ఈ నాటి అనుబంధ మేనాటిదో ?
దువ్వూరి వారు విశాఖయూనివర్సిటీ లో తెలుగు లెక్చరర్ గా 1941 లో చేరాక ,రెండవ ప్రపంచ యుద్ధకాల౦ లో బాంబుల భయం వలన యూని వర్సిటీని గుంటూరుకు మార్చారు .అంత పెద్ద కాంపస్ దొరక్క అక్కడా అక్కడా సర్దుకొన్నారు .లెక్చరర్లు ఇక్కడ పెంచిన అద్దె ఇళ్ళల్లో ఉండలేక సతమతమయ్యారు .ఒకసారి వైజాగ్ లో పరిచయమైన గుంటూరు హైస్కూల్ తెలుగు పండిట్ సూర్యనారాయణ కు తనకు ఇల్లు చూచి పెట్టమని రాస్తే ‘’ అదెంతభాగ్యం సామానుతో వచ్చెయ్యండి ‘’అని జవాబిస్తే ,రేపు కాలేజీ తెరుస్తారనగా కుటుంబం తో ఆయన ఇంటికి చేరారు .ఆ ఇల్లు జూటు మిల్లుకు దగ్గర ఆ చివర్లో ఉంది .అక్కడ ఏడెనిమిది ఇళ్ళు మాత్రమె ఉన్నాయి . వెళ్ళిన రోజు వారి౦ ట్లోనే భోజనాలు కానిచ్చి వసారాలో సామాను ఇరికించి అక్కడే పడుకొన్నారు .సూర్యనారాయణ గారు దగ్గరలో ఒక ఇల్లు చూశానని ఇంకా పనులు పూర్తీ కాలేదని అవగానే వీరికే ఇస్తానని చెప్పాడని చెప్పి లాగించాడు .యూని వర్సిటి స్టడీస్ బోర్డ్ మీటింగ్ కూడా గుంటూరు లోనే కనుక కొందరు పెద్దలు దువ్వూరి వారి౦టివసారాలోనే మకాం .వారికి వీరిపై ఉన్న వాత్సల్యం అది .వీరేకాక వారి స్నేహితులూ అంతే.విశాఖలో ఉన్నా అలాగే .వీరింటే ఉండటం వారికిష్టం .ఇరుకు ఇల్లు బాధ భరించలేక మారుదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘’ఓనరుడు ‘’పడనివ్వలేదు .అద్దె తీసుకోమంటే మనలో మనకు అద్దె మాట లెందుకు అని నంగనాచి కబుర్లు చెప్పేవాడు .
‘’వానరుడు’’ చెప్పిన ఇల్లు మాచర్ల వెంకటప్పయ్యగారిది .క్లాసులు ఉదయం 8నుంచి 11వరకే కనుక మధ్యాహ్నం ఇంటి వేట చేస్తూ ఆ ఇంటికి వెళ్ళగా ఆయనే ‘’నమస్కారం మేస్టారూ!’’అని దారిలో కనిపించి పలకరిస్తే ‘’మీ ఇంట్లో ఉందామని అనుకొంటే మేరు ఎవరికో అద్దేకిచ్చినట్లు మాస్టారు చెప్పారు ‘’అనగా ‘’అదేమిటి మాస్టారు .మీరొస్తారని అంతా సిద్ధం చేసి చాలాకాలమైంది .మిమ్మల్ని అద్దెకు పంపమని ఆయనకు చెప్పి కూడా చాలాకాలమైంది .ఒకసారి ఆయన కోమట్ల ఇళ్ళలో శాస్త్రి గారు ఉండనన్నారు ఇంకెవరికైనా ఇచ్చేయండి అని నాతొ చెప్పారు కూడా అనగా ‘’ ఆశ్చర్యపోయారు దువ్వూరివారు..ఆయనకు డబ్బు అంటే మహా కక్కుర్తి .అద్దె తనకే వస్తుందని మీకు మాయమాటలు చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు ‘’అన్నారు శాస్త్రిగారికి సీన్ అర్ధమైంది .’’మేమొచ్చేస్తాం.మీరు ఇస్తారా ?’’అని అడిగారు .’’మీరు వస్తే మాకు మహా భాగ్యం .ఇప్పుడే ఇస్తాం .పైన ఉన్న రెండు గదుల్లో మేముంటాం కిందనాలుగు పెద్ద గదులు మీరు వాడుకోండి .మీకు అనవసరమనిపిస్తే మీరే ఎవరికైనా రెండు గదులు అద్దెకిచ్చుకోవచ్చు పెత్తనమంతా మీదే’’అనగా అద్దె యెంత అని అడిగితె ‘’అద్దేకోసం కట్టలేదు మీవంటి విద్యా స్వరూపులు ఉంటె చాలు .రాచకొండవారికి ఎంతిస్తే మాకు అంతే ఇవ్వండి .ఈ మారుమూల అద్దెలకు ఎవరూ రారు .మీరు చేరండి చాలు .సెలవులకు వెళ్లేముందు సామానంతా ఇక్కడకు చేర్చి తాళం వేసుకొని నిశ్చింతగా వెళ్ళండి .’’అన్నాడు .
