శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ షస్టాస్టకం.చుక్కెదురే .మామగారి మాటంటే తృణప్రాయం అల్లుడికి ..కాని పరోక్షంగా మామగారి పాండిత్యాన్ని మెచ్చి గౌరవించే వారు .ఇదో విపరీత స్వతంత్ర పధ్ధతి ఆయనది .ఫాలాక్షుడికి కూడా భయపడని తత్త్వం .సముద్రమంత పాండిత్యం .సరస కవితా శక్తి ,విజయనగర రాజాస్థానం లో విశేష గౌరవం ఉన్నవారు .ఆయనకిచ్చే రాచగౌరవం అలాంటి ఇలాంటిది కాదు .విజయనగర సంస్థానాధీశులు విజయరామ గజపతి ఆస్థాన పండితులు శ్రీ పేరి వెంకటశాస్త్రులుగారు .యువరాజు శ్రీ ఆనంద గజపతి ఆస్థాన పండితులు, ఆస్థానకవి ,శ్రీ పేరి కాశీ విశ్వ నాథ శాస్త్రులు గారు .ఆతండ్రీ తనయులవద్ద,ఈతండ్రీ కొడుకులు ఆస్థాన పండితులన్నమాట . ,విశ్వనాథశాస్త్రి గారు ప్రతిరోజూ వచ్చి యువరాజావారి మహల్ లో శాస్త్ర గోస్టీ,కవిత్వ చర్చ చాల చనువుగా జరిపేవారు .
ఒక రోజు మధ్యాహ్నం 4గంటలకు శాస్త్రిగారు కోటలోకి వెడుతుంటే ,తండ్రీకొడుకులు మొతీమహల్ డాబాపై ఏదో మాట్లాడుకొంటూ పచార్లు చేస్తున్నారు .విజయరామ గజపతి గారు ‘’ఎవరా పెద్దమనిషి ,గొడుగు దించకుండా వస్తున్నాడు ‘’అని ప్యూన్ ని కేకేశారు .బంట్రోతు గబగబా పరిగెత్తుకొస్తున్నాడు .దగ్గరకొచ్చాడంటే,ఆ గొడుగు మనిషి కాళ్ళూ, చేతులూ విరిచేసేవాడే .మహారాజలు తప్ప వేరెవరూ కోటలో గొడుకు వేసుకోవటం మహాపరాధం .,గొప్పనేరం .ఆధిపత్యమే కాదు ఏకచ్చత్రాదిపత్యం కూడాకదా వారిది .యువరాజు ఎందుకో అటువైపు చూడగాశాస్త్రి గారిని గుర్తుపట్టి తండ్రితో ‘’ఆ వచ్చేది మన కాశీ విశ్వనాధ శాస్త్రులవారు .మన ఆస్థాన పండితులకుమారులు . ఆస్థాన మర్యాదలు ఉల్లంఘి చేవారుకాదు .ఏదో పొరబాటున అలా వచ్చి ఉంటారు .ఇది ప్రథమ తప్పిదంగా సర్కారు మన్నించాలి –ఆయన స్థానం లోనేను క్షమాపణ చెబుతున్నాను ‘’అన్నారు .వెంటనే మహా రాజు బంట్రోతుకు ఏదో సౌ౦జ్న చేశారు .దానితో బంట్రోతు వెనక్కి తగ్గాడు .లేకుంటే కాశీ శాస్త్రులుగారి కాలూ చేయీ కాశీలో కలిసిపోయేవి .మహాప్రమాదం నుంచి బయట పడ్డారు .శాస్త్రిగారు ఆనంద గజపతి మహల్ లో మామూలుగా కూర్చునేచోట కూర్చున్నారు .
కాసేపటికి యువరాజు వచ్చిఅభివాదం చేసి ‘’ఏమిటండీ ఈ రోజు చాలా పొరబాటు చేశారే?’’అనగా ‘’ఏం పొరబాటు ?’’అన్నారు శాస్త్రీజీ .’’కోటలోకి గొడుగు వేసుకురావటం మహాపరాధం కాదంటారా ?’’అన్న ప్రశ్నకు ‘’మహాపరాధమే ప్రభో !.అందుకే నేను రోజూ మొదటి గేటు బయటే గొడుగు ముడుచుకొని మరీ వస్తాను.ఈ రోజూ అంతే చేశాను ‘’అన్నారు .’’లేదు శాస్త్రీజీ !మూడు గేట్లు దాటి మోతీమహల్ఎదురుగా నడుస్తూ కూడా గొడుగు తీయలేదు .మేమే స్వయంగా చూశాం .మహారాజులు౦గారు మహా ఆగ్రహపడ్డారు .మీ బదులు మేము క్షమాపణ చెప్పి శాంతి౦పజేశాం .చాలా ప్రమాదం తప్పింది ‘’అన్నారు యువరాజా .తెల్లబోయిన శాస్త్రిగారు ‘’ఇప్పటికీ గొడుగు ముడుచుకొని వచ్చాననే భ్రా౦తిలోనే ఉన్నానుప్రభూ .ఒక కల్పన స్ఫురించి శ్లోకంగా అల్లుకొంటూ మీకు వినిపించాలనే తదేక దృష్టిలో రావటం వలన గొడుగు మాట మరచి పోయి ఉంటాను క్షమించాలి ‘’అన్నారు అత్యంత వినయంగా శాస్త్రీజీ .
