కద్రూ కొడుకులైన నాగులకు దాసుడుగా,తల్లి వినత చేసిన పందెం వలన ఉండాల్సి వచ్చి,భరించలేక ఏకాంతం లో దుఖిస్తూ ‘’ఇతరులకు సేవ చేయనివారు ధన్యులు ,పుణ్యాత్ములు .వారు తమ శరీరాలకు ప్రభువులై సుఖ,ఆనందాలు పొందుతారు .పరతంత్రులజీవితం దుర్భరం నీచం నింద్యం ‘’అని తల్లిని చేరి ‘’ఎవరి అపరాధం వలన నువ్వు దాసీ అయ్యావు ?కారణం చెప్పు ‘’అని ప్రార్ధించాడు .అరుణుని తమ్ముడైన వైనతేయునితో తల్లి ‘’నేనూ మీ పినతల్లి కద్రూ పందెం కాశాము. ఓడిపోయినవారు దాస్యం చేయాలని నేనే పందెం కాశాను కనుక తప్పు నాదే .ఆమె కపటోపాయం తో నన్ను జయించిందినేను దాసినయ్యాను. నాతో పాటు ఆ దురదృష్టం నీకూ పట్టింది ‘’అని వివరించింది . ఒకప్పుడు కద్రువ వినతతో ‘’నీ కొడుకు దాసీ పుత్రుడైనా సూర్యుని నమస్కరించటానికి అడ్డులేకుండా వెళ్ళగలడు.నువ్వు ధన్యురాలవు త్రిలోక పూజితవు ‘’అన్నది .ఆశ్చర్యపడిన వినత సవతితో ‘’నీ కొడుకులు కవి అంటే సూర్యుని చూడటానికి ఎందుకు వెళ్లరు ?’’అని అడిగింది .కద్రూ గరుడిని ‘’నాకోడుకుల్ని నాగాలయమైన పాతాళానికి తీసుకు వెళ్లి .అక్కడి చల్లని సరస్సు దగ్గర వదలమని చెప్పు ‘’అనగా అలాగే చేశాడు .కద్రు వినతతో ‘’నా కొడుకులు నాగుల్ని నీకొడుకు దేవ నివాసానికి తీసుకు వెళ్ళేట్లు చేయి ‘’అనగానే అలానే చేశాడు గరుడ .మళ్ళీ ‘’నాకోడుకుల్ని రోజూ సూర్యుని వద్దకు నీకొడుకు తీసుకు వెళ్ళేట్లు చెయ్యి దాసీ ‘’అన్నది .భయపడుతూ వినత ‘’ సరే ‘’అనగా వినతాపుత్రుడు నాగులను అందర్నీ తనపై అధిరోహింప జేసుకొని సూర్యుని చేరబోగా ,ఆ మహోష్ణానికి తట్టుకోలేక సర్పాలు భయ భీతి తో ‘’సూర్యతాపానికి ఒళ్లుకాలిపోతున్నాయి. మమ్మల్ని మళ్ళీ మా అమ్మదగ్గరకు చేర్చు ‘’అని కోరగా ,వినకుండా సూర్యదర్శనం చేయిస్తానని సూర్య సంముఖానికి వారితో చేరాడు .నాగాలలో వేలకొలది పడగలన్నీ కాలికమురు కంపు కొడుతూ ‘’వీరణం ‘’అనేద్వీపం లో పడి పోయాయి .విషయం తెలిసిన కద్రువ వారిని ఓదార్చటానికి వెళ్ళింది .వినతతో ‘’నీకోడుకు దుష్టబుద్ధితో దుష్కార్యం చేశాడు .దీనికి శాంతిలేదు .కాశ్యపుడైన ఫణీశ్వరుడు ఆదిశేషుడు ఇక్కడ ఉంటే పిల్లలకు శాంతికలుగుతుంది ‘’అనగా ,ఆమె కొడుకుతో ‘’నీ పని బాగాలేదు వినయం ఉండాలి .శత్రువులకు కూడా అపకారం చేయకపోవటం సజ్జన లక్షణం ‘’అని హితవు చెప్పి ‘’నీకొడుకులు ముసలితనం పొందారు .వారికి శాంతి ఏమిటో చెప్పు నాకొడుకు చేస్తాడు ‘’అన్నది .