రెండురోజులయ్యాక రాచకొండాయనతో ‘’షావుకారు కనిపించాడు . వాళ్ళ బందువులెవరూ రారట .కావాల్సివస్తే మాకు ఇస్తామన్నారు ‘’అని చావుకబురు చల్లగా చెప్పారు .ఓనరుడికితన పన్నాగం బయట పడిందని తెలిసి కిక్కురుమనలేదు .అద్దెకూడా పది రూపాయలే అని చెప్పారు .’’మీకు విశాలంగా ఉంటుంది అదే మనకు కావాల్సింది ‘’అని కలర్ పూశాడు .సెలవలకు వెళ్ళే ముందు సామాను కొత్తింట్లో చేర్చి సెలవలతర్వాత తిరిగొచ్చి ఆ ఇంట్లో చేరారు దువ్వూరివారు .ఈకొత్త యజమాని సౌజన్యం చాలా గొప్పది అనిపించింది .ఒక రోజు ఉదయం ఆయన సుత్తీ మేకులతో వచ్చి ‘’మేడగదిలో చొక్కాలు తగిలించుకోటానికి రెండు మేకులు కొట్టబోతుంటే మా ఆవిదవచ్చి ‘’కింద బాబుగారు ఉంటె ఈ శబ్దాలేమిటి ‘’అన్నది నాకు ఆలోచన తట్టలేదు .మీ అనుమతి తో మేకులు కొడుతాను .అన్నారు .అంతేకాదు ఆమె ‘’బాబుగారు వారానికో పదిరోజులకో మేడ మీదకు వస్తారు .గోడలనిండా మేకులు చూసి అసహ్యి౦చుకోరా “’అన్న ఆమె విజ్ఞతకు దువ్వూరి వారి కుటుంబం అమితాశ్చర్యపోయింది .
శాస్త్రిగారి ప్రియమిత్రులు పింగళి లక్ష్మీ కాంతంగారు రోజూ సాయంత్రం 4గంటలకు వీరింటికి రావటం ,ఇద్దరూకలిసి మాచెర్ల రైలుకట్ట మీద షికారు చేయటం రివాజు .చాలాసార్లు పింగళి ‘’ఊళ్ళో ఇంటి అద్దెలు పెట్రేగి పోతున్నాయి.మూడు నెలల కోసారి ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తోంది .ఇప్పటికి మూడిళ్లు మారాను. మీ ఇంటి ఓనర్లు మిమ్మల్ని వెళ్ళమనరు సరికదా ,మీరెక్కడ వెళ్ళిపోతారో నని భయపడుతూ దాసులుగా ఉన్నారు. ఏమి మాయ ,మంత్రం వేశారో మీరు .మాక్కూడా ఆమంత్ర చెప్పండి ‘’అని నవ్వుతూ అనేవారు .
