దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం
ప్రౌఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పోస్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది లక్షణ గ్రంథాలలో బాగా కృషి చేసి ,బోధనానుభవం తోపాటు శాసన పరిశోధన చేసి ఉండాలని పత్రికా ప్రకటన చేసింది .అప్పటికి శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు చిట్టి గూడూరు ఓరిఎంటల్ కాలేజీలో పాతుకుపోయారు కదలాలనే ఆలోచనాలేదు .కాని ఊరూ పేరూ లేని పండితులు దానికి దరఖాస్తులు పెట్టి ,జమీన్దారులతో సిఫార్సు ఉత్తరాలతో ప్రయత్నిస్తున్నారని కర్ణాకర్ణి గా విని దరఖాస్తు పెట్టటానికైనా తనకు అర్హత లేదా అనుకోని సహాధ్యాపకులు రామానుజాచార్యులవారితో ,సోమశేఖర శాస్త్రి గారితో అన్నారు .వారిద్దరూ ‘’అది మీ గురువుగారు వజ్ఝల వారి స్థానం.అన్ని విధాలా మీకు అర్హత ఉంది .దరఖాస్తు పెట్టకపోతే అర్హత లేక ఊరుకున్నట్లు ఉంటుంది .అది మనకు చాలా చిన్నతనం .ఒక రాయి విసిరి చూడండి ‘’అని ప్రోత్సహించారు .
వీరి ప్రోత్సాహంతో శాస్త్రిగారు ప్రిన్సిపాల్ వరదా చార్యుల వారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు .ఆయన వెంటనే ‘’ఎవరు దరఖాస్తు పెట్టినా లాభం లేదు .అది వేటూరి ప్రభాకర శాస్త్రి గారికే ఇవ్వాలని యూనివర్సిటి ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నది ,మొన్న తిరుపతిలో వేటూరి వారుకలిసి ‘’దేశం లో తెలుగు పోస్ట్ లలో పెద్దది కదా వెడదామని ఉంది ‘’అనగా ‘’తప్పకుండా వెళ్ళండి ‘’అని నేనూ అన్నాను ‘’అని ,’’మీరు కూడా ఒక కాగితం పెట్టండి వస్తుందని ఆశ మాత్రం పెట్టుకోకుండా ,దరఖాస్తు పంపి నిశ్చింతగా ఉండండి ‘’అని చావు కబురు చల్లగా చెప్పారు ఆచార్య స్వామి .’’దరఖాస్తుతో పాటు రెండు మూడు టెస్టిమోనియల్స్ ఉండాలి కనుక మీది ఒకటి ,వజ్ఝల వారిదీ, రాయుడు శాస్త్రిగారిదీతీసుకొని పంపిస్తాను ‘’అన్నారు దువ్వూరి వారు .వజ్ఝాల వారికి రాస్తే ‘’ఏమయ్యోయ్ !నా స్థానం లో నువ్వు రావటం నాకు చాలా ఇష్టం .’’ఎప్పటికైనా నా పోస్ట్ లో మా వేంకట రమణ శాస్త్రి వస్తేనే బాగుంటుంది అని వీలైనప్పుడల్లా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నాను .ఇది అందరికీ తెలుసు కాని ఇప్పుడు దృశ్యం మారిపోయింది .వేటూరివారికే ఇద్దామని యూని వర్సిటి అభిప్రాయ పడింది .ఆయనకూడా ఈ మధ్య వచ్చి అందర్నీ కలిసి ,ఇల్లు కూడా మాట్లాడుకొని వెళ్ళారు .కనుక నీకు ఆ పోస్ట్ రాదు .లక్షణ గ్రంధాలలో అత్యంత ఆసక్తి కల నా అత్మీయుడు నా స్థానం లో వచ్చే యోగం లేకపోయింది . అయినా అడిగావు కనుక టెస్టిమొనియల్ పంపిస్తున్నాను ‘’ అని సుదీర్ఘ లేఖతో టేస్టిమోనియల్ పంపారు .రాయుడు శాస్త్రిగారు మ౦దేపంపారు .ఆచార్యులుగారూ మిగిలిన ఇద్దరూ చాలా వాత్సల్యాన్ని చూపిస్తూ మంచి మాటలు రాశారు ,టేస్టిమోనియల్ తో దరఖాస్తు సకాలం లో యూని వర్సిటీకి పంపారు .శాస్త్రిగారు మనసులో ‘’ఉద్యోగం వద్దు సద్యోగం వద్దు .అలాంటి గురువుల వాత్సల్యాభిమానాలు లభించాయి చాలు అనుకొన్నారు .
