దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత ‘’రమణీయం ‘’గుర్తుకొస్తాయి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు ఆసాంతం చదివి హస్త, మేధోగతం చేసుకొన్నారు .1914విజయనగరం మహారాజాకాలేజిలో విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో సంజ్ఞాపరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రారంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు వ్యాకరణాలు చప్పచప్పగా ఉంటాయని అంటారే ,కాని సూరి వ్యాకరణం లో సూత్రాలు, వృత్తులు ఉదాహరణలు ‘’పాణినీయం ‘’లోమాదిరి పట్టుగా ముద్దుగా బాగున్నాయే ‘’అనిపించింది .ఈ భావన కలిగిన 60ఏళ్ళ తర్వాత 1974 లో కూడా ఆ అభిప్రాయం సుస్థిరమైఁదే కాని వీసమెత్తు తగ్గలేదు .పైగా రోజురోజుకూ బలపడుతూనే ఉంది .
విద్వాన్ పాసై అదేకాలేజి లో ఉపాధ్యాడుగాచేరి బాల వ్యాకరణం బోధించే అవసరం కలిగింది శాస్త్రి గారికి .ఆ వరుసలో 45 ఏళ్ళు బాలవ్యాకరణ౦ భాషా ప్రవీణ క్లాసుల్లో ఎం .ఏ .క్లాసుల్లో అవిచ్చిన్నంగా బోధించారు .మొదటి పదేళ్ళ తర్వాత సూరి రచనలో పాండిత్యం ,పటుత్వం మాత్రమె కాక మరేదో చమత్కారం ,సౌకుమార్యం ఉన్నట్లు కనబడింది .’’వ్యాకరణం లో ఇదేమిటి చెప్నా !’’అనుకొన్నారు .ఆలోచిస్తుండగా క్రమంగా ప్రతిమాటలో ఏదో సారస్యం ,ముద్దుముద్దుగా ముచ్చటగా ఉన్నట్లు అనిపించేది .పాఠం చెబుతున్న శాస్త్రి గారికే కాక వినే విద్యార్దులకూ ఉత్సాహంగా ,ఉల్లాసంగా అనిపించేది .అన్ని పాఠాలకన్నాబాల వ్యాకరణ పాఠంఎంతో వినోదంగా కనిపించేది .శాస్త్రిగారికే ప్రీతికాదు నేర్చుకొంటున్న శిష్యులకు కూడా అదే రకమైన ప్రీతి జనించటం అత్యాశ్చర్యకరం .గ్రామర్ అంటే తలకాయ నెప్పి అనుకొనే విద్యార్ధులు ,సూరి వ్యాకరణం అంటే కావ్యం చదువుతున్నంత మహదానందం పొందేవారు. అది దువ్వూరివారి బోధనా విశేషం .
గురువుకూ శిష్యులకు అత్యంత ప్రీతికరమైన బాలవ్యాకరణం పాఠం నిత్యం జరిగిపోతూ ఏదో లోకం లో విహరిస్తున్న అనుభూతి కలిగించేది .మిగిలిన తెలుగు వ్యాకరణా లెలా ఉన్నాయో అని అన్నిటినీ ఒకపట్టు పట్టి చూశారు శాస్త్రీజీ .చూచినకొద్దీ చిన్నయ సూరి’’ మహా పెద్దయ్య సూరి’’అనే భావమే ఎక్కువైంది .దానిముందు సూర్యునిముంది దివిటీలు అనిపించాయి .సూరి ప్రత్యేకత మరింత స్పష్టంగా దర్శనమిచ్చింది .సూరి మాటలమధ్య చమత్కారం ఆనందం ,ఆహ్లాదం పె౦చాయి .
