మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

‘’పంచనవతి వర్ష’’(95) యౌవనులు డా రాచకొండ నరసింహ శర్మగారు తమకున్న ఆంగ్లకవితాభిరుచికి దర్పణంగా తాను  చదువుతున్నకాలంలో తనకు అత్యంత ప్రీతికరమైనఅ ఆంగ్ల  కవితలను ఎంచుకొని , మరో ఆంగ్లకవితానువాద సంపుటిని సప్తతి(70) కవితల అనువాదంతో ఈ సెప్టెంబర్ లో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా వెలువరించారు  .ఆంగ్ల కవిత్వం చదివితే ‘’చిత్తము నిలవదు సుంత యైన ‘’అన్నట్లు ఆయన అనుభవించి ఆ ఆన౦దానుభూతిని మనకూ పంచిపెట్టే హృదయమున్న భిషగ్వరులాయన .ఇప్పటికే ‘’పడమటి సంధ్యారాగం ‘’లో 41,’’అయితే ‘’లో 46ఆంగ్లకవితల్ని అనువదించి ,స్మైల్స్ ,టియర్స్ అండ్ మోర్’’ ఆంగ్లకవితల ను ,’’సానెట్స్ ఫ్రం పోర్చుగీస్’’ అందించిన అనుభవం వారిది .తెలుగు కవితలను ఆంగ్లంలోకీ అనువాదం చేసిన నేర్పు వారిది .అంటే ద్విభాషా కవి .ఈ పుస్తకాన్ని తమప్రియతమ అర్ధాంగి డా .అన్నపూర్ణా దేవికి ,ఆమె మైదానం లోకి రాలేనందున ఆమెగదిలోకే ‘’మైదానం లో సూర్యోదయం ‘’తెచ్చి పరమానంద భరితురాలిని చేసి ,తమ సతీ ప్రేమను వర్షించారు .పుస్తక శీర్షికకు తగిన మైదానం ,సూర్యోదయం ,పశువులు, నీటి చెలమ ,పచ్చ గడ్డిలతో ముఖ చిత్రం ముద్దులొలికింది .ఆంగ్లకవితలు పేజీకి ఎడమవైపు ,తెలుగు సేత కుడివైపు ,అనుబంధంగా ఆకవుల చరిత్ర సంక్షిప్తంగా అందించారు .దాదాపు స్కాలిత్యం లేని పెద్ద  అక్షరాలతో.పుస్తకం చూడగానే మైదానం అంటే ‘’ఫ్లాటై ‘’పోతాం .శర్మగారు ఆత్మీయంగా పంపిన ఈపుస్తకం నిన్న మధ్యాహ్నం నాకు అందింది .రాత్రి 20,ఈ రోజు ఉదయం మిగిలిన 50 ఆబగా జుర్రేశాను .నిన్న పుస్తకం ఒక సారి తిరగేసి ‘’టైటిల్ ‘’విషయం లో ముందుమాటలు రాసినవారు ఎవరైనా మార్గ దర్శనం చేశారేమో అని వెతికితే దొరకలేదు .శార్మగారికే ఫోన్ చేసి పుస్తకం అందిన సంగతిచెప్పి  ,శీర్షిక ఔచిత్యాన్ని గురించి అడిగాను .వారు చెప్పిన సమాధానం సంతృప్తి కలిగించింది .ఈ కవుల జననకాలం 1554నుంచి 1896వరకు .అంటే దాదాపు 350సంవత్సరాల కాలవ్యవధిలోని  కవులు, వారికవిత్వ దర్శనం అన్నమాట .కనుక అద్భుతమైన వైవిధ్యం ,ఆలోచనలలో పరిపక్వత ,అనుభవసారం ఉన్నకవితలు .ఈ కవులు రాజకవులు ,కవిరాజులు ,రాజాస్థాననకవులు అనే పొయెట్ లారియట్స్ , జన హృదయసామ్రాజ్యాన్ని గెలిచినవారు.భగవదన్వేషకులు ,మాటలతోకాక చేతలతో మంచి చేయమని బోధించే తత్వ వేత్తలు ,జర్నలిస్ట్ లు ,సైంటిస్ట్ లు ,నవలా, కథా రచనలలోఅరితేరినవారు,వివిధ దేశాలకు చెందినవారు,’’ఆకాశంలో సగభాగమైన ‘’స్త్రీలు కూడా ఉన్నారు .ఒకరకంగా’’ డెబ్భై మనో ప్రపంచ దర్శనం ‘’చేయించారు శర్మగారు ఈపొత్తం లో .ఈ కవుల్లో కొందరు పులిట్జర్ ప్రైజ్ వంటి ప్రఖ్యాత బహుమతులు అందుకొన్నవారే . వివరాలు తెలీని ఒకకవి ,మరో అజ్ఞాతకవి ఇందులో చోటు చేసుకోన్నారుకూడా . ఇక కవితా మైదానంలో సూర్యోదయ దర్శనం చేసి పులకిద్దాం .

