బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి
విజయనగరం అంటే శ్రీ మదజ్జాడఆదిభట్ల నారాయణ దాసు గారే ముందు గుర్తుకొస్తారు .తాతా రాయుడు శాస్త్రిగారు విజయనగరం రాజావారిసంస్కృత కాలేజిలో వ్యాకరణ అధ్యాపకులు .ఈ ఇద్దరికీ ఆబాల్య మైత్రి ఉంది .శాస్త్రిగారు రోజూ కాలేజీకి కానుకుర్తి వారి వీధిలో ఉన్న దాసు గారింటి మీదనుంచే వెళ్ళేవారు .మేడపై నుంచి దాసు గారు చూసి గబగబా దిగి వచ్చి ‘’శాస్త్రీ !అని కేకవేసి ఆపి ‘’సిద్ధాంత కౌముది లోను ,మనోరమ ,మాహా భాష్యం లోనూ ఈ పంక్తులకు సమన్వయము ఇట్టా చేసుకొన్నాను .అవునోకాదో చూడు .శంఖం లో పోస్తే కాని తీర్ధం కాదు కదా ‘’అనేవారు అప్పుడు శాస్త్రిగారు ‘’అదేనయ్యా !సమన్వయ౦.నీ బుద్ధికి తప్పు దారి తోచదు ‘’అనేవారు .ఆలాగే పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారిని దాసు గారు పలకరించి ‘’అయ్యా !ముక్తావళి లో ఈ పంక్తికి ఇదే కదూ అర్ధం ?’’అని అడిగితె ‘’అవునండీ ‘’అనే వారు అలాకాదు ఇలా అనాల్సిన అవసరం ఉండేదికాదు .
‘’ కౌముది అన్నా ,మనోరమ అన్నా ,మహా భాష్యం అన్నా ,ముక్తావళి అన్నా సామాన్య గ్రంథాలు కావు .శాస్త్ర సంస్కారం ఉన్నవాళ్ళు గురువు వద్ద సావధానంగా చెప్పు కుంటే కాని బోధ పడవలసినవి కావు .కానీ నారాయణ దాసుకు దేనికీ గురువు అక్కర లేదు .ఆయన ‘’స్వయం గురుః,స్వయం శిష్యః’’.ప్రతిభా సంపత్తి విషయంలో రాయుడు శాస్త్రి గారి ప్రతిభ గురువుల ఉపదేశం వలన ఉద్యుద్భుదమైంది .అదీ ఈ రెండు ప్రతిభలకు ఉన్న తేడా ‘’అంటారు కళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు .విజయనగరానికి ‘’విద్యానగరం’’అని పేరురావటానికి తండ్రీ కొడుకులైన విజయరామ గజపతి ,ఆనంద గజపతి మాహారాజుల సంస్థానానికి విజయనగరం ముఖ్య పట్టణం అవటం ఒకటి అయితే ,తాతా రాయుడు శాస్త్రిగారు ,ఆదిభట్ల నారాయణ దాసు గార్లు ఆ పట్టణం లో ఉండటం రెండో కారణం అన్నారు దువ్వూరి .అదీ వారి ప్రతిభ .ఆ రెండూ అసాధారణ ప్రతిభా జ్యోతులు .రాయుడు శాస్త్రిగారి ప్రతిభకు ఆకర్షితులై చిట్టి గూడూరు నుంచి వచ్చిన శ్రీ మత్తిరుమల గుడిమెట్ల వరదా చార్యులవారు అపూర్వ మిత్రులయ్యారు .దువ్వూరివారిపై రాయుడు శాస్త్రిగారి వాత్సల్యమూ అపూర్వమైందే .
