సర్వ శాంతి కలిగించే ‘’చిచ్చిక తీర్ధం ‘’గోదావరి ఉత్తర తీరాన ఉన్నది .చిచ్చుక అనే పక్షిరాజును గండ భేరుండం గా,శ్వేత పర్వతం పై ఉంటూ ప్రసిద్ధి చెందింది .అక్కడ మహర్షులు ప్రశాంతంగా తపస్సు చేసుకొంటారు .సర్వవిధ వృక్షాలు అక్కడ ఉంటాయి .రోగాలు రొస్టులు ఉండవు .ధర్మ నిరతుడైనతూర్పు దేశ క్షత్రియరాజు పవమానుడు మంత్రి సామంత పురోహిత సైన్య సమేతుడై అక్కడ ఉన్నాడు .ఒక రోజు మృగయావినోదం కోసం స్త్రీలతో సహా అరణ్యాలకు వెళ్ళాడు .అలసి ఒక చెట్టుకింద విశ్రమించాడు .అక్కడ రెండుముఖాలున్న సుందరమైన విచారంగా ఉన్న ఒక పక్షిని చూసి ఆశ్చర్యపోయి ‘’ఎందుకు విచారం గా ఉన్నావు .ఇక్కడ అందరూ ఆయిగా ఉంటె నీకెందుకు విచారం ?’’అని అడిగాడు .
చిచ్చికపక్షి రాజుతో ‘’నాకు ఎవరి వలనా ఎవరికీ నావల్లా భయం లేదు .ఈ పర్వతం శూన్యంగా ఉందేమిటని చూస్తున్నాను .నాకు కొంతైనా సుఖం,సంతృప్తి కలగటం లేదు .నిద్ర ,ఆనందం విశ్రాంతి నాకు లేవు .అందుకే నా చింత ‘’అన్నది .రాజు ‘’అసలు నువ్వెవరవు .ఈపర్వత౦ ఎందుకు శూన్యమైంది .రెండు తలలున్నా సంతృప్తి ఎందుకు లేదు .ఈజన్మలోకాని గత జన్మలోకాని ఏదైనా దుష్కృతం చేశావా ?’’అని అడగగా నిట్టూరుస్తూ ఆ పక్షి ‘’పూర్వజన్మలో నేను వేదవేదాంగ పారంగతుడనైన బ్రాహ్మణుడను .జ్ఞాన విజ్ఞానాలున్నా ఇతరులపనులు చెడగొట్టేవాడిని .కలహ ప్రియు డిని .ఎదురుగా ఒకరకంగా, చాటుగా వేరొకరకంగా మాట్లాడే వాడిని .బాగుపదేవాళ్లను చూసి ఈర్ష్యపడేవాడిని .కృతఘ్నత ,పరనింద ,గురుద్రోహం డాంబికం ,నా స్వభావం .మనోవాక్కాయలచే అందరినీ హిసించేవాడిని .నేను చేయనిపాపం లేదు .నావంటి ద్రొహిమరొకడు ఉండడు.అందుకే రెండు ముఖాలతో అంటే’’ స్ప్లిట్ పర్సనాలిటి ‘’తోపుట్టాను కనుక ఇక్కడ అంతా దుఖమే కనిపిస్తోంది .కపట వినయం వలన పాపం కలుగుతుంది .డాంబికం తో సదాచారం లో ఉన్నట్లు నటించేవాడిని .అందుకే ఈ పక్షి రూపం .అయినా ఎంతోకొంత మంచి చేశాను .నా పూర్వజన్మ ను తలుచుకొంటూ ఉంటాను ‘’అన్నది .
రాజు పవమానుడు చిచ్చిక పక్షితో ‘’ఏ కర్మవలన నీకు ముక్తికలుగుతుంది ?’’అని అడుగగా పక్షి ‘’గౌతమికి ఉత్తరాన గదాధరతీర్ధం పవిత్రమైనది .నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు .నీ దయవలన ఆక్షేత్ర సందర్శన చేసి నా సకల పాపాలు తొలగించుకొంటాను ‘’అన్నది .దయతో రాజు ఆపక్షికి గదాధర క్షేత్ర సందర్శనభాగ్యం కలిగించి ,గౌతమిలో స్నానం చేయించాడు .చిచ్చిక ‘’అమ్మా గౌతమీ !నిన్ను చూడని వాడు పాపి .ఇప్పుడు నీ దివ్య దర్శనం కలిగింది నాపాపాలన్నీ క్షాళన చేసి పుణ్యం కట్టుకో ‘’అని ప్రార్ధించి స్నానించి గదాధరునిసేవించి అందరూ చూస్తుండగా స్వర్గానికి చేరింది .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’చిచ్చిక తీర్ధం’’ , ‘’పవమాన తీర్ధం ‘’అనే పేరుతో విరాజిల్లుతోంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-19-ఉయ్యూరు