కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం
డా .కామేశ్వరికి ట్రాన్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రాస్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ 1970-74లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న చోటికి రావటం ,నాన్న దగ్గర నాలుగైదు రోజులు ఉండటం జరుగుతూనే ఉంది .నాన్నను చూడాలనే కోరిక ఆమెకు ఎక్కువో ,తల్లి ని చూడాలనే ఈయన కోర్కె ఎక్కువో తేల్చుకోలేక పోయారిద్దరూ .ఇదో విధమైన రుణాను బంధం అన్నారు శాస్త్రిగారు .జన్మలుమారినా ప్రేమలు, అభిమానాలు అక్కడక్కడ గోచరిస్తూనే ఉంటాయి ,కామేశ్వరి ఎప్పుడు కలిసినా పెద్దలతో ,పిన్నలతో ‘’ఈయన నాకొడుకు ‘’అనే పరిచయం చేస్తుంది .ఉత్తరాలలో కూడా తల్లి కొడుక్కి రాసినట్లే రాస్తుంది .’’నువ్వు ‘’అంటు౦దే కానీ ఎన్నడూ ‘’మీరు ‘’అననే అనదు.
దువ్వూరి’’ శాస్త్రి కొడుకు గారి ‘’వొళ్ళో పడుకొంటుంది .’’ఏ పూర్వ జన్మలోనో నీకు తల్లినై ఉంటాను నాన్నా !’’అంటుంది శాస్త్రిగారికీ అదే నిశ్చయం .ఆమె భర్తకూడా అంతే చనువుతో ఉండటం మరీ ఆశ్చర్యం .అదొక గొప్ప సంస్కారం .అతడు 1968లో ఎం.ఏ.పాసై ,ఇంగ్లాండ్ వెళ్లి ,ఏదో పరిశోధన చేశాడు .మధ్యమధ్యలో వచ్చి భార్యాపిల్లల్ని చూసి వెడుతూ ఉండేవాడు .ఇద్దరుకొడుకులు పాండిచ్చేరి అరవిందాశ్రమం లో చదివారు .తర్వాత ఒకడు మెడిసిన్, ఇంకోడు ఇంజనీరింగ్ చదివి సెటిలయ్యారు .కామేశ్వరి దంపతులు నాన్న ను చూడటానికి వచ్చేవారు .భర్త యెదుటనే కామేశ్వరి కొడుకైన శాస్త్రిగారి వొడిలో తలపెట్టుకొని పడుకొని భర్తతో ‘’నాన్న వొళ్ళో తలపెట్టుకొని పడుకుంటే యెంత ప్రశాంతంగా ఉంటోందో !ఆ అనుభవం మీకు లేదుకదా ‘’అని ఆటపట్టించేది .జలంధర్ నుంచో కలకత్తా నుంచో తిరువన్నామలై వెడుతూ ,మధ్యలో దాక్షారామ దగ్గర దువ్వూరి వారి స్వగ్రామం మసకపల్లి వెళ్లి’’ నాన్న’’ ను ఒకటి రెండు సార్లు చూసి వెళ్ళింది’’ తల్లి’’ డా.కామేశ్వరి . దువ్వూరి వారి కుటుంబం అందరితోనూ అదే చనువుతో ఉండేది .మగపిల్లలను అన్నా, తమ్ముడూ ఆడపిల్లలను అక్కా, చెల్లీ అని ఆప్యాయంగా పిలిచేది .శాస్త్రిగారి దౌహిత్రి నాగమణి అంటే కామేశ్వరికి మహా ప్రీతి .నాగమణి కి కూడా ఆమెపై ‘’కంచి కామాక్షి అమ్మవారిపై ఉన్నంత గౌరవ ఆదరాలు’’ .దీనికి కారణం ఎవరూ చెప్పలేరు ‘’కస్యచిత్ క్వచిత్ ప్రీతిః’’అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరిపై ప్రేమ ఏర్పడుతుంది .ఎందుకో చెప్పలేము .అది చెప్పలేకే జన్మాంతర సంబంధంగా భావిస్తాము .డా .కామేశ్వరిలో ఆధ్యాత్మిక భావమూ చాలా ఎక్కువే .నిత్యపూజ, దేవీధ్యానం ,దేవీ స్తోత్రం అంతా పరమ పవిత్రంగా ఉండి ముచ్చట,ఆశ్చర్యం తన్మయత్వం కలిగిస్తుంది .ప్రతియేడూ తిరువన్నామలై వెళ్లి గురు సాన్నిధ్యంలో కొంత సేపు గడిపిరావటం ఆమె ప్రత్యేకత .దేశం లో ఆమె చూడని క్షేత్రం లేనేలేదు .ఆమె తండ్రిగారు సన్యాసాశ్రమం స్వీకరించి సుమారు 20ఏళ్ళు తపస్సు చేసి సిద్ధి పొందారు .ఆ ఆధ్యాత్మిక సంస్కారం కూతురు కామేశ్వరిలో బాగా సంక్రమించింది .
రిటైరైన దువ్వూరి వారిదగ్గరకొచ్చి నప్పుడల్లా ‘’నాన్నా !ఒకరి నిర్బంధం లో లేకుండా ఇప్పుడు స్వేచ్చగా ఉన్నావుకదా.వచ్చి నా దగ్గరే ఉండు నాన్నా !ఖాళీగా ఉన్నప్పుడల్లా మనమిద్దరం కలిసి పుణ్యక్షేత్రాలు తిరిగొద్దాం .డాక్టరైన నీ కూతురు నీదగ్గరే ఉంటు౦దికనుక ఆరోగ్యానికి భయం లేదు ‘’అనేది .అలా అంటూనే ఉంది .ఈయనా వెళ్ళాలనే అనుకొంటారు .కాని .అవి ‘’తీరే కోర్కేలా ‘’అంటారు శాస్త్రీజీ .చివరికి ‘’కొన్ని కోర్కెలు తొలగించుకోలేము ‘’అని మనసుకు సమాధానం చెప్పుకొన్నారుకళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు .
ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-19-ఉయ్యూరు