గౌతమీ మహాత్మ్యం-65
94-సరస్వతీ తీర్ధం
పుష్పోత్మటం తూర్పున ,గౌతమికి దక్షిణాన ‘’శుభ్రం ‘’అనే పర్వతం బాగా ప్రసిద్ధి చెందింది .దానిపై శాకల్యుడు అనే ముని తపస్సు చేస్తు౦డగా,సమస్త ప్రాణికోటి అతనిన్ని స్తుతిస్తూ ,నమస్కరి౦చేది . అక్కడే ‘’పరశువు ‘’అనే రాక్షసుడు కామ రూపియై బ్రాహ్మణ ,పులి ,స్త్రీ ,బాలరూపాలు ధరించి రోజూ శాకల్యముని తపో భంగం చేసి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు చేశాడు .కాని విఫలుడయ్యాడు .ఒక రోజు ఆ ముని తపస్సు అయ్యాక భోజనానికి వస్తుండగా ,ఆమాయావి దుర్బల బ్రాహ్మణ వేషం తోఒక కన్యకతో వచ్చి ‘’మేమిద్దరం భోజనానికి వచ్చాం .ఆతిధ్యమిచ్చినవారు సర్వ శ్రేస్టులు ‘’అన్నాడు .
వాడి కపటం తెలీక ముని అతడికి మర్యాద చేసి భోజనం పెట్టాడు .ఆపోశన వేశాక ‘’పరశువు ‘’అతిధి కోరిన కోరిక తీర్చటం లోకమర్యాద.నేను కోరింది తీరుస్తానంటే భోజనం చేస్తాను ‘’అని మెలికపెట్టాడు.’’అడిగింది ఇస్తా .తినండి ‘’అన్నాడు ముని .అప్పుడు వాడు ‘’నేను పరశువు అనే రాక్షసుడను .నీకు శత్రువును కాను ,నావి తెల్లబడిన వెంట్రుకలు కావు .దేహం మాత్రం సుష్కించింది .నిన్ను, నీ అనుచరులను ఎత్తుకుపోయి తిని ఆకలి తీర్చుకొంటాను ‘’అన్నాడు .
శాకల్యముని వాడితో ‘’నాది వజ్ర శరీరం .అయినా ఒకమాట చెప్పాలినీకు .అతిధివికనుక హితం చెప్పటం నా విధి .నన్ను శ్రీహరి సకల దిక్కులలోనూ రక్షిస్తూ ఉంటాడు .నాపాదాలను విష్ణువు శిరస్సు జనార్దనుడు ,పృస్టాన్నికూర్మరాజు ,హృదయాన్ని శ్రీ కృష్ణుడు ,వరాహమూర్తి బాహువులను ,నృసింహస్వామి వ్రేళ్ళను ,పక్షివాహనుడు నేత్రాలను ,వాగీశుడు ముఖాన్ని ,కుబేరుడు చెవులను శివుడు అంతటా రక్షించుగాక .నారాయణుడే నాకు శరణు .ఆకలితో ఉన్నావు కనుక నన్ను తీసుకు వెళ్లి తిని ఆకలి తీర్చుకో ‘’అన్నాడు నిర్భయంగా . పరశు రాక్షసుడు ‘’మహాత్మా !నువ్వు సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు స్వరూపంగా కనిపిస్తున్నావు .వేదస్వరూపునిగా ,జగన్మయుడివిగా దర్శన మిస్తున్నావు .కనుక నువ్వే నాకు శరణు .నా అజ్ఞానం పటాపంచలైంది .ఇనుము సువర్ణం అయినట్లు ఉందినాకు ‘’అన్నాడు .
అప్పుడు శాకల్యమౌని కృపతో ‘’గౌతమీ తీరం చేరి ,సరస్వతీ దేవి అనుగ్రహం సాధించు .జనార్దనుడిని స్తుతించు .అన్నిటికీ తరుణోపాయం నారాయణ స్తోత్రమే ‘’అని చెప్పాడు .వాడు వెంటనే వెళ్లి పావన గౌతమీ స్నానం చేసి శుచిగా నిష్టగా గంగకు అభిముఖంగా కూర్చుని జగజ్జనని సరస్వతి దేవి దర్శన భాగ్యం పొందాడు .పాపాలన్నీ తొలగిపోయి పరిశుద్ధుడై ,.పరిశుద్ధ అంతరంగుడై ‘’అమ్మా !శాకల్య గురువు శ్రీ హరిని స్తుతించమని ‘చెప్పారు అనుగ్రహించి ఆ శక్తి నాకు కలిగించు ‘’అని వేడాడు .’’తధాస్తు ‘’అన్నది వాణీమాత .గీర్వాణి అనుగ్రహంతో విష్ణుమూర్తిని అనేక స్తోత్రాలతో మెప్పించాడు .మురారి సంతసించి’’నీమనసులో ఉన్న కోర్కె తీరుతుంది ‘’ అన్నాడు .అందరి అనుగ్రహం తో ఆ రాక్షసుడు స్వర్గం చేరాడు .ఈ ప్రదేశమే సరస్వతీ తీర్ధం .ఈశ్వేత పర్వతం నుంచి సారస్వతం ,వైష్ణవం ,శాకల్యం ,పరశు అనే తీర్దాలేర్పడినాయి అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-19-ఉయ్యూరు