   విల్లా కేథర్’’అనే కవయిత్రి రాసిన ‘’ప్రయరీ డాన్’’కవిత శర్మగారి చేతిలో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా, ఈ పుస్తకం శీర్షికగా మారి దర్శన మిచ్చింది .ఈమెఅమెరికాలో చాలాకాలం కొండలు గుట్టలు ఉన్నప్రాంతం లో ఉండి,ఒక్కసారిగా మైదాన ప్రాంతాన్ని చూసి అక్కడి ప్రకృతి సోయగం , సూర్యోదయాలకు పులకించి రాసిన కవిత అది .పులిట్జర్ ప్రైజ్ పొందినకవి .ఈ మైదానం లో ఆమె ‘’తారలు తరలించిన రక్తారుణజ్వలనం ,ధూళి నిండిన ‘’సేజాకు’’ ఘాటుపరిమళం ఆలమందల హఠాత్ చలనం, దూర పీఠభూముల క్రమ దర్శనం వెలుగులో వెండి మడుగుల  భాసురం ,కాంతి శూలం ఒకటి అతివేగంగా వచ్చి అవనిని గుచ్చటం చూసి తనవూరి పర్వత శ్రేణి కై తృటిలోనే ,కన్నీరు చిమ్మింది .ఆమె మధురానుభూతి మనమనసులను సేద తేరుస్తుంది .’’వాటర్ డిచేస్ సిల్వర్ ఇన్ దిలైట్ ‘’అన్న ఆమె మాటలను శర్మగారు ‘’వెలుగులో వెండి మాడుగుల భాసురం ‘’అని చక్కగా అనువదించారు .’’ఎ సడన్ సిక్ నెస్ ఫర్ ది హిల్స్ ఆఫ్ హోమ్’’ను ‘’తనూరి పర్వత శ్రేణికై తృటిలోనే కన్నీరు చిమ్ము ‘’అన్న అనువాదం  భేషు గ్గా ఉండి,పుస్తక శీర్షికకు గొప్ప న్యాయం చేకూర్చింది .ప్రభాత సూర్యోదయ కాంతికిరణాల నులి వెచ్చని ఆహ్లాదం భాసించింది .

 ఈ కవితా కదంబం సర్ ఫిలిప్ సిడ్నీ కవిత ‘’టు స్లీప్ ‘’ తోప్రారంభమై అజ్ఞాతకవి ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’తో పూర్తవుతుంది .సిడ్నీకవి నిద్రను ‘’శాంతినిచ్చే ముడి ,దుఖానికి ఉపశమనం ,నిరుపేదకు భాగ్యం పక్షపాతం లేని న్యాయ నిర్ణేత (తగవరి ) అంటాడు .ఈకవి ఎలిజబెత్ కా  లం లో 108సానెట్ ల ‘’ఆస్టోఫెల్ అండ్ స్టెల్లా’’కావ్యం రాసి ఆదర్శ పురుషుడుగా గుర్తి౦పు పొందాడు .అందుకే చివరగా ‘’లైవ్ లియర్ డాన్ఎల్స్ వేర్   స్టెల్లాస్ఇమేజెస్ సీ’’అని ఫినిషింగ్ టచ్ ఇవ్వగా శర్మగారు ‘’ఉల్లాస౦గా చూడగలవు –నాలో స్టెల్లా ప్రతిబింబమును ‘’అని ముగించారు అందంగా .70వ కవిత అజ్ఞాతకవి రాసిన ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’ను శర్మగారు ‘’నిజంగా బంగారు నిమిషాలు ‘’గా అనువదించారు .నిమిషాలు గంటలు కాలపరిమాణ౦ లో అర్ధం లేనివి –కానీ అవే బంగారు నిమిషాలు మహత్తర ఘడియలు .ఒకరికి సంతోషం కలిగించటం లో ,చిర్నగవు తెప్పించటం లో  కన్నీరు తుడవటం లో  నైరాశ్యాన్ని అంతం చేయటం లో స్నేహాన్నివ్వటం లో  వాటిని ఉపయోగిస్తే సార్ధకం .అనికాలం మహత్తరమైన విలువకలదన్న బోధ చేశాడుకవి  .