రాయుడు శాస్త్రిగారు ఎప్పుడు వచ్చినా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారింట్లోనే బస .రాయడు శాస్త్రిగారి ప్రధాన వ్యాకరణ శిష్యులలో వేదులవారు ప్రప్రధములు మాత్రమేకాదు పినతల్లి కుమారులు కూడా .కనుక ఎప్పుడూ బస ఇక్కడే .’’సాధారణ పండితుల్లో తాము చదువుకొన్న శాస్త్రం లో బ్రహ్మాండమైన కృషి చేసి పాఠాలుబోధించి అనుభవ౦తో ఆ శాస్త్రం లో వారొక్కరే’’ అధారిటీ’’ అని పేరు పొందినవారున్నారు .తమ ప్రధాన శాస్త్రం తో పాటు ,ఇతర శాస్త్రాల సంప్రదాయాలు తెలిసినవారూ ఎందరో పండితులున్నారు .ఎందరున్నా ,రాయుడు శాస్త్రి గారి ప్రతిభ ఇంకెక్కడా లేదు .శాస్త్ర విషయాన్ని సూక్షంగా తెలుసుకొనే గ్రహణ శక్తి వేరు .విన్న విషయాలను మరుపు లేకుండా జ్ఞప్తి లో ఉంచుకొనే ధారణా శక్తి వేరు .తెలిసిన విషయాలను తేలికగా శిష్యులకు చెప్పే బోధనా శక్తి వేరు .సభలలో శాస్త్ర విషయాలపై జరిగే చర్చలలో జరిపే వాద శక్తి వేరు .కొత్త విషయాలు ఆకళింపు చేసుకొని వాటిపై పుస్తకాలు రాసే రచనా శక్తి వేరు .వీటిలో ఏ కొన్ని శక్తులున్నవారికైనా పేరు,ప్రసిద్ధి వస్తుంది.రాయుడు శాస్త్రిగారిలో ఈ శక్తులన్నీ ఉండి,వాటిపైన మెరుస్తూ ఉండే అసాధారణ ప్రతిభా సంపద ఉంది .కనుక కావ్య ,నాటకా,లంకారాది సాహిత్య ప్రపంచం లో కాని ,వారి ప్రధాన శాస్త్రమైన వ్యాకరణం లోకాని ,అతి పరిచయమున్న ధర్మ శాస్త్రం లో కాని ,పఠన ,పాఠనాల తో సంబంధం లేని న్యాయ ,వేదాంత శాస్త్రాలలో ఏ ప్రకరణం లో ఏ సందర్భం ఉన్న పంక్తి అయినా ,ఆయన చూశారంటే చక్కగా అర్ధమై పోవాల్సిందే .అన్వయించని క్లిస్టపంక్తి అనేది ఏ శాస్త్రం లోనూ ,ఏ గ్రంథం లోనూ రాయుడు శాస్త్రిగారికి ఉండేది కాదు .ప్రతిభ అంటే అదే ప్రతిభ ‘’అని శాస్త్రిగారింట్లోనే చాలాకాలమున్న దువ్వూరి వారు ఎస్టిమేట్ చేసి చెప్పారు .ఈ ప్రతిభ ఎలా ఒక ముఖ్య సందర్భం లో బయట పడిందో ఇప్పుడు తెలుసుకొందాం .
‘’ వేదార్ధం చెప్పటం ఆషామాషీ వ్యవహారం కాదు .దీనికి వేదం లోని82 ప్రశ్నలు క్షుణ్ణంగా వల్లించి ఉండాలి ,సంస్కృత భాషలో గట్టి పాండిత్యం ఉండాలి ,వ్యాకరణ ,పూర్వ మీమా౦సాలలొ మాంచి స్వతంత్రత ఉండాలి .న్యాయ ధర్మాది శాస్త్రాలతో బాగా పరిచయమూ ఉండాలి ,ఇన్ని ఉన్నా ‘’విద్యారణ్యం ‘’ఎన్నో సార్లు చదివి విషయం అంతా ఆకళిం పై గుర్తు ఉంచుకొంటే కాని సభలలో వేదార్ధం చెప్పటం కుదరదు.ఇంత క్లేశం ఉండబట్టే వేదం లో సంహిత ,పదము ,క్రమము వల్లించేవారు చాలామంది ఉన్నా వేదార్ధం చెప్పేవారు నూటికి ఒకరో ఇద్దరో ఉంటారు .
ఒక సారి పిఠాపురం సంస్థానం లో విద్యారణ్య ప్రకటన ఇచ్చేనాటికి వేదవేదాంగ పరిచయం ఉండి,ఎక్కడపడితే అక్కడ వేదార్ధం చెప్పే’’ నువ్వా నేనా’’ అని పోటీ పడే విద్యారణ్య పండితులుగోదావరి జిల్లాలో ఇద్దరే ఉండేవారు .ఒకరు వడలి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు .రెండవవారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .ఈ ఇద్దరూ పరీక్షకు దరఖాస్తు పెట్టారు .ఈ ఇద్దరిలో ఎవరు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే వారు పిఠాపుర సంస్థాన ఆస్థాన పండితులౌతారు .ఇద్దరూ ఇద్దరే దిగ్దంతులు .ఎవరు ఫస్ట్,ఎవరు సెకండ్ ?అని టెన్షన్ గా ఉంది పండితులలో .ఐతే దురదృష్ట వశాత్తు ఉప్పులూరివారి ఆరోగ్యం బాగులేక పరిక్షకు వెళ్ళలేక పోయారు .వడలి వారొక్కరే పరీక్ష ఇచ్చారు .ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులై ఆస్థాన విద్వాసులయ్యారు .