కద్రూ ‘’రసాతలం లో ఉన్న శీతలజలం నా కొడుకులకు శాంతి చేకూరుస్తుంది ‘’అనగా క్షణం లో పాతాళం వెళ్లి వైనతేయుడు అజలం తెచ్చి నాగులపై అభి షేకింఛి శతక్రతువైన దేవేంద్రుని తో ‘’ముల్లోకాలకు శుభాలు చేకూర్చే మేఘాలు ఇక్కడ వర్షించేట్లు చేయి ‘’అని కోరగా వర్షాలు కురిసి ,నాగులన్నిటికి మహా శాంతి లభించింది .ఈ ప్రదేశమే నాగాలయం .నాగుల ముసలితనం పోగొట్టిన రసాతల పవిత్రజలం ,నాగులకు సంజీవని ఔషధం అయిందో అది అమృత ప్రవాహమై ‘’వంజరా ‘’పేరు తో వర్ధిల్లి ,జరా, దారిద్ర్య, సంతాప హరణం అయి ,ఒక లక్షా ఇరవై ఐదు తీర్దాలతో విరాజిల్లుతోంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
91-దేవాగమ తీర్ధం
ధనం కోసం సురాసురులు పోటీపడ్డారు .స్వర్గం దేవతలకు, భూమి రాక్షసులకు ఆవాసభూమి అయ్యాయి .అసుర గణం భూమి అంతా ఆక్రమించి విస్తరించారు .దుర్బుద్ధితో దేవతల యజ్ఞభాగాలను అపహరించి ,దాతలను హి౦సిచగా ,దేవతలకు యజ్ఞభాగాలు లేక బ్రహ్మ దగ్గర మొర పెడితే ,అసురులతో యుద్ధం చేసి భూమి సంపాదించి ,యజ్ఞయాగాదులు చేసి కీర్తి పొందమని చెప్పాడు .
దైత్య దానవ రాక్షసులంతా కలిసి బలగర్వంతోఅందులో ముఖ్యంగా అహి త్వాష్ట్రి,వృత్రుడు బలి,నముచి శంబరుడు శంఖుడు మొదలైనవారు వీరా వేశంతో యుద్దోన్మత్తులయ్యారు .అగ్ని ,ఇంద్ర వరుణ ,త్వష్ట , పూషా ,అశ్వినులు ,మరుద్గణాలు లోకపాలకాది దేవతా సమూహమంతా యుద్ధానికి బయల్దేరారు .దానవులంతా దక్షిణ దిక్కున మొహరిల్లి మంత్రా లోచన చేశారు .మొదట త్రికూట పర్వతం వారి ఆవాసభూమి అయింది .దేవతలు కూడా ఇక్కడికే చేరారు .వీరంతా యుద్ధం చేసిన చోటే మలయపర్వతం .ఆప్రాంతమే మలయ దేశం .ఇక్కడ శివుడు గౌతమి తీరం లో నిత్యనివాసి ..
దివ్య రథాలతో సురులు గౌతమీ పులిన తీరం చేరి భవు నారాధించి తమకు మేలు చేయమని కోరారు .దేవతలకు ఒక్కటే శరణ్యం విజయమో వీర స్వర్గమో .అని భావిస్తుంటే ఆశరీరవాణి’’దుఖం వద్దు .వెంటనే గౌతమి చేరి అక్కడ హర హరిలను ఆరాధించండి ‘’అన్నవాక్కు వినిపించి ,హరిహరుల ఆశీస్సులతో దేవతలు యుద్ధం లో గెలిచి వారివారి స్థానాలకు వెళ్ళిపోయారు .దేవతలు ఆగమనం పొందినదే ‘’దేవాగమ’’ దేవప్రియ తీర్ధం ‘’.అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .ఇదే కరీంనగర్ జిల్లా మంథెనలోని గోదావరి నది మధ్యలో ఉన్న ‘’సహస్ర లింగ క్షేత్రం ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-19-ఉయ్యూరు