  శర్మగారికి ఉన్న కవితాభిమానం కవులపై ఆరాధన నిరుపమానం .అందుకే ఆ అభిమానాన్ని చాటుతూ ,షేక్స్ పియర్ వి 3,ఎమిలి డికిన్సన్ వి 10,ఎల్లావీలర్ విల్కాక్స్ వి 3,సారా టెసల్డేల్ వి అత్యధికంగా 18,ఎడ్నాసెయింట్ విన్సెంట్ మిల్లేవి 2 కవితలను ఎంచుకొని అనువదించారు .ఎమిలీ ,తారా ఇద్దరూ కవయిత్రులే అవటం విశేషం.’’తలపు నీపైనమరల  సంతోషంకలిగి ,మృదుమధురమైన ప్రేమ స్మృతి ని మెదలి నృపతి పదవినైనా తృణీకరిస్తాను-‘’అని ,’’గులాబీ స్థితి వేరే అని ,అది మరణించినా మధుర పరిమళాలనిస్తుందని ,అందుకే అడవిపూలకంటే భిన్నమైనదని ,సత్కవిత వడబోతు నీ సత్యమహిమ ‘’అని ,సుఖాన్ని కోరితే దుఖం ,సంతోషంకోరితే మిగిలేది స్వప్నమే –నరకానికి బాట ఐన నాకసుఖం రాయటం ఎవరికీ వీలుకావటం లేదని షేక్స్ పియర్ తన మూడు  సానెట్ లలో చెప్పాడు .’’ఏ లిలీ ఆఫ్ ఏ డే –ఈజ్ ఫైరర్ ఫార్ ఇన్ మే’’అన్న బెంజాన్సన్ కవిత అందరికీ తెలుసు .’’ఇన్ స్మాల్ ప్రోపోర్షన్స్  వుయ్ జస్ట్  బ్యూటీస్  సీ –అండ్ ఇన్ షార్ట్ మెజర్స్ లైఫ్ మే పెర్ఫెక్ట్ బి ‘’అన్న గొప్ప జీవితసత్యాన్ని ‘’సూక్ష్మ పరిమితి లోనే –చూడగలము సౌందర్యమును –తక్కువ పరిమాణం లోనే లోపరహితంగా ఉండవచ్చు మనిషిజీవితం ‘’అని అదే జీవితానికి నిజమైన కొలత అని అర్ధవంతమైన  అనువాదం చేశారు శర్మాజీ.అదే మనతెలుగుకవి  ‘’కాకి చిరకాలమున్న నేకార్య మగును ?’’ అన్నాడెప్పుడో.’’వసుధలో వస్తువులన్నీ కడతేరాల్సిందే –గతవైభవప్రదర్శన తర్వాత గోరీలోకి జారాల్సిందే ‘’అంటూ పువ్వుల్ని అంత తొందరగా రాలిపోవటం ఎందుకు –మేము చదివే అందమైన పత్రాలు మీరు ‘’అని ‘’టు బ్లాసమ్స్ ‘’కవిత లో   రాబర్ట్ హార్రిక్ అన్నదాన్ని శర్మగారు ‘’విరులకు ‘’విన్నపంగా చెప్పారు .’’ఈలోకం సుందరమైనది ,ప్రేమ మహత్తరమైనది ,జీవితం సంక్లిష్టమైనది ‘’అనే సందేశం ఇచ్చాడు హార్రిక్ కవి .మనపదవీ ,వంశగౌరవాలన్నీ ముందో వెనకో విధికి వశమవ్వాల్సిందే .సన్మార్గుల కృత్యములే సౌరభాలు వెదజల్లి ,మట్టిలో వికసిస్తాయి ‘’అని తాత్విక సందేశమిచ్చాడు జేమ్స్ షిర్లి.