‘’ఇప్పటికే క్షమించేశాం .ఆకల్పన శ్లోకం వినిపించండి ‘’అనగానే శాస్త్రిగారు వినిపించగా కల్పనా, శ్లోకం రెండూ బాగున్నాయని యువరాజా మెచ్సి ,పాలు భంగూ ,మిఠాయి తెప్పించి ఆనందంగా ఆనంద గజపతి ,కాశీ విశ్వనాథ శాస్త్రిగారు కలిసి సేవించారు .పండితులను గౌరవించే విషయం లో ఆనందగజపతి మహారాజా చాలా నిక్కచ్చిగా ఉంటారు .
మరో ముచ్చట చూద్దాం .పాణిని వ్యాకరణం లో పరిషే౦దుశేఖరానికి వాక్యార్ధ చంద్రిక ,శబ్ద రత్నాకరానికి చిత్రప్రభ అనే గొప్ప వ్యాఖ్యానాలు రాసిన శ్రీ భాగవతుల హరి శాస్త్రులుగారు విజయనగర ఆస్థాన పండితులుగా ,కాశీలో ,విజీనగరంలో ,కోటిపల్లి లో ఉంటూండే వారు .వీరికంటే కొంచెం పెద్దలు శ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రిగారు ,కాశీలోనే చదువుకొని ,మహా వైయాకరణులై,కాశీలో స్థిర నివాసమేర్పరచుకొన్నారు .పాణినీయ వ్యాకరణం లో ఆయన మహా వీరులని ప్రసిద్ధి . నిస్పృహులు ,అతి స్వతంత్రులు కనుక రాజాస్థాన ఉద్యోగాలు చేయలేదు .ఆనందగజపతి స్వయంగా పండితులుకనుక ,శాస్త్రిగారితో బాగా పరిచయం ఉండటమేకాక ,కాశీలోని తమసంస్థానం లో కొన్ని సార్లు ఉండి వచ్చేవారు .
ఒక రోజు దండిభట్లవారు కాశీలో బయల్దేరి ఎక్కడికో వెడుతూ ,విజయనగరం లోదిగి ,సరాసరి ఆనంద గజపతిమహలు ఏదని కనుక్కొంటూ మూడు దేవిడీలు ,నాలుగు పారాలు దాటి,నాలుగవ విచ్చుకత్తుల పారా దగ్గరకు వెళ్లి హిందూ స్థానీలో పహారా వాళ్ళతో మాట్లాడి ,ఈయన్ను అడ్డగిస్తే ,తమకు శిక్ష పడుతుందేమో నని భయపడుతూ మిన్నకున్నారు .శాస్త్రిగారు పెద్ద వస్తాదులాగా,చేఎత్తు విగ్రహం ,మాసిన గడ్డం 9 మూరల దుక్క పంచ, లోపల ముతకబనీను మోకాళ్ళదాకా బొత్తాలు సరిగ్గా పెట్టని పెద్ద లాం కోటు (లాంగ్ కోట్ ) ,బుజం పై జమిలి నేత తెల్లదుప్పటి,నెత్తిన తట్టంత తలపాగా ,చేతిలో సంచీకూడా లేకుండా వచ్చారు కోటుకుఎడాపెడా జేబుల్లో యెంత సరుకైనా పెట్టుకోవచ్చు .చక్కని మాట .కాశీలో ఆన౦ద గజపతి తనకు స్నేహితులని ఠీవిగా చెబుతున్నారు .వాళ్ళూ హిందూ స్థానీయులేకనుక ఈయన్ని అడ్డగించలేదు .