ఇలా మరో పదేళ్ళు గడిచిపోయాయి .ఒక రోజు బాలవ్యాకరణ పీఠిక లో శాస్త్రిగారికి ‘’అనయము లలితోక్తులతో నొనరు పడం గూర్చి లక్ష్య యోజన మొప్పంగను బాలవ్యాకరణం బనగా లక్షణ మొనర్తు నాన్ద్రంబునకున్ ‘’అన్న పద్యం కనబడింది .రోజూ చూసే పద్యమే .’’అయితేనేం అంతవరకూ అందులోని అక్షరాలు కనిపించాయే కాని ,అంతరార్ధం స్పురించలేదు .’’లలితోక్తులతో వొనరు పడం గూర్చి లక్ష్య యోజనమొప్పన్’’అంటాడేమిటి అంటే చెప్పే మాటా ,ఇచ్చే ఉదాహరణ లలితంగా ఉండేట్లు కూర్పు కూరుస్తున్నాను అంటాడేమిటి .ఇంకా మనం అతని లాలిత్యం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే .ఈ దృష్టి తనలో ఉన్నట్లు స్పష్టంగా చెప్పాడే ‘’అనుకోని ‘’యురేకా ‘’అని యెగిరి గంతేసినంత పని చేశారు న్యూటన్ యాపిల్ కిందపడటం ఎన్నో సార్లు చూసినా మొదటిసారి అందులో ఏదో వింత ఉన్నట్లు తెలుసుకొని సూత్రం కనిపెట్టినట్లు దువ్వూరి వారికి బాలవ్యాకరణం లో లలిత రమణీయ భావనలు స్పష్టంగా కనులముందు గోచరించాయి .ఈ దృష్టిని చెదిరి పోనివ్వకుండా జాగ్రత్త పడ్డారు .సూరి అక్షరాల వైపు చూస్తుంటే ఏదో కొత్త విషయం దృగ్గోచరమై మనసుకు ఉల్లాసం కలిగేది. ఆనందం తాండవించేది .ఈ భావనలు ఇప్పుడు విద్యార్ధులకు బోధనలో కూడా చోటు చేసుకోవటం తో వారిలోనూ రామనణీయభావనలు బలపడి మరింత స్పష్టయ్యాయి గురు శిష్యులకు .సూరి పాండిత్య ,లాలిత్య ,నైపుణ్యాలు స్పస్టమై గట్టిపడ్డాక శిష్యులకు ఉత్సాహంగా చెప్పి వారినీ’’ఎలివేట్’’ చేసేవారు .1940కి పూర్వమే ఈ భావనలు బలీయమై మనసులో ఉంటె కాదు వాటికి అక్షర రూప మివ్వాలి చిన్న పుస్తకంగా తేవాలి అనేది చిట్టిగూడూరు కాలేజిలో ఉండగానే నిశ్చయమైంది .ఐతే ఇంకెందుకు ఆలస్యం అని లేడికి చేచిందే పరుగుగా తొందరపడి రాత ప్రారంభించలేదు .ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకేమేమి విశేషాలు బయటపడుతాయో అని అనిపించింది .
చిన్నయ సూరి 18ఏళ్ళు అహోరాత్రాలు శ్రమించి ఆప్యాయనంగా సంతరించిన బాలవ్యాకరణం ‘’కొందరి వంచనా దృష్టితో శిస్టు కృష్ణ మూర్తికవి సంస్కృతీకరించి ‘’హరి కారికావళి’’అని పేరు పెట్టగా ,కల్లూరి వెంకటరామ శాస్త్రిగారు ‘’హరికారికా వళి’’యే మొదటి గ్రంథమని ,సూరి దాన్ని తెనిగించి బాలవ్యాకరణం ‘’అనే పేరు పెట్టాడని ,సూరికి అంత’’ దృశ్యం’’ లేదనీ ‘’అంటూ చాలా అభూతకల్పనలు చేశారు .ఇక ఊరుకొంటే లాభం లేదని దువ్వూరివారు ‘’బాలవ్యాకరణమే మూలం హరికారికావళి దీనికి అనువాదమే అని సిద్దాన్తరీకరించి 40పేజీల వ్యాసం రాస్తే 1933లో ‘’ఆంద్ర సారస్వత పరిషత్ పత్రిక ‘’ప్రచురించింది .శాస్త్రిగారి సిద్ధాంతాన్ని పండితులందరూ సమర్ధించి గొప్ప’’ బూస్ట్’’ ఇచ్చారు .తరువాత మరో వ్యాసం ‘’సూరి లలితోక్తి చాతురి ‘’అని 25పేజీల వ్యాసం రాస్తే అదే పత్రిక1960లో ప్రచురించింది .ఇలా రమణీయం రచనకు ఈ రెండు వ్యాసాలూ గొప్ప భూమికలయ్యాయి .
