పరమధార్మికుడు ఐలుడనే పురూరవరాజు ఊర్వశి ని చేబట్టి,కొద్దిగా నెయ్యిమాత్రమే తాగుతూ తపస్సు చేస్తుండగా ఊర్వశి వచ్చి అతడిని ఉద్రేకపరచి వివస్త్రుడుగా అయ్యాక ,ఆమె పాన్పు పై పడుకోగా అతడు పాన్పు చేరగా ,అతడు నియమోల్ల౦ఘన చేశాడని వెళ్ళిపోయింది ,అతడు నగ్నంగా కనిపించనంతవరకే అతని వద్ద ఉంటానని ఇదివరకే వారిద్దరిమధ్య ఒప్పందం ఉంది .తాను నగ్నంగా ఎందుకయ్యాడో తెలీక ,శత్రురాజు మీదకు వస్తే జయించి దేవలోకం చేరాడు .తిరిగి వచ్చి కులగురువు వశిష్టుని వలన ఊర్వశి వెళ్ళిపోవటం తెలుసుకొని ,విరహంతో నిరాశా దుఖం ,నిస్పృహలతో నిత్య కృత్యాలన్నీ మానేశాడు .వసిస్టు డు వచ్చి ‘’ఆమె ఇవాళ చనిపోయింది .స్త్రీలమనస్సులు కుక్కలలాంటివి .వంచన ,నృశంసత్వం ,చంచలత్వం, దుశ్శీలం వారి నైజాలు.ప్రతివారు స్త్రీలమాయలో పడిపోతారు .దుఃఖించక కర్తవ్యమాలోచి౦చు ‘’అన్నాడు .ఊరట చెందిన రాజు గౌతమీ నది చేరి నది గర్భం లో నిలబడి శివ ,జనార్దన బ్రాహ్మ భాస్కర గంగలను ధ్యానించాడు .తర్వాత శివునిపైనే ధ్యానముంచాడు .సంసారం త్యజించి అనేక యాగాలు చేసి ,రుత్విక్కులను భారీ దక్షిణలతో సంతృప్తి చెందించాడు .అందుకే ఇది యజ్ఞ ద్వీపమని వేద ద్వీపమని పిలువబడుతోంది .ప్రతిపౌర్ణమి రాత్రి ఊర్వశి అక్కడకు వచ్చి వెడుతుంది .ఈద్వీపానికి చేసిన ప్రదక్షిణ సమస్త పృధ్వికి చేసిన ప్రదక్షిణతో సమానం .ఇక్కడ వేదం స్మరించినా చదివినా ,వేదఫలం ,యాగ ఫలం పొందుతారు .దీనికే ఐల తీర్ధం పురూరవ తీర్ధం వాసిష్ట తీర్ధం ,నిమ్న భేద తీర్ధం అని పేర్లు .ఐలమహారాజు పాలనలో ఏ కర్మలమీద నిమ్నభావం ఉ౦డేదికాదుకనుక ఆపేరు సార్ధకమైంది .ఇక్కడ సర్వ భావమే తప్ప నిమ్నభావన లేదు .ఇక్కడి స్నాన జప దానాలన్నీ పరలోక ప్రాప్తి కలిగిస్తాయని బ్రహ్మ నారదునికి వివరించాడు .
83-ఆనంద తీర్ధం
నారదునికి బ్రహ్మ దేవుడు ఆనంద తీర్ధ మహాత్మ్యాన్ని వివరించాడు –అత్రిపుత్రుడు ‘’చంద్రమా ‘మహా తేజస్వి .గురువు బృహస్పతి నుండి సర్వ విద్యలు నేర్చాడు .ఇంకా ఏవైనా ఉంటె వాటినీ సాధించి గురుపూజ చేస్తానని గురువుకు చెప్పాడు .తనభార్య తార అనుమతిస్తే అలాగే అన్నాడు .ఇంటిలోపలికి వెళ్లి ,గురుపత్ని తారను చూసి మోహపరవశుడై ,తన నివాసానికి లాక్కెళ్ళా డు .గురువుకు తెలిసి చంద్రుని శపించాడు ,,యుద్ధమూ చేశాడు .కాని చంద్రుడు చావ లేదు .నిర్భయంగా తారను మందిరానికి తీసుకువెళ్ళి ,భార్య రోహిణి తోపాటు అనేక సంవత్సరాలు సుఖం అనుభవించాడు .గురువు సర్వ ప్రయత్నాలు చేసినా శిష్యుడిని ఏమీచేయలేక ,చేసేదీ లేక నీతి వాక్యాలు స్మరిస్తూ ఉన్నాడు .
బృహస్పతి రాక్షసగురువు శుక్రుని దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్ళబోసుకొన్నాడు .సోదర గురువుకు జరిగిన అవమానానికి కినిసి కవి అంటే శుక్రుడు ‘’నీ భార్యను తెచ్చి నీకు అప్పగించేదాకా నీరు త్రాగను, భోజనం చేయను,నిద్రపోను ‘’అని ప్రతిజ్ఞ చేసి ,అభయమిచ్చి ,’’నీ భార్యను నీదగ్గరకు చేర్చాక,గురుద్రోహి చంద్రుని శపించిన తర్వాతే ఏదైనా తింటాను ‘’అని చెప్పి వెళ్ళాడు .శుక్రుడు శంకరుని పూజించి అన్నివరాలు పొందాడు. గురు శుక్రులిద్దరుకలిసి చంద్రుడున్న చోటుకు వెళ్ళారు .చంద్రుని ‘’కుష్టు వ్యాధితో బాధపడు ‘’అని శపించాడు .ఈశాపం వెంటనే తగిలి చంద్రుడు క్షీణించటం మొదలుపెట్టి ఇక చేసేదిలేక తారను వదిలేశాడు . తార చేయిపట్టుకొని శుక్రుడు సర్వ రుషిగణ,పితృ గణ,ఓషధీ గణ,పతివ్రతాగణాలను పిలిచి తారకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని ప్రశ్నించాడు .అప్పుడు శ్రుతి’’బృహస్పతితో కలిసి తార గౌతమీ స్నానం చేస్తే పవిత్రమౌతుంది ‘’అని చెప్పింది .తారా బృహస్పతులు అలాగే గౌతమీ స్నానం చేయగా ,దేవతలు పుష్పవర్షం కురిపించగా ,జయశబ్దం భూ నభోన్తరాలలో మర్మ్రోగింది .దేవతలు దిగివచ్చి ఆదంపతులను ఆశీర్వదించారు .మనుషులు, రాజులు తార పవిత్రతను శ్లాఘించి బృహస్పతికి ఇచ్చారు .ఇక్కడే మహా తీర్ధం ఏర్పడి శుక్ర బృహస్పతి తారలకు సకల జనులకు ఆనందం క్షేమం ,పాప విధ్వంసం ,సర్వకామదం అయినందున ఆనంద తీర్ధం అయింది .గురువు గౌతమితో ‘’నువ్వు సదా పూజ్యురాలవు .ముక్తి దాయినివి .నేను అంటే బృహస్పతి సింహ రాశిలో ఉండగా త్రైలోక్య పావనివి అవుతావు .అప్పుడు అన్ని తీర్దాలు నీలో చేరతాయి ‘’అన్నాడు .శివుని వాహనం నంది ఇక్కడ ఎప్పుడూ ఉంటాడుకనుక ‘’నంది తీర్ధం ‘’అనే పేరుకూడా వచ్చింది అని బ్రహ్మ నారదునికి వివరించాడు .
సశేషం
నాగులచవితి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-19-ఉయ్యూరు