‘’గద్య పద్య ధారణా బాల సరస్వతి’’ చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ బందరు ధారణావధానం
సన్నగా పీలగా పొడుగ్గా బక్కపలచని యెర్రని రూపం సంప్రదయ పంచకట్టు చొక్కా ,మెడలో జరీ అంచు ఖండువా , నుదుట విభూతి రేఖలపై యెర్రని బొట్టు తో 13ఏడేళ్ళ ఎనిమిదవ తరగతి బుడతడు ,’’అపర బాలమురుగన్’’ గా నిన్న 25-10-19శుక్రవారం సాయంత్రం 6గం.లకు బందరు మహతీ ఆడిటోరియం లో ‘’తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ‘’నిర్వహించిన గద్య పద్య ధారణావధానం లో’’బాల ధారణా ధురీణ ‘’గా తన సామర్ధ్యాన్ని వందకు పైగా హాజరైన రసజ్ఞులైన ప్రేక్షక మహాశయుల ఎదుట నిరూపించుకొని శాహభాష్ అనిపించాడు .ఈ చిరంజీవి తలిదండ్రులు శ్రీ విష్ణు భట్లురమాకాంత్, శ్రీమతి లక్ష్మీ దుర్గ ల అంటే రమాకాతుడైనవిష్ణుమూర్తికి ,లక్ష్మీ దేవిల కడుపు పంట ఐన ఈ చిన్నారి హరిహర రూపాత్మకుడై పద్య గద్యాలను పై స్థాయిలో పాడుతున్నా గొంతులో రవంత జీరకాని ,అస్పష్టత కాని లేకపోవటం సభ్యులను అబ్బుర పరచింది .భావ వివరణలో అత్యంత సునాయాసంగా ,తానే ,ఒక’’ మల్లినాథ సూరి’’లాగా విడమరచి చెప్పటం అందరినీ అలరించింది .అడుగడుక్కీ హర్ష ధ్వానాలు పలికి సభ్యులు మహదాన౦దాన్ని ,తనివి తీర అనుభవించారు .
వయసు రెండున్నర నుంచే పద్య ధారణ చేసి ఆలపిస్తూ ,మూడవ తేటనుంచి వేదికపై అరంగేట్రంచేసి ,పద్య ధారణప్రస్థానం కొనసాగిస్తున్నాడు .2012తిరుపతి ప్రపంచ తెలుగు మహా సభలలో,ముందుగా ఉపవేదికపై అవకాశం పొంది ,సత్తా చూపి అసలు వేదిక నెక్కి అసలైన సామర్ధ్యం చూపి అందరి ప్రశంసలు , దీవెనెలు,ఘనసన్మానం అందుకున్నాడు కార్తీక్ . రవీంద్రభారతి ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ,లలితా కళాతోరణం ,త్యాగరాజ గాన సభ వంటి విశిష్ట పండిత సభలలో తన ధారణా ప్రతిభ ప్రదర్శించి మెప్పు పొందాడు .చెన్నై వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వారి జాతీయస్థాయి పద్యాలపోటీలో ప్రథమ బహుమతి నందుకొన్నప్రజ్ఞాశాలి .నారాయణ రెడ్డి ,మాడుగుల ,గరికపాటి ,కాశీ లోని శ్రీ కొల్లూరి అవతార శర్మ వంటి ఉద్దండ పండిత ,అవధానకవుల ఆశీస్సులు పొందిన ధన్యబాలుడు .ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేత తన స్వర్ణభారతి ట్రస్ట్ కు స్వయంగా ఆహ్వానింప బడి పద్య ధారణచేత పులకిప జేసి సత్కరింప బడిన చిన్నారి ఈ చిరంజీవి .శివ దేవుని చిక్కాలలో అశ్వారోహణ పొంది పురవీడులలో ఘనంగా ఊరేగింపు పొందిన భాగ్యశాలి .అన్నవరం ద్వారకా తిరుమల ,దేవాలయాలలో ,దూరదర్శన్ లో ధారణా ధీరత్వం భక్తిభావానా మాధుర్యం చాటిన వాడు కార్తీక్ .