1946లో యూని వర్సిటి తో పాటు దువ్వూరి వారి కుటుంబం కూడా మళ్ళీ విశాఖ పట్నం చేరింది .బయల్దేరేరోజున యజమాని ఒక అందమైన చేతికర్ర కొని తెచ్చి బహుమతిగా ఇచ్చి కుటుంబం అంతా రైలుదాకా వచ్చి ఆప్యాయంగా వీడ్కోలు పలికారు .ఆకర్రను అత్యంత ప్రేమగా వాడుకొన్నారు శాస్త్రిజీ .’’విలువ వస్తువుది కాదు ప్రేమది ‘’అన్నారాయన .’’న వసంతి హిప్రేమ్ణి గుణాః,న వస్తుని ‘’ వస్తువుకున్న విలుకకాదు అందులోని ప్రేమను చూసి ఆన౦దించాలి .
మళ్ళీ విశాఖ వెళ్ళాక గుంటూరు హిందూకాలేజీ వారు వార్షికోత్సవానికి పిలిస్తే రెండు సార్లు కుదరక మూడో పిలుపుకి పదేళ్ళ తర్వాత వెళ్ళారు .వస్తున్నట్లు వెంకటప్పయ్యగారికి ముందే కార్డ్ రాశారు .ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారింట బస చేద్దామనుకొన్నారు .అప్పటికే వెంకటప్పయ్య గారు అక్కడికి వచ్చిఉంనారు ‘’రేపు మీటింగు కనుక వీలు కుదురుతుందో లేదో ఈ రోజే ,ఇప్పుడే మా ఇంటికి దయచేయాలి ‘’అని మర్యాదగా ఆహ్వానించారు మాజీ ఓనరు గారు .దువ్వూరివారితో శాస్త్రిగారు కూడా వెళ్ళారు .
వెళ్లేసరికి ఇంటిల్లి పాదీ దువ్వూరి వారికోసం వెయ్యి కళ్ళలతో ఎదురు చూస్తున్నారు .ఇంట్లో అద్దెకున్న ప్లీడరు గారి తల్లిగారు కూడా ఉన్నారు .హాలులో కుర్చీలు బల్లలలూ అన్నీ సిద్దంగా గా ఉన్నాయి .’’మీరు స్నానం కూడా చెయ్యలేదు సరాసరి వచ్చేశాం . వెడదాం ‘’అన్నారు శాస్త్రిగారు కబుర్లు అయ్యాక .వెంకటప్పయ్యగారి భార్య ‘’ వెళ్ళటం ఏమిటి ? బాబుగారు ఈ రాత్రికి ఇక్కడే ఉంటారని మేమంతా సంబర పడుతున్నాం ‘’అనగా ముసలమ్మగారు ‘’మీరీపూట ఉంటారని వంట కూడా చేశాను ‘’అనగా శాస్త్రిగారు ‘’అమ్మా !ఆయన ఉండే రెండు పూటలు మా ఇంట్లోనే భోజనం మీరాప్రయత్నంచేయద్దు ‘’అన్నారు .ముసలమ్మగారు ‘’బాబుగారూ !మీరు వెళ్లి పదేళ్ళు అయింది మేమొచ్చి అయిదారేళ్ళు అయింది .ఈ కుటుంబం అంతా ఎప్పుడూ మీ కుటుంబం గురించే ముచ్చటగా చెప్పుకొంటారు .ఎప్పుడో అద్దెకు ఉండి వెళ్లి పోయిన వారిమీదింత అభిమానం ఏమిటి అని ఆశ్చర్యపోతాం .వీరిపెద్దమ్మాయి మాణిక్యం కాపురానికి వెళ్ళినా ,మీరోస్తున్నారని వారినడిగి ముగ్గురు పిల్లలతో సహా తీసుకొచ్చారు .ఆ అమ్మాయి మీ మీద ఒకనేరం నాతొ చాలా సార్లు చెప్పింది .మీరు వస్తున్నారుగా అడుగుదామని కాచుక్కూచున్నాను .