కొంతకాలం తారవాత విజయనగరం సంస్కృత కాలేజి లో ఒరియా పండితులుగా పని చేసి ,యూని వర్సిటీలో ఒరియా పండితులుగా ఉన్న మధుసూదన షడంగి దువ్వూరి వారి మసకపల్లికి ఉత్తరం రాసి ‘’మనమింక యూని వర్సిటీలో కలిసి ఉంటాం ‘’అని రాశారు శాస్త్రిగారికి అది అర్ధం కాలేదు .ఆయనకు వేటూరి వారికి ఆపోస్ట్ ఇస్తున్నట్లు తెలిసి ఉండదు అనుకొన్నారు .సస్పెన్స్ తెర వీడి ,మూడు రోజులతర్వాత దువ్వూరి వారికి యూని వర్సిటి రిజిస్ట్రార్ నుంచి’’వాల్తేరు యూని వర్సిటి కాలేజిలో తెలుగు డిపార్ట్ మెంట్ లో ఆనర్స్ పండితులుగా మిమ్మల్ని సిండికేట్ అపాయింట్ చేసింది .15-6-1941 న జాయిన్ అయి రిపోర్ట్ ఇవ్వండి ‘’అని ఒక కవరొచ్చింది .పెద్దగా ఆంగ్ల పాండిత్యం లేక శ్రుత పాండిత్యమే ఉన్న శాస్త్రిగారు అయిదారు సార్లు చదివి అర్ధం చేసుకొని అవాక్కయ్యారు .జులై 1కాని కాలేజీలు తెరవరు. కాని వజ్ఝలవారి పోస్ట్ ఖాళీ అయినందున పై తే దీకే జాయనింగ్ ఆర్డర్ ఇచ్చారు .
సంతోషంగా వరదాచార్యులగారికి చెప్పి కాగితం చూపించగా ఆయనా మరింత తెల్లబోయారు .18ఏళ్ళు చిట్టి గూడూరులో పని చేసి శాఖను సమర్ధతతో నడపటం ,తనతర్వాత పంచా౦గమ్ నరసింహా చార్యులుగారున్నండువల్లా ,తమకాలేజీ లో పని చేసిన వ్యక్తికీ యూనివర్సిటీ పోస్ట్ రావటం వల్లా ఆచార్యులవారు పరమ సంతోషింఛి ‘’వెంటనే వెళ్లి జాయిన్ అవండి ‘’అన్నారు .విశాఖ వెళ్లియూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్ శ్రీ సూరి భగవంతం గారిని కలిశారు .ఆయన ‘’సంతోషం సెలవులు కనుక ఇంటికి వెళ్ళండి జులై 1 కి రండి ‘’అన్నారు .తెలుగు శాఖలో ఉన్న పింగళి లక్ష్మీకా౦త౦ గారిని ,గంటి జోగి సోమయాజులుగారినీ , షడంగి గారినీ మర్యాదగా కలిసి మసకపల్లి వెళ్ళిపోయారు దువ్వూరి వారు .
