గౌతమీ మహాత్మ్యం—70
100-భిల్ల తీర్ధం
సింధు ద్వీపముని,సోదరుడు వేదుడు పరమ ధార్మికులు . వేదుడు ఒక రోజు భిక్షాటనకు వెళ్ళగా ,వ్యాధుడు అనే ధార్మికుడైన వేటగాడు వేటకు వచ్ఛి వేటాడి ,శివునికి అభిషేకం చేయటానికి నోటితో నీళ్ళు తెచ్చి , వేట మాంసాన్ని ధనుస్సు చివర ఉంచి పూజించాడు .అప్పటికే వేదుడు పూజించిన దాన్ని కాలితో తోసేసి, ఆది కేశవ శివుని పత్రాలతోపూజించి మాంసం నైవేద్యం పెట్టి ,నోటిలోని నీటి తో అభిషేకించేవాడు.ఇతడికి శివభక్తి తప్ప వేరే ఏమీ శుభ ప్రదం కాదు అనే నమ్మకం .ప్రతి రోజు అలానే చేసేవాడు .భిల్లుడు వచ్చి పూజించే దాకా శివుడు ‘’అనీజీ ‘’గా కనిపించేవాడు. ప్రసన్నత తక్కువగా ఉండేది .ఇలా రోజూ వేదుడు పూజించిన దాన్ని కాలితో తోసేయటం ,ఆకులతో పూజించి నోటితో తెచ్చిన ఎంగిలి జలం(గండూ షాంబు ) తో అభిషేకించి వేటాడిన మాంసం నైవేద్యం పెట్టటం చాలాకాలం చేశాడు .
చాలాకాలం ఉపేక్షించిన వేదునికి ఒక రోజు కోపం వచ్చి శివద్రోహం చేసిన వాడు వధార్హుడు అని నిశ్చయించి ,తాను నిత్యం చేసే మంత్రపూత పూజను ధ్వంసం చేసిన వాడు ఎవడో చూడాలనుకొని ప్రక్కగా నిలిచి ఉండగా ,వ్యాధుడు నిత్యపూజకు రాగా ‘’ఆలస్యంగా ఎందుకు వచ్చావు బాగా అలసి పోయినట్లున్నావు .నువ్వు లేకుండా నేను సుఖం గా లేను .నాయనా పుత్రుడు లాగా నన్ను ఓదార్చు ‘’అన్నాడు మహా శివుడు .ఈమాటలు వేదుడికి మిక్కిలి బాధ ,కోపం తెప్పించాయికాని ఏమీ మాట్లాడ లేకపోయాడు .భిల్లుడు యధాప్రకారం శివుని అర్చించి వెళ్లి పోయాడు .ఇంకా మండిపోయిన ధార్మికుడైన వేదుడు శివునితో ‘’ఆ భిల్లుడు జంతు హింస చేసే పాపి, క్రూరుడు, దయాహీనుడు,గురువు లేనివాడు, అజితే౦ద్రియుడు..అలాంటి వాడికి కనిపించి మాట్లాడావు .నిత్యం నీపూజ భక్తీ శ్రద్ధలతో విధివిధానం గా చేసే నన్ను కనికరించలేదు . ఆ దురాత్మునికి తగిన శాస్తి చేస్తాను .నీ నెత్తిన బండ రాయి పెట్టి పోతాను ‘’అన్నాడు .శివుడు ‘’తొందరపడకు .రేపు వచ్చి ఏమి జరుగుతుందో కళ్ళారా చూసి ,కావాలనుకొంటే అప్పుడే ఈస్థాణుడిపై మహా స్థాణువుపెట్టు ‘’అన్నాడు .కోపం తగ్గించు కొని కొంత ప్రశాంత చిత్తుడై వెళ్లి పోయాడు .
మర్నాడు ఉదయం వేదుడు వచ్చిఆది కేశవునికి మంత్ర పూత అభిషేకం పూజ చేసి నైవేద్యం పెడదామని శివ లింగం దగ్గరకు వస్తే .లింగం పై భాగం నుంచి రక్తం కారటం చూసి భయపడి ,చేసేదిలేక మట్టీ,ఆవుపేడ ఆకులు అలమలు కలిపి నూరి పట్టీలాగా వేసి దర్భలచే శుద్ధి చేసి ,శుద్ధ గంగా జలం తో కడిగి నిత్య పూజ చేశాడు . అప్పుడే భిల్లుడు రాగా చాటుకు వెళ్ళాడు .వ్యాధుడు శివుని శిరసుపైగాయం ,రక్తం చూసి తట్టుకోలేక ,తాను జీవించి ఉండగా శివునికి ఎలాంటి దుర్గతి కలిగిందని వాపోయి ,వాడియైన తన బాణాలచేత’’ తనను వందలు, వేలుగా చేది౦చుకొని ‘’అనన్య భక్తి చాటుకొన్నాడు .పరమ శివుడు భిల్లుని పరమభక్తికి అత్యంత ప్రీతి చెంది వేదవిదుడైన వేదుడితో ‘’భక్తి భావ బందురుడైన భిల్లుని చూడు .నువ్వేమో మట్టి దర్భలతో గాయం మాన్పటానికి ప్రయత్ని౦చావు . ఈ భిల్లుడు తన ఆత్మ నే సమర్పణ చేశాడు . అతనిలో భక్తీ, ప్రేమ ,శక్తి ఉన్నాయి .అందుకే ముందుగా అతనికే వరం ఇస్తాను .తర్వాత నీకు వరమిస్తాను ‘’అన్నాడు .
భిల్లుని వరం కోరుకోమన్నాడు ఆదికేశవుడు ‘’భూత నాథా!నీ నిర్మాల్యం నాకు ప్రసాదించు . ఈతీర్ధం నాపేర పిలువబడేట్లు చేయి .ఈ తీర్ధాన్ని స్మరిస్తేనే సర్వ క్రతు ఫలం లభించేట్లు అనుగ్రహించు ‘’అని కోరుకున్నాడు .తధాస్తు అన్నాడు స్థాణుడు .అప్పటి నుంచి ఇది ‘’భిల్ల తీర్ధం ‘’గా ప్రసిద్ధి చెందిందని బ్రహ్మ దేవుడు నారద మహర్షికి వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-19-ఉయ్యూరు