అసలు విషయం ఏమిటంటే .తనూ ,తండ్రీ మీ పెరటి పూలమొక్కలను జాగ్రత్తగా పెంచుతున్నా ఆమ్మాయిని ఆ పూలు కోసుకో నివ్వలేదట. ఇదే అభియోగం .నిజమేనా .కొన్ని రోజులతర్వాత ఒక రోజు మీరే రోజుకు ఒక్క పువ్వు మాత్రం కోసుకోమన్నారట.నిజమేనా బాబుగారూ !’’అనగానిజమే జ్ఞాపకమొచ్చింది అన్నారు దువ్వూరిజీ .అప్పుడా పిల్లవయసు 11-12మధ్య .ఇప్పుడు ముగ్గురు బిడ్డల తల్లి .వెంకటప్పయ్యగారి భార్య సుబ్బప్ప లోపలి వెళ్లి రెండు గ్లాసులతో ఏదో పానీయం తెచ్చి ఇద్దర్నీ పుచ్చుకోమన్నది .అది సంధ్యాసమయం ఏదీ తీసుకొను అన్నారు . కళ్ళ నీళ్ళతో వారమ్మాయి ‘’ఇదికాఫీ కాదు టీ నాన్నా .నీకోసం నేనే లోపలి వెళ్లి తయారు చేశాను పుచ్చుకోవా నాన్నా ‘’అనగానే గుండె ద్రవీభవించింది దువ్వూరివారికి .పదేళ్ళ క్రితం అలవాటు గుర్తుపెట్టుకొని ఆప్యాయం గాచేసి ఇచ్చిన ఆపిల్ల తండ్రిపై ఉన్న ప్రేమకు కళ్ళు చెమర్చాయి .అది గ్లాసు అంటే చిన్న గ్లాసుకాదు,10 అంగుళాల పొడవున్న ఆప్కోరా చె౦బు .సమయంకాని సమయమైనా ఆప్రేమకు పులకించి గడగడా తాగే శారు .సంతృప్తి ,కళ్ళనీళ్ళతో వంగి దువ్వూరివారి కాళ్ళు పట్టుకొంది ఆపిల్ల .దువ్వూరి వారికీ కంటి నిండా నీరే .’’లేమ్మా ‘’అని,అక్కడ మరోకుర్చీ లేకపోవటంతో ఆ పిల్లలతల్లిని తన కుర్చీలోనే కూర్చోపెట్టుకొని తలనిమిరి ఆశీర్వదించారు .నీలకంఠ శాస్త్రిగారు వెంకటప్పయ్య గారి కుటుంబం ,ప్లీడరుగారి తల్లిగారు అందరూ యెంతో సంతోషం, ఆనందం, ఆశ్చర్యం పొందారు .దీనిపై దువ్వూరివారు ‘’ఈ ప్రేమలు ఇప్పటివికవు. జన్మాన్తరీయలై ఉండాలి ‘’వ్యక్తిజన్మాంతర ప్రీతిం మనస్స్ని హృద కారణం ‘’అంటారు .ఎప్పుడో అద్దెకున్న వ్యక్తిపై అందునా తమకులం వాడు కూడా కాని వారిపై జన్మా౦తర౦ వరకు నిలిచిపోవటం ఏమిటి ‘’అని ఆర్ద్రంగా అన్నారు దువ్వూరి శాస్త్రిగారు .తనవాడే అయిన పాత ఇంటి యజమాని చేసిన ద్రోహానికీ దీనికీ ఎంతతేడా ?కులంకాడు గుణమే గౌరవం .ఈ దృశ్యం కళాతపస్వి విశ్వనాథ్ తీసే సినిమా సీన్ లాగా ఉందని పించింది కదా .ఆర్ద్రత అంటే ఇదే .దీనిలో నిష్ణాతుడు విశ్వనాథ్.అందుకే ఆయనసినిమాలు మనసులో స్థిరంగా నిలిచిపోతాయి కళ్ళవెంట ఆనంద బాష్పాలు ధారా పాత౦గా కారిపోతాయి .అదీ ఆన౦దానికి పరాకాష్ట .
ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-19-ఉయ్యూరు
—