గౌతమీ మహాత్మ్యం-57
గంగ ఉత్తర ఒడ్డునున్న నారసింహ తీర్ధం సర్వ రక్షాకం .హిరణ్య కశిపుడు బలపరాక్రమాలతో దేవతలను జయించి ,హరిభక్తుడైన తనకొడుకు ప్రహ్లాదునిపై ద్వేషం తో స్తంభం లో ఉంటె చూపించమంటే ,ఉన్నాడంటే, గదతో స్తంభాన్ని కొట్ట గా అందులోనుంచి శ్రీహరి నారసింహ రూపం లో ఉద్భవించి ,తన విశ్వాత్మను ఆవిష్కారం చేసి హిరణ్యకశిపుని గోళ్ళతో చీల్చి చంపి ,దైత్యసైన్య సంహారం చేసి మహోగ్రరూపంతో ,రసాతలం లోని శత్రువులనూ చంపి ,స్వర్గానికి వెళ్లి అక్కడి రాక్షసులను భూలోక పర్వతాలపై ఉన్న రాక్షసులను ,సముద్ర, నదులలోని వారినీ, గ్రామ, వనవాస దైత్యులను సంహారం చేసి ,ఆకాశం చేరి అక్కడున్నవారిని, వాయువు ,జ్యోతిర్లోకం లో ఉన్న రాక్షసులను పరిమార్చి,పిడుగుకంటే కఠినాలైన గోళ్ళతో ,బాగాపెరిగిన జూలుతో ,మహా నాదం చేస్తూ వీర విహారం చేసి ,గౌతమీ తీరం చేరాడు ..
అక్కడ అంబర్య అనే దండకాధిపుడైన శత్రువు ఉంటె వాడితో భీకరపోరాటం చేసి ,గౌతమి ఉత్తర తీరాన వాడిని మట్టుపెట్టాడు .ఈ తీర్ధమే నారసి౦హతీర్ధ౦ .ఇక్కడ నారసింహ దైవం ఎల్లప్పుడూ ఉంటూ భక్తులకోర్కెలు తీరుస్తాడు అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
81-పైశాచ తీర్ధం
నారదునికి బ్రహ్మ పైశాచక తీర్ధ వివరాలు చెప్పాడు .ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు పిశాచ రూపం పొంది ఇక్కడ ముక్తి పొందటం తో ఆపేరొచ్చింది .’’సుయవుని ‘’ కొడుకు అజీగర్తుడు కుటు౦బభారం ,దరిద్రం తో బాధపడుతున్నాడు .అతని ముగ్గురుకొడుకులలో మధ్యవాడు శునశ్శేఫుడు గొప్పబ్రహ్మవాది .ఇతడిని ఒక క్షత్రియుడికి యాగ పశువుగా బాగా ధనం తీసుకొని సంహరించటానికి అమ్మేశాడు తండ్రి .కొడుకును సంహరించటం అనే పాపం అతనికి చేరి ,నయంకాని రోగంతో తీవ్రంగా బాధపడి చనిపోయి ,నరకం చేరాడు .యమాజ్ఞచే అనేక యోనులలో జన్మించాడు .చివరికి పిశాచ రూపం పొందగా యమదూతలు వాడిని నిర్జనారణ్యంలో తోసేశారు డు .ఇదీ అతడి ఫ్లాష్ బాక్ ..
పశ్చాత్తాపంతో ఏడవటం మొదలెట్టాడు .ఒక రోజు శునశ్శేఫుడు అటుగా వెడుతూ పిశాచి రోదనం విని ,జాలిపడి ,ఎవరని అడిగితె శునస్షేఫుని తండ్రినని తన వృత్తాంతమంతా వినిపించాడు .అప్పుడు కొడుకు తండ్రి దీనావస్థకు దుఃఖించి ‘’తండ్రీ !నన్ను విక్రయించి నరకానికి వెళ్లావు .నేనిప్పుడు నిన్ను స్వర్గానికి పంపిస్తాను ‘’అని విశ్వామిత్రుని దత్తపుత్రుడు ,తన నిజపుత్రుడు ఐన తనకన్నతండ్రికి ఉత్తమలోక ప్రాప్తికోసం గంగానది కి చేరి ధ్యానించటం ప్రారంభింఛి ప్రేత రూపు దైన తండ్రికి జలాంజలి ఇచ్చాడు .జలదాన మాత్రం చేత అతడికి పిశాచరూపం పోయి,అజీగర్తి పుణ్య శరీరం పొందాడు .అరవై వేల సూర్యుల తే గంగామాత అనుగ్రహంతో అజీగర్తుడు ,దేవతా సంఘం నడిపే దివ్య విమానం లో వైకుంఠం చేరాడు .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’పిశాచ నాశక తీర్ధం ‘’గా విలసిల్లింది అని బ్రహ్మ నారదునికి వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-19-ఉయ్యూరు