నిన్న బందరు ధారణావధానం లో నేను సంచాలకునిగా ,పురాణేతి హాసాల పృచ్ఛకునిగా ద్విపాత్రాభినయం చేశాను ..మొదట అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పి ,ధనత్రయోదశి నాడు కార్తీక్’’ పద్య లక్ష్మీకనక ధార’’ కరిపించి బందరు పురజనులను తనియింప జేయాలని కొరాను. దీపావళి సందర్భం గా భాగవత పురాణం లో నరకాసుర సంహార ఘట్టం లో పోతనగారు సత్యభామ వీరశృంగార రసాభినయాన్ని వర్ణించిన పద్యం చెప్పమని కోరగా చిరంజీవి’’వేణిం జొల్లెము వెట్టి,సంఘటిత నీవీ బంధయై భూషణ శ్రేణి దాల్చి,ముఖేందు మండల మరీచీ జాలముల్ బర్వగా పాణిన్ పయ్యెద జక్కగా ‘’దురిమి ,శు౦భద్వీర సంరంభియై –ఏణీ లోచన లేచి నిల్చె,తనప్రాణేశాగ్ర భాగంబునన్ ‘’కమ్మగా పాడి వినిపించాడు భావరాగ యుక్తంగా శ్రావ్యంగా పాడి వినిపించాడు ..సత్యభామ వ్యస్తాలీఢ పాదం తోచేసిన యుద్ధ వర్ణన బాగా వివరించాడు .దానికి మెచ్చినేను’’ బాపుగారు సత్యభామ ఈభంగిమను అత్యద్భుతంగా చిత్రీకరించారు .ఆయన దీపావళి గ్రీటింగ్స్ లో ఇది కనబడి కను విందు చేస్తుంది ‘’అని చెప్పాను . నేను మళ్ళీ ‘’పరుజూచున్ వరు జూచు ‘’ అనే పద్యం చెప్పమంటే’’ రాదు గురువుగారు ‘’అని సవినయంగా చెప్పాడు .కనుక ఇకపై పృచ్చకులందర్నీ’’ప్రత్యేకించి పద్యాలు గద్యాలు అడగవద్దు .ఎందులోకావాలో అడిగితె అదు లోనివి తనకు వచ్చినవి ధారణ చేస్తాడు ‘’అని చెప్పి ,అతని కి ఏమి వచ్చో దానినే విని ఆన౦దిద్దాం రానిదానిపై ప్రశ్నించవద్దు ,ఇది పరీక్షకాదు‘’అని చెప్పాను .అయినా ఆపద్యం మీకోసమైనా నేను చెప్పాలికదా –
‘’పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్’’
సత్యభామ వీర శృంగార సౌందర్య ,భయ రౌద్ర రూపం దాల్చింది .కొడుకైన దుష్టనరకుడిని నరికి పారేసింది .
దీనికి అంటే పోతనగారికి ప్రేరణ పద్యం ‘’ఉత్తర హరివంశం’’ లోని నాచన సోముడు చెప్పినపద్యం –
‘’అరిజూచున్ హరిజూచు ,జూచుకములదందమందార కే-సరమాలా,మకరంద సలిల స్యదంబు లందంబులై –తొరుగం బయ్యెద కొంగొకింత దొలగం దొడ్తో శరాసారమున్ –దరహాసామృత పూరముం గురియుచు దన్వంగికేలీగతిన్ ‘’
తర్వాత కార్తీక్ భారతం లో ఉదంకోపాఖ్యానపద్యాలు, రామాయణ పద్యాలు ధారణ చేశాడు .పద్మావతి మహిళాకళాశాల ఉపన్యాసకులు శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి కావ్యాలలోని పద్యాలను ధారణ చేయమనగా ,మను వసు చరిత్ర పద్యాలు ,ఆముక్తమాల్యద లోని అత్యంత క్లిష్టమైన పద్యం ధారణ చేసి విభ్రాంతి కలిగించాడు .