గౌతమీ మహాత్మ్యం-67
96-భద్ర తీర్ధం
త్వష్ట ప్రజాపతి కూతురు ఉష సూర్యుని భార్య .ఛాయ రెండవ భార్య.ఈమె కొడుకే శని .ఇతని సోదరి విస్టి భయంకరాకార కురూపి . ఈమెను ఎవరికిచ్ఛి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు తండ్రి .అప్పుడు విస్టి తండ్రితో ‘’కన్యను తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తే తండ్రి కృతార్దుడౌతాడు .కన్యకు పదేళ్ళు దాటక పూర్వమే పెళ్లి చేయాలి .సద్గుణుడికి ఇవ్వాలి లేకపోతె నరకం అనుభవిస్తాడు .కన్యాదాన౦ అక్షయ పుణ్య ప్రదం ‘’అన్నది తండ్రి సూర్యునితో .సూర్యుడు ఆమె తో ‘’నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు .నీ గుణం ఒక్కటే గొప్పది మిగిలినవన్నీ తక్కువే కదా .నువ్వు ఒప్పుకొంటే ఇవాళే ఎవరికో ఒకరికిచ్చి వివాహం చేస్తాను ‘’అన్నాడు .దీనికి విస్టి’’పూర్వ జన్మ కృతం అందరూ అనుభవించాల్సిందే .మన వంశ ఆచారం తగినట్లు చేయి ‘’అని చెప్పింది .
సూర్యుడు ఆమె మాటలప్రకారం త్వష్ట ప్రజాపతి కొడుకు ,భీషణాకారుడు ,శీలా సంపన్నుడు విశ్వ రూపుడు కు విస్టి నిచ్చి వివాహం చేశాడు .ఇద్దరు అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు .వీరికి గండుడు,అతి గండుడు ,రక్తాక్షుడు ,క్రోధనుడు ,వ్యయుడు ,దుర్ముఖుడు ,చివరగా హర్షణుడు అనే కొడుకులు పుట్టారు .చివరికొడుకు సత్ప్రవర్తన తో ,మనోహర రూపంతో శుచిగా ఉండేవాడు .ఇతడోకసారి మేనమామ యమ ధర్మరాజును చూడటానికి వెళ్ళాడు .యమలోకం లో దుఖితులను, సుఖం పొండుతున్నవారినీ చూసి మేనమామ ను సనాతన ధర్మం అంటే ఏమిటో వివరించమని కోరాడు .
యముడు తనమేనల్లుడు హర్షణుడితో ‘’ఎప్పుడూ విధ్యుక్త ధర్మం చేసేవారు నరకానికి రారు .శాస్త్రం ఆచారం ,వేదం ,పండితుల ఎడల గౌరవం చూపని వారు ,విధ్యుక్త ధర్మాన్ని అతిక్రమించిన వారు నరకం పొందుతారు ‘’అన్నాడు .అప్పుడు హర్షణుడు ‘’మా తండ్రి ,తల్లి విస్టి నా సోదరులు అందరూ కురూపులే .వీరంతా శాంత స్వభావం సుందర రూపం నిర్దోషులు ,మంగళ కర్మాచారులు అవటానికి వారికోసం నేనేమి చేయాలో ఉపదేశించు ‘’అని ప్రార్ధించాడు .యముడు సంతోషం తో ‘’నీ పేరుకు తగిన సద్గుణాలున్న వాడివి .నీకు చాలామంది కొడుకులు పుడతారు. కాని వంశ ప్రతిష్ట పెంచలేరు .కనుక మీ అందరికీ మంచి జరగాలంటే గౌతమీ నదికి వెళ్లి స్నానం చేసి ,ఏకాగ్రతతతో శ్రీ మహా విష్ణువును స్తుతించి ప్రసన్నం చేసుకో .ఆయనే నీ కోరికలన్నీ తీర్చగలడు’’అని హితోపదేశం చేశాడు .
ఆలస్యం చేయకుండా హర్షణుడు గోదావరికి వెళ్లి నదీ స్నానం తో శుచియై ,శ్రీ హరి ని స్తుతించాడు .స్తోత్రాలకు హర్షమానసుడైన విష్ణుమూర్తి హర్షణుడితో ‘’నీ సమస్త అమంగళాలు ఉపశమన పూర్వకంగా మంగళమగుగాక ‘’అన్నాడు .వెంటనే తల్లి విస్టి,తండ్రి ,సోదరులు అందరూ మంగళాకారులుగా మారారు .పుత్రులుకూడా భద్రులు అనే పేరుతో శోభిల్లారు .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’భద్ర తీర్ధం ‘’అయింది .ఇక్కడ జనార్దనుడు కొలువుండి ,సమస్తకోరికలు తీరుస్తున్నాడు అని బ్రహ్మ నారదునికి వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-19-ఉయ్యూరు