ఇద్దరూ ఇద్దరే మహానుభావులు
శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రామం మసకపల్లి లో కాకర్లపూడి నరసరాజుగారు క్షత్రియ కుటుంబాలలో మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు పుట్టటానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపోయారు .శాస్త్రిగారు విజయనగరం కాలేజి లో పని చేస్తుండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొంఠి లక్ష్మీ నరసింహ శాస్త్రి ‘’మన ఊళ్ళో రాజుగారొకరు నీకు కొద్దిగా సొమ్ము బాకీ ఉన్నారని ,అది ఇచ్చేయ్యటానికి సిద్ధంగా ఉన్నానని ,నీకు కబురు చేయమన్నారు ‘’అని ఉత్తరం రాశాడు .ఈ కబురు వచ్చేనాటికి శాస్త్రిగారికి 20,రాజుగారికి 70ఏళ్ళు .
శాస్త్రిగారికి కావ్యాలు బోధించిన పినతాతగారు లింగయ్య శాస్త్రులగారికీ రాజుగారికీ మంచి స్నేహం .రాజుగారు లంకలో వ్యవసాయం చేస్తూ పెట్టుబడులకు అవసరమైన డబ్బుఊల్లో బ్రాహ్మణ్యం దగ్గర తీసుకొంటూ ,పంటరాగానే తీర్చేవారు .కొన్నేళ్ళకు వ్యవసాయం కలిసిరాక ఊళ్ళో బ్రాహ్మలకు సుమారు 12వందల రూపాయలు బాకీ పడ్డారు .తీర్చలేక ,రోజూ వారు అడుగుతూ ఒత్తిడి చేస్తే ఊళ్ళో ఉండలేక మకాం ఎత్తేసి ,భద్రాచలానికి చాలాదూరం ఏజెన్సీ ప్రాంతం చేరి, అక్కడ పొలం సాగు చేస్తూ కాలక్షేపం చేశారు .చేతిలో డబ్బు ఆడినప్పుడు ఇలా చిల్లరబాకీలు తీసుకొన్నవాళ్ళందరికీ ,12ఏళ్ళ కాలం లో బాకీలు తీర్చేశారు .ప్రోనోట్ల బాకీ 380మిగిలి ఉంది .అందులో ఒకటి 250,ఒకటియాభై ,ఒకటి ఎనభై.ఉన్నాయి అందులో 80 ప్రోనోటు శాస్త్రిగారి పినతాతగారిది .కాలదోషం పడుతున్న తరుణం లో మొదటివారిద్దరూ ,రాజుగారికిఎన్ని సార్లు ఉత్తరాలు రాసినా జవాబు లేకపోవటంతో ఊళ్ళో ,ఆకెళ్ళ రమణయ్య అనే లౌక్యుని సంప్రదించి కాకినాడ కోర్టు లో దావాలు వేయించారు .భద్రచాలానికి చాలాదూరంగా ఉన్న రాజుగారికి ఉత్తరాలు అంది ఉండకపోవచ్చు .
ఒకసారి రాజుగారికి రమణయ్యగారు రైలు లో కనిపించగా ,దావాల విషయం అడిగి ,తనకు దావాలు వేయించటం ఇష్టం లేదని వాళ్ళిద్దరి బలవంతం మీద దాఖలు చేశానని చెప్పారు రమణయ్య .అప్పుడు రాజుగారు ‘’లింగయ్య శాస్త్రి గారి నోటు ఒకటి ఉండాలికదా .అదీ మీ దస్తూరితో రాసి౦దేనని జ్ఞాపకం .దాని మాటేమిటి ?’’అని అడిగారు .అప్పుడు రమణయ్యగారు ‘’అవునండీ రాజుగారూ !మీరంటే జ్ఞాపకం వచ్చింది .కోర్టుపక్షిని ,పాపాల భైరవుడినీ నేనేకనుక శాస్త్రులు బావగారికి కూడా జ్ఞాపకం చేశాను .కాకినాడ వెడుతున్నాను నోటు ఇస్తే కోర్టులో దాఖలు చేస్తాను అని చెప్పాను .అప్పుడు శాస్త్రిగారు ‘’అవునోయ్ రమణయ్య బావా !ఏమిటి నీ వెర్రి .నరసరాజు గారి కంఠం లో ప్రాణం ఉండగా ప్రోనోటుకు కాలదోషం ఏమిటి ?దావాలూ తంటాలు మనకేమీ వద్దు ‘’అన్నారని అందుకే ఆనోటుకు దావా పడలేదని రాజుగారికి రమణయ్యగారు చెప్పారు .ఇది విన్న రాజుగారు తెల్లబోయి ‘’మళ్ళీ సెలవియ్యండి’’ అని అడిగి చెప్పించుకొని ‘’ఎంత విలువైన మాట అన్నారు .లింగయ్యగారు ఆయనకు నామీద యెంత విశ్వాసం ?నాపై దావాలు వేసినవాళ్ళు ఏం తీసుకొంటారో కోర్టే తేల్చనివ్వండి ‘’అన్నారు తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు .ఇది జరిగి అప్పటికి 40 ఏళ్ళయింది .దావాలు వేసినవారిద్దరూ ,వేయించిన రమణయ్యగారూ చనిపోయారు .