  మూడు దేశాల చక్రవర్తి మూడు సార్లు పార్లమెంట్ ను రద్దు చేసి ఇంగ్లాండ్ లో    అంతర్యుద్దానికి కారకుడై, చివరికి పార్లమెంట్ కు లొంగిపోయి , ఆలివర్ క్రామ్వేల్ తో ఓడిపోయి ఉరితీయబడ్డ   మొదటి చార్లెస్ ‘’క్వయట్ స్లీప్ ‘’కవితలో ‘’నెమ్మదికల అంతరాత్మకు  శాంతి విశ్రా౦తులు౦ టాయని ,భద్రంగా నిద్రపొమ్మని –నిద్రకంటే మధురమైనది లేదని ‘’తన అనుభవ సారంగా చెప్పాడు .మొదటి చార్లెస్ రాజు తరఫుకవి అంటే ‘’కావిలియర్ పొయెట్ ‘’ రిచార్డ్ లవ్ లేస్ సైన్యంలో కెప్టెన్ .’’విమల పవిత్ర వక్షస్థలతపస్వినీ గృహాన్ని వదిలి యుద్ధానికి వెడుతూ ,తాను  దయావిహీనడనుకానని,రణరంగం లో మొదటి శత్రువు ఖడ్గ, కవచాన్ని, అశ్వాన్ని  అధికతర విశ్వాసంతో కౌగలి౦చుకొంటానని,అప్పుడు ఆమెకూడా తనను పొగడాల్సిందే నని తన నిలకడ లేనితనం పేరు ,ప్రతిష్ట లను తాను  ప్రేమించకపోతే ఆమెనుకూడా అంతగా ప్రేమించి ఉండలేనని సందేశమిచ్చాడు .హెన్రి వాన్ కు పొదపొదలో పూలహారాలు ఫలహారాలుగా కనిపించి మహీతలం నీరవ నిశ్శబ్దంగా భాషా యోష అశ్రుగీతం వినిపించింది ‘’విశాలాకాశం లో ‘’.’’డి చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మాన్ ‘’అని ప్రకృతి,కవి వర్డ్స్ వర్త్ అన్నమాట వర్దీ మాట .రైన్బో కవితలో ఆమాట చెప్పి మరణమే మేలు –పిల్లలే పెద్దలకు తండ్రులు .నా రోజులన్నీ ఒకదానితో ఒకటి ముడి పడి ఉండాలని ఆశించాడు .

  వాల్టర్ సావేజ్ లాండర్ కవి ‘’ఆన౦ద  క్షణాలు రాలిపోతున్నాయని చి౦తఎందుకు ? మళ్ళీ రమ్మనటానికి నేను ఉండను అవి ఎక్కడో మళ్ళీ వెలుగుతాయి ‘’అని భరోసా ఇస్తాడు .’’ఆబూ బెన్ ఆడం ‘’కవిత చదవని, వినని, విని మురిసిపోని వారుండరు .లీహంట్ రాసిన ఈకవిత ‘’తోటిమానవులను ప్రేమించినవారినే దైవం తనవాడిగా భావిస్తాడు’’అన్న గొప్ప సత్యాన్ని చాటిన కవిత .నేను తొమ్మిదో తరగతిలోనే చదువుకొన్న దానినే విద్యార్ధులకు పాఠంగా చెప్పినకవిత కవిత .టెన్నిసన్ మహాకవికి ‘’ప్రథమ ప్రేమ మధురం ,ప్రగాఢం.వెళ్ళిపోయిన రోజులు శోకభరితం విషాదం  వినూతనం .మాయమైన రోజులు సజీవమరణమే అనిపించాయి కవికి .రాబర్ట్ బ్రౌనింగ్ కు ‘’నేనుఎవర్ని ?’’అనే ప్రశ్న వచ్చి ‘’వెనుతిరిగి చూడని వాడిని –మంచి ఓటమి పొందినా చెడు గెలుస్తుందని కలలో కూడా అనుకోని వాడిని –నిద్రించటం మేల్కొవటానికే అని నమ్మినవాడిని –కస్టేసుఖీ  అని నమ్మి చివరిదాకా పోరాడేవాడిని –ఇక్కడిలాగానే ‘’అక్కడా ‘’అలాగే జీవితం సాగించమని కోరేవాడు .ఆర్ధర్ హఘ్ క్లో కు ‘’ఆశలు నిరాశాలైతే భయాలు భ్రా౦తు లౌతాయి .ప్రభాకరుడు నెమ్మదిగా పైకి వస్తున్నా ,పడమట నేల౦తా శాంతి మయంగా కనిపించింది .