మరో రెండేళ్లకు రిటైరౌతారనగా దువ్వూరివారు రచనకు ఉపక్రమించారు .’’నాపేరు రమణ కనుక ‘’వా నామ దేయస్య అనే వార్తికం వలన రమణ శబ్దం వృద్ధ ప్రాతిపదిక కాకపోయినా వికల్పంగా ఛ ప్రత్యయం వచ్చి ‘’రమణీయ’’శబ్దం సాధువు కనుక ‘’రమణీయం ‘’పేరు పెడదామనుకొని చివరకు ఉభయతారకంగా ‘’రమణీయం ‘’ పేరు ఖాయమైంది’’అని చెప్పుకొన్నారు శాస్త్రిగారు. బాల వ్యాకరణానికి అప్పటికే రెండుమూడు టీకలు ప్రచురింపబడ్డాయి .ఆతీరులో వ్యాఖ్యానం రాయటానికి ఇష్టపడక ,వ్యాఖ్యాన రూపంగా కాక తనకు తోచిన విశేషాలను మాత్రమె రాస్తూ ,ఒక సమీక్షగా రాయలనుకొని ప్రణాళిక సిద్ధం చేసుకొని రాయటం మొదలు పెట్టారు .అదే సమయం లో ‘’సూరిగారి శతవార్షిక వర్ధంతి’’ దగ్గర పడింది .ఆఉత్సవాన్ని హైదరాబాద్ లో సాహిత్య అకాడెమి వారు వైబవంగా నిర్వహించారు .శాస్త్రిగారు అందులో సూరి పాండిత్య ,లాలిత్యాలపై గంట సేపు ప్రసంగించారు .అధ్యక్షులు కవిసామ్రాట్ విశ్వనాథ ఎంతో సంతోషించారు .సూరికి వారి వర్గం లో వారైన తాపీ ధర్మారావు కూడా సంతోషించి అభినందించారు .ఆ సందర్భంగా రమణీయం ముద్రణకు సాహిత్య అకాడెమి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు .
ఆంద్ర విశ్వ విద్యాల ప్రెస్ లో ముద్రిస్తే అందంగా పుస్తకం తయారౌతు౦దని ,తప్పులు దగ్గరుండి సరి చేయవచ్చు నని భావించి సిండికేటు కు లెటర్ పెట్టారు శాస్త్రిగారు. ఉచిత .ముద్రణమాట ఎత్తకుండా ,వెయ్యి రూపాయలు శాంక్షన్ చేసింది .3300రూపాయలు అడ్వాన్స్ ప్రెస్ కు ఇచ్చి ప్రెస్ డైరెక్టర్ ముత్తుస్వామిగారి పర్యవేక్షణలో మంచి గెటప్ తో ముద్రణ జరిపించారు .99శాతం ముద్రణ తప్పులు లేకుండా జరిగింది .హైదరాబాద్ శ్రీ కృష్ణ దేవరాయ నిలయంలో ఆవిష్కరణ ఉత్సవం జరపమని కార్యదర్శి డా బిరుదురాజు రారాజుగారు శాస్త్రిగారిని కోరారు .విశ్వనాథ అధ్యక్షులుగా ,దివాకర్ల వెంకటావదానిగారు వక్తలుగా డా బెజవాడ గోపాల రెడ్దిగారు ఆవిష్కరణ జరిపారు .వ్యాకరణ పుస్తకానికి ఇంతఅద్భుతమైన ‘’గెటప్పా’’అని అందరూ అవ్వాక్కై ఆశ్చర్యపోయి శాస్త్రిగారిని ప్రత్యేకంగా అభినందించారు .
దువ్వూరి వారి కృష్ణా –గుంటూరు జిల్లాల శిష్యులు తెనాలిలో ‘’రమణీయ సమ్మేళనం మూడు రోజులు ‘’నిర్వహించి శ్రీ వరదా చార్యులవారినీ ఆహ్వానించి ఘనంగా చేశారు .80 శిష్య బృందం పాల్గొన్న ఆసభలు దివ్యంగా మహా రమణీయంగా జరిగి రమణీయం రామణీయకాన్ని శతవిధాల పెంచాయి .శిష్యులు గురువుగారిని అత్యంత వైభవంగా సత్కరించి గురూణం తీర్చుకొన్నారు .సిండికేటు రూపాయి కూడా ‘’చేపకుండా ‘’ఆతర్వాత శాస్త్రిగారే ప్రెస్ కు 2800రూపాయలు బాకీ అని నోటీసు పంపింది .చివరికి పెద్దలంతా కూర్చుని జుట్టుపీక్కుని ముద్రణఖర్చు 3200రూపాయలే అయి౦ది కనుక తామే శాస్త్రిగారికి 100రూపాయలు బాకీ అని తేల్చి చివరికి ‘’మీ బాకీ సిండికేట్’’ ‘’వైవ్’’ చేసింది .మీ రేమీఇవ్వక్కర్లేదు’’ అని రిజిస్ట్రార్ కాగితం పంపటం తో రమణీయం రమణీయ నాటకం గా ముగిసింది .
ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-19-ఉయ్యూరు