అవధానులపద్యాలపై పృచ్చించిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి సిహాద్రిపద్మ సర్వశ్రీ మాడుగుల ,గరికపాటి, రాళ్ళబండి అవధానకవుల పద్యాలు అడగగా అత్యంత సునాయాసంగా పద్యాలు రాగయుక్తంగా వారి వారి ప్రత్యేక బాణీలతో విరుపులతో ,చమత్కారాలతో వారే వచ్చి మన కళ్ళ ఎదుట నిలబడి పద్యం చెబుతున్న భ్రాంతిని అద్భుతంగా కలిగించాడు చిన్నారి చిరంజీవి .’’తెభాసం స ‘’ కార్యవర్గ సభ్యురాలు ప్రముఖ కవయిత్రి శ్రీమతి గుడిపూడి రాదికారాణి’’ శతకాలపై ప్రశ్నిస్తూ ధూర్జటి రామదాసు ,శతకాలపపద్య ధారణ చేయమని కోరగా మంచి పద్యాలు ఎన్నుకొని ధారణ చేసి మెప్పించాడు .దూర్జటిలోని భక్త్యావేశం ,రామదాసులోని,ఆర్తి వేమనలోని చిత్తశుద్ధి ,విమర్శ కళ్ళముందు నిలిపాడు .చివరగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం స్థానాచార్యులు శ్రీ ముత్తేవి శ్రీనివాస శశికాంత్ పృచ్ఛి౦చిన’’భగవద్గీత ‘’లో శోక్లాలను అర్ధవంతంగా అర్ధతాత్పర్య సహితం గా చెప్పి ధారణావధానం కరతాళధ్వనులమధ్య ముగించాడు కార్తీక్ .
తర్వాత సుమారు 45నిమిషాలు మన బాల సరస్వతి తన ఏకబిగి ధారణా దారామకరందం తో అందరినీ సంతృప్తులను చేశాడు .’’శ్రీనివాస గద్యాన్ని’’అలవోకగా నాన్ స్టాప్ గా కర్ణపేయంగా ధారణ చేసి మురిపించాడు .నేను ‘’ఇందులో ఒక్కపదం అర్ధం మనకు తెలియకపోయినా ,అందులోని నాదమాదుర్యం మనల్ని ఏడుకొండలని ఎక్కించి, ఆ తిరుమల నాథుని సన్నిధానానికి చేర్చింది . పరబ్రహ్మ నాదానంద విభూతి దాయకుడు కదా .’అని చెప్పి ప్రేక్షక జనాలను లేచినిలబడికరతాళధ్వనులు చేయమని అంటే ‘’స్టాండింగ్ వోవేషన్’’ఇవ్వమని కోరగా, అందరూ అలాచేసి తమ ఆనంద హర్షామోదాలు తెలియజేసి చిన్నారిని మనః పూర్వకంగా ఆశీర్వదించారు .
అలాగే భాగవతం లో గజేంద్ర మోక్షం లోనిపోతనగారి అరణ్య వర్ణన గద్యాన్నిసు శ్రావ్యం గా ధారాపాతంగా వినిపించాడు .నేను ‘’పోతనగారికవిత్వం మందార మకరంద మాధుర్యం .ఆయన గద్యలోనూ ఆ మాధుర్యం కరిపించాడు .అడవిలోని ప్రతిమొక్క చెట్టూ చేమా లతా తీగా,అన్నీ మనకు గోచరి౦జేశాడు .గద్యం రసాత్మకం కావ్యం అనే భ్రాంతి కలిగించాడు .చిన్నయసూరి గద్య నీతి చంద్రిక మనం చిన్నప్పుడు చదువుకొని అందులోని పద బందురాన్ని ఆస్వాదించాం .చిన్నయ సూరి బాలవ్యాకరణం లోని సూత్రాలలో గొప్ప ఛందస్సు,లయ ఉందని , అందులోని కవితా మాదుర్యాన్ని బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు ‘’రమణీయం ‘’గ్రంథంలో దీన్ని నిక్షిప్తం చేశారని ,శాస్త్రి గారు వ్యాకరణం బోధిస్తుంటే కావ్యాన్ని బోధిస్తున్నట్లు ఉండేదని చెప్పాను .