  ఎమిలి డికిన్సన్ అమెరికాలోని మాసాచూసెట్స్ లోని  ఆంహెర్స్ట్  కవయిత్రి.1800కవితలురాసింది  .ఒంటరిజీవితమే గడిపింది .ఎమెర్సన్ సరసన నిలువగలిగిన కవి .ఆమె మరణం తర్వాత నే కవితలు, లేఖలు చెల్లెలు లవినియాకు దక్కి ప్రచురించింది .దాదాపు మిస్టిక్ పోయెట్.ఆమెవి’’ గాస్పెల్ పోయెమ్స్’’ గాగుర్తి౦పుపొందాయి . శర్మగారు ఎంచుకొన్న 10కవితలలో కొన్ని ముఖ్యభావనలు –‘’చిన్న యెదలో ప్రశాంతంగా   పారే సెలయేరు ఉందా ?అందులోని ప్రాణజలం తాగు .ఈ సెలయేరు ఎండకుండా జాగ్రత్త పడు .గుండెల్లో బాధ దాచుకోటానికి మనస్తైర్యం కావాలి .ఈ ప్రపంచం పరిసమాప్తికాదు .అవతల ఏదో ఉంది .ఆత్మనుకొరికే దంతాన్ని మతబోధకుల అభినయాలు’’ హలలూయాలు ‘’నిద్రమందులు అంతం చేయలేవు .ఆకాశం కన్నా విశాలమైంది,మహోదధికన్నా లోతైనది  భగవంతునితో సరితూగేది  మానవ మస్తిష్కం .ఒకపెద్ద బాధతర్వాత ఒకవిధమైన అనుభవం కలుగుతుంది .ఏటవాలుగా పడేకాంతి ని చూసి నీడలుకూడా ఊపిరితీయటం మానేస్తాయి .హృదయం మొదటకోరేది ఆనందం.తర్వాత నిద్ర .చివరికి చనిపోయే స్వేచ్చ .ఆత్మీయులను తానె ఎంచుకొని  ఆత్మ తలుపు వెంటనే మూసేస్తుంది .అందరికీ ఒకమర్యాద ఏదోరోజువస్తుంది .ఆ వైభవం చెప్పనలవికానిది .అదే చావు సంబడం అన్నమాట .జయం ఎప్పుడూ పొందనివారికి విజయం లో మాధుర్యం అతిఎక్కువగా గా అనిపిస్తుంది .విజయకేతనాన్ని ఎగరేసిన సైనికుడు కూడా విజయం నిర్వచనం చెప్పలేడు.

