గౌతమీ మహాత్మ్యం-59
84-భావ తీర్థం
భవుడు వెలసినదే భావతీర్దం..సర్వ ధర్మ పారంగతుడు ప్రాచీన బర్హి మూడున్నర కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన సూర్య వంశ క్షత్రియ రాజు .వార్ధక్యం లో భార్యా ,పిల్లలు సమస్తం వదిలేస్తాననుకొన్నాడు .ప్రజలు ఆది వ్యాధులు లేకుండా సుభిక్షంగా ఉన్నారు .ఒక సారి పుత్రులకోసం గౌతమీ తీరం లో యజ్ఞం చేస్తే ,శివుడు ప్రీతి చెంది ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పుత్రుని ప్రసాదించమని బర్హి దంపతులు కోరారు .అప్పుడు అతనిని ముక్కంటి తన మూడవ కంటిని చూడమన్నాడు . బర్హి చూడగా ఆనేత్ర కాంతినుంచి పుత్రుడు జన్మించాడు .అతనికి ‘’మహిమా ‘’అనే పేరు .అతడు చేసిన స్తోత్రం శివ మహిమన స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది .ఆతీర్ధాన్ని తీర్ధ రాజమయేట్లు చేయమని కోరాడు .సరే అన్నాడు భవుడు అదే భావ తీర్ధం .ఇక్కడ 70పుణ్య తీర్దాలున్నాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
85-సహస్ర కుండాఖ్య తీర్థం
పూర్వం శ్రీరామచంద్రుడు సముద్రానికిసేతువు నిర్మించి ,లంకను చేరి రావణాది రాక్షస సంహారం చేసి ,అగ్నిపునీత సీతాదేవిని పిలిచి తన అన్కమున కూర్చోటానికి అర్హత పొందిందని చెప్పాడు .కాని హనుమ అ౦గదాదులు అది సరైన మాట కాదన్నారు .అయోధ్యకు వెళ్లి సర్వ నృపతుల, తల్లుల సోదరుల, పురజనుల సమక్షం లో రామాన్కస్థిత కావాలని చెప్పారు . వీరి మాటలుకాదని విభీషణ, లక్ష్మణ,జాంబవంతుల మాట విని, రాముడు సీతా దేవిని సాదరంగా పిలువగా శ్రీరామ అంక పీఠం ఆరోహించింది సీతాసాధ్వి .అక్కడి వారంతా సంతోషించాగా .అందరూ పుష్పక విమానం లో అయోధ్యకు బయల్దేరి వెళ్లగా ,అయోధ్యలో శ్రీ రామునికి పట్టాభి షేకం వైభవోపేతంగా జరిగింది .
కొంతకాలానికి ఒక అనార్యుని మాటలకు రాముడు నిండు గర్భిణి యైన సీతను పరిత్యజించాడు .రామాజ్ఞపై లక్ష్మణుడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర ఆమె ఏ తప్పూచేయలేదని తెలిసినా వదిలి పెట్టి వచ్చాడు .కొన్నేళ్ళకు రాముడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించి .సీతారాములకుమారులు లవ కుశులు రామాస్థానం లో నారద తు౦బు రుల్లాగా రామాయణాన్ని గానం చేశారు .వారిని తనకుమారులుగా గుర్తించి రాముడు దగ్గరకు పిలిచి పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం అనుభవించాడు .ఆనందం, దుఖం తో రాముడు మాటిమాటికీ వారిని మళ్ళీ మళ్ళీ కౌగిలించుకొని ,మనసులో ఏదో ధ్యానిస్తూ ,ఉండగా లంకావాసులైన విభీష ణాది రాక్షసులు, సుగ్రీవ ,అంగద ,జాంబవంతాది వానర ప్రముఖులు వచ్చి ,రాముని చూసి సీతా దేవికనపడకపోవటం తో ద్వారపాలకులను అడుగగా ,వారు రాముడు సీతను వదిలి పెట్టాడని చెప్పగా, వారంతా అగ్ని పునీత సీతను లోకాపవాద భీతితో వదిలిపెట్టటం ధర్మకాదని ,ఇక తమకు మరణమే శరణ్యమని భావించి గౌతెమీతీరం చేరారు ..
వారి వెనుకనే రామ పరివారం వెళ్ళారు .అందరూసీతా దేవి రాకకోసం గొప్ప తపస్సు చేయాలనుకొన్నారు. రాముడు అందరితో కలిసి గౌతమీ స్నానం చేసి, శివారాధన తత్పరుడయ్యాడు .చాలాకాలం తపస్సు చేసి పరితాపాన్ని పోగొట్టుకొన్నాడు .ఇక్కడే రాముడు పాప హరం, సర్వ ఆపత్ నివారకం అయిన హోమాన్ని వేయి కుండాలలో వసుధారతో చేశాడు. ఈ తీర్ధమే ‘’సహస్ర కుండ తీర్ధం ‘’గా ప్రఖ్యాతి పొందింది .ఇక్కడి స్నాన దానాలు సహస్ర ఫలప్రాప్తి కలిగిస్తాయి అని నారదునికి బ్రహ్మ తెలియ జేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-19-ఉయ్యూరు