మరు సటి సంవత్సరం విద్యారణ్య పరీక్షకు దరఖాస్తు సమయం వచ్చింది .గణపతి శాస్త్రిగారికి పరీక్ష కు వెళ్ళాలా వద్దా అనే అనుమానం, తన సమ ఉజ్జీ వడలి వారు పరీక్షకులు కనుక తాను పరీక్ష్యకుడుగా వెళ్ళటం ఉచితమా అనే సందేహం కూడాకలిగింది .కొందరు వెళ్ళమని కొందరు వద్దని సలహా ఇచ్చారు .దువ్వూరివారినీ అడిగితే ‘’పరీక్షకులు ఎవరైతే ఏమిటి సమర్ధత ఉ౦ది కనుక మీరు వెళ్లి తీరాలి ‘’ అని చెప్పారు ఉప్పులూరివారికి .చివరకు దరఖాస్తుపెట్టి పరీక్షకు వెళ్లి రాస్తే సెకండ్ క్లాస్ వచ్చింది .అయ్యో ఫస్ట్ క్లాస్ రాలేదా అని కొందరు విస్తుపోయారు సాయంతం సభ ,సన్మానం అయ్యాయి .ఇంటి దారిలో వడలి,వారు ఉప్పులూరివారు కలుసుకొని ఓహో అంటే ఓహో అనుకోని వడలి వారు ‘’శాస్త్రిగారూ !మీకు ఫస్ట్ క్లాస్ రావటం నాకు ఇష్టం .వస్తుందనే అనుకొన్నా .అన్నిపేపర్లూ బాగానే రాశారుకాని ఒక దానిలో 40మార్కుల ప్రశ్న చెడిపోయింది .ఒక్క మార్కు కూడా ఇవ్వటానికి వీల్లేక పోయింది .అందుకే ఫస్ట్ క్లాస్ రాలేదు .నొచ్చుకోన్నాను .నొచ్చుకొని ఏం లాభం ?’’అన్నారు సానుభూతిగా .’’ఏ ప్రశ్న చెడగోట్టానో జ్ఞాపకం ఉందా ?అని అడిగారు ఉప్పు లూరి. ‘’ఫలాని ప్రశ్న అని ఆయన అంటే ‘’అన్నిటికంటే దానినే బాగా రాశానే .ఎక్కువ మార్కులు దానికే వస్తాయని ఆశి చానే .ఏమిటి చిత్రం ‘’అన్నారు వడలి’’మీ సమాధానం పెడదారిన నడిచింది అందుకే మార్కులు వెయ్యలేదు .మీ పేపరు చూపిస్తా రండి ‘’అని ఇంటికి తీసుకు వెళ్లి చూపించారు .రెండుగంటలు దానిపై ఇద్దరిమధ్యా వాదోపవాదాలు జరిగాయి .చివరికి వడలి వారే ‘’ఇది ఇప్పుడు తేలేదికాదు .భోజనాలు చేద్దాం .రాయుడు శాస్త్రి గారు ఊళ్లోకి వచ్చారట .భోంచేసి విద్యారణ్యం పట్టుకొని ఆయనదగ్గర కూర్చుని అక్కడే వారి తీర్పు తెలుసుకొందాం ‘’అన్నారు .ఇదీ నేపధ్యం .
భోజనాలు పూర్తి చేసుకొని వేదులవారింటికి వెళ్లి రాయుడు శాస్త్రిగారి సమక్షం లో విషయం వివరించారు.ఆయన ‘’అయ్యా !ఇది వ్యాకరణం కాదు ధర్మ శాస్త్రం కాదు అందులోనూ నాకు పరిచయం లేని విద్యారణ్య మాయే .నేనా తేల్చటం ?”’అన్నారు .’’మాకు తేల్చుకోవటం కుదర కనే మీ దగ్గరకు వచ్చాం మీ తీర్పు శిరో దార్యం ‘’అన్నారు వడలి,ఉప్పులూరి ఉభయులూ .ఇద్దరి వాదనలు పూర్తిగా విన్నాక రాయుడు శాస్త్రి గారు ‘’మీ ఇద్దరు చెప్పింది కూడా గ్రంథకర్తకు ఇష్టమైన మార్గం కానట్టుంది .విద్యారణ్య స్వామి అభిప్రాయం నాకు వేరే విధంగా గోచరిస్తోంది .పంక్తులు చదువుతూ ఉండండి చెబుతాను ‘’అని వారు చదువుతూ ఉంటె సమన్వయ మార్గాన్ని వివరించి విద్యారణ్య అభిప్రాయం ఇదే అని తనకు తోచి౦దని తాను గ్రంథం చూడలేదుకనుక పూర్వాపరాలు ఎలా ఉన్నాయో తెలీదు కనుక తాను చెప్పిన సమన్వయము సరిపోతుందేమో చూడమని కోరారు .ఇద్దరు శాస్త్రులవార్లు అవాక్కై తెల్లబోయి ఒకరి ముఖా లొకరు చూసుకొని రాయుడు శాస్త్రిగారితో ‘’అయ్యా !తమరు సెలవిచ్చిందే విద్యారణ్యుల వారి ఆంతర్యం.ఆయనొకమార్గం లో నేనొక దారిలో సమన్వయము చేసుకొని చిక్కుల్ని సర్దుకొంటూ భ్రాంతిలో పడి పోయాం .విద్యారణ్య హృదయం మాకు విప్పి చూపారు చాలా సంతృప్తిగా ఉంది .నమస్కారం సెలవు ‘’అన్నారు వడలిలక్ష్మీనారాయణ శాస్త్రిగారు ,ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు . అదీ రాయుడు శాస్త్రులవారి ప్రతిభా సంపద .ఆ బుద్ధికి ఉండే తళుకే వేరు ‘’అంటారు దువ్వూరివారు
ఆధారం
దువ్వూరివారి స్వీయ చరిత్ర
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-19-ఉయ్యూరు
—