 సారా టేస్ డేల్కవితలను    శర్మగారు 18ఎంచుకొని తర్జుమా చేశారు .అమెరికా సెయింట్ లూయీ కి చెందిన ఈమే 14వ ఏడువచ్చేదాకా బడిలో చదవలేదు కాని 19ఏట పట్టభాద్రురాలైంది .తీవ్రభావోద్వేగంతో ,సంప్రదాయబద్ధంగా ,సరళంగా కవితలురాసింది .ఈమె రాసిన ‘’లైక్ బార్లీ ‘’కవితను హో లింగ అనే చైనా అమ్మాయి చిన్నతనం లోనే అనువాదం చేసింది .సహజత్వం కవితలలో స్పష్టం .కొన్ని భావనలు –‘’కంచల అ౦చు లపైనా ,గడ్డికట్టల   పైనా ,వైఢూర్యాలను వెదజల్లుతూ ,దార౦లొ తారలను ధరించిన సాలె గూళ్ళను మంచు వీడింది .గి౦జగింజలో హరివిల్లు ధరించిన కలుపు మొక్కలను తళతళలాడిస్తోంది .నీప్రేమ వేకువలాగా నవనూతనం .నాపూర్వీకులు నాకు ఆత్మజ్యోతి నిచ్చారు .కానీ నా ప్రేమికులే వివిధవర్ణ శోభామయ చంచలజ్వాల ప్రసాదించారు .గడియ సేపు స్వర్గాన్నిచ్చిన కవితను ప్రేమించాను .వజ్రోదయం తెల్లని ఎండలో భాసించింది .నగలుమార్చినట్లు నీనుండి చూపులు మార్చుకొంటాను.కాలం అనే నేస్తం ముదిమినొసగి మరపిస్తుంది .బార్లీ వెన్నులు కిందకి వంగి తిరిగి మీదకు లేచినట్లు వేదన –లోతులనుంచి పైకొచ్చింది .ప్రకృతి పరిశీలన ఇది . విశ్వనాథగుర్తుకొస్తాడు .గాలి రెండంచులకత్తిలా ఉంది .ఇల్లులేని బాలుడిలాగా నాయెద రోదిస్తోంది .నువ్వుగాలిఅయితే నేను కడలిని .తుఫానులో నీటి గుంట క్షేమంగా ఉన్నా ,సంద్రంకంటే ఎక్కువ చేదుగా అవుతుంది .’’ప్రేముడి’’ గట్టిగా అరచి౦ది నాలో .నాకు శక్తి ఉంది స్వేచ్చనియ్యకపోతే నీ ఎదను విదలించగలను.కాఠిన్యం  కంటే కమనీయతే హృదయ విచారకరం .ఈ విశ్వం లో ఒకే గొంతుమాత్రమే నాకు విశ్రాంతి నివ్వగలదు .ప్రేమించు ప్రేమించు .ప్రేమతోనే జీవితం సార్ధకం .ప్రేమవల్లనే స్వర్గం చేరగలవు .చెరువుమీద మంచు నీటమునిగిన కత్తుల వలేమెరుస్తున్నాది .సౌందర్యం శకలం జ్వలించే టప్పుడు సౌందర్యమా నువ్వు చాలునాకు .గానం నన్ను వీడితే మరచిన గీతంలో మృత్యువే కోరుకొంటా .నేనుగతి౦చినా  నా గాన౦  నాప్రాణం లో జీవిస్తుంది .నా హృదయ చషకం అందమైనదే .నిర్జీవమైన నిర్వేదమద్యాన్ని సజీవంగా సవర్ణంగా మార్చుట ఎలాగోనాకు తెలుసు .ఇలాతలం పై రాత్రి రెక్కలు పరుచుకొ౦టో౦ది .నాహృదయం చెట్టులోని పక్షిలాగా .పిలుస్తూనే ఉంది .అని హృదయావేదన ,ప్రేమ తపన వ్యక్తం చేసింది సారా .