అంతసులభంగా గ్రామర్ బోధించటం ఎవరి తరమూకాలేదని ,మిగిలినవారు బోధిస్తుంటే శిష్యులు అర్ధంకాక తలలు పట్టుకొని కూర్చునే వారని చెప్పాను . కవితాప్రసాద్ గారి ‘’కాదంబిని’’కావ్యంలో అమ్మవారిపై ఆయన రాసిన శతక పద్యాలలో అయిదారు అదే భక్తీ తాత్పర్యాలతో ధారణ చేసి గొప్ప అనుభూతికలిగించాడు .ఆముక్తమాల్యద లోని క్లిష్ట పద్యాలను మనుచరిత్రలోని ‘’పూతమెరుంగులున్ పసరు పూపబెడంగులు ‘’అనే దీర్ఘ చంపకమాలను చివర చెప్పిన ‘’సంస్కృతంబు పచరించిన పట్టున ‘’అనే దానితో సహా గానం చేసి తెలుగు సంస్కృత కవితా మాధుర్యాన్ని ఎదుట నిలిపాడు .అలాగే హరిశ్చంద్ర నాటకం లో చేరిన జాషువా గారి ‘’కాటి సీను ‘’పద్యాల ధారణతో కరుణ రసస్పూర్తి కలిగించాడు .చివరగా తెలుగు భాషా మాధుర్యం గొప్పతనం నేర్వవలసిన ఆవసరం గుర్తుకు తెస్తూ మంచి పద్యాలు ధారణ చేసి అందరికి కర్తవ్య బోధ చేసి,ధారా ధారణ సమాప్తి చేశాడు . నేను ‘’ఈ చిరంజీవిని ఇక్కడి పాఠశాలలలకు ఆహ్వానించి ,ధారణావధానం చేయించి విద్యార్ధులలో ప్రేరణ ఉత్సాహం స్పూర్తి కలిగించాలి .బందరులో సినిమా వారం ఆడితే రాష్ట్రం లో యాభై రోజులు ఆడుతుందనే నమ్మకం ఉండేది .ఇక్కడ ఈ కుర్రాడికి జరిగిన సత్కారం దేశమంతటా జరగాలి .అతనుక్రమంగా ఎదిగి అవధాని అవ్వాలి .గజారోహణగౌరవం కూడా పొందాలి’’అన్నాను . గాయని శ్రీమతి కాళీ పట్నం ఉమగారి భర్తనాదగ్గరకు వచ్చి పరిచయం చేసుకొని ,ఉదయం ఈచిరంజీవితో జైహింద్ హైస్కూల్ లో ధారణా చేయిచా మనే మంచి వార్త తెలియజేశారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ సిలార్ గారి ఆధ్వర్యం లో శ్రీ దత్తాత్రేయ శర్మగారి నేతృత్వంతో కార్తీక్ కు అతని మాతృమూర్తికి శాలువా ,నగదు,గులాబిమాల , జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేశారు .సరసభారతి తరఫున కార్తీక్ కు శాలువా కప్పి 500రూపాయల నగదు ,సరసభారతి రెండు పుస్తకాలు బహూకరిచాను నేను . తర్వాత చాలామంది నగదు ,శాలువాలు అందించి తమ అభిమానం చాటారు .దత్తాత్రేయ శర్మ గారు నాకు 500రూపాయలు కవర్ లోపెట్టి అందజేశారు .
యుటిఎఫ్ మాజీఅధ్యక్షులు ,తెలుగుభాషా సాంస్కృతిక సమాఖ్య మాజీఅధ్యక్షులు స్వర్గీయ శ్రీ పెనుబోతు వెంకటేశ్వరరావు గారి స్మారక సాహిత్య కార్యక్రమ౦ గా జరిగిన ఈ కార్యక్రమం ఆయన సేవలను బహుధాకొనియాడి ఘననివాళి ఘటించారు .ఈ మొత్తం కార్య క్రమానికి రూపశిల్పి ,నిర్వహణ చేసిన శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ అభినందనీయులు .
నన్ను ఒక కార్యకర్త బైక్ మీద బస్ స్టాండ్ లో దింపగా రాత్రి 9-30 బస్ ఎక్కి ఉయ్యూరుకు రాత్రి 10-45కు చేరి ,ఇంత మజ్జిగన్నం తిని పడుకొన్నాను .
రేపు27-10-19 దీపావళి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-19-ఉయ్యూరు