ఉత్తరం అందగానే దువ్వూరివారు మసకపల్లి వెళ్లి స్నేహితుడిని కలిశారు .ఆయన రాజుగారు రాయమంటే తాను ఉత్తరం రాశానని ఆయన చెప్పాడు .ఉదయం 9గంటలకు అందరూ దువ్వూరి వారి అరుగుమీద కూర్చున్నారు .రాజుగారు వచ్చారు .కుశల ప్రశ్నలైన తర్వాత రాజుగారు ‘’స్వయంగా నేనే మీకు మనవి చేయాలని ఉత్తరం రాయించాను .శ్రమపడి దయ చేశారు .మీరు నాకు తెలియదు .లింగయ్య శాస్త్రి గారి కి మనవలున్నట్లే నాకు తెలీదు .వారి కుటుంబం లో లో ఎవరున్నారని వాకబు చేయగా మీ సంగతి తెలిసింది .మీ తాతగారికి నామీద విపరీతమైన అభిమానం .అవసరాలకు రెండుసార్లువారిదగ్గర నలభై,నలభై చేబదులు తీసుకొని సమయానికివ్వలేక, ఏకంగా 80రూపాయలకు ప్రోనోటు వ్రాశాను .ఎవరు ఎన్ని చెప్పినా ఆయన నామీద దావావేయ్యలేదు సరికదా ‘’నరసరాజు కంఠం లో ప్రాణముండగా ప్రోనోటుకు కాలదోషమేమిటి ‘’?అన్నారని రమణయ్యగారి ద్వారా తెలిసింది .ఎప్పటికైనా వారి వారసులకు ఆడబ్బు ఇచ్చేసి రుణ విముక్తుడిని కావాలని తాపత్రయ పడుతున్నాను .వారి కుటుంబంలో మూడవ తరం దాకా ఇది కుదరలేదు .ఆఎనభైకి వడ్డీ లెక్క వేస్తె ఎనో రెట్లు అవుతుంది .అక్కడికి వెళ్ళినా గౌరవంగా కాలక్షేపం చేస్తున్నానే కాని పెద్దగా సంపాది౦చి౦ది లేదు .తాతగారిమీద అభిమానం ,నా పరిస్థితి గమనించి మీరు యెంత ఇమ్మంటే అంతా ఇచ్చి రుణ విమోచకుడిని అవుతాను .ఈ అరుగుమీదే లింగయ్యగారి దగ్గర అప్పు తీసుకొన్నాను కనుక ఇక్కడే మీ బాకీ తీర్చాలని వచ్చాను .మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలనే కోరికా ఉంది .నా పిచ్చి ఊహతో మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను మన్నించండి’’ అన్నారు ఆర్తిగా .
దువ్వూరి వారు ‘’తమరెవరోనాకు, నేనెవరో మీకు తెలీదు .మీ బాకీ మాట నేను ఎవరివల్లా వినను కూడా లేదు .కనుక నేను చెప్పదలచుకోలేదు .మీకు యెంత తోస్తే అంతా ఇవ్వండి ఎక్కువా తక్కువా అనుకోను .నిర్ణయం మీదే ‘’అన్నారు రాజుగారితో . రాజుగారు ‘’నాకు తోచింది ఇస్తే రుణవిముక్తి అనిపించుకోదు .నామనసూ సంతోషించదు కూడా . తమరే సెలవియ్యండి’’అన్నారు .దువ్వూరివారు ‘’అసలు సంగతే మనం మాట్లాడుకొందాం. వడ్డీ సంగతి వదిలెయ్యండి .ఆ ఎనభైరూపాయలు ఇచ్చేస్తే బాకీ పూర్తిగా తీర్చినట్లు నేను భావిస్తాను ‘’అన్నారు .ఆమాట అనగానే రాజుగారు తానూ తొడుక్కున’’ కళ్ళీలాల్చి’’బిగువై పోయే౦తగా ‘’పొంగిపోయారు .అందరూ శాస్త్రిగారిని ‘’చాలాబాగా చెప్పావు .చిన్నవాడివైనా చాలాదూరం ఆలోచించావు ‘’అని అభినదించారు .రాజుగారు ఖండువా కొంగున కట్టుకొచ్చిన మూట విప్పారు .అందులో ఖచ్చితంగా 80 వెండి రూపాయలున్నాయి.వాటిని నాలుగు దొంతర్లుగా పెట్టి ‘’తీయించండి ‘’అన్నారు ‘’మా లింగయ్యన్నగారికన్నా తమరు నామీద ఎక్కువ అనుగ్రహం చూపించారు ‘’అన్నారు రాజుగారు కృతజ్ఞతగా .శాస్త్రిగారు ‘’అదేమీ కాదండి. అది అనుగ్రహమే అయితే ,అది నాది కాదు .తాతగారికీ మీకూ ఉన్న స్నేహానిది ‘’అని ఉచిత రీతిని చెప్పారు .రాజు గారు ఆనందంగా వెళ్ళిపోయారు .దువ్వూరివారు విజీనగరం బయల్దేరి వెళ్ళారు .ఇద్దరోఇద్దరే మహానుభావులు .
ఆధారం –దువ్వూరివారిస్వీయ చరిత్ర
.మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-19-ఉయ్యూరు
.