  విశ్వాసం కోసం ప్రార్ధన చేసింది  మార్గరెట్ సాంగ్ స్టర్.ఎదలో ప్రార్ధన సమసిపోతే ఏకాకి నైపోతాననని వాపోయింది .ఏదో ఒక శుభప్రదమైన ఆశ రాత్రిగీతం లో వినిపిస్తుందని ఆశ ధామస్ హార్డీకి .జేమ్స్ విట్కాంబ్ రిలే కి యెంత లోతుగా దిగజారినవారినైనా ప్రేమ ఉద్ధరిస్తుందనే నమ్మకం .ఎల్లా వీలర్ విల్కాక్స్ కు కోరికలు జయించేమనోబలమున్నవారు ,చిరునవ్వులో దుఖాన్ని దాచగలిగేవారు గౌరవపాత్రులుగా కనిపించారు .అవనిలో ని ఆన౦ద౦  శోభా,సౌందర్యాలు సర్వం తిరిగిరాని కథ, శేషజీవితం కేవలం ఒక విధిమాత్రమెఅనిపించింది .నిన్నటి దినాలనుపాతిపెట్టి ఈరోజు గురించి ఆలోచించి ,ఇద్దర్నీకలిపేది దైవమని అన్నది.ఈమె కవితలో అంద౦ ఆశాభావం కనిపిస్తాయి  .రుడ్యార్డ్ కిప్లింగ్ కు   తాను ఉరితీయబడ్డప్పుడు తల్లిప్రేమ తనను అనుసరిస్తుందని ,లోతు సముద్రంలో మునిగినప్పుడు ఆమె కన్నీరు తన చెంతకు చేరుతుందని ,శరీరం ఆత్మ పాపభూయిస్టమైనపుడు ఆమె ప్రార్ధనలు తన్ను ఉద్ధరిస్తాయని ఎరుగును .లయోనేల్ జాన్సన్ మొదటి చార్లెస్ విగ్రహం దగ్గర కూర్చుని  రాసిన దీర్ఘకవితలో జీవితం లో పరాజితుడైనా చనిపోయి సౌందర్యం సాధించాడని ,అతని ఆత్మకళలలో  ఆనందం పొందుతుందని ,జనమంతా ఆయనకృపకు’’ ఆకొని’’ఉన్నారని ఆవేదన చెందాడు .

  జోసెఫ్ బి స్ట్రాస్ ఆశావాది .దెబ్బపై దెబ్బతిన్నా కస్టాలకడలిలో ఈదుతున్నా బాధతప్ప ఏదీ లేదు అనుకోడు .వసంత స్పర్శ ,ఎగిరే పక్షి,చల్లని చిరునవ్వు ,ఒకరిద్దరు నమ్మిన నేస్తాలు జీవితానికి విలువ నిస్తాయనినమ్మాడు  .రాబర్ట్ ఫ్రాస్ట్ కుదూరటానికి కూడా వీలులేని చీకటి వనం లో పక్షిగానం చీకటిలోకి శోకం లోకి రారమ్మని  వినిపించి౦ది. కాని నక్షత్రాలకోసం బయటే ఉండిపోయాడు .మన ల క్ష్యాన్ని అతిదూరం గా ఉంచమని కోరాడు ఫిలిప్ ఏం రాస్కిన్ రష్యన్,జ్యూయిష్ అమెరికన్ కవి . మార్గరెట్ యి బ్రూనేర్ కు కుక్క మానవ హృదయాన్నే అర్ధం చేసుకోగలది అనిపించింది .దానికి కావలసింది అర్ధం చేసుకోగలమిత్రుడే అని నమ్మింది ఆమె. .మన చెట్టు కవి ఇస్మాయిల్ లాగా జాయిస్ కిల్మార్ కు చెట్టంత అందమైన కవిత కనిపించలేదు. అది రోజంతా ఆకులవంటి చేతులు పైకెత్తి దైవ ప్రార్ధన చేస్తుంది .తనలాంటి మూర్ఖులే కవితలు రాస్తారని కాని దేవుడుమాత్రమే చెట్టును చేయగలడని నమ్మాడు .సున్నిత శ్రావ్యత సౌందర్య౦  ఎలినార్ మార్టాన్ వైలీ కవితలలో ఉంటుంది-ఏదో ఒక చోటుకి మఖమల్ పావులు వేసుకొని నీరవ నిశ్శబ్ద నీహారం లోకి నడుద్దాం రమ్మంటుంది.పడకగది గోడమీద తనపొడవును సగర్వంగా కొలిచిన తల్లి కొలిచిన వైనం గుర్తొచ్చింది రోజా జగ్ నోనిమరియాని కి .జోసెఫ్ మార్రిస్ కు యెద కు౦గినపుడు చిరునవ్వే పలకరిస్తుందని నమ్మకం .కారుణ్యం ఎక్కడ అంతం అవుతుందో చూడలేకపోయినా అది శాశ్వతకాలాన్ని చేరుతుంది అంటాడు .అందుకే విలువైన తన 400ఎకరాల భూమిని మయామీ యూని వర్సిటీకి దానంగా ఇచ్చాడు.