సరాసరి మహల్ లోకి వెళ్లి ఒక కుర్చీలో కూర్చున్నారు .ఒకనౌకరు దగ్గరకొచ్చి దండాలుపెడుతూ ‘’ఏమిటి సెలవు బాబూ !’’అని గౌరవంగా అడిగాడు .’’ఏమీ లేదు .మహారాజా వారితో కాశీనుంచి దండిభట్ల విశ్వనాథం వచ్చాడు ‘’అని చెప్పు అన్నారు బాగా బిగ్గరగా .మహారాజుకు వినబడి గుర్తుపట్టి ,వెంటనే వచ్చి ‘’ఎప్పుడు దయ చేశారు ?మాకు వ్రాయకుండానే వచ్చారు ?కాశీ నుంచేనా ,ఎక్కడికి ప్రయాణం ?’’అని అడిగారు .కాశీను౦చే కాని ఎక్కడికో తెలీదు .ఎటో తిరిగివద్దామని బుద్ధిపుట్టి బయల్దేరాను .రైలులో బరంపురం దాటాక జేబు తడుముకొంటే ‘’భంగు ‘’అయిపొయింది .తెలుగు దేశం లో అది దొరకదు ఎలా అనుకొంటే విజయనగరం జ్ఞాపకమొచ్చి మీదగ్గర ఉంటుందికదా అని దిగి వచ్చాను ‘’అన్నారు శాస్త్రీజీ .మహారాజు సంజ్ఞ తో నిమిషంలో అక్కడ ఒకపళ్ళెం లో భంగుముద్దా ,ఒకపళ్ళెం లో మిఠాయీ ,గ్లాసులో పాలు వచ్చేశాయి .ఇద్దరూకలిసి సేవించారు .మరి కొంచెం భంగు ,మిఠాయితెచ్చారు .వీటిని పొట్లాలు కట్టించుకొని జేబుల్లో కుక్కుకుని ‘’ఇక నే వెడతాను ‘’అన్నారు శాస్త్రిగారు .
‘’అదేమిటి శాస్త్రీజీ !ఆస్థాన పండితులను రప్పిస్తాం .నాలుగు రోజులుండి వెళ్ళండి ‘’అని కోరారు రాజా .’’అబ్బే !నేనెవరి ఇంటా ఉండను .ఇక్కడికైనా భంగుకోసమే వచ్చా.వెనక్కి కాశీ వెళ్ళిపోతా .ఈలోపు స్టేషన్ దగ్గర మంచుకొండ వారి సత్రం లో ఉండి,రేపు ఉదయం 10గంటల రైలుకు వెళ్ళిపోతాను .ఇంటికి వెళ్ళేదాకా భోజనం చేయను ‘’అని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు .
ఆ సాయంత్రం ఆస్థాన పండితులు వస్తే ,సత్రంలో శాస్త్రి గారి దర్శనం చేయమని చెప్పగా మర్నాడు ఉదయం వారు వెళ్లి కలిసి ,తమ ఇళ్ళకు రమ్మని చాలా ఆర్తిగా ప్రార్ధించినా ‘’ఆ మాట వదిలేయండి .మీరంతా వచ్చారు సంతోషం .శిష్యులను కూడా తీసుకొచ్చారు .వీరిలో వ్యాకరణ పండితులున్నారా ?’’అని అడగ్గా ‘’తమరు వారిని పరీక్షించమని మనవి ‘’అన్నారు వారు పరీక్షించి బాగుందని మెచ్చి ‘’శేఖరం ‘’చదువుతున్నఈకుర్రాడు బాగా పనికొస్తాడు కానీ ఇస్త్రీ బట్టలు ,ఆషోకు శాస్త్రానికి పనికి రాదు .అందరూ జాగ్రత్తగా చదువుకోండి ‘’అని హితవు చెప్పారు .ఆ ఇస్త్రీబట్టల షోకులకుర్రాడు మరెవ్వరోకాదు .శ్రీ తాతారాయుడు శాస్త్రి గారే . ఉదయం విశ్వనాథ శాస్త్రిగారిని అందరూకలిసి స్టేషన్ కు సగౌరవం గా తీసుకువెళ్ళి ,10గంటల రైలు ఎక్కించి ‘’టికెట్టు ఎక్కడికి తీయ మంటారు ?’’అని వాళ్ళు అడిగితె ‘’అబ్బే!నాకు రైలులో ఎప్పుడూ టికెట్టు లేదు .ఆ కష్టం మీకు అక్కర్లేదు .మీరంతా వెళ్ళండి ‘’అని చెప్పగా వీడ్కోలు పలికి ఇంటిదారిపట్టారు ఆస్థాన విద్వాంసులు .శిష్యబృందం .
ఆధారం –శ్రీ దువ్వూరివారి స్వీయచరిత్ర
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-19-ఉయ్యూరు
—