రాదు అనుకొన్న పోస్ట్ ఎలా వచ్చిందో అనే మిస్టరీ వీడలేదు .నెమ్మదిమీద వివరాలు తెలుసుకొన్నారు .ముందు సెలెక్షన్ కమిటీ సమావేశమైంది .తెలుగు హెడ్ పింగళి ,ప్రిన్సిపాల్ విస్సాఅప్పారావుగారు సిండికేట్ మెంబర్ జయపూర్ దివాన్ ,మద్రాస్ యూని వర్సిటి నుంచి ఎక్స్పెర్ట్ మెంబర్ గా కోరాడ రామకృష్ణయ్యగారు ,వైస్ చాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డిగారు కమిటీ మెంబర్లు .రిజిస్ట్రార్ వి ఎస్ కృష్ణ గారు కూడా మీటింగ్ లో కూర్చున్నారు .మీటింగ్ ప్రారంభం లో కట్టమంచి ‘’వేటూరి వారిని వేస్తె బాగుంటుందను కుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి ‘’అని లాంచనంగా అన్నారు ..ఆమాట ఇదివరకే అనుకొన్నాం కనుక ఆపేరు రాయండి అన్నారట మిగిలినవారు .అప్పుడు వైస్ చాన్సలర్ గారే ‘’సెలెక్షన్ కమిటీ లో ఒకే ఒక్క పేరు వేస్తె ఆక్షేపిస్తారు .వచ్చిన దరఖాస్తులబట్టి మరో రెండు పేర్లు చేరిస్తే మంచిది ‘’అన్నారు .కోరాడ వారు దువ్వూరి వారిపేరు ,పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి పేరు వేయమన్నారు .దివాన్ గారు ‘’బానే ఉంది కాని పంచాగ్నుల వారి పేరు రెండుగా వేయండి ‘’అన్నారు .లక్ష్మీకాన్తంగారు ‘’దువ్వూరి వారి దే రెండో పేరుగా ఉండాలి ‘’అన్నారు .రెడ్డిగారు ‘’ఏ పేరు వేసినా సిండికేట్ లో ఇచ్చేది వేటూరివారికే కదా .ఏదో క్రమం చెప్పండి’’ అని విస్సావారిని కోరారు .ఆయన రెండవపేరు దువ్వూరి ,మూడవపేరు పంచాగ్నుల ‘’అన్నారు ఈ వరుసలోనే రాశారు .
మర్నాడు సిండికేట్ మీటింగ్ లో అపాయంట్ మెంట్ విషయం వచ్చి కట్టమంచి వేటూరివారి పాండిత్యం తాళపత్ర పరిశోధన సోదాహరణం గా చెప్పి ,సెలెక్షన్ కమిటీ కూడా వీరి పేరే ముందు సూచి౦ చింది కనుక వేటూరివారికే ఇద్దాం అన్నారు .సిండికేట్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ విశాఖ జిల్లా కలెక్టర్’’ మాస్టర్ మాన్’’ అనే యూరోపియన్ ‘’మిస్టర్ వైస్ చాన్సలర్ !పండితుల తారతమ్యాలు మీకు తెలిసినట్లు మాకు తెలియదు .కాని సెలెక్షన్ కమిటీ నిర్ణయించిన క్రమం సరిగా లేదని పించింది .వ్యాకరణ౦ లో ప్రత్యేకక కృషి చేసినవారికి ,ఎక్స్ పీరిఎన్స్ ఉన్నవారికీ ఈ పోస్ట్ ఇస్తామని మనం ప్రకటించాం .రెండవ వ్యక్తి వ్యాకరణం స్పెషలైజ్ చేసినట్లు ,వ్యాకరణ బోధనలో 22ఏళ్ళ సర్వీస్ ఉన్నట్లు అప్లికేషన్ లో స్పష్టంగా ఉంది .మొదటివారికి మూడున్నర ,మూడవవారికి రెండున్నర యేళ్ళే బోధనానుభవం ఉంది .మధ్యవ్యక్తి, పై ఇద్దరికంటే పదేళ్ళు చిన్నవారుగా ఉన్నారు .కనుక రెండో పేరును మొదటి పేరుగా మార్చండి ‘’అని ఖచ్చితంగా చెప్పి’’వాట్ డు యు సే మిస్టర్ రాయ్ స్ట్రాక్ “”?అని అడిగాడు .స్ట్రాక్ అమెరికావాడు .అతడూ వెంటనే ‘’ఐ ఎంటైర్లీ యగ్రి విత్ యు ‘’అన్నాడు .ముఖం మాడిన రెడ్డిగారు మనసుమార్చుకొని గంభీరంగా ‘’దట్సాల్ రైట్ .వుయ్ కెన్ చేంజ్ ది ఆర్డర్ ‘’అనగా రిజిస్ట్రార్ వరుసమార్చి దువ్వూరి వారిపేరు మొదటిపేరుగా మార్చారు .తర్వాతనే దువ్వూరివారికి ఆర్డర్ పంపారు. సమర్ధతను గుర్తించి దువ్వూరి వారికి ఆపోస్ట్ ఇచ్చిన ఆ తెల్ల దొరలు అభినదనీయులు కదా .పోస్ట్ ల విషయం లో యెంత కిరికిరి జరుగు తుందో తెలిసిందా ? దీనికి ఎవరూ అతీతులు కారు .
ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-19-ఉయ్యూరు
.