 విలియం యి హేన్లి అజేయమైన ఆత్మను తనకిచ్చినదుకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పాడు .భయాలకు ప్రమాదాలకు వెరువనివాడు. తన ఆత్మకు తానె అధిపతిని ,తానె నాయకుడిని అని నమ్మాడు’’ ఇన్విక్టస్ ‘’అంటే అజేయత కవితలో .ఈకవితను దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా తనతోపాటుజైల్ లో ఉన్నవాళ్ళకు ఈకవిత వినిపించి ధైర్యం, పోరాటపటిమ కలిగించాడు .తనతల్లికి ఉన్న ధైర్యం ఆమెతో వెళ్ళిపోయిందని ,ఆమె ధైర్యమే తనకు ఉంటె యెంత బాగుండును అని బాధపడింది ఎడ్నావిన్సెంట్ మిల్లె .కాలం బాధను పోగొడుతుంది అన్నది నిజంకాదు అంటుంది .ఈమెధైర్యసాహసాలకు మేధా శక్తికి ‘’అమెరికన్ మహిళా బైరన్ ‘’ గా కీర్తిపొందింది  .కార్రీ మే నికొలాస్  కు ధుమ ధుమలను చిరునవ్వు మాయం చేస్తుందని తీయని చూపు కోపాన్ని చల్లారుస్తుందని అనిపించింది .డోరోతి క్విక్ కు పాతదేవుళ్ల పాలన అంతమైందని గుడిలో’’ కొత్తా దేవుళ్ళు’’ఉండరని ,జీవితసారాన్నీ గ్రహించిన నిమ్నోన్నతాలకు తాను  బంధువునని అనిపించింది .ఈమె 11ఏళ్ళ వయసులో మహా నవలారచయిత మార్క్ ట్వేన్ ను పడవ లో కలిసి స్పూర్తి పొందింది .నార్మన్ వి పియర్స్ కవి కి గులాబీ తోటలు కనిపించకపోయినా వాసన ఇష్టం .పర్వత శిఖరాలు కనిపించకపోయినా  వాటి నుంచివచ్చే చల్లనిగాలి సౌఖ్యం అనుభవించగలడు .పక్షుల్ని చూడలేకపోయినా వానకోయిల గాన సుఖం అనుభవిస్తాడు .దారిలో పిల్లల్ని చూడలేకున్నా వారి హాసాన్ని ఆస్వాది౦చ గలడు .సముద్రంపై చంద్రకాంతి చూడలేకపోయినా కెరటాల సంగీతం వినగలడు.ప్రకృతి సమర్పించే శ్రావ్య ధ్వనులన్నీ వీనులవిందు అతనికి .అందుకే దైవానికి వందనాలు సమర్పించి ఇంతకంటే ఎక్కువఏదీ కోరను అని సంతృప్తి పడ్డాడు ‘’బ్లైండ్ ‘’అంటే అందుడుకవితలో .

  ఇన్ని అద్భుతఆంగ్ల  కవితలను తెలుగులో బంగారపు పోత పోసి అందించిన రాచకొండ శర్మగారికి ఆంద్ర సాహితీ లోకం ఎంతో రుణపడి ఉంది .ప్రతికవిత ఆకవి హృదయాన్ని ఆవిష్కరించే తీరులో అనువాదం సాగి అనుభూతి నిచ్చింది .ఇన్ని హృదయాలలో పరకాయ ప్రవేశం చేయటం మాటలుకాదు .చేసి చూపించి తమ సమర్ధత చాటారు డా.శర్మగారు .మిక్కిలి అభిన౦దనీయులు .వారి పూనిక ధైర్యం దీక్ష ,నిరంతర సాహితీ సేవ అందరికీ ఆదర్శం .భగవంతుడు వారికి, వారి శ్రీమతిగారికీ శతాధిక ఆయుస్సు ,ఆరోగ్యం కలిగించాలని ,మరిన్ని అందమైన ఆంగ్లకవితల అనువాదాలు వారి లేఖిని నుండి వెలువడాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-19-ఉయ్యూరు   .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.