు .అక్కన్న మాదన్నలను పదవులనుంచి తొలగించమని సుల్తాన్ ఫర్మానా జారీచేశాడు .గ్రహించిన అక్కన్నమాదన్నలు తామే పదవికి వీడ్కోలు పలికారు .ఒకరోజు వీరిద్దరూ బంగారుపల్లకిలో వస్తుంటే అత్తెమత్తయ రాయడి సైనికులు అకస్మాత్తుగా వారిపై పడి తలలు నరికేసి ,శరీరాలను మట్టిలో ఈడుస్తూ ,వారి బంధువులను హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల భీభత్సం సృష్టించి వారినీ చంపేశారు .మాదన్నకు సంతానం లేదు .అక్కన్న కొడుకు మల్లన్నను ఒక తురక అతనుజాగ్రత్తగా కాపాడి పెంచాడు .అక్కన్నమాదన్న మరణ వార్త తానీషా విని చాలా దుఃఖించాడు .
తానీషా పాదుషాకు లొంగిపోయి ,ఒక లేఖ రాశాడు .గోల్కొ౦ డ మొగలాయీలు స్వాధీనం చేసుకొని తానీషాను దౌలతాబాద్ కోటలో బంధించారు.14ఏళ్ళు బందీగా మగ్గిపోయి క్రీశ 1602లో తానీషా చనిపోయాడు .
ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
విజయదశమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-19-ఉయ్యూరు