గౌతమీ మహాత్మ్యం-68
97-పతత్రి తీర్ధం
కశ్యప ప్రజాపతి అరుణుడు ,గరుత్మంతుడు కుమారులు .ఈవంశం లోని వారే జటాయువు సంపాతి .ఈ ఇద్దరు బలగర్వం తో స్పర్ధతో ఆకాశానికి యెగిరి సూర్య దర్శనం చేయాలనుకొన్నారు .సూర్యతాపానికి తట్టుకోలేక ఇద్దరూ అలసిపోయి ఒక పర్వత శిఖరం పై పడిపోయారు .వీరిద్దరిని అరుణుడు చూసి విచారించి సూర్యునితో ఆ ఇద్దరినీ కాపాడమని వేడుకొన్నాడు .సరే అని రవి ఆ రెండుపక్షులను బ్రతికించాడు .గరుడుడు కూడా వీరి అవస్థ చూసి మహా విష్ణువుతో వచ్చి పరామర్శించాడు .వీరి తాపం పోవటానికి గంగా అనే గోదావరికి చేరి స్నానం చేసి తాపం పోగొట్టుకొన్నారు . అక్కడకు వచ్చిన విష్ణు శివుడు ,సూర్యుడు తీరం పై కొలువై ఉన్న తీర్ధమే పతత్రి తీర్ధం అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .
98-విప్ర తీర్ధం
నారాయణ తీర్ధం అనే విప్రతీర్ధం విఖ్యాతి చెందింది .అంతర్వేదిలో వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు .అతనిపుత్రులు దయాగుణమున్న వారు .అందులో చివరివాడు’’అసందిపుడు ‘’జ్ఞానం తెలివి తేటలూ కూడా ఉన్నవాడు .ఇతని వివాహానికి తండ్రి ప్రయత్నం చేస్తున్నాడు .ఒక రోజు రాత్రి యితడు విష్ణు స్మరణ చేయకుండా ,ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయాడు .అప్పుడొక రాక్షసి అతడిని గోదావరి దక్షిణ తీరాన ఉన్న శ్రీ గిరికి ఎత్తుకు పోయింది .అది ధర్మానికి పవిత్రతకు నిలయం .అక్కడి రాజు బృహత్కీర్తి సుగుణ సంపన్నుడు .రాక్షసి అక్కడికి చేరాక ముసలి వేషం ధరించి బ్రాహ్మణ పుత్రునితో ‘’ఇదే గంగానది .సంద్యోపాసన చేయి .నన్ను తల్లిగా చెప్పుకొని అనుష్టానం చేయి .నామాట వింటే నీకు సకల సుఖాలు కలిగిస్తాను .నీ తలిదంద్రులవద్దకు పంపిస్తాను ‘’అన్నది .
అప్పుడా విప్రుడు ‘’నువ్వు ఎవరు “?అని ప్రశ్నించగా అది ‘’నేను కంకాలిని .నువ్వేది చెబితే అది చేస్తాను ‘’అన్నది సరే అనగా అతన్ని తీసుకొని అన్ని చోట్లా తిరుగుతూ అతడు తనకొడుకే అని చెప్పు కొంటో౦ది .నిజమే అని నమ్మిఅక్కడి బ్రాహ్మణుడు తనకూతురును వాడికిచ్చి పెళ్లి చేశాడు .సద్గుణ రాశియైన తనభార్య ను, తనను రాక్షసి ఎప్పుడు మింగేస్తుందో అని విచారించాడు .ముసలిది బయటికి వెళ్ళిన సమయం లో భార్య భర్త విచారానికి కారణం అడిగింది .అసలు విషయమంతా ఆమెకు చెప్పాడు .తెలివిగల ఆమె ‘’అజ్ఞానం వలన భయం కలుగుతుంది .గౌతమీనది దుఖహారిణి.విష్ణుభక్తులకు భయం ఉండరాదు .’’అని చెప్పింది .వెంటనే ఆ విప్రుడు గౌతమీ ష్ణానం చేసి శుచియై ముకుందుని ధ్యానించాడు .అతని ప్రార్ధనకు కరిగిపోయిన విష్ణువు ప్రత్యక్షమై సుదర్శన చక్రం తో ఆ రాక్షసిని సంహరించాడు .దంపతులు సంతోషించారు .భార్యను మామగారింటికి తీసుకువెళ్ళి ఆనందం అనుభవించాడు. ఇదే విప్రతీర్ధం ,నారాయణ తీర్ధం అని బ్రహ్మనారదునికి ఉవాచ